మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

 
మహాత్మా  గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

తాత్విక సిద్ధాంతాల ఆచరణాత్మక ఉపయోగం ఏమిటని కొంతమంది తత్వవేత్తలను అడుగుతుంటారు.శాంతి, పర్యావరణ శాస్త్రం వంటి  వాటికి వాటితో ఎలాంటి సంబంధం ఉంది? ఆచరణాత్మక జీవితానికి సిద్ధాంతాన్ని ఎలా వర్తింపజేయాలన్న తాత్విక ఆలోచనా విధానం ఉందా? అని చాలామంది ఆలోచిస్తుంటారు.తాత్వకత కేవలం మనసుకు సంబంధించినదా లేదా జీవితాచరణకు సంబంధించినదా అన్న మీమాంస కు సమాధానం "నా జీవితమే నా సందేశం" అన్న గాంధీ జీవితమే. గాంధీ  గుజరాత్ లోని పోరుబందరులో కరంచంద్ గాంధీ ,పుత్లీబాయి గాంధీ దంపతులకు‌‌   అక్టోబరు 2, 1869 న జన్మించారు.జనవరి 30, 1948 న ఆయన మతోన్మాదుల తుపాకీ    గుళ్లకు బలయ్యారు.

టాల్ స్టాయ్  రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు (The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ రాసిన అన్టుది లాస్ట్ (Unto the Last) , భగవద్గీత ,బైబిల్
 అతన్ని బాగా ప్రభావితం చేశాయి. వీటి ద్వారా ఆత్మజ్ఞానానికున్న ప్రాముఖ్యత, నిష్కామ కర్మ  అర్థమయ్యాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా అతను గ్రహించాడు. వీటి ద్వారా తాత్వికంగా గాంధీ ఒక ఆచరణవాది గా మారాడు.  '‘చేయదలచిన దానికి చేయటానికి మధ్య అంతరం తగ్గటమే సత్యసాధన.’’ అని నిరూపించారు.
       
        అతను మతపరమైన భావాలను విశ్వసించాడు.కానీ వాటిలో ఉన్న ఆలోచనలు అహేతుకంగా  అనైతికంగా ఉంటే, అతను వాటిని తీవ్రంగా వ్యతిరేకించాడు.సముద్ర యానం చేయడం పాపమన్న దాన్ని తిరస్కరిస్తూ సముద్ర యానం చేసి ఇంగ్లాండ్ వెళ్లాడు. సంప్రదాయాలపై మొట్టమొదటి తిరుగుబాటు చేశాడు. తరువాత ఇంగ్లాండ్ లో సాహిత్య సాంస్కృతిక ప్రభావం తో కులమతాలకు అతీతంగా ఉండటం అలవరచుకున్నాడు.అక్కటి అలవాట్లు తనను తప్పుదోవ పట్టనీకుండా ఎంతో నిగ్రహం పాటించాడు.1906 లో దక్షిణాఫ్రికా కు వెళ్లి వర్ణవివక్ష ను ప్రత్యక్షంగా అనుభవించాడు. వాటిని క్రీస్తు, బుద్ధుని మార్గాలతో ఎదుర్కొన్నారు. తన అనుభవాల నుంచి సత్యాగ్రహం అనే పోరాట రూపాన్ని రూపొందించారు. అదే నేడు అన్ని రాజకీయ ప్రజాసంఘాల పోరాట రూపం. బుద్ధుని అన్వేషణ దుఃఖ రాహిత్యమైతే,   గాంధీ అన్వేషణ సత్యశోధన.
        గాంధీ ప్రపంచానికిచ్చిన అద్భుతమైన ఆయుధం సత్యాగ్రహం. సత్యాగ్రహంలోని ప్రధానోద్దేశం అన్యాయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించడం.సత్యాగ్రహమంటే సత్యం కోసం జరిపే పోరాటం.  అహింస దీని ప్రధాన ధర్మం.  నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ ద్వారా  చేసే ధర్మాగ్రహమే  సత్యాగ్రహం.ఇదొక ప్రజాస్వామిక రూపం. గాంధీ  దక్షిణాఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. అమెరికాలో  పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా వర్ణవివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా ఈ సత్యాగ్రహ ఉద్యమాన్నే ఆయుధంగా స్వీకరించారు.   "అహింసా పరమోధర్మః" అన్న సూత్రం ఇందులో ఉంది.   బైబిల్ లో  ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమని క్రీస్తు చెప్పిన  దక్పథం ఇందులో ఉంది. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.

     ప్రశ్నించడం ప్రగతికి తొలిమెట్టు. కానీ నేడు  ప్రశ్నించడం దేశద్రోహం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన పాలకులు ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతున్నారు.ఇది గాంధీ చూపిన మార్గానికి వ్యతిరేకమైనది.

      దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక చంపారన్‌ పారిశుధ్య కార్మికుల పోరాటం, నీలి మందు రైతుల కోసం సత్యాగ్రహ ఉద్యమం , అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల కోసం చేసిన నిరాహారదీక్ష , బార్డోలీ భూమి శిస్తు వ్యవహారం , ఖాదీ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం  ఇలా అనేక ఉద్యమాలు   రైతులు, కార్మికుల కోసం గాంధీ చేపట్టారు.  
        "నేనెవరో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో నేనేమిటో వ్యక్తం చేసుకోవటం గూడా అంత ముఖ్యం’’ - అన్నారు రవీంద్రనాథ ఠాగోర్‌.  గాంధీజీ తానేమిటో తన జీవితాచరణ  ద్వారా నిరూపించాడు. ఆయన చేసిందంతా  సత్యాన్వేషణే. 

    గాంధీజీ తన తొలి రాజకీయ ప్రసంగం లో రాజకీయ స్వాతంత్య్రం కంటే ముందు  పరిశుభ్రత, ప్రజారోగ్యం సాధించాలన్నారు.
 అందుకేనేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన కళ్లద్దాలు,చీపురులను స్వచ్చభారత్ కు గుర్తుగా చేసింది. ప్రజారోగ్యం మాత్రం మరిచారు.
       దేశవాళీ విధానాలను పరిశోధించి వైద్యం  సాగాలని  గాంధీ కోరుకున్నారు. ఆయన తాను చెప్పింది సమగ్రమనుకోలేదు. అవసరమైన చోట సవరించుకోవడానికి ఆయన సిద్ధపడినాడు. గాంధీ రామరాజ్యం కాదు గ్రామస్వరాజ్యం కావాలన్నాడు. అందుకు గ్రామ పంచాయతీ ని బలోపేతం  చేయాలన్నారు.
         సత్యం, అహింస, సర్వమత సమానత్వం అనే విలువలపై గాంధీ తత్వం అధారపడి ఉంది.బుద్దుని బోధనలు, పరమహంస తాత్విక దృక్పథం ఇవే. రాముడూ, రహీం  ఒక్కరే అన్నారు.అన్ని మతాల సారాంశం సహజీవనమేనన్నాడు. అదే ఈ దేశానికి శరణ్యమన్నాడు.మతమంటే రామ, కృష్ణుల జన్మభూములు కాదని అంతరంగ ఆచరణ, శోధన - అని గాంధీ చెప్పారు!
మతం పేరుతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతున్న నేటి కాలంలో గాంధీ ఆచరణాత్మక సందేశం చాలా అవసరం ఉంది. 
        మతపరమైన ధర్మశాస్ర్తాలకు ఆయన కట్టుబడినాడు. దాంతో   చాలామంది ఆయనను మతవాదిగా చూశారు. అయితే ఆయన మాత్రం మతాచారాలనూ, దేవాలయాల అసాంఘిక ధోరణులను తీవ్రంగా ఖండించారు. " దేవాలయాలు దేవుడి నిలయాలు కాదు, రాక్షస నిలయాలు. నాకు కలిగిన అనుభవాన్ని బట్టి ఇలా చెప్పవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. ధర్మకర్త మంచివాడైతే దేవాలయాలు మంచివే" అని యంగ్‌ ఇండియా   పత్రికలో రాశాడు. " క్రైస్తవ దేవాలయాలు, మసీదులు, దేవాలయాలు ఇవన్నీ మోసం, కపటం, వంచనకు నిలయాలయ్యాయి. దరిద్రులను వీటి చెంతకు రానీయరు. ఇవి భగవంతుని ఆరాధనా స్థలాలు కావు. పరమాత్మకు ఎగతాళి పట్టించే స్థలాలు"  అన్నాడు. రాముడు ఒక చారిత్రక వ్యక్తి అనే ఆలోచనను తిరస్కరించాడు. దానిని చరిత్రగా పరిగణిస్తే, రామాయణానికి సరైన స్థలం చెత్తబుట్టలో ఉందని గాంధీ ప్రకటించారు. 
అంతేగాక సత్యం, అహింస, శ్రమ, కర్తవ్యం వంటివాటిని మతాలకతీతంగా పాటించమని బోధించారు.  

  ‘‘నేను భారతీయుణ్ణి, అన్నివర్గాల భారతీయ ప్రజలను అర్థం చేసుకొనటానికి ప్రయత్నం చేశాను. కలిసి బ్రతికాను.వాళ్ళందరినీ ప్రేమించాను . ఇతరులు దౌష్ట్యానికి పాల్పడ్డారని హిందువులుగూడా దౌష్ట్యానికి పాల్పడితే మనం హిందూ మతానికే ద్రోహం చేసిన వాళ్ళ మవుతాం. దుష్టులు వాళ్ళ దౌష్ట్యం వల్ల కుంగిపోతారు. మనం కూడా వాళ్ళతో పాటు కుంగాలా!  హింసవల్ల హిందూమతం గాని, సిక్కు మతంగాని బాగుపడదు. హత్యలతో హిందూమతాన్ని రక్షించలేరు.’’ అన్నారు గాంధీ. 

       గాంధీ వేదాలను గౌరవించాడు కానీ అవి దేవుని "పవిత్ర పదాలు" గా ఆయన ఒప్పుకోలేదు.  పీఠాలకు నాయకత్వం వహించే మత పెద్దలకే ప్రాచీన శృతులను వివరించే ఏకైక అధికారం ఉందనడాన్ని ఆయన తిరస్కరించారు.

    గాంధీజీ వర్ణ వ్యవస్థ ను సమర్థించారు. కానీ అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఒక వైపు ఆవును పూజిస్తూ, తోటి మానవుల పై అంటరానితనం రూపంలో వివక్షను చూపిస్తే, మనకు స్వాతంత్ర్యంపై హక్కు ఎలా ఉంటుంది? అని ప్రశ్నించాడు.

తాత్వికంగా గాంధీ ఒక ఆదర్శవాది. భౌతిక వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సత్యం, అహింస, త్యాగం వంటి నైతిక విలువలు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం, శాంతి వంటి రాజకీయ విలువలు, కుల వివక్ష నిర్మూలన, స్త్రీలకు సమానత్వం, మత సామరస్యం వంటి సామాజిక విలువల కోసం గాంధీ నిలబడ్డాడు. వాటిని నిజ జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నించారు.
      హిందూ మతానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘ఈశ్వర్, అల్లా తేరే నామ్’ అంటూ ఆలపించిన గాంధీని కించపరుస్తూ గాడ్సేకి గుడి కట్టాలనే గాడ్సే వారసులున్నారు. హిందూ, ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గాంధీని మరచిపోతే, ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఈ జాతికి నిష్కృతి లేదు.       
        జీవితంలో పోరాటం అనివార్యం. అది ద్వేషంలేని పోరాటంగా ఉండాలన్నది గాంధీజీ ప్రయత్నం. లోభం పెరిగిన కొద్దీ అటవికత పెరుగుతుంది. లోభాన్ని తొలగించుకోవాలని పిల్లలకై కస్తూరిబా ఉంచుకున్న చిన్న ఆభరణాన్నిగూడ మందలించి ఇచ్చేయమనటం శ్రుతిమించిన కాఠిన్యంగానే అనిపిస్తుంది. కాని తనను తాను శిల్పంగా మలచుకోవటంలో ఈ గాయాలు భరించక తప్పదు. 

      తనకు భార్యపట్ల కామాపేక్ష అధికమేనని నిస్సంకోచంగా వ్రాసుకున్నాడు. భార్యతో పడక సుఖం పొందుతున్న సమయంలో తన తండ్రి మరణించడంతో సంగమం పట్ల విరక్తి చెందాడు. నిగ్రహశక్తిని పెంపొందించుకున్నాడు.  జిన్నాతో, అంబేద్కర్‌తో, నవఖాళీలో ఉద్రేకపూరిత జనసమూహంతో సంప్రదింపులు జరిపే సమయంలో నిగ్రహం కోల్పోక కోపాన్ని అణచుకొన్నాడు. వాళ్ళ స్థితినుండి అది సహజమేనని గుర్తించి తనను తాను దిద్దుకొని కోపాన్ని జయించుకున్నాడు. ఆత్మశోధన కోసం ఉపవాసాలు చేశాడు.   
  
       గాంధీజీ తనకోసం తాను బ్రతకలేదు. రాజకీయ స్వాతంత్య్రం కోసం కూడా కాదు. హిందూ ముస్లింల సమైక్యత, అస్పృస్యతా నిర్మూలన, అహింసల కోసం బ్రతికాడు. అహింసకు ఆయన నిర్వచనం వేరు. ‘‘ప్రేమకు వ్యక్తరూపమే అహింస’’ అన్నాడు.
       త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం కలుగుతుంది. పర్యావరణం గురించి గాంధీ ఆలోచనలు  యజుర్వేదం లో ‘దేహీ మా దదామి తే’ అన్నట్లున్నాయి. అంటే నువ్వు నాకొకటి ఇస్తే, దానికి బదులుగా నేను  ఇంకొకటి తిరిగిస్తానని. మరోమాటలో  ప్రకృతి నుండి తీసుకోవడమే కాదు,మరలా తిరిగి ఇవ్వాలని అర్థం.
                         
          ప్రజలపై  రాజ్యం ఉపయోగించే
హింసను  ఎదిరించడానికి  గాంధీజీ చూపిన అహింస మంచి సాధనంగా ఉంది . గాంధీ ఆచరించిన అహింస వెనుక నైతిక, ఆధ్యాత్మిక పార్శ్వం ఉంది. ఈ విషయాన్ని గాంధీనే చెప్పుకున్నారు. గాంధీజీ అహింస అనే సూత్రాన్ని రాజకీయ రంగంలోకి తీసుకుని రాక ముందు,  ఆ మాట కేవలం సాధారణ జీవిత వ్యవహారాల్లో మాత్రమే కనపడేది.గాంధీ తన ఆహారపు అలవాట్ల విషయంలో, ఆహార్యం విషయంలో, భాషలో, ప్రవర్తనలో  కూడా ఈ సూత్రాన్ని అమలుపరచి ఒక సన్యాసి లాగా జీవించారు.     
       గాంధీ   నిర్భయతను నైతికతకు ప్రధాన లక్షణంగా భావించారు.సత్యం , ప్రేమ , అహింస లకు నిర్భయత్వం తో పనిలేదు. ఇవి ఎలాంటి భయం లేకుండా  స్వేచ్చగా ఉండే గుణాలు. ఎవరికీ హాని కలిగించ కుండా సరైన మార్గంలో సంపద, కీర్తి, ఆరోగ్యం, బలం పొందినట్లయితే నిర్భయత్వం దానంతట అదే  వస్తుందన్నారు.
      స్వేచ్ఛ అంటే  తమకు నచ్చినది చెప్పే హక్కు. చెప్పిన దాన్ని చేయగలగడమే స్వేచ్ఛ అని గాంధీజీ పేర్కొన్నారు.అయితే స్వేచ్చ అనేది మరొకరి  స్వేచ్చను హరించేలా చేసే లైసెన్సు కాదన్నాడు.
      ఆయనకు సోషలిజం గురించి ఏ మాత్రం అవగాహన లేదు. దాని గురించి తెలుసుకునే లోపే హత్యకు గురయ్యారు.  యంగ్‌ ఇండియా  (1924.4.11) లో  "బోల్షివిజం అంటే ఏమిటో నాకు ఇంకా సరిగా తెలియదు. అది రష్యాకు మంచిదో కాదో నేను చెప్పలేను. విజయం పొందడానికి హింసాత్మక మధ్యేమార్గాల్లో నాకు విశ్వాసం లేదు. నా బోల్షివిక్‌ స్నేహితుల పట్ల సానుభూతి ప్రకటిస్తాను."అని రాశారు.
ఒక సారి "మీరు కమ్యూనిస్టులమని చెబుతారు. కానీ మీరు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితయాత్ర సాగిస్తున్నట్టు కనిపించదు. నిజానికి నేను కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించి జీవించాలని సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాను." అన్నాడు.
1917లో రష్యా విప్లవం జరిగి, దాని ప్రభావం మన దేశంపై పడింది.రష్యా మద్దతు మనకు లభించింది. 1947లో మహాత్మాగాంధీ నడిపిన జాతీయోద్యమం పరాకాష్టకు చేరి, బ్రిటిషువారు మనదేశాన్ని విడిచిపెట్టారు.
        డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవడం, ఎన్నిక కాగానే అధికారపక్షానికి వలసపోవడం బాగా పెరిగి పోయింది. నేటి రాజకీయాల్లో  విలువలు పతనమవు
తున్నాయి. రాజకీయరంగంలో విలువల పునరుద్ధరణ కు గాంధీ ఆలోచనలు ఉపయోగ పడతాయి.వర్తమాన ప్రపంచంలో   గాంధీ ఆలోచనల సమకాలీనతపై  అధ్యయనం చేయాలి.                                                                                          
    నేటి   సమాజం లో వ్యాపార దృష్టి, తీవ్రవాదం, హింస పెరిగాయి. తుపాకీ సంస్కృతి, మాఫియా, బయో వార్, మాదకద్రవ్యాల వాడకం వంటివి పెరిగాయి.  యువత వీటి మైకంలో పడి దారీ తెన్నూ లేక కొట్టుమిట్టాడుతున్న  సమయమిది. ఈ నేపథ్యంలో గాంధీ మార్గం చాలా అవసరం ఉంది.హిందూత్వ శక్తులు సమాజాన్ని మతతత్వానికి గురిచేస్తున్నప్పుడు, ఫాసిస్టు పాలనా పద్ధతులను విధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, గాంధీ ప్రబోధించిన, ఆచరించిన నైతిక, రాజకీయ  సామాజిక విలువలు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు చాలా సహాయకారిగా ఉంటుంది. మతవిద్వేషాలు పెచ్చురిల్లుతున్న నేటి సందర్భంలో ప్రజలందరి ఐక్యత అవసరం.దానిని సాధించడానికి గాంధీ తత్వమే అనుసరణీయం. ఆయన భావాలను ప్రచారం చేయాలి. ఆయన సత్య మార్గాన్ని, పోరాట పటిమను, సహనశీలతను నేటి తరానికి అందించాలి.  
      ప్రతి మనిషి అవసరాన్ని తీర్చే శక్తి ఈ ప్రపంచానికి ఉంది.. కానీ, మనిషి దురాశకు మాత్రం ఈ ప్రపంచం సరిపోదు’ అన్నది గాంధీ చెప్పిన విలువైన మాటల్లో ఒకటి.
        దళితులను సమాజస్రవంతిలోకి తీసుకురావాలని గాంధీ సహపంక్తి భోజనాలు, దేవాలయాల్లోకి ప్రవేశాల కొరకు పోరాటాలను చేపట్టాడు.   మహాత్మాగాంధీ  వ్యక్తి స్వేచ్ఛ  మీద, వర్గ సామరస్యం మీద, హృదయ పరివర్తన మీద ఆధారపడి తన ఉద్యమాన్ని నడిపాడు. ఆదర్శానికంటే, దానిని సాధించడానికి అనుసరించే మార్గం, ఆచరణలో పెట్టిన సాధనం ముఖ్యమని మాటిమాటికీ నొక్కి చెప్పాడు. 
       అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగే రోజు సరైన  స్వాతంత్ర్యం వచ్చినట్లు న్నాడు. అర్ధరాత్రి కాదు గదా , మిట్ట మధ్యాహ్నం కూడా తిరగలేని రోజులివి. మద్యపాన సేవనం అధః పాతాలమన్నాడు.కానీ మద్యం ఏరులై పారుతోంది. 
     హరిజన్ పత్రిక(28.3.1936)లో గాంధీజీ ఇలా రాశారు."గాంధీయిజం అంటూ ఏమీ లేదు. నాదంటూ ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. కొత్త సిద్ధాంతాన్ని నేను కనుగొన లేదు. నాకున్న అభిప్రాయాలు అంతిమమైనవి కావు. వాటిని నేను భవిష్యత్తులో మార్చుకోవచ్చు కూడా. సత్యం, అహింస అనేవి అత్యంత పురాతనమైనవి. నేను చేసిందల్లా వాటిని భారీ ఎత్తున ప్రయోగించడానికి ప్రయత్నించడమే. ఈ ప్రయోగాలు చేయడంలో నేను కొన్ని తప్పులు చేశాను.నా తప్పులు తెలుసుకున్నాను. నేను చెప్పిన విషయాల సారమంతా ఇదే."
         EMS నంబూద్రిపాద్   జాతీయో ద్యమానికి, బూర్జువా తరగతి వర్గ ప్రయోజనా లకు భంగం కలగకుండా ఉండే విధంగా  గాంధీ ప్రజానీకాన్ని సమీకరించి పోరాడినట్లుగా భావించాడు.రాహుల్జీ మాత్రం మహాత్మా గాంధీని భారతీయ సంస్కృతికి నిజమైన ప్రతినిధిగా భావించాడు.ఆయన్ను బుద్ధుడు,   మార్క్స్ లతో   పోల్చారు.బహుజనుల హితం కోసం   ఆయన బుద్ధుని కంటే కూడా ఎక్కువ కష్టాలు సహించాడన్నారు.  దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చాక గాంధీ భారత ప్రజల ఆర్థిక స్వాతంత్య్రం గురించి కూడా ఆలోచించటం ప్రారంభించాడన్నారు.

      ఐక్యరాజ్య సమితి లోని బ్రిటిష్‌ ప్రతినిధి నోయల్‌ బేకర్‌ ‘ప్రపంచంలోని దరిద్ర నారాయణులకు, చరిత్ర హీనులకు ఇటువంటి మిత్రుడు మరొకడు లేడు’ అన్నాడు.
     అమెరికా సెనేటర్‌  వాండన్‌ బర్గ్‌ ‘నిరాడంబరత్వం, సత్యం, ప్రబల సామ్రాజ్యాల కంటే బలమైనవి అని గాంధీ నిరూపించాడు’ అన్నాడు.
       బ్రిటిష్‌ కార్మికోద్యమ ప్రముఖ నాయకుల్లో ఒకడు, బ్రిటిష్‌ కాబినెట్‌ కార్మిక మంత్రుల్లో ఒకడు అయిన సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్సు ‘ఆత్మ బలం యొక్క శక్తిని ఇంత మహత్తరంగా నిరూపించగలిగిన వ్యక్తి ఇటీవలి ప్రపంచ చరిత్రలో మరొకడు లేడు’ అన్నాడు.
"ఇలాంటి వ్యక్తి ఈ భూమిపై ఎప్పుడో నడిచాడని చెపితే రాబోయే తరాలు నమ్మలేరు" అన్నాడు ఐనిస్టిన్.
    ‘‘అతను ఇప్పుడు లేడూ; ఎప్పుడూ ఉన్నాడు’’  అన్నాడు శ్రీశ్రీ.ఇటీవల 2021లో జరిగిన షహీన్ బాగ్ పోరాటం లో , డిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతుల మొక్కవోని సంఘటిత ప్రతిఘటన లో  గాంధేయమే ముందుండి నడిపించింది.

___ పిళ్లా కుమారస్వామి,9490122229

ఆధారాలు:
గాంధీతత్వం-- త్రిపురనేని గోపీచంద్
గాంధీ అవసరం ఎక్కడెక్కడ? __డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
గాంధీజీ ఎందుకవసరం?_కె. రామచంద్ర మూర్తి 
(ఆంధ్ర ప్రభ దినపత్రిక )
మనుష్యులందరూ గాంధీలే - కానీ మహాత్ముడొక్కడే! -- డా. వావిలాల సుబ్బారావు
(ఆంధ్ర ప్రభ దినపత్రిక)
అహింస ఎలా సాధ్యం?దేవ్ దత్ పట్టనాయక్ (ది ఎకనామిక్ టైమ్స్)
గాంధీ జయంతి కవితా సంకలనంలో బాపూజీ తత్త్వం పై వెల్లి విరిసిన కవిత్వం __పిళ్లా కుమారస్వామి
సత్యశోధన__ గాంధీ

Comments

Popular posts from this blog

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం