సింధు నాగరికత తదనంతర సాహిత్యం _చారిత్రక దృక్పథం
- Get link
- X
- Other Apps
సింధు నాగరికత తదనంతర సాహిత్యం _చారిత్రక దృక్పథం
వేద సాహిత్యం గురించి చర్చించే ముందు వేదకాలానికి ముందున్న సింధు నాగరికత సాహిత్యం గురించి తెలుసుకోవాలి. వేదకాలం నాటికి సింధూ నాగరికత పతనమైంది .అది అలా ఎందుకు పతనమైందో ఇప్పటి వరకుతెలియదు .
సింధూ నాగరికత పూర్వ దశ
సింధూ నాగరికత కు పూర్వం క్రీ. పూ. 6000 ప్రాంతాల్లోనే బలూచిస్తాన్ మెహర్గిడ్ కొండల మధ్య ప్రాంతాలలో ప్రజలు వ్యవసాయం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. మరో వెయ్యేళ్లకు కుండల తయారీ మొదలైంది .వీరంతా సింధ్, పంజాబ్ వంటి ప్రదేశాల్లో స్థిరపడసాగారు. క్రీ.పూ. 4000ల నాటికి వీరికి సంస్కృతి సంప్రదాయాలు ఏర్పడసాగాయి. వీరు బఠాణీలు నువ్వులు కర్జూరం మొదలైన పంటలు పండించడం,రకరకాల జంతువుల పెంపకం నేర్చుకున్నారు.అలంకరణకు అవసరమైన రాళ్లు, పూసల వంటి వాటి కోసం దూర ప్రాంతాల వారితో వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నారు.క్రీ.పూ. 3000 నాటికి రావి నది తీర ప్రాంతంలో నాగరికతకు పునాది ఏర్పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి లిపి కూడా ప్రారంభమైంది.
సింధూ నాగరికత ప్రారంభ దశ_1(a)
సింధూ ప్రజలు మరో వెయ్యేళ్లకు(క్రీ.పూ.2000) మొహంజదారో హరప్పా నాగరికత లు అభివృద్ధి చేసుకున్నారు.ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా దాని పూర్తి వివరాలు మాత్రం 1999లో లభించాయి.సింధు లోయ నాగరికత (క్రీ.పూ2600 - క్రీ.పూ.1500) ప్రస్తుత భారత దేశం మరియు పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలు బయటపడినాయి. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం వెలుగులోకి రావడంతో దీనిని
సింధు లోయ హరప్పా నాగరికత అని పిలుస్తున్నారు. ఈ హరప్పా నాగరికత క్రీ పూ 2600 లో ప్రారంభమై 600 సం.లు అవిచ్ఛిన్నంగా సాగినట్లు సాయి పాపినేని రాసిన 'మూలవాసులు 'అనే వ్యాసంలో పేర్కొన్నారు (misimi జూలై 2015).సింధు నాగరికత , అతి ప్రాచీన మైన మెసొపొటేమియా నాగరికత ,ప్రాచీన ఈజిప్టు నాగరికత లకు సమకాలికమైనది. ఇవి కంచు యుగాలకు సంబంధించినవి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన సింధు నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. వీరి భాష సంస్కృతం అని కొంతమంది వాదన కాదు, ద్రవిడ అని కొందరి వాదన . అశోకుని కాలంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మి లిపిలో శాసనాలు రాశారు. కానీ దీనికి సింధు నాగరికత నాటికి వున్న లిపికి సంబంధం ఎంత మాత్రం లేదు . ఈ నాగరికత కాలంలో కొన్ని గుర్తులు ముద్రల పైన, సరిహద్దు రాళ్లపైన, చిన్న పాత్రల మీద, మెడలో ధరించే తాయత్తు లాంటి వాటిమీద కనిపిస్తున్నాయి. ఈ లిపిలోని గీతలు తమిళ భాషకు దగ్గరగా పోలికలు ఉన్నాయని అయినప్పటికీ వీటి అర్థం ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు.
సింధూ ప్రజల భాష లిపి మత భావనలు ,పూజలు , నమ్మకాలు ఆచారాలు కట్టుబాట్లు నియమ నిబంధనలు మనకు ఏమీ తెలియడం లేదు. క్రీ.పూ 2600 నాటికి ఉచ్చ దశ కు చేరిన సింధూ నాగరికత (హరప్పా నాగరికత)క్రీ.పూ 1500 నాటికి పతనమైంది.సింధూ నాగరికత పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడింది.
క్రీ.పూ. 6000 ప్రాంతంలో సింధూ నది పశ్చిమ కనుమల్లో నివసించే ప్రజలు రాతి పనిముట్లు తోనే ధాన్యాలు పండించే వారు. దాంతో పాటు మేకలు, గొర్రెలు, ఆవులు వంటి జంతువులను పెంచేవారు. ఇతర ప్రాంతాలతో వర్తకం చేసేవాళ్ళు. మూడు వేలకు పైగా జరిగిన ఈ పరిణామాలు మొహంజోదారో, హరప్పా వంటి నగరాల నిర్మాణానికి కారణమయ్యాయి.
విశ్వామిత్రుడు రచించిన గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువర్ స్వాః లు మూడు లోకాలను సూచిస్తాయని అంటారు సాయి పాపినేని. భూ అంటే భూలోకం ,భువర్ అంటే భువర్లోకం ,స్వ అంటే స్వర్గలోకం అని అర్థం. లోకం అంటే ప్రదేశమని అర్థం.రుగ్వేదంలో సింధూ, సరయు, సరస్వతి నదులు కనిపిస్తాయి .అందువల్ల ఈ మూడు మహా నదుల పరివాహక క్షేత్రాన్ని భూలోకం గా మనం భావించవచ్చు . భువర్ లోకాన్ని పితృలోకం అంటాయి పురాణాలు.
క్రీ. పూ7000 నాటికి సింధూ నదికి పశ్చిమాన ఉన్న
హిందూ కుష్ కనుమల్లో ఉన్న ఎగువ మైదానాల్లో క్రీస్తుపూర్వం 3100 కు ముందు కాలం లో సాగిన
సంస్కృతిని భువర్లోకం గా గుర్తించారు. స్వర్గం పురాణాల ప్రకారం దేవతల నివాసం. ఇది గంధర్వుల అధీనంలో ఉండేది.అసురులు గంధర్వులను తరిమేసి దానిని
ఆక్రమించుకున్నారు. అసురులను నిర్జించి దేవతలు దానిని స్వాధీనం చేసుకున్నారు. దానికి అధిపతి దేవేంద్రుడు అయ్యాడు.దీనికి రాజధాని అమరావతి. ఇది స్వర్గలోకం చరిత్ర. సింధూ నది కి పాయగా నారా నది ఉండేది. రుగ్వేదం ప్రకారం గంధర్వులు స్వర్గానికి మూలవాసులు. ఈ గంధర్వులు నారాయణుడి బిడ్డలు .నారాయణుడు అంటే నారా అనే నది మీద నివసించే వాడు అని అర్థం. గంధర్వుల మూల స్థానం అయిన స్వర్గం సింధూ-సరస్వతి దిగువ లో నారా నది కేంద్రంగా నర్మద వరకు ఉన్న తీర ప్రాంతంలో విస్తరించిన సంస్కృతిగా గుర్తించవచ్చని సాయి పాపినేని పేర్కొన్నారు.
సింధూ నాగరికత పతన దశ
మెసపుటోమియా (ప్రస్తుత ఇరాక్ )లోని ప్రాచీన సంప్రదాయాన్ని సుమేరియన్ నాగరికత అంటారు. తర్వాత కాలంలో అది బాబిలోనియా గా ప్రసిద్ధి చెందింది అక్కడ 18వ శతాబ్దంలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు హమ్మురాబి.అతని తర్వాత ఆ ప్రాంతాలకు ఆర్యులు వచ్చినట్లు క్యూనిఫాం రచనల వల్ల తెలుస్తోంది. వారిలో కొన్ని బృందాలు సింధూ నది ప్రాంతం వరకు కూడా వచ్చి ఉంటాయి. వీరందరికీ వున్న ఒకే రకమైన సంప్రదాయం , సంస్క్రతి రుగ్వేదంలోనూ కనపడతాయి. రెండింటిలోనూ గోవులది ప్రముఖ స్థానం .పార్సీ వారు అగ్ని ని పూజిస్తారు .రెండు సంప్రదాయాల్లోనూ సోమరసానికి(తాగే మత్తు పానీయం)సంబంధించిన తంతులున్నాయి.మొదట్లో తమను ఆర్యులు గా, పొరుగువారిని దాసులు గా చెప్పుకున్నారు. ఈ దాసులనే ద్రావిడులు అంటున్నారు.ఆర్యులకు దాసులకు మధ్య విభేదాలు జాతిని బట్టి కాక వారి సంప్రదాయాలల్లో వచ్చిన తేడా వల్ల వచ్చినాయి. ఆర్యుల్లో రాజన్యులు ,రుత్విజులు, కవులు ఉండేవాళ్ళు. ఆర్యులు కొత్తగా వచ్చినప్పుడు దాసుల (ద్రావిడుల)పురాలను ,ఆవులను కొల్లగొట్టే వారు. ఇలా వారు పురాలను ధ్వంసం చేయడం వల్లనే సింధు నాగరికత అంతమైందని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. రుగ్వేదంలో ఇంద్రునికి పురంధరుడు ( పురాలను నాశనం చేసేవాడు) అనే పేరు కూడా ఉంది.శతపథ బ్రాహ్మణములో అసురులు(ద్రావిడులు) స్థిరాస్తి వ్యవసాయం చేసేవారని చెప్పినారు.వారి ఆస్తి గోవులు, గుర్రాలు. వేద సాహిత్యంలో ఇతరుల పై దాడి చేసి గోవులు ,గుర్రాలు తీసుకోవడం గొప్పగా వర్ణించారు. కుటుంబానికి మారుపేరు గోత్రం .
జొరాస్ట్రియన్ మత గ్రంథమైన జంద్ అవెస్తాలో అహుర మజ్ద అనే సృష్టికర్త ఉన్నట్లు తెలుస్తుంది .వారికి దైవ శబ్దం దయ్యం తో సమానం. తెలుగులో దైవానికి వికృతి దయ్యం. వారి భాషకు మన ద్రవిడ భాష కు ఏదైనా సంబంధం ఉందేమో భాషా శాస్త్రవేత్తలు తేల్చాలి.తమకు నచ్చని స్థానికులను అసురులుగా రాక్షసులుగా చిత్రీకరించారు.
తమను దేవతలుగా చెప్పుకున్నారు. దీనిని బట్టి ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిలో ఒక తెగ ఇరాన్ లోని తెగ తో విభేదించి వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకనగా వీరికి దైవ శబ్దం దేవతలతో సమానం. దేవతల శిల్పి విశ్వకర్మ .రాక్షసుల శిల్పి మయుడు . మయసభఅద్భుతమైన కట్టడం. ఆర్యులు, ద్రావిడుల మధ్య ఘర్షణ జరిగేది. కాల క్రమంలో వారి మధ్య పెళ్లిళ్లు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగిన తర్వాత కలిసిపోయారు
ఆర్యుల పురోహితులు ద్రావిడ పురోహితులు ఒకరయ్యారు. ఆ విధంగా బ్రాహ్మణులు 18 గోత్రీకులయ్యారు.
ఆర్యుల రాక పూర్వం భారతదేశంలో ఉన్న సింధూ నాగరికతను ద్రావిడ నాగరికతగా భావిస్తున్నారు. ఈ నాగరికత గా పేర్కొన్న హరప్పా కాలిబంగన్ బలూచిస్తాన్ లోని కలత్ ప్రాంతంలో బ్రా హి భాషను (తమిళ భాష కుదగ్గరగా గల భాష ఇది)ఇప్పటికీ 2.5 లక్షల మంది మాట్లాడుతున్నారు ఈ భాష ఇరాన్ సరిహద్దులు దాటి ఎవరూ మాట్లాడడం లేదు .దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ ద్రావిడ నాగరికత కు వారసులు అవుతారు.
ఈ ద్రవిడ జాతి కూడా ఇండో-యూరోపియన్ జాతేనని చరిత్రకారులు చెబుతున్నారు. వీరు క్రీస్తు పూర్వం 4 వేల సంవత్సరాలలో కంటే ముందుగా మధ్యధరా సముద్ర ప్రాంతం నుండి వచ్చారని భావిస్తున్నారు .అదే ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆర్యులుసింధు నాగరికతను ధ్వంసం చేసి ఉంటారని ఆ రకంగా ద్రావిడులను దక్షిణ భారత దేశంలోకి తరిమి కొట్టడంతో వారంతా దక్షిణ భారతంలో కి వెళ్లి ఉంటారని చరిత్రకారులు భావిస్తూ ఇప్పటివరకు చరిత్రను రాశారు .కానీ ఇండియాలో ఐదు లక్షల సంవత్సరాల నుండి మానవ సంచారం ఉందని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అడిచన్నలూరు, కర్నూలు చిత్తూరు వంటి ప్రదేశాల్లో లభించిన ఆధారాలను బట్టి పాతరాతి యుగం లోనూ కొత్త రాతి యుగం లోనూ మానవులు సంచరించినట్లు గా తెలుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు కె.ఎస్.చలం తన 'ఇండియాలో సామాజిక పరిణామం' గ్రంథంలో వివరించారు. ద్రావిడుల కన్నా ముందే మన దేశంలో బిల్లులు చెంచు,యానాది ,సవర సంతాల్ ,ముండా వంటి తెగలు మూలవాసులుగా ఉన్నారు. కానీ వీరి గురించి పూర్తిగా పరిశోధనలు జరగలేదు.
వేదాలు
భారతీయ ప్రాచీన సాహిత్యం వేద సాహిత్యం తో మొదలవుతుంది. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రకు ఆధారంగా నిలుస్తుంది. వేద అంటే విజ్ఞానం అర్థం. వేదాలు నాలుగు.అవి 1రుగ్వేదం 2 యజుర్వేదం 3 సామవేదం 4 అధర్వణవేదం.
వేదాలు ఒకరు రాసినవి కాదు. ఇవి మౌఖికంగా ఒకరి నుండి మరొకరికి సంక్రమించినవి. వేదాలలో అత్యంత ప్రాచీనమైనది రుగ్వేదం. వేదాలను అధ్యయనం చేసిన తర్వాత వాటి కాలాన్ని పలువురు పండితులు నిర్ణయించారు. క్రీ.పూ 1500 __1000 కాలాన్ని తొలి వైదిక కాలం అన్నారు. ఈ కాలంలో రుగ్వేదం వచ్చింది. క్రీ.పూ 1000__ 600 కాలాన్ని మలి వైదిక కాలం అన్నారు ఈ కాలంలో మిగిలిన మూడు వేదాలు వచ్చాయి .వాటి ఇతర శాఖలు కూడా వచ్చాయి. ఈ వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే ఆర్యుల చరిత్ర కూడా తెలుస్తుంది.
రుగ్వేదంలో 1028 కవితలు( సూక్తాలు )ఉన్నాయి.రుక్ అంటే స్తుతించు అని,వేద అంటే జ్ఞానం అని అర్థం. యజ్ఞయాగాదుల్లో దేవుళ్లను స్తుతించే కవితలు చాలా ఉన్నాయి. యజుర్వేదం(క్రీ.పూ. 1000_600) యజ్ఞ నిర్వహణ గురించి చెప్తుంది . ఇందులో యాగాలు చేస్తున్నప్పుడు రుత్విక్కులు (యజ్ఞం చేసేవారు) పఠించే కవితలున్నాయి. యజుర్వేదం పై వ్యాఖ్యానం గా శతపథ బ్రాహ్మణం వచ్చింది.రుగ్వేదాన్ని జ్ఞానం గానం చేసే విధానం సామవేదం . ఇది క్రీ.పూ.1100 లలో వచ్చింది.సామవేదంలో సామూహికంగా రాగ బద్ధంగా గానం చేసే రుక్కులు(గీతాలు) ఉన్నాయి. అధర్వణ వేదం(క్రీ.పూ 1200)లో అనారోగ్యాన్ని పోగొట్టడానికి చదివే మంత్ర తంత్రాలు ఉన్నాయి.
వేదాలపై వ్యాఖ్యానాలు గా బ్రాహ్మణాలు( క్రీ.పూ. 1000 700 )అరణ్యకాలు (క్రీ.పూ 500 600) ఉపనిషత్తులు (క్రీ.పూ 1000_500) వచ్చాయి.
వేదాలకు వ్యాఖ్యానాలు గా ఏర్పడిన గ్రంధం బ్రాహ్మణము అని పిలువబడుతోంది ఒక్కొక్క వేదానికి కొన్ని బ్రాహ్మణాలు ఏర్పడ్డాయి.ఐతరేయబ్రాహ్మణం రుగ్వేదం గురించి చెప్తుంది .
శ్వేతాశ్వతర బ్రాహ్మణం యజుర్వేదం గురించి మాట్లాడుతుంది. గోపథ బ్రాహ్మణం అధర్వణ వేదం గురించి చెబుతుంది .ఇలా రకరకాల బ్రాహ్మణాలు ఉన్నాయి . వానప్రస్థాశ్రమంలోఉన్నప్పుడు చేసే కర్మకాండ గురించి అరణ్యకాలు చెప్తాయి. ఈ బ్రాహ్మణాలు ,ఆరణ్యకాలు యజ్ఞాలు గురించే మాట్లాడుతూ ఉంటాయి. ఉపనిషత్తులు కూడా వేదాలపై వ్యాఖ్యానాలు .ఉపనిషత్తు అనగా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేది అర్థం .ఇవి 108 ఉన్నాయి. చాలా ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు మొదలైనవి.ఇందులో ప్రశ్నోపనిషత్తు
సృష్టి ఎలా ఏర్పడింది , రుతువులు ఎలా ఏర్పడ్డాయి, ఆయనములు ఎలా ఏర్పడ్డాయి ,ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది మొదలైన ప్రకృతి సంబంధ విశేషాల గురించి చర్చిస్తుంది. తక్కినవి ఆత్మ-పరమాత్మ మనసుల గురించి చర్చించాయి.
రుగ్వేదం
రుక్ అనగా స్తుతించు అని అర్థం. రుగ్వేదం క్రీ.పూ 1500 కాలానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు.ఋగ్వేద కాలంలో ప్రజలకు లిపి తెలియదు . క్రీ.పూ.4వ శతాబ్దికి ముందు అక్షరాలు ఉన్నాయనడానికి కూడా ఆధారాలు లేవు.
ఆల్బెరూనీ ప్రకారం క్రీ.శ. 10వ శతాబ్దం తర్వాత మాత్రమే వేదాలకు లిపిరూపం ఇవ్వబడింది. వేదాలను వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడు. క్రీ.శ.14వ శతాబ్దంలో సాయణుడు ఒక సమగ్ర వ్యాఖ్యను వేదాలపై వెలువరించాడు.రుగ్వేదంను ఒకరి నుండి మరొకరికి మౌఖికంగా నేర్పుకుంటూ వెళ్లారు .మౌఖిక సంప్రదాయం అప్పటి విద్యలో భాగంగా ఉండింది .రుగ్వేదంలో ఒకచోట శిష్యులు గురువు చెప్పిన పాఠాలు వల్లె వేయడానికి వర్షాకాలంలో కప్పలన్నీ ఒకచోట గుమిగూడి బెక బెక లాడినట్లు సామ్యం చెప్పినారు.
రుగ్వేదానికి ఇరానియన్ మత గ్రంథం అవెస్థాకు దగ్గర సంబంధం ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. రుగ్వేదం లోని పదాలు, అవెస్తా లోని పదాలు ఒకటే లాగా ఉండడమే దీనికి కారణం.
రుగ్వేదం లో ఏముంది?
రుగ్వేద కాలంలో అనేక వృత్తులు ఉండేవి .బట్టలు నేయడం ఉండేది. కుమ్మరి పని సర్వసాధారణం . ఉపర ( రోకలి), ద్రిషద (రోలు) మొదలైన రాతి పనిముట్ల ప్రస్తావన ఉంది .అల్లికపని( పెషాస్కరి) రంగులద్దడం (రజయిత్రి )స్త్రీలు చేసే పనులుగా పురుష మేధ సూక్తం చెప్పింది. రజక స్త్రీని గురించి వాజసనేయ (30 . 9 .12) చెపుతుంది.అంతేగాక ధనస్సును, వింటినారిని తయారు చేసేవారు .తాళ్లు పేనే వారు .తోళ్లను పదును చేయడం ,వెదురుతో వాడి గల వస్తువులు లేపనాలు ,కత్తులు తయారు చేసే మహిళలు, రాళ్లు పగులగొట్టడం , అశ్వసంరక్షణ ,దుంగలు మోయడం, నిప్పును మండించడం, ఆవులు కాయడం ,వేటాడడం, చేపలు పట్టడం మొదలైన పనులు చేసేవారి గురించి ఇందులో ఉంది.స్వర్ణకారుడు, వ్యాపారి, వైద్యుడు, జ్యోతిష్కుడు వంటివారు ఆనాడు ఉన్నారు.రుగ్వేద కాలంలో ' నిష్క' ను డబ్బుకు చిహ్నంగా వాడేవారు.
నిష్క అనేది ఒక ముద్రిక .దానికి నిర్దిష్టమైన బరువు ఉండి ఉండవచ్చు. నిష్కను బంగారం లేదా వెండితో తయారు చేసేవారు. రుగ్వేదంలోనూ ,అధర్వణ వేదం లోనూ(20:1.27) ఒక రుషి 100 నిష్కములు, 300 అశ్వములను బహుమతిగా పొందినట్లు చెపుతాడు. శతపథ బ్రాహ్మణంలో పురోహితునికి సంభావన ఇచ్చే బంగారం 100 గింజలు ఎత్తు(13.2.3.2) అని చెపుతోంది.
__పిళ్లా కుమారస్వామి,9490122229
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment