మహాభారతం__ చారిత్రక వాస్తవాలు
మహాభారతాన్ని ఇతిహాసమని పిలిచారు. ఇతి అనగా ఇది హాసమనగా చరిత్ర అని అర్థం.అంటే ఇది చరిత్ర అని అర్థం. మహాభారతం ఆధారంగా మన భారతదేశచరిత్రను వెలికి తీయవచ్చని భావించారు పరిశోధకులు. దీనికి కారణం గ్రీకు దేశంలో హోమర్ రాసిన ఇలియడ్ ఆధారంగా జరిపిన త్రవ్వకాలలో ఆ కాలం నాటి నగర శిధిలాలు బయట పడ్డాయి .అదే విధంగా మహాభారతంలో హస్తినాపురం ప్రధాన పట్టణం.భరతుని కంటే ముందు తరాల వాళ్ళు ఆ పరంపరలోకురువంశ రాజులు పరిపాలించారు. గ్రీసు దేశంలో మాదిరే మహాభారతంలో చెప్పిన హస్తినాపురంలో కూడా తవ్వకాలు చేపడితే కొన్ని ఆధారాలు దొరుకుతాయని భావించి త్రవ్వకాలు చేపట్టారు పురావస్తు శాస్త్రజ్ఞులు.
కానీ అక్కడ కేవలం కొన్ని ఇనుప ఆయుధాలు మాత్రమే దొరికినాయి. వాటి కాలాన్ని కార్బన్ డేటింగ్ పద్ధతిలో కనుగొంటే అది క్రీ.పూ. 950 కి సంబంధించినవిగా తేలినాయి.
దానిని బట్టి మహాభారతం లో జరిగిన కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 950లో జరిగినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. అయితే ఈ సంగ్రామం ఆధారంగా వ్యాసుడు జయం పేరుతో ఒక కథను రాసినాడని ఆ తర్వాత వివిధ కాలాలలో క్రీ.పూ. 400నుండి క్రీ.శ. 400 వరకు జరిగిన సంఘటనలను జయం కథలోకి చేర్చి పెద్ద కథగా మహాభారతాన్ని మలిచారని ప్రముఖ చరిత్ర పరిశోధకులు సుక్తాకర్ హోష్కిన్స్ భావించాడు.ఇది ప్రారంభంలో 18,000 పద్యాలతో ఉన్న కథ కాలానుగుణంగా లక్ష పద్యాలకుచేరింది.గణసమాజంలో నుంచి రాచరిక వ్యవస్థలోకి మారుతున్నప్పుడు జరిగే మార్పులకు అనుగుణంగా మహాభారతం కథ సాగింది .
మహాభారత కథ అనేక ఉపకథలతో సాగింది .కథలో కథ ఉంటుంది .ఆ కథ శాఖోపశాఖల కథలుతో సాగుతుంది. ఆ కథల్లో సమాజంలోని ప్రజలు పాటించాల్సిన ధర్మాలను చెప్పించారు. బ్రాహ్మణుల గొప్పతనాన్ని పెంచే విధంగా తక్కిన కులాలవారు వారికి అణిగిమణిగి ఉండే విధంగా
రాసినారు.చాలా గణాలను తమలో కలుపుకోవడానికి, వారి దేవుళ్ళను ఆర్యుల దేవుళ్ళ లోకి కలుపుకోవడానికి వీలుగా కథను నిర్మించి ప్రచారం చేసినారని డిడి కోశాంబి పేర్కొన్నారు.ఈ కథానిర్మాణం బుద్ధుని తర్వాత జరగడం వల్ల వర్ణ వ్యవస్థ పతనం కాకుండా ఉండడానికి , భారతం లోని కథలను వర్ణ వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెప్పే విధంగా రాశారు. బౌద్ధం చెప్పే విషయాలను బ్రహ్మచర్యాన్ని ఒక వైపు కీర్తిస్తూ ఒకవైపు ఖండిస్తూ పరస్పర విరుద్ధ అంశాలతో ఒక్కోసారి ఒక్కో రకంగా వివిధ పాత్రల ద్వారా చెప్పించారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే విషయాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
మహాభారత కథను డి.డి.కోశాంబి మూడు సంప్రదాయాల కలయికగా విడగొట్టాడు .ఈ కథ మొత్తం ఢిల్లీ ,మీరట్ ,మధుర ప్రాంతానికి పరిమితమైనదిగా గుర్తించాడు.భారతంలో 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షల మంది చనిపోయారు .ఒక లక్షా 30 వేల రధాలు ఏనుగులను, గుర్రాలను ఉపయోగించారని రాసినారు.ఇలా జరగాలంటే ఆ నాటి దేశ జనాభా 20 కోట్లు ఉండాలని ఆయన అంచనా వేశారు .అయితే బ్రిటిష్ కాలం నాటికి దేశ జనాభా 20 కోట్లకు కూడా చేరుకోలేదని గుర్తు చేస్తాడు.ఈ కథకు కేంద్రం కురుక్షేత్ర యుద్ధం కాదు. నాగజాతి అంతం చేస్తానని జనమేజయుడు చేసిన యజ్ఞం అని కోశాంబి భావించాడు.
అయితే జనమేజయుడు తలపెట్టిన యజ్ఞం ఆస్తికుడు అనే బ్రాహ్మణుని చొరవ వలన ఆగిపోతుంది.ఆస్తికుని తల్లి నాగ స్త్రీ .తండ్రి బ్రాహ్మణుడు. జనమేజయుని పురోహితుడు సోమశ్రవుడు కూడా నాగ స్త్రీకి పుట్టినవాడే. యజ్ఞాన్ని ఆపినారంటే ఆటవికులకు వ్యవసాయ సమూహాలకు మధ్య సామరస్యం కుదరటం వల్లనే జరిగి ఉంటుంది .అటవికులు వ్యవసాయాన్ని వర్ణ వ్యవస్థను అంగీకరించారు. వారిలో కొంతమంది బ్రాహ్మణులుగా క్షత్రియులుగా మారిపోయారు. అత్యధికులు శూద్రులయ్యారు. మహాభారత కథలో శ్రావస్థి, కపిలవస్తు ,రాజగృహ అయోధ్య వారణాసి ,ఉజ్జయిని కౌసంబి ,హస్తినాపురం ,తక్షశిల మొదలైనవన్నీ నగరాలు గా వర్ణించారు . వాస్తవానికి ఇవి కొంత నాగరికత సాధించిన గణాలు సంచరించిన ప్రాంతాలుగా ప్రసిద్ధి చెంది ఉంటాయని కోశాంబి చెప్తాడు. అందుకే వాటిన కోసలలు ,మా గధులు అని పిలిచారు.
కాంభోజ ,గాంధార ,కురు, పాంచాల ,మత్స్య ,శూరసేన ప్రాంతాలన్నీ జనపదాలు గా ప్రసిద్ధి చెందినవే.ఉత్తరాపథంలో మగధ ,కోసల విదేహ ,మల్ల,శక్య,లిచ్ఛావి కూడా జనపదాలే.గంగా యమున లోయల మధ్యలో కాశి, కుసినార, అవంతి, వత్స కూడా జనపదాలే.ఈ జనపదాలు అనేక పురాణాల కథల్లోనూ, బౌద్ధ కథల్లోనూ కనిపిస్తాయి.మహాభారతంలో బృహద్రతుడు మగధ రాజు గా ఉంటాడు. కాకపోతే భారతదేశంలోనే మొట్టమొదటి సర్వసత్తాక రాజ్యం మగధ .ఇది క్రీ.పూ. 530_470 మధ్య రూపొందింది .హర్యాంక వంశస్థుడైన బింబిసారుడు ఈ మగధను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. చాలా గణాలు వర్ణ వ్యవస్థలోకి ఇమిడిపోయాయి. అనేక జనపదాలు మెల్లగా మారిపోయాయి. విదేహ జనపదం వైదేహికులుగా, వ్యాపారస్తులుగా మిగిలారు. మగధ గణానికి చెందిన వారు మాగధులుగా అంటే రాజులను పొగిడేవారుగా మిగిలిపోయారు
__పిళ్లా కుమారస్వామి,
(http://virasam.org, జూన్,2019)

Comments
Post a Comment