జనపదాల పుట్టుక వరకు సాగిన భౌతికవాద తాత్విక భావనలు
_*జనపదాల పుట్టుక వరకు సాగిన భౌతికవాద తాత్విక భావనలు*_
క్రీ.పూ 2లక్షల సంవత్సరాల నుంచి క్రీ.పూ.25000 ప్రాంతం లో మంచు యుగం అంతమయ్యేదాకా నిటారుగా నిలబడే మానవునిగా రూపాంతరం చెందడం లో మానవుని భౌతిక వాద ధోరణే ప్రధాన పాత్ర వహించింది. దీన్నంతా ఆదిమ సమాజం అనవచ్చు.మానవుని అనేక రకాలుగా శ్రమ చేయడంలో చేతులు ప్రధాన పాత్ర వహించాయి. ఆనాటి మానవుడు ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ జీవించేవాడు. క్షణం క్షణం క్రూరమృగాల తో పోరాడుతూ ఉండేవాడు.ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం, ఆకలి తీరాక లైంగిక సుఖం ఈ రెండింటి తో జీవితం వెల్లబుచ్చేవాడు. అతను మృత్యువు గురించి ఆలోచించనేలేదు. నైతిక పరమైన మంచిచెడ్డలు అతనికి తెలీవు. దేవుని గురించి అసలే తెలీదు. సుగుణాలు వ్యసనాలు అతనికి అసలు తెలియవు.స్త్రీ పురుషులు కోరికలు తీర్చుకునే వారు. ఎలాంటి వావి వరసలు లేని కాలమది.తండ్రి ఉంటాడని ఎవరికీ తెలియదు.స్త్రీలు తమకు నచ్చిన పురుషునితో సంగమించేవారు. తమకు పుట్టిన పిల్లల్ని ప్రకృతి సహజ ప్రేరణ వల్ల కొంత కాలం పెంచేవారు. ఆహారం వెతుక్కోగల దశ రావడంతోనే పిల్లలు తల్లిని వదిలి వెళ్లిపోయేవారు. తర్వాత మళ్ళీ కలిసిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు గురించి ఆలోచనే తప్ప రేపటి గురించి ఆలోచన ఉండేదికాదు. దీన్నంతా మనం ఒకసారి పరిశీలిస్తే భౌతిక వాద ధోరణిగానే కనపడుతుంది.
జంతువుల నుండి తన్ను తాను రక్షించుకునే దశలో గుహల్లో చెట్టు తొర్రలలో తలదాచుకునే వారు. క్రమంగా ఎముకలతో ను చర్మాలతో ను చెట్ల ఆకులతో గుడిసెలు వేయడం నేర్చుకున్నారు. ఆడ, మగ మధ్య పని విభజన జరిగింది. మగవారు చేపలు పట్టడానికి వెళ్లేవారు.
కేవలం వేటపైనే ఆనాడు మానవులు ఆధారపడలేదు. చెట్ల కాయలు, గింజలు,
పండ్లు ఏరుకొని,సేకరించుకొని తినేవారు. ఈ పనిలో ఎక్కువగా స్త్రీలు పాల్గొనేవారు. వారి
పరిశీలనలో విత్తనాల నుండి మొక్కలు మొలుస్తాయని తేలింది. దానితో గింజలు నాటి
మొక్కల్ని పెంచడం ప్రారంభం అయింది. అదే క్రమంగా వ్యవసాయంగా మారింది. అలా స్త్రీ లే వ్యవసాయం చేయడం కనిపెట్టారు.
ఇదంతా ఆనాటి సమాజ నిర్వహణలో స్త్రీల పాత్ర ఎంతో తెలియజేస్తుంది. వారికి ఆనాడు అత్యంత గౌరవం ఉండేది. అప్పటికి దేవుళ్ళ గురించి గానీ దయ్యాల గురించి గానీ ఎలాంటి భావనలు ఏర్పడలేదు. జీవికే ప్రధాన సమస్య.
క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి గుంపులు గుంపులుగా బతికేవారు.ఇలా గుంపు గా బతికడమే వారికి ఒకరికి ఒకరు తోడుగా ఉండే సంఘజీవనాన్ని నేర్పింది. నిప్పును ఆరిపోకుండా వంతుల వారీగా చూసుకోవడం, పెద్ద పెద్ద జంతువులను వేటాడటం ఆనాటి గుంపు సమాజమే నేర్పంది. ఈ గుంపు సమాజాలు క్రీ.పూ.5000 నాటికి గణసమాజాలుగా మారాయి.
వీరికో పెద్దగా ఆ గుంపు పెద్దదవుతుంది డానికి కారణమైన స్త్రీ ఉండేది.ఆమెకు అందరూ వినయవిధేయలతో ఉండేవారు.
గుంపు జీవన దశలోని మానవులు పూర్తిగా భౌతిక వాదులు. దేవున్ని అప్పటికి మనిషి కని పెట్టలేదు. తమకు కావలసినవి చేసి పెట్టమని ఏ దేవుణ్ణి ప్రార్థించకుండా ఆ పనులు తామే చేసుకునేవారు.గుంపు మానవులు తమకు ఎండగానీ, వానగానీ, గాలిగానీ, కావాలనుకుంటే ఏ దేవుడికీ మొక్కక ఎండ నాట్యం, వాన నాట్యం, గాలి నాట్యం సామూహికంగా చేసేవారు. ఆది మానవులు కొన్ని క్రూర జంతువులను వేటాడి పట్టుకోదలిస్తే అందుకు తగిన బలాన్ని ప్రసాదించమని దేవుళ్ళను ప్రార్థించేవారు కాదు. తమకు తాముగా జంతువులను వేటాడుతున్నట్లుగా వేటకు ముందుగా ఉమ్మడిగా నాట్యం చేస్తూ ఆడి,పాడి ఉత్తేజితులయ్యేవారు. వాన కురవాలనుకుంటే మబ్బులు కమ్మినట్లు, పిడుగులు గర్జించినట్లు, వర్షాలు కురిసినట్లు అభినయిస్తారు. కోరికలు వాస్తవంగా ఈడేరినట్టు మానసిక భ్రమలో అభినయిస్తారు. ఈ అభినయంలో చిట్టచివరకు 'వర్షించు మేఘమా' అనే ఆజ్ఞను మంత్రం లాగా చెపుతారు. ఇది ఆజ్ఞేకాని, ప్రార్థన కాదు. ఇలాంటివి ఇప్పటికీ అండమాన్ లో ఉన్న ఆదిమ జాతులు చేస్తున్నారు.ఇవి భావ వాద పునాదులైనా విశ్వాసాలకు పునాదులయ్యాయి. సంప్రదాయాలకు దారి తీశాయి. అయితే
గుంపులోని వ్యక్తులు విడివిడిగా ఉన్నప్పుడు బలహీనులే అయినా మూకుమ్మడిగా ఉంటే ఈ ప్రపంచాన్ని, ప్రకృతినీ ఎదుర్కోవచ్చుననే నమ్మకంతో ప్రకృతి శక్తులను శాసిస్తున్నామని భావించేవారు.ప్రకృతి శక్తులను ఆది మానవుడు అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ప్రకృతి శక్తులలో అంత ర్భాగంగా వుండే సూత్రాల వల్లనే ఇలాంటి మంత్రాల వలన అవి జరుగుతున్నాయని భావించేవారు.ఆదిమ మానవుల మంత్రతంత్ర విద్యల వల్లనే అనుకున్న కార్యాలు సఫలమవుతాయని , ఏ దేవతల వలనా కాదనే స్థాయిలో వారు భావించేవారు.ఆ భావనే
1500 BCE కాలంలో వచ్చిన వేద కాలానికి యజ్ఞ యాగాదులకు దారితీసింది. ఈ యజ్ఞ యాగాదులు, క్రతువులు మూఢనమ్మకాలకు, అభూత కల్పనలకు, భ్రమలకు దారితీశాయి.
అవి ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నాయో ముందు ముందు తెలుసుకుందాం.
అదే సమయంలో నిప్పు కాలుతుందని, దాంతో మాంసాన్ని కాల్చి తినవచ్చని, నిప్పును చూపి జంతువులను భయపెట్ట వచ్చని అర్థం చేసుకున్నాక నిప్పు ద్వారా జంతువులను తమ అదుపులోకి తీసుకురావడానికి వీలయింది. ఇదంతా తమ శక్తి వల్లనే అని భావించారు. పిల్లలనుకనే స్త్రీలాగ ప్రకృతి గూడ ఫలసాయాన్ని ఇస్తుంది కాబట్టి ప్రకృతిని స్త్రీగా భావించుకునేవారు. ఇలాంటి భౌతిక పరిస్థితులను బట్టి ఏర్పడిన భావాలు ప్రపంచమంతా ఒకే రీతిగా సాగాయి. ఇవన్నీ భౌతిక వాద భావనలే.
గుహల్లో నివసించే ఆదిమానవులు గుహలో నుండి బయటకు వచ్చి చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉండటం నేర్చుకున్నారు .స్త్రీ పురుషులు కలిసి ఉండడం మొదలైంది. గుంపులో తల్లి తండ్రి గుర్తింపు మొదలైంది .దాంతో స్త్రీ పురుష సంబంధాల్లో కట్టుబాట్లు మొదలైనాయి. ఈ విధంగా ఇల్లు కుటుంబాలు ఏర్పడడం మొదలయినాయి.
వేటద్వారా సరిపడా తిండి దొరికాక, చిన్నచిన్న సాధు జంతువుల్ని (పందులు, ఆవులు, మేకలు, గొర్రెలు) చంపకుండా పట్టుకుని వాటిని మచ్చిక చేసుకోవడం,పెంచడం ప్రారంభించారు. క్రీ.పూ. 10 వేల ఏళ్ళనాడే కుక్కల్ని మేకల్ని గొర్రెల్ని మచ్చిక చేసుకోవడం నేర్చు కున్నాడు.
వాటిని పెంచడం ద్వారా వేటాడకుండానే కావాల్సినంత మాంసం దొరకుతుందని గ్రహించారు. వాటి సంతతిని పెంచవచ్చునని, పాడిని ఉపయోగించుకోవచ్చునని గ్రహించారు.
ఆ విధంగా పశుపెంపకం ప్రారంభమయింది.
క్రీ.పూ. 5000 నాటికే గుర్రాలను మచ్ఛిక చేసుకున్నాడు
ఆహార సేకరణ లో కొత్త మార్గాలను కనిపెట్టాడు. భూమిని దున్ని విత్తనాలు చల్లి పంటలు పండించే వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నాడు. దాంతో వేటాడం తగ్గి పోయింది. కొత్త ప్రాంతాలలో గుంపులు గుంపులుగా స్థిరనివాసం ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. ఇది అన్ని దేశాల లో అన్ని ప్రాంతాల లో జరిగింది.
మన ప్రాచీన భారతీయ సమాజంలో ఏర్పడిన భారతీయ తాత్విక చింతనకు ఆనాటి ప్రజల భౌతిక ప్రధానమైన సామాన్య కోర్కెలే ప్రధాన భూమిక వహించాయి.
గుంపులు గా ఉన్న సమాజాన్ని గణ సమాజం అన్నారు. ఈ గణ సమాజం నిరంతరం సంచరిస్తూ ఉండేది.కొన్ని గుంపులు ఒకే చోట నివాసం ఏర్పరచుకున్నాయి.సాధారణంగా వీరు నదుల వెంబడి స్థిర నివాసం చేసుకొన్నారు. ఆ గుంపులే తెగలయ్యాయి. ప్రతి తెగ ఒక చెట్టునో జంతువునో గుర్తుగా పెట్టుకునేవారు. వాటిని పవిత్రంగా భావించే వారు. వాటికి అపకారం చేస్తే తమ గణానికంతా అపకారం చేసినట్లు భావించేవారు.
ఆ గుర్తే కాలక్రమంలో గోత్రం గా మారింది. ఒకే గోత్రం లో ఉన్న వారు పెళ్లిళ్లు చేసుకోరాదని నిబంధన చేసుకున్నారు.గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కనిపించదు.అంటే క్రీ.పూ.1500 నాటికి గోత్రాలు లేవన్నమాట.
ఒక గణం మరో గణ సమూహాలపై పడి వారు సేకరించిన ఆహారాన్ని దోచుకునేవారు. ఆ గుంపులో నుంచి వారిని బానిసలుగా చేసుకుని వాళ్ళతో తమ పనులు చేయించుకునే వారు.
ఇలాంటి పని క్రీ.పూ 10 వేల ఏళ్ళనాడే ప్రారంభమైంది . వ్యవసాయం చేయడం పెద్ద ఎత్తున మొదలయ్యాక అవసరమైన పరికరాలు తయారు చేసే వాళ్ళు అవసరమైనారు. దాంతో గుంపులనే శ్రమ విభజన, వృత్తుల విభజన ఏర్పడింది . అప్పుడు వారి పనిముట్లు
అందరి ఉమ్మడి సొత్తు గా ఉండేవి.అందరు కలిసి ఉమ్మడి గా ఉత్పత్తి చేసి ఎవరికి కావలసినంత వారు తీసుకునేవారు. అందువల్లనే వారు ఉమ్మడిగా పాడుకునే వారు. సకాలంలో వానలు పడాలని, పంటలు బాగా పండాలని కోరుతూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ తూ కోరుకునేవారు. తన గురించి, ప్రకృతి గురించీ, సాటి ప్రాణుల గురించి అవగాహన పెరుగుతున్నకొద్దీ, మనిషికి తానేమి చేయాలో ఏమి చేయకూడదో, అట్లే తన పట్ల ఎదుటివారెలా ప్రవర్తించడం మంచిదో అర్థమవుతూ వచ్చింది. అదే ధర్మానికి ప్రాతిపదిక అయింది. దీనిని ఆదిమ కమ్యూనిస్టు సమాజం అన్నారు.
బానిస సమాజం ఏర్పడినాక బానిస యజమానులు తాము శ్రమపడకుండా తమ సంపద పెరగాలని కోరుకున్నారు.తమ ఆస్తులు రక్షించు కోవడానికి తగిన చట్టాలు కూడా తయారు చేసుకున్నారు .ఆ చట్టాలను అమలు చేయడానికి కొంత సైన్యాన్ని రక్షక భటులను నియమించు కున్నారు. కానీ బానిసలతో మాత్రం మిమ్మల్ని ఇతర గుంపు నుండి కాపాడటం కోసం చట్టాలను సైన్యాలను తయారు చేస్తున్నామని చెప్పారు. వారు నమ్మి తమ స్వేచ్ఛను వారికి అర్పించారు.ఆ విధంగా ఆదిమానవుడు అనుభవించిన స్వేచ్ఛ జీవితం హరించుకుపోవడం మొదలెట్టింది. దీన్నే మానవుడు పుట్టుకతో స్వేచ్చా జీవి.కాని అతడు తరువాత సంకెళ్లలో చిక్కుకు పోయాడన్నాడురూసో తన డిస్కోర్స్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ ఇనీక్వాలిటీ గ్రంథం లో.
వివిధ గుంపులన్నీ (గణాలన్నీ) కలిసితెగలు గా మారడం మొదలైంది.ఇలా భారతదేశంలోకి మొదటి మెడిటేరియన్( మధ్య ధరా సముద్రం) ప్రాంతం నుండి ద్రావిడ తెగలు,మధ్య ఆసియా (ఇరాన్ తూర్పు) నుండి ఆర్య తెగలైన భరత,పురు,యదు తెగలు వలస వచ్చాయి.కానీ ఈ తెగలన్నీ కలిసి ఒక జాతిగా ఏర్పడ్డాయి .
జాతులు ఉండే ప్రాంతాలను జనపదాలు అన్నారు. జాతి కి నాయకుడు గా ఉండేవాడు తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం నమ్మకాలను,ఆచారాలను బలవంతంగా ప్రజల పై రుద్దడంతో భావవాద చింతన పై చేయి సాధించడం మొదలైంది. భౌతిక వాద పరంగా ఉన్న వారిని, ప్రశ్నించే వారిని చంపేశారు. సోక్రటీస్, బ్రూనో, చార్వాకులు మొదలైన వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు.
(Swetchaloachana,9/2021)
__పిళ్లా కుమారస్వామి, 9490122229
Comments
Post a Comment