ఉర్వారుక మివ బంధనం అంటే
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు. ‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ శ్లోకం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి *‘ఉర్వారుక మివ బంధనం’ లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తను, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.
దోసపండు పండుగా మారే నాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే దోసపండు గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.
Comments
Post a Comment