హిందూమతం _ చారిత్రక ఆధారాలు




      
      భారత చరిత్రలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయని చెపుతారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా.
       ప్రాచీన కాలంలో కులమనేది చాలా కఠోరంగా ఉండేదని, బ్రాహ్మణేతరుల మీద - ప్రత్యేకించి శూద్రులు లేదా అస్పృశ్యుల మీద సామాజికంగా, చట్టపరంగా, ఆర్థికంగా అనేక ప్రతిబంధకాలు విధించారు. దీనికి చాలా  ఆధారాలు  ఉన్నాయంటారు ఝూ. అయితే, అగ్ర కులాలు, కులీనులు, భూస్వామ్య వర్గాల వారు మన కాలంలో అంబానీలు, అదానీల లాగానే సంతోషంగా సుసంపన్నంగా ఉన్నారన్నది నిజమే. స్వర్ణయుగంలో ఇటువంటి వాళ్లు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారన్నది మనకు తెలిసిందే.

      గుప్తుల పాలన కాలం స్వర్ణయుగమని, జాతీయవాదాన్ని గుప్తులు పునరుద్ధరించారని పంతొమ్మిదో శతాబ్దం చివర్లోను, ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోను చరిత్రకారులు వాదించారు. ప్రఖ్యాత భారత చరిత్రకారుడు డి.డి.కోశాంబి  ప్రకారం, గుప్తులు జాతీయవాదాన్ని పునరుద్ధరించటం కన్నా - జాతీయవాదమే గుప్తులను పునరుద్ధరించింది. మధ్య యుగాన్ని ముస్లిం పాలకుల క్రూర పరిపాలనా కాలంగా చిత్రీకరించటం కొంతమంది సంస్కరణవాదులతో మొదలైంది. 
          దయానంద సరస్వతి (1824-83) తన ‘సత్యార్థప్రకాశ’లో రెండు అధ్యాయాలను ఇస్లాం, క్రైస్తవ మతాలను అప్రతిష్ఠపాలు చేయటానికి ప్రయత్నం చేశారు. వివేకానంద (1863-1902) తన రచనల్లో ‘‘పసిఫిక్ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వరకూ ప్రపంచమంతా ఐదు వందల ఏళ్ల పాటు రక్తం పారించింది మహమ్మదీయ మతం’’ అని వ్యాఖ్యానించారు.
      ముస్లింల పాలన క్రూరంగా ఉండేదని, హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, హిందువుల ఆలయాలను ధ్వంసం చేశారని, హిందూ మహిళలను బలాత్కరించారని వర్ణించేవారు.
      ముస్లింల పాలనను ఈ రకంగా చిత్రీకరించటాన్ని తారాచంద్, ఎండీ హబీబ్, ఇర్ఫాన్ హబీబ్, షిరీన్ మూస్వీ, హర్బన్స్ ముఖియా, ఆడ్రే ట్రష్‌కే తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు.

     ముస్లిం పాలకుల ‘దుశ్చర్యల’ను గోరంతలు కొండంతలు చేసి చూపారని, వారు చేశారని చెబుతున్న దుర్మార్గాలు, ఆ కాలపు రాజకీయాలతో ప్రేరేపితమైనవని, వలస పాలన కాలానికి ముందు ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణ ఉందనటానికి సరైన ఆధారాలు లేవని, 
నిజానికి మొఘలుల పాలనలో ‘సంస్కృత’ సంస్కృతి పరిఢవిల్లిందన్నారు.

   
భరత  అనేది ఒక భూభాగం కాదు

      అతి ప్రాచీన సాహిత్య గ్రంథాల సమాహారమైన వేదాల్లో సైతం.. కొన్ని చోట్ల భారత తెగ అనే ప్రస్తావన ఉందే గానీ , ఒక భూభాగమనే అర్థంలో ఈ పదం ఎక్కడా లేదు. మొట్టమొదటిగా ఖారవేలుడి (క్రీ. పూ. ఒకటో శతాబ్దం) శాసనంలో ‘భరతవర్ష’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. అది ప్రస్తుత ఉత్తర భారతదేశాన్ని ఉద్దేశించి కావచ్చు. అందులో మగధ కలిసి లేదు. మహాభారతంలో భారత అనే పదం ఇండియాలో ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది కానీ, దక్కను భాగాల గురించి కానీ, దిగువ దక్షిణ ప్రాంతం గురించి కానీ ఏమీ చెప్పదు.
‘భరతవర్ష’ ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది. కానీ, అవి దీని ఆకారాన్ని పలు రకాలుగా వర్ణిస్తాయి. కొన్ని పురాణ భాగాల్లో దీనిని చంద్రుడితో పోల్చారు. ఇంకొన్నిటిలో ఇది త్రిభుజాకారంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరికొన్నిటిలో ఇరువైపుల త్రికోణాలుండే చతుర్భుజాకారంలో ఉంటుందనో, అసమ చతుర్భుజాకారంలో ఉంటుందనో, నారి చాచిన విల్లు ఆకారంలో ఉంటుందనో వర్ణించారు.
అయితే,  ప్రాచీన భారత గ్రంథాలు  ఇండియాను ఒక తల్లిగా ఎక్కడా  చిత్రీకరించలేదు.   ఇండియాను ఒక ‘తల్లి’గా స్త్రీ రూపంలో అభివర్ణించటం మొదటిసారిగా ద్విజేంద్రరాయ్ (1863-1913) రాసిన ఒక పాటలో కనిపిస్తుంది. ఆ తరువాత కొంత కాలానికి బంకిమ్ చటర్జీ రాసిన 'ఆనందమఠ్'లోనూ కనిపిస్తుంది.భరతమాతను మానవరూపంలో చిత్రీకరించటం మొదటిసారిగా అవనీంద్రనాథ్ ఠాగూర్ 1905లో గీసిన వర్ణచిత్రంలో కనిపించింది. ఒక హిందూ వైష్ణవ సన్యాసిని రూపంలో భరతమాతను ఆయన చిత్రీకరించారు. అలాగే, 1936లో వారణాసిలో నిర్మించిన భరతమాత ఆలయంలో మొదటిసారిగా ఆమెను దేశపటం రూపంలో చిత్రీకరించారు.




           

        

గోవును  ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా మార్చిన హిందూత్వ వాదులు.

          గోవధ పట్ల వ్యతిరేకత ప్రాచీన యుగం చివరలో, మధ్యయుగం ప్రారంభంలో పుట్టుకు వచ్చింది. అయితే, ఇస్లాం రాకతో ఇది బాగా బలపడింది. వేదకాలంలో  గోమాంసం తిన్న  బ్రాహ్మణులే ఈరోజున ముస్లింల మీద గోమాంస భక్షకులు అనే ముద్ర వేయడం విచిత్రం.
గోవు మధ్య యుగంలో ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా ఆవిర్భవించిందనడంలో సందేహం లేదు. శివాజీ సారథ్యంలో మరాఠా శక్తి బలపడటంతో అది ఇంకా భావోద్వేగభరితంగా మారింది. బ్రాహ్మణులను, గోవులను సంరక్షించటానికి భువికి దిగివచ్చిన దేవుడి అవతారంగా శివాజీని కీర్తించేవారూ ఉన్నారు. కానీ, రాజకీయంగా సాధారణ జనాన్ని సమీకరించటం కోసం గో చిహ్నాన్ని మొదటిసారిగా ఉపయోగించింది 1870ల్లో సిక్కు కుకా ఉద్యమం. దాదాపు అదే కాలంలో దయానంద సరస్వతి మొదటి గోరక్షణ సభను స్థాపించారు. గోరక్షణ ఉద్యమం తీవ్రమవుతుండటంతో ఆవు గోమాతగా మారింది. భారత్ కూడా భరతమాతగా మారిన కాలానికి కొంచెం అటూ ఇటూగానే గోవు గోమాత అయింది.


మధ్యప్రదేశ్‌లో మినహా ఉత్తర భారతదేశంలో 17 లేదా 18వ శతాబ్దాలకు ముందు రాముడి ఆలయాలు ఉన్నాయని చెప్పే ఎలాంటి ఆధారాలూ లేవు.మధ్యప్రదేశ్‌లో 12వ శతాబ్దపు రాముడి ఆలయాలు రెండో, మూడో బయటపడ్డాయి.
నిజానికి, అయోధ్యలో జైనమతం, బౌద్ధమతం వంటి ఇతర మతాలే ప్రముఖంగా ఉండేవి. మిర్ బఖీ 1528లో ఆ మసీదును నిర్మించినపుడు అక్కడ రామాలయం లేదు.



చరిత్రకారులు కనుక సామాన్య ప్రజల కోసం, అది కూడా ఇంగ్లిష్‌లో మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా రాస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ప్రజలు చరిత్రను మరింత హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి ఆ రచనలు తోడ్పడతాయి.

       






Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం