బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక తాత్విక చింతన
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక తాత్విక చింతన
భారతదేశంలో ఎవరినైనా గుర్తించాలంటే అతని కులాన్ని మొట్టమొదట చూస్తారు. ఆ తర్వాతే అతని గుణగణాలు లెక్కలోకి వస్తాయి.దానికి భిన్నంగా కులమతాలకు అతీతంగా భారతీయ భౌతిక వాద తాత్వికతకు, ఆధునిక మానవవాద భావాలకు ప్రతిరూపంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మౌ(Mhow)'అనే army regiment గ్రామంలో కీ.శ. 1891వ సంవత్సరం ఏప్రిల్ 14న రాంజీ మలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించారు.జై భీమ్ అని, బాబా సాహెబ్ అని ప్రేమగా ఆయన్ను అందరూ పిలుస్తారు. వీరి పూర్వీకులది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబావాడే గ్రామం. రాజ్యాంగ నిర్మాతగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, భారతీయ భౌతిక వాద తాత్వికునిగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు. ఆయనది సాఫల్య జీవితం. ఉత్తేజభరిత జీవితం. విద్యార్థిగా అవమానాల్ని ఎదుర్కొని అంటరాని తనానికి, వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా ధిక్కార స్వరంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటబావుటాగా నిలిచారు.
అత్యంత కష్టభూయిష్టమైన వివక్షతల, అవరోధాల మధ్య, ఏటికి ఎదురీదుతూ కఠినమైన శారీరక, మేధోపరిశ్రమతో, సంఘర్షణాత్మక దృక్ఫదంతో ,పీడిత ప్రజలకు విముక్తి మార్గాన్ని, సమానత్వం తో కూడిన సామాజిక విప్లవం తో కూడిన గొప్ప తాత్విక దృక్పథాన్ని అందించాడు.అవి ఆధునిక భారతంలో జరిగిన రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో గణనీయమైన పాత్ర వహించాయి.
జీవితంలో ఎదురైన ఎన్నో అవరోధాల మధ్య ఆయన పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబై లోను పూర్తిచేసినాడు. అవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పడ్డాయి. అంబేద్కర్ 1913లోను మరియు 1917లో కొద్దికాలంపాటు బరోడా మహారాజు దగ్గర సేవలుకూడా అందించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొలంబియా విశ్వ విద్యాలయంలో, గ్రేస్ ఇన్ బాక్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. 1920లలోనే అంబేద్కర్ ఎమ్.ఎ, పి.హెచ్.డి. ఎమ్.ఎస్.సి (అర్థశాస్త్రం), డి.ఎస్.సి (అర్థశాస్త్రం) మరియు బారిస్టర్ ఎట్ లా పూర్తిచేశాడు. ప్రముఖ విద్యావేత్తలు, అధ్యయనకారులు తమ జీవితకాలంలో సాధించలేనన్ని అనుభవాలను, జ్ఞానాన్ని తనకు 30 సంవత్సరాలు వచ్చే నాటికే అంబేద్కర్ సంపాదించుకున్నారు.
భారత దేశం ఒక ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక, స్వయం సంపన్న దేశంగా ఎదగడానికి అవసరమైన విధానపరమైన అభివృద్ధి నమూనాను, అందుకు ఆధారమైన రాజ్యాంగ వ్యవస్థల్ని సృష్టించారు. ఆయన దళితులకు మాత్రమే ఆరాధ్యుడు కాదు. భారతదేశంలోనే కాదు ఆమాటకొస్తే ప్రపంచంలోని నేతలు, మేధావుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు. 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' అన్న కాళోజి మాటలకు నిలువెత్తు ప్రతిరూపం ఆయన. నమ్మిన సిద్ధాంతాలకు, ఆదర్శాలకు జీవితమంతా కట్టుబడి పనిచేశారు. వెలివాడల బతుకుల్లో తను ఒక వెలుగుల ప్రస్థానం అయ్యారు. అమానవీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమ కేంద్రమయ్యారు. ఇటీవల కొలంబియా విశ్వవిద్యాలయం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆయన జయంతిని ఐక్యరాజ్యసమితి అధికారికంగా జరుపుతోంది.భారతదేశంలో ఆయన్ను కీర్తించని రాజకీయ పార్టీ లేదు.ఇవన్నీ అంతర్జాతీయంగా పెరిగిన ఆయన ప్రాధాన్యతను, ప్రాసంగికతను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి.
పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు.ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ఆయన దగ్గర శిష్యరికం వల్ల అంబేద్కర్ ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దు కోవడానికి అవకాశం కలిగింది.
భారతదేశానికి తిరిగి వచ్చాక 'మూక్ నాయక్' (నిశ్శబ్ద వీరుడు) అనే పత్రిక స్థాపించాడు. భారతీయ సమాజంలో ఉన్న కులవ్యవస్థపై ధ్వజమెత్తడం ద్వారా తన తాత్విక భావాలను ఆచరణలో పెట్టాడు. 'బహిష్కృత హితకారిణి' అనే సంక్షేమ సంస్థను స్థాపించి దళితుల పిల్లలకోసం పాఠశాలలను, వసతి గృహాలను నడిపాడు. మహద్‌లోని చెరువు నీళ్ళను దళితులు వాడుకునేందుకు పోరాటం నడిపాడు. అగ్రవర్ణాలు ఆ సందర్భంలో ఆయనపై దాడిచేశారు. దాంతో అక్కడి దళితుల్లో ఐక్యత, చైతన్యం పెరిగింది. నాసిక్ లోని 'కాలారాం' ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలని ఉద్యమం చేపట్టారు. దీనివల్ల దళితుల్లో సాంఘిక సమానత్వం కావాలన్న చైతన్యం పెరిగింది.
అంబేద్కర్ కు సమకాలికుడైన జాషువా
'కసరి బుసకొట్టు నాతని గాలిసోక/ నాల్గుపడగల హైందవ నాగరాజు' అంటూ హిందూ వర్ణవ్యవస్థపై తన కవితాఖడ్గంతో ధ్వజమెత్తినట్లు, అంబేద్కర్ వర్ణవ్యవస్థకు, బ్రాహ్మణీయ భావజాలానికి ఆధారంగా ఉన్న 'మనుస్మృతి'ని దళితులందరితో కలసి దహనం చేశాడు.
మనిషి కేంద్రంగా వచ్చిన బౌద్ధం ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చింది. దీనికి ప్రతిగా ప్రతీఘాత విప్లవ సమయంలో ఆవులను లేదా జంతువులను చంపి తినడం సాధారణంగా ఉన్న హిందూ మతం ఒక సాత్విక మతం అన్న కొత్త రూపు ఇవ్వడానికి అనేక పురాణాలను సృష్టించడం మొదలు పెట్టింది పురోహిత వర్గమే నని అంబేద్కర్ తన రచనల్లో పేర్కొన్నారు. హిందూ ధర్మమంతా కులం సోపానాలు మీద నిర్మితం అయిందన్నారు.
సమాజంలో దళితుల పరిస్థితిని జాషువా తన కవిత్వంలో ఇలా చెపుతాడు.''వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశయించు/ వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు /భోజనము పెట్టు వానికి భుక్తి లేదు'' అంటూ ఆనాటి దళితుల వ్యధార్థ జీవితాన్ని జాషువా వర్ణించాడు. ఇలాంటి పరిస్థితిని స్వయంగా అనుభవించిన అంబేద్కర్ దళితుల అభివృద్ధికి రాజకీయాలకూ గల సంబంధాన్ని గుర్తించాడు. దాంతో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేయాలని ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. 'మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు' ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ గాంధీజీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేశాడు. ఆయన మరణాన్ని ఆపడానికి తన డిమాండును కూడా ఒదులుకున్న మానవతావాది అంబేద్కర్.
దళితుల పక్షాన, దళితుల ఆకాంక్షను వ్యక్తీకరించే పార్టీ గా 'ఇండిపెండెంట్ లేబర్ పార్టీ' ని స్థాపించాడు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, కనీస వేతన చట్టాల అమలు, భూసంస్కరణలు అనే అంశాలను పార్టీ ప్రధాన అజెండాగా ప్రకటించాడు.భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం 1938లో కొంకణ్ రైతాంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ పనిని భారతదేశ పెట్టుబడీదారులు చేసి ఉండాలి. కానీ వారు భూస్వామ్య వ్యవస్థ తో రాజీపడి ఉన్నారు.అందువల్లనే ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ ఉంది. దాని భావజాలం ఇంకా సమాజంలో ఉంది. సైన్యంలో దళితులకు ప్రవేశం కల్పించాలని పోరాడారు. దాంతో ''మహర్ రెజిమెంట్' ఏర్పడింది. దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని పోరాడారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు 1942లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ను నెలకొల్పారు. ఈ ఫెడరేషన్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గెలిచింది.
అంబేద్కర్ పోరాటం భూస్వామ్య అగ్రవర్ణాల సమిష్టి ఆధిపత్యాన్ని సవాలుచేసే దళిత ఆత్మగౌరవ పోరాటం.కమ్యూనిస్టులు, పూలే, పెరియార్, అంబేద్కర్ నడిపిన ఈ తరహా పోరాటాలు దేశంలో విస్తృత ప్రభావం కలిగించాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ''మా చేతుల్లోకి రాజకీయాధికారం వచ్చినప్పుడే స్వాతంత్య్రం ఉపయోగంగా ఉంటుంది. మా కష్టాలను మేమే పరిష్కరించుకుంటాం'' అని చెప్పారు. ''మీ ప్రభుత్వం అధికారంలో వున్నా దళితుల బ్రతుకుల్లో మార్పువచ్చిందా'' అని ప్రశ్నించాడు.
కాంగ్రెస్ పార్టీ లోని ప్రముఖ నాయకుల్లో చాలామంది బ్రాహ్మణీయ దృక్పథం కలవారు. వీళ్ళు ఆర్‌ఎస్‌ఎస్ తో కలిసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మారుస్తారని భావించాడు అంబేద్కర్. అంటే తిరిగి వర్ణవ్యవస్థను కీర్తించే మనువాద సంస్కృతి ని అమలుచేస్తారని భయపడ్డాడు. స్వాతంత్య్రం వస్తే తరువాత సామాజిక న్యాయం సాధించు కోవచ్చన్న కాంగ్రెస్ వాదనతో ఆయన ఏకీభవించ లేదు. అందువల్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనను బ్రిటీష్ వారితో కుమ్మక్కయ్యారని దుష్ప్రచారం చేశారు.అయినప్పటికీ తాను నమ్మిన ప్రజాస్వామ్యం, సమభావం, సామాజిక న్యాయం సాధించడానికి జరిగిన ఉద్యమాలకు ఆయన సారథ్యం వహించాడు.
అంబేద్కర్ బెంగాల్ ప్రావిన్స్ నుండి ముస్లింలీగ్ మద్దతుతో రాజ్యాంగసభకు ఎన్నికయ్యాడు. పాకిస్తాన్ విభజన తరువాత ముస్లింలీగ్ తన సభ్యులను రాజీనామా చేయించింది. అయినప్పటికీ బొంబాయి లెజిస్టేటివ్ కౌన్సిల్ నుండి కాంగ్రెస్ మద్దతుతో అంబేద్కర్ తిరిగి ఎన్నికయ్యాడు.ఒక రకంగా అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తో తాను సాధించదలుచు కున్న లక్ష్యాల కోసం రాజీ పడ్డాడు.
నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా అంబేద్కర్ చేరాడు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగసభ, ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
రాజ్యాంగ రచనా కమిటీలో అంబేద్కర్‌తో సహా ఏడుగురుంటే వారిలో ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వుండి, రచనలో పాల్గొనలేదు. మరొకతను విదేశాల్లో వుండటం వల్ల ఈ బాధ్యతలో పాలుపంచుకోలేదు. మిగిలిన వాళ్లు దీనిపట్ల ఆసక్తి చూపలేక పోయారు. దీంతో అంబేద్కర్ ఒక్కడే ఈ బాధ్యతను తీసుకున్నారు. ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేయడం వలన, స్వతహాగా ఎంతో అవగాహన ఉండటం చేత, బుద్ధుని ధర్మాల ఆకళింపు చేసుకోవడం వల్ల ఆ భావాల్ని రాజ్యాంగంలో అంతర్లీనం చేస్తూ దేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా, రాజ్యాంగాన్ని కులాల, మతాల, లింగవివక్షలకు అతీతంగా సమాన హక్కులు కల్పిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా రచించాడు.అందుకే అంబేద్కర్ ను నెహ్రూ 'రాజ్యాంగ రూపశిల్పి' గా అభివర్ణించారు. భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.
ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి, నూతన సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ నడుంకట్టారు. హిందూమతంలోని వర్ణ విభజన ఆయనను ఎంతగానో కదిలించింది. అంబేద్కర్ భారతదేశంలో శ్రామికులను కులాల వారిగా శ్రమ విభజన మీద ఆధారపడి చేసింది కాదని, అది స్పష్టంగా శ్రామికుల విభజన అని నిర్థారించారు. భారతదేశంలోని కులస్వామ్యం స్థానం లో ప్రజాస్వామ్యం, భూస్వామ్య అధికార స్థానంలో స్వేచ్ఛ, భిన్న మత విశ్వాసాల స్థానంలో సమానత్వం, సోదరభావం వంటి సిద్ధాంతాలపై ఆధారపడిన నూతన సమాజాన్ని నిర్మించాలని ఆయన భావించారు. సమాజం దుర్మార్గపు ఆచారాల మీద కాకుండా, హేతువు మీద ఆధార పడాలన్నాడు. కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే వర్ణాంతర వివాహ మొక్కటే సరైన మార్గమని అంబేద్కర్ భావించాడు.
దేశప్రజలందరికీ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయపరమైన హక్కులను, స్త్రీలకు, దళితులకూ, మైనారిటీలకు రక్షణగా ప్రత్యేక సదుపాయాలను కల్పించటానికి తీవ్రమైన కృషి చేశారు. అంబేద్కర్ కృషి మూలంగానే నేడు దళితులు, మైనారిటీలు, మహిళలు, సాధారణ ప్రజానీకం రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నారు.
హిందూ మతాచారాలు, ధర్మం అంతా వర్ణవ్యవస్థ పునాదుల మీద నిర్మించబడింది. భగవద్గీత చెప్పిన కర్మ సిద్ధాంతం మొత్తం వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి పనిచేస్తుంది. కానీ వర్ణాశ్రమం అనేది పుట్టుకతో కాదు, చేసే పని ద్వారా నిర్ణయమవు తుందన్న వాదనను గాంధీ చేసేవారు. అంబేద్కర్ దీన్ని పూర్వపక్షం చేస్తూ హిందూ మతంలో రుగ్వేద పురుష సూక్తం మొదలు పురాణాల వరకు పుట్టుకను బట్టి వర్ణం( కులం) నిర్ణయం చేయబడుతోందని అన్నాడు . అంటే బిడ్డ కడుపులో పడగానే ఆడ, మగ అని తెలిసే లోపు కులం నిర్ణయం అయిపోతుంది. అంబేద్కర్ పురుషసూక్తం మొదలు అన్ని పురాణాలు వర్ణవ్యవస్థ నిర్మితం అయిన తర్వాతే రాయబడినవనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.అంతేగాక స్త్రీల ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చింది ఈ కుల వ్యవస్థ. స్త్రీ వాద ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా వచ్చినా మనదేశంలో ఇప్పటికీ కట్టుకథల పురాణాలను వల్లె వేసే ప్రవచనాకారుల ముందర కూర్చున్న వారిలో దాదాపు 70-80 శాతం స్త్రీలే ఉంటారు. స్త్రీ వాద ఉద్యమాల ప్రభావం వీరిపై ఏ మాత్రం పడలేదు.
కులవ్యవస్థపైనా, చాతుర్వర్ణ, సనాతన ధర్మాలపైనా, అంటరానితనాన్ని మార్పు లేకుండా యథాతథంగా నిలిపి ఉంచే సామాజిక దొంతరలపైనా, హిందూ ధర్మశాస్త్రాల అధిపత్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, వీటిపై రాజీకి తావులేకుండా సాగే ఆయన విశ్లేషణలను హిందూ మత రహస్యాలు, భారతదేశంలో కులం పుట్టుక, కుల నిర్మూలన, హిందూ తాత్విక దృక్పథం, అస్పృశ్యత, శూద్రులెవరు? మొదలైన గ్రంథాలలో వివరించారు. అమెరికా లో ఉన్నప్పుడు భారతదేశంలో కుల, మత వ్యవస్థ గురించి Caste in India – Their Genesis అనే పరిశోధనా వ్యాసాన్ని రచించాడు. భారత దేశ ప్రజలు ఆర్య, ద్రావిడుల, మంగోలియన్‌ల సమ్మేళనం గా విశ్లేషించారు. వీటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. Riddles in Hinduism లో ఆయన వేసిన ప్రశ్నలు చదువరులను ఆలోచింప జేస్తాయి.దాంతో దాదాపు ఆ పుస్తకాన్ని నిషేధించే స్థాయికి తీసుకువెళ్లారు కాషాయవాదులు అప్పట్లో.
1952లో నిర్వహించిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అంబేద్కర్ 'రిపబ్లికన్ పార్టీ' స్థాపించి దళితుల కోసం పోరాటం సాగించారు.
ప్రత్యేక రిజర్వుడు స్థానాలు లేకపోవడంతో ఆ ఎన్నికల్లో అంబేద్కర్ పార్టీ గెలవలేకపోయింది.
నెహ్రూ అంబేద్కర్ కృషిని గుర్తించి తన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు.అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. దళితులు, స్త్రీలపై జరుగుతున్న వివక్షనూ, అణచివేతనూ నిరోధించే చట్టం ఇది.
ఆయన పెట్టిన హిందూ కోడ్ బిల్లు లో అన్ని రకాల అంటే స్థిర చరాస్తి పై స్త్రీ కి హక్కు కలిగి ఉండా లన్నాడు. భర్తను కోల్పోయిన స్త్రీ కి భర్త మరియు తల్లితండ్రుల నించి సంక్రమించే ఆస్తిలో వాటా కలిగి ఉండాలన్నాడు.పెళ్లి కాని యువతికి ఆస్తిలో సగం వాటా, పెళ్లి అయిన స్త్రీకి పావు వంతు వాటా తల్లితండ్రుల ఆస్తిలో కలిగి ఉండాలన్నాడు. స్త్రీ తనకు నచ్చని పెళ్లి నించి విడాకులు తీసుకునే హక్కు కలిగి ఉండాలన్నాడు. విడాకులు పొందిన స్త్రీలకు పొందాల్సిన భరణం, స్త్రీ తనకు నచ్చిన పిల్లలను కుల మతాలకు అతీతంగా దత్తత తీసుకునే హక్కుని కలిగి ఉండటం మొదలైనవి ఆయన ప్రతిపాదించారు.
దీనికి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించారు నెహ్రు . కానీ కాంగ్రెస్ లోని హిందూ చాంధస నాయకులు పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బాబు రాజేంద్రప్రసాద్ ఇలా ఒకరేమిటి హిందూ మహాసభ దగ్గర నించి అందరూవ్యతిరేకించారు. బాబు రాజేంద్రప్రసాద్ అయితే ఏకంగా బెదిరింపులకు కూడా దిగారు. సంప్రదాయవాదుల బెదిరింపులకు తలొగ్గిన నెహ్రూ పూర్తిగా బిల్లుని ఉపసంహరించుకోమనడంతో అంబేద్కర్ తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక RSS , హిందూ మహాసభ లయితే నాలుగాకులు ఎక్కువ తిన్నాయి. ఆడవాళ్ల చేతిలో త్రిశూలాలు పెట్టి పార్లమెంటు ముందు మా ధర్మాన్ని నాశనం చేస్తున్నారని అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ధర్నాలు, వాళ్ళ పత్రికల్లో దారుణాతి కార్టూన్లు, ఒకటేమిటి వీళ్ళ అరాచకాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. ఇప్పుడంటే ఆయన ప్రభావం పెరగడంతో అంబేద్కర్ ను నెత్తకెత్తుకుంటున్నారు గానీ లేకుంటే వీళ్ళు ఎప్పుడో ఆయన్ను పక్కన పెట్టేవారే. బిల్లు వీగిపోయింది. ఆయన రాజీనామా చేస్తూ ఇలా అన్నారు.
“To leave inequality between class and class, between sex and sex, which is the soul of Hindu Society untouched and to go on passing legislation relating to economic problems is to make a farce of our Constitution and to build a palace on a dung heap. This is the significance I attached to the Hindu Code. It is for its sake that I stayed on notwithstanding my differences. So if I have committed a wrong, it is in the hope of doing some good. Had I no ground for such a hope, for overcoming the obstructionist tactics of the opponents?”
స్త్రీల హక్కుల కోసం పదవులు వదులు కున్నాడు. ఒంటి చేత్తో పోరాటం నడిపారు. లింగ వివక్ష ఉండకూడదని స్త్రీల కోసం మహా యుద్ధమే చేసిన అంబేద్కర్ ను స్త్రీ వాద ఉద్యమాలు కానీ, స్త్రీల సంక్షేమం కోసం పని చేసే మహిళాసంస్థలు కానీ ఎందుకు విస్మరించాయి?
హిందూమతంలో వుండి దాన్ని సంస్కరించడం సాధ్యంకాదని గుర్తించాడు.దాంతో 'నేను హిందువుగా పుట్టినా హిందువుగా మరణించటానికి ఎంత మాత్రమూ అంగీకరించను' అని అంబేద్కర్ ఒక బహిరంగసభలో ప్రకటించారు. క్రైస్తవ, సిక్కుమతాల గురువులు ఆయనను కలిశారు. ఇస్లాంలోకి వస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ చూపినారు. కానీ, దుఃఖాన్ని నివారించడానికి, పీడనలకు తావులేని తాత్విక దృక్పథం కలిగివున్న బౌద్దాన్ని ఆయన స్వీకరించారు. దానిలో వున్న ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆయనను ఆకర్షించాయి. మానవుడు కేంద్రంగా ఉన్న బౌద్ధం ఆయనకు నచ్చింది.భారతదేశ చరిత్ర మొత్తం "బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబేడ్కర్ విశదీకరించారు.తాను జన్మించిన మతంలో కులపరమైన వివక్షకు పరిష్కారం లేదని భావించి ఆయన 1956లో అక్టోబర్ 14న నాగపూర్‌లో రెండు లక్షల మందితో థేరవాద బౌద్ధం స్వీకరించారు. భారతదేశంలో బౌద్ధ ధర్మ పునర్వికాసానికి బాటలు వేసినాడు.
'ప్రాచీన భారతదేశంలో విప్లవం- ప్రతీఘాత విప్లవం', 'బుద్ధుడు - మానవతా మూర్తి', 'బుద్ధుడు - విప్లవం', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' పుస్తకాలలో ఆయన బౌద్ధాన్ని వాస్తవిక దృక్పథంతో వివరించారు.
అంబేద్కర్ కేవలం రిజర్వేషన్లు సాధించడం మాత్రమే చేశారని, ఆర్.ఎస్. ఎస్ భావాలు కలిగిన అరుణ్ శౌరి 'వర్ షిపింగ్ ఫాల్స్ గాడ్స్' పుస్తకంలో అంబేద్కర్ కృషిని తక్కువ చేసి అవమానించడానికి ప్రయత్నం చేయడం సరైంది కాదు.అంబేద్కర్‌ను కేవలం దళిత నాయకుడిగా చూడటం అంటే ఆయన విశాల దృక్పథంతో చేసిన కృషిని విస్మరించడమే. ఆయన స్ఫూర్తి, దళిత చైతన్యాన్ని వికసింప చేయాలన్నది వాస్తవమే అయినా ఆయన దృక్పథం మాత్రం విశాల బాహుళ్యానికి సంబంధించినది.
మనిషి కేంద్రంగా వచ్చిన బౌద్ధం ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చింది. దీనికి ప్రతిగా ప్రతీఘాత విప్లవ సమయంలో ఆవులను లేదా జంతువులను చంపి తినడం సాధారణంగా ఉన్న హిందూ మతం ఒక సాత్విక మతం అన్న కొత్త రూపు ఇవ్వడానికి అనేక పురాణాలను సృష్టించడం మొదలు పెట్టింది పురోహిత వర్గమే నని అంబేద్కర్ తన రచనల్లో పేర్కొన్నారు. హిందూ ధర్మమంతా కులం సోపానాలు మీద నిర్మితం అయిందన్నారు.
డా.అంబేద్కర్ శూద్రులను, అస్పృశ్యులను అణగద్రొక్కడానికి ప్రయత్నించిన హిందూ కుల వ్యవస్థ ను నిశితంగా విమర్శించి, అస్పృశ్యతా నివారణకు రాజ్యాంగ బద్ధంగా పోరాడారు.
గాంధీ ''డాక్టర్ అంబేద్కర్ హిందూమతానికి ఓ సవాలు'' అని ప్రకటించాడంటే అందులో ఆశ్చర్య మేమీలేదు. 1933 లో గాంధీజీ హరిజన్ పత్రికలో అంబేద్కర్ పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ‘అంబేద్కర్ మనస్సు లో క్రోధం ఉంది. ఆ క్రోధం సహేతుకమైంది. విదేశాలలో ఆయన పట్ల ఎంతో గౌరవం, ఆప్యాయత వ్యక్తమవుతూ ఉంటాయి కాని, స్వదేశంలో హిందువులు హిందూ సమాజంలో ఫలానా కులానికి చెందిన వాడంటూ అంబేద్కర్ ను అడుగడుగున వేలెత్తి చూపుతుంటారు'అని అన్నారు.ఆయన ఈనాటికీ మనువాదులకు మింగుడు పడని ఒక సవాలుగానే నిలిచి ఉన్నారు.అంందుకే మనువాదులు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ప్రచారం చేస్తున్నారు.
హిందూ మతానికి పరమమత సహనం ఎక్కువని కొంతమంది చెపుతుంటారు.కానీ వాస్తవానికి పూర్వం హిందూ మతం లో శైవ, వైష్ణవ మతాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకునేవి. అంతకుముందు బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి బౌద్ధాన్ని నాశనం చేశారు.ఇప్పుడు అనివార్యం అయింది కాబట్టి సహనం కలిగి ఉంది. ఏ మతం అయినా ఆ దేశం సెక్యులర్ అయితే ఖచ్చితంగా అన్ని మతాలు సహనంతోనే ఉంటాయి. యూరప్ నించి అమెరికా వరకు ఆఖరుకు దుబాయ్ లో కూడా హిందూ దేవాలయం కట్టారు. అది ఆ దేశం నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై ఆధారపడుతుంది. అసలు ధర్మం పేరుతో ఏర్పడిన హిందూమతంలో మనుషుల్ని సమానంగా చూడని వ్యవస్థ ఉంది. ఇందులో సహనం ఎక్కువ అంటే ఎలాగా? అని ప్రశ్నించాడు ప్రసాద్ శివారెడ్డి తన వ్యాసంలో.
అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఒక జీవనవిధానం. సమాజంలో వ్యక్తులు ఒకరిని ఒకరు సమానంగా చూస్తూ, పూర్తి స్వేచ్ఛతో సౌభ్రాతృత్వం తో కలిసి బతకడం. మతంలో ఎప్పుడూ కులవివక్ష ఉంటుంది.రెండు మూడు మతాలు కలిసిన చోట మత వివక్ష ఉంటుంది. అంబేద్కర్ విధానంలో ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంటుంది. బుద్ధుని కాలంలో ఉన్న సంఘాలు ప్రజాస్వామికంగా పనిచేసేవి. ఆయన మాటల్లోనే “ బౌద్ధ సంఘం లో కూర్చునే సీటు ఏర్పాట్ల నియమాలు, ప్రతిపాదనకు సంబంధించిన నియమాలు, బ్యాలెట్ ద్వారా ఓటింగ్, తీర్మానాలు, కోరం, విప్, ఖండన తీర్మానం, ఓట్ల లెక్కింపు, కమిటీలు, క్రమబద్ధీకరణ, తీర్పు మొదలైన విధానాలను బుద్ధుడు భిక్షు సంఘాల సమావేశాలలో 2600సంవత్సరాల క్రితమే అమలు చేశాడు.ఇవన్నీ నేటి మన పార్లమెంటరీ సంస్థలకు సంబంధించిన విషయాలు.బౌద్ధం సారాంశంలో ఒకరి స్వేచ్ఛ, ఆర్థిక, సామాజిక మరియు రాజకీయాల కోసం ఆచరణాత్మకంగా పనిచేయడం. బుద్ధుడు ప్రజాస్వామ్య ఆరాధకులు. ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ప్రాణం పోసినవాడు." ఇవన్నీ అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక లో పొందు పరిచారు. ఆ పీఠికను నిర్వచించే సమయంలో ఇలా అంటారు.”Without equality, liberty would result in monopolies; equality without liberty would prevent individual initiative; and without fraternity, the enforcement of liberty and equality would require a constable”. ఇంత విశాలంగా, లోతుగా సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్. ప్రపంచంలో అతి గొప్ప తత్వవేత్తలో ఒకరు అనిపించుకోదగిన ఆయన రచనలను నేటి తరం అధ్యయనం చేయాలి. ఆయన భారతీయుడు కాకుండా ఉండి ఉంటే ఈ ప్రపంచం ఆయనను ఒక తాత్వకునిగా కీర్తించేది.భారతదేశంలో ఎవరైతే కులం గురించి మాట్లాడతారో వారిని అదేపనిగా పక్కన పెడుతుంది హైందవ సమాజం. గతంలో బుద్దుని కూడా అలాగే చేశారు.
అంబేద్కర్ 'భాషా ప్రయుక్త రాష్ట్రాలు', 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా' ప్రధానమైనవి.
అంబేద్కర్ ”ఇండియాలో చిన్న కమతాలు – పరిష్కారాలు” అనే రచనలో పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలను సరైన పాళ్ళలో ఉపయోగిస్తే గరిష్ఠ ప్రతిఫలం, రాబడి ఉంటాయన్నారు. పెట్టుబడులకు మించిన రాబడులు వస్తే, అది లాభాసాటి కమతం అవుతుందని చెప్పాడు. 1927లో బొంబాయి శాసనమండలిలో మాట్లాడుతూ భారతదేశంలో సాధారణ జీవన ప్రమాణాన్ని పెంచాలంటే వ్యవసాయంగా నుండి కొంత మంది శ్రామికులను పరిశ్రమల వైపు మళ్ళించాలని సూచించాడు. ఫలితంగా ఈ రెండు రంగాలలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. దీని కొరకు ”స్టేట్ సోషలిజం”ను ప్రతిపాదించాడు. భూమిని ప్రభుత్వ యజమాన్యంలో ఉంచి సమిష్టి, సహకార వ్యవసాయ పద్దతిని అనుసరించాలి. వ్యవసాయానికి పరిశ్రమలకు కావల్సిన మూలధనాన్ని ప్రభుత్వమే సమకూర్చాలి. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి భద్రత, కనీస ఆదాయాలు లభించి గ్రామీణ పేదరికం తగ్గుతుంది. సంపద, ఆదాయాల పంపిణిలో అసమానతల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందన్నాడు.
తాను రాసిన స్టేట్స్ అండ్ మైనారిటీస్' అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమిని, భారీ పరిశ్రమలను, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు.అవన్నీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని ప్రతిపాదించాడు. భీమారంగం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండి ప్రతి పౌరునికి ఆదాయానికి తగిన జీవిత భీమా చేయించాలని సూచించాడు. పరిశ్రమలను రాజ్యం నిర్వహించినప్పుడు వచ్చే మిగులును మళ్ళీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించాలన్నాడు. పెట్టుబడిదారి విధానానికి లాభార్జన తప్ప మానవముఖం ఉండదని తెలియచేసాడు . భారతదేశానికి సోషలిజమే సరైనదన్నారు. తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించాలని అప్పుడే సాంఘీక భద్రత చర్యలు అమలుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. వ్యవసాయం పైన ఆధారపడిన జనాభాకు భద్రత అత్యంత అవసరమని గుర్తిస్తూ, పంటల భీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, తద్వారా మనదేశంలోని గ్రామీణ ప్రజల బ్రతుకులను మెరుగుపరచడంలో, కరువు కాటకాల భయానక పరిస్థితులను తగ్గించడంలో ప్రగతి సాధించవచ్చునని తెలియజేశాడు. భూసేకరణలో నష్టపరిహారాన్ని చాలా ఉదారంగా చెల్లించాలని ప్రతిపాదించాడు. ప్రవేట్ వ్యక్తుల ఆధీనంలో వున్న పరిశ్రమలు, భీమా సంస్థలు, మరియు వ్యవసాయ భూముల యాజమాన్య హక్కులను ప్రభుత్వం స్వీకరించి, వారికి నష్టపరిహారాన్ని డిబెంచర్ల రూపంగా చెల్లించాలని ప్రతిపాదించాడు.
రాజ్యాంగ సభకు తను సమర్పించిన డ్యాకుమెంట్‌లో ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ దేశానికి మార్గమన్నారు. వ్యవసాయ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, యాంత్రీకరణ అవసరమని అన్నారు. సాగుకు యోగ్యమైన భూముల్ని నష్టపరిహారం చెల్లించి భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలన్నారు.సమిష్టి వ్యవసాయం ద్వారానే అణగారిన, అస్పృశ్య వర్గాల శ్రామికులకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నాడు. అప్పుడే ప్రతి వ్యక్తికి ఒకే విలువ అను ప్రజాస్వామ్య సూత్రం అర్థవంతమవుతుందని చెప్పినాడు.
దేశానికి స్వేచ్ఛ ఎలా జన్మహక్కో... ప్రతి కార్మికుడికి సమ్మె హక్కు జన్మహక్కని ముంబయి అసెంబ్లీలో ఉద్ఘాటించారు.
అంబేద్కర్ ”స్టేట్ సోషలిజం”ను రాజ్యాంగ చట్టంగా రూపొందించాలని, ప్రాథమిక హక్కులలో చేర్చాలని ప్రయత్నం చేసాడు. ఈ ప్రతిపాదనలను రాజ్యాంగపరిషత్ సంపూర్ణంగా అంగీకరించలేదు. దీనికి అంబేద్కర్ స్పందిస్తూ రాజ్యంగ బద్ద హక్కులతో ప్రతి వ్యక్తి తనకు వచ్చిన పనిని చేసుకోవచ్చు.కానీ అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇతరులను పాలించే, పెత్తనం చెలాయించే అధికారాలను కట్టబెట్టకూడదని చెప్పాడు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ఉండే స్వేచ్ఛ , అమానవీయ, ఆధిపత్య దోపిడి హింసలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. అంబేద్కర్ తన బలమైన వాదనలతో ఉపాధి హక్కు, విద్య, ఆరోగ్య హక్కు, సంపద సమాన పంపిణి వంటి అంశాలు ఆదేశిక సూత్రాలలో చేర్చారు. అయితే ఇవి రాజ్య వ్యవస్థకు మార్గదర్శక సూత్రాలేగాని, తప్పనిసరిగా అమలు పరచాల్సినవి కావు. సామాజిక ఆర్ధికాభివృద్ధి అంశాలలో అంబేద్కర్ ఆలోచనలను సోషలిస్టు దృక్పథం ఉన్న నెహ్రూ తన హయాంలో వీలైనంత వరకు అమలు పరిచాడు. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం నిర్వహణ, భూసంస్కరణలు అమలు, రవాణా, శక్తి, ఇంధనం, గనులు, రక్షణ రంగాలలో ప్రభుత్వ రంగంలోనే భారీగా పరిశ్రమలు స్థాపించడం చేశాడు. ప్రైవేట్ పరిశ్రమలు, వ్యాపార సంస్థల పై గుత్తాధిపత్యం నియంత్రించే చట్టాలను రూపొందించాడు.
అంబేద్కర్ రచనల్లో ప్రతిఫలిస్తున్న భావాలు భారతీయ సామాజిక చారిత్రక క్రమాన్ని, అర్థం చేసుకోవడంలో ఎంతో ప్రాధాన్యత వహిస్తున్నాయి. వర్తమాన పరిస్థితుల దృష్ట్యా చూస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలలో అంబేద్కర్ ఎంతో ముందుచూపుతోనే ఆయన తన భావాలను వెలువరించినట్లు అర్థమవుతుంది. మనువాదం,కుహనా సైన్సు పెరుగుతున్న నేటి సమాజానికి ఆయన అందించిన శాస్త్రీయఆలోచనా సరళి, రాజనీతిజ్ఞత ఎక్కువగా సమకాలీనత కలిగి ఉన్నాయి.
అంబేద్కర్ పోరాట ఫలితాలను అనుభవిస్తున్న వర్గాలు ఆయన మొదలుపెట్టిన సామాజిక విప్లవాన్ని కొనసాగించడానికి ప్రతిన పూని బాధ్యతతో పని చేయాలి. ”సమాజానికి తిరిగి చెల్లించు”అనే భావన తో పనిచేయటమే సుందర మానవవాద మందారమైన అంబేద్కర్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.
ప్రవేటీకరణ, సరళీకరణ ప్రపంచీకరణ(LPG) విధానాలతో పాలకులు సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పరిశ్రమలను అమ్మేస్తున్నారు. స్వదేశి, విదేశి పెట్టుబడుల పై నియంత్రణ ఎత్తివేశారు.ఫలితంగా రోజు రోజుకు సాంఘిక, రాజకీయ ఆర్థిక అసమానతలు పెరిగాయి. ప్రజలను దారిద్య్రం నుండి ఆర్థిక దోపిడి నుండి బయట పడేయడానికి అంబేద్కర్ సూచించిన సంక్షేమ విధానాలు దీపస్థంభంగా నిలుస్తున్నాయి. వీటి అమలుకు పౌర సమాజం ప్రజా ఉద్యమాలను నిర్మించుకోవాలి.
"జ్ఞానం వస్తువు కాదు. అది పని, శ్రమలతో సముపార్జించుకోవాలి. ఇందుకు ఏకాగ్రత ముఖ్యం. నాకు దేవుళ్ళు, దెయ్యాలు, మహిమల పట్ల నమ్మకం లేదు. ఎవరైతే కష్టపడతారో వారు ఇతరుల కన్నా ఒక అడుగు ముందుంటారు. జ్ఞానం కేవలం అధ్యయనం ద్వారా మాత్రమే లభిస్తుంది." అన్నాడు Dr.B.R.Ambedkar.
అంబేద్కర్ ఒక దార్శనికుడు.ఒక తత్వవేత్త.ఒక ఆర్ధిక వేత్త,మానవహక్కుల ఉద్యమానికి చుక్కాని,దళిత, బహుజనుల అస్తిత్వ పోరాట యోధుడు,రాజ్యాంగ నిర్మాత. ఆయనను ఆధునిక బుద్ధునిగా చాలా మంది బౌద్ధులు భావిస్తున్నారు. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం 1990లో ప్రధానంచేసి తన్ను తాను గౌరవించు కుంది.ఆయన ఇచ్చిన నినాదం “బోధించు, సమీకరించు, పోరాడు ” ప్రజా ఉద్యమాలలో ప్రధాన నినాదం కావాలి. అంబేద్కర్ ఆశయాలను కలుపుకోకుండా భారతదేశంలో ఏ విప్లవం సాధ్యం కాదు.
- పిళ్ళా కుమారస్వామి
94901 22229
ఆధారాలు:
Prasad sivareddy గారి ఫేస్బుక్ లోని వ్యాసం
జాబిలి మాస పత్రిక
హేతువాది మాస పత్రిక
Telugu trending news
ప్రజాశక్తి దినపత్రిక
వికిపీడియా

Comments
Post a Comment