భిన్న దృక్పథాల సంఘర్షణే భారతీయ తాత్విక చింతన
భారతీయ తాత్విక చింతనంతా ఒకే రకంగా సాగుతోందని అది బ్రహ్మ, ఆత్మ, మోక్షం మొదలైన భావవాదం చుట్టూ తిరుగుతూ వుందని ఆధ్యాత్మిక వాదులు నిత్యం ప్రచారం చేస్తూవున్నారు. వాస్తవానికి భావవాదానికి భౌతిక వాదానికి మధ్య జరుగుతున్న సంఘర్షణే భారతీయ తాత్వికచింతన.
దేవీప్రసాద్ చటోపాధ్యాయ రాసిన భారతీయ తత్వ శాస్త్రం-సులభపరిచయం (అనువాదం డా॥ గూడ సుందరరామయ్య) గ్రంథం భారతీయ తాత్విక చింతనపై సంపూర్ణంగా కాకపోయినా ఒక అవగాహన పెంపొందించుకునేందుకు సులభపరిచయం రాశారు. ఈ గ్రంథంలో ఆయన విశ్లేషించినట్లు రెండు భావధారలు సమాంతరంగా సాగినాయి. అవి భావవాదం, భౌతికవాదం.
అయితే అవి ఎలా సంఘర్షించాయో వాటి మధ్య మళ్ళీ సామరస్యం ఎలా కుదిరిందో తెలుసుకోవాలంటే ఈ గ్రంథం తప్పక చదవాలి.
భారతీయ తాత్విక చింతనను తెలుసుకోవాలంటే అత్యంత ప్రాచీన సాహిత్యమైన వేదసాహిత్యం నుంచి మొదలు పెట్టాలి. దాదాపు 5000సంవత్సరాల క్రిందటి వేద సాహిత్యం విజ్ఞానాభివృద్ధి ప్రాథమికంగా వున్నదశలో ఏర్పడిన భావాలు మెల్లమెల్లగా సాహిత్యరూపం దాల్చి వేదసాహిత్యం తయారయ్యింది. వేద గ్రంథాలన్నీ సాధారణ శకం కు ముందు BCE1000-600 మధ్య ప్రాంతాలలో సంకలనం
చేయబడినాయని ఈ వేదాలనుBCE.500 ప్రాంతంలో ప్రాముఖ్యంలోకి తెచ్చివుంటారని పరిశోధకులు భావిస్తున్నారు.
ఏమీ తెలియని కాలంలో ప్రతి సంఘటనను దైవశక్తికి ఆపాదించారు. వానకు, మేఘానికి, అగ్నికి, సముద్రానికి, గాలికి ఇలా ప్రతి దానిని ఒక దేవతగా భావించారు. అందువల్లనే వేదాల్లో చాలామంది ఇతర దేవతలు కనిపిస్తారు. వేదాల్లో వున్నదంతా గేయాలు, కవితలు తప్ప మరేమీకాదు. వాటికి ప్రత్యేక మహిమలుగాని, పవిత్రతగాని ఏమీలేవు. ఆనాటి
వారు నేడు చాలా మంది మానసికంగా భావవాదులుగా ఆచరణలో మాత్రం భౌతికవాదులుగా ఎలా ఉన్నారో వేదకాలంనాటి
వారూ అదేవిధంగా ఉన్నట్లు కనిపిస్తారు. వారి కవితల్లో చాలా చోట్ల భౌతికవాద భావనలు కనిపించడమే దీనికి నిదర్శనంగా భావించవచ్చు. బంగారం, పుత్రప్రాప్తి, ఆరోగ్యం పొందటానికి అగ్ని, సోమరసం మొదలైన వాటిపై ఆధారపడినారు. ఈ ఆలోచనలు చాలాకాలం నడిచాయి. దీనికి కారణం ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులే.
ప్రాచీన కాలం నుండి 19వ శతాబ్దంలో ప్రథమ అర్థ శతాబ్దంవరకు(ఆంగ్లేయులు రానంతవరకు) ఏ విధమైన మార్పు జరగకుండా సమాజం సాగిపోవడంవల్లనే భారతదేశం స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో మార్పు రాలేదని మార్క్స్ గుర్తించారు.
వేదాల్లో మొదటిది రుగ్వేదం. ఇందులో 1-187 పితృదేవత అగస్త్యుడు అన్న సూక్తంలో(కవిత్వంలో) 'ఓ పితూ, పర్వతాల సంపద నీకే చెందుతున్నది. ఓ తీయని వాడా మామాటలు వినాలి. మాభోజనానికి దగ్గరగా వుండు. నీరు, మొక్కలు సమృద్ధిగా వుంటే సంతోషిస్తాము.కనుక ఓ శరీరమా నీవు లావుగా వుండాలి. ఉడకబెట్టిన యవ, కాగిన పాలతో కలిసినపుడు ఏర్పడేసోమరసం మాకు ఆహ్లాదం కలిగిస్తుంది. కనుక ఓ శరీరమా నీవు లావుగా పెరుగుదువుగాక' ఇలా
సాగే కవితలలో 'వాపాతే పీవ:ఇతభవ' అనే పల్లవివుంది. దీని అర్థం “ఈ శరీరం పుష్టికరంగా వుండాలి. తుష్టిని కలిగి వుండాలి' అని. కవితలన్నింటిని గమనిస్తే వేదకాలం నాటి మనుషులు భౌతిక సుఖాలకోసం, భౌతిక పదార్థాల కోసం తాపత్రయ పడ్డారని అర్థమవుతుంది.
వేదాల్లోని దేవతలు ప్రధానంగా మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలైనవారున్నారు. అలాగే అన్నదేవత, 'గర్భస్రావనిరోధ దేవత' మొదలైన దేవతలు కూడా వుండేవారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే దేవతలు వేదాలలో లేరు. ఈ వేదాలన్నీ యజ్ఞాలు చేయడానికి వుపయోగపడతాయి. యజ్ఞం వలన వర్షాన్ని, భాగ్యాన్ని, జయాన్ని పొందవచ్చనే భావనతో పాడేపాటలే వేదాలని 'గోర్టన్ చైల్డ్' అభిప్రాయపడ్డాడు.
వేదసాహిత్యం పరంపరలో భాగంగానే ప్రతిదాన్ని పూర్వపక్షం చేసే విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. పాతవాటిని మొదలు చెపుతారు. దీన్ని పూర్వపక్షం అంటారు. పూర్వపక్షంలో వుండే బలహీనతలను ఎత్తిచూపి తర్వాత తమభావాలను చెపుతారు. దీనినే 'సిద్ధాంతం' అంటారు. ఇలాతమ భావాలను 'సిద్ధాంతాలు' గా ప్రచారం చేస్తారు. ఇలా మీమాంసలు, సాంఖ్య, యోగ,న్యాయ, వైశేషికాలు వచ్చాయి. వీటిని దర్శనాలు అన్నారు.వేదాలకు దర్శనాలకు కూడా జతచేర్చి వాటిన్నింటి ఒకే వేదాంతంగా మార్చినారు. దీన్నింతటిని కలిపి ఒకే ఒక తత్త్వజ్ఞానమని ప్రచారం చేశారు. ఈ తత్త్వజ్ఞానం వేదాంత మతశాఖ అయిన అద్వైతంలో లయమైందన్నారు. అద్వైతం ప్రకారం బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. జీవుడు-బ్రహ్మ,(జీవాత్మ-పరమాత్మ) అనేవి ముఖ్య విషయాలు. బ్రహ్మ చైతన్యం, జగత్తు మిథ్య.
మీమాంస సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక దర్శనాలన్నీ మొదటి భౌతిక వాదం తో మొదలై భావవాదంపై అమోఘమైన యుద్ధం చేశాయి.మీమాంసకులు ప్రపంచమనేది నిత్యం వస్తూపోతూవుండే చర్యగా భావించారు. వైదికదేవతలైన ఇంద్రుడు, అగ్ని, వాయువు, మొదలైన దేవతలు కేవలం పేరుకే వున్నారు కాబట్టి వారి ఆరాధన అర్థరహితమన్నారు. సృష్టి స్థితిలయలు ప్రజాపతి వలన ఏర్పడతాయనే విషయాన్ని హేళన చేశారు.మోక్షాన్ని నిరాకరించారు. స్వర్గమంటే సుఖమన్నారు. పరలోకం కాదన్నారు. వీరు అభివృద్ధి చేసిన
జ్ఞాన మీమాంస తత్వశాస్త్రం అనేక వైజ్ఞానిక భావాలకు బీజం వేసింది. అదే సందర్భంలో జ్ఞాన మీమాంస దర్శనం ఒక చిక్కుముడిగా వుండిపోయింది. ఈ దర్శనం కూడా ఆర్థికంగా వుపయోగపడే సంప్రదాయాలను వదిలిపెట్టరాదని చెపుతుంది. యజ్ఞాలను ఇవి సమర్థించాయి. ఇలా మీమాంస కూడా వేదాంతంలో భాగమైపోయింది. కానీ భావవాదాన్ని పూర్వపక్షం చేసి భౌతికవాదానికి పునాదిని వేసింది.
వైశేషిక సూత్ర గ్రంథాన్ని కణాదుడు రాసినాడు. ఇతని కాలం క్రీ. శ. 150 అని కొందరి అభిప్రాయం. ఇంకా ముందున్నవాడని కొందరి వాదన. కణాదుడు ప్రపంచమంతా అణువులసమూహమని చెప్పినాడు. ప్రతిపదార్థం పరమాణువులనే చిన్నచిన్న కణాలతో ఏర్పడినాయని
చెప్పినాడు. ఒక పదార్థాన్ని అనంతంగా విభజించుకుంటూ పోగా ఇక విభజించటానికి వీలులేని దాన్ని 'అణువు' అన్నాడు. సూర్యకిరణాల్లో వుండే అల్పాతి అల్పమైన రేణువునే వీరు త్ర్వణుక' అన్నారు. అది మూడు భాగాల కలయిక వలన ఏర్పడినందువల్ల దానిని అట్లా పిలిచారు. ఇందులో
వుండే ప్రతి భాగాన్ని 'ద్వణుక' అన్నారు. 'ద్వణుక' కంటికి కనిపించదు. కాని ఇందులో కూడా భాగాలుంటాయన్నారు. ద్వణుకలోని భాగాలను పరమాణువులన్నారు. ఆయన మరణిస్తూ 'కణాయనమః' అంటూ మరణించాడని అంటారు. గ్రీకు తత్త్వవేత్త డెమొక్రటస్ ఇదే విధంగా అణువాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను కణాదుని సమకాలీకుడు. వైశేషిక సూత్రాలు భగవంతుని నిరాకరించినందువల్ల కణాదుని నాస్తికుడన్నారు. గ్రీకు, చైనాదేశాల్లో తాత్విక భావాలు చర్చలు
జరుగుతున్న కాలంలోనే మనదేశంలో కూడా సమాంతరంగా
అదే విధమైన ఆలోచనాధోరణి కనిపించడం ఆశ్చర్యం వేస్తుంది.
సాంఖ్య సూత్రాలను కపిలుడు ప్రవేశపెట్టాడు. ఇతను క్రీ.పూ. 400కాలం నాటివాడని,బుద్ధుని తర్వాత కాలంనాటి వాడని పలువురి అభిప్రాయం. ప్రకృతి నిత్యమైనది. సమస్త చరాచరా సృష్టింతా దాని రూపాంతరాలే' అని ఆయన ప్రతిపాదించాడు. మొత్తం 25 పదార్థాలతో సృష్టి కార్యం జరుగుందని కపిలుడు విశ్లేషించాడు. భౌతిక పదార్థం ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుందని వీరు చెప్పినారు. వేదాంతదర్శనానికి సాంఖ్యదర్శనం ప్రథమ ప్రత్యర్థిగా నిలిచింది.
బ్రహ్మ సూత్రాల్లో సాంఖ్య సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. సాంఖ్య సిద్ధాంతంలోకి పురుషున్ని
ప్రవేశపెట్టారు. పురుషుని కోసం ప్రకృతి వుంది.పురుషుని కైవల్యసాధనే అంతిమ లక్ష్యమనిసాంఖ్యం చెప్పడంతో అది రెండు విరుద్ధ భావాల్లోకి పోయి అంతిమంగా భావవాదంలోకి
కూరుకుపోయింది.
న్యాయ వైశేషిక దర్శనాల్లో అన్నంభట్టు అనే దార్శనికుడు పృధ్వి అణువులచేత నిర్మితమైన మన శరీరాలు భూలోకంలో వున్నాయన్నాడు. జల అణువులచేత నిర్మితమైనవి వాయులోకంలోనూ,అగ్ని అణువుల చేత నిర్మితమైనవి ఆదిత్యలోకంలో వుంటాయన్నాడు. అయితే ఇతను తన పాత నమ్మకాలను వదలలేదు. సృష్టివాదాన్ని నమ్ముతూనే భౌతిక వాదాన్ని ప్రవేశపెట్టారు.
ఒక సత్యాన్ని లేదా దోషాన్ని నిర్ధారించడానికి న్యాయవైశేషికులు విప్లవాత్మకమైన పద్ధతి ప్రవేశపెట్టారు. దీనికి వారు చెప్పింది ఆచరణే సత్యానికి సరైనదారని.ఆచరణలో పెట్టినపుడు అది సత్యమైనదా కాదా తెలుస్తుందన్నారు. ఆచరణలో మంచి ఫలితాలు వస్తే సత్యమని లేకుంటే అది
దోషమని చెప్పినారు. ఆధునిక కాలంలో ఇదే వైజ్ఞానిక పద్ధతిని పాటిస్తున్నారు. న్యాయవైశేషికులు అణువుల కలయిక వలన పదార్థంలోని భాగాలు ఏర్పడతాయని భావించారు. అయితే అట్లా కలవడానికి ఒక కర్త కావాలని వీరు భావించారు. కుండలోని భాగాలను కలవడానికికుమ్మరి ఏ విధంగా అవసరమో ఆవిధంగా అణు సమూహాల కలయికకు ఒక కర్త అవసరమన్నారు. ఆవిధంగా వీరి అణు సిద్ధాంతంలోకి భగవంతుని ప్రవేశపెట్టారు. అంతేగాక వీరు ఆత్మను అంగీకరించారు. శరీరంతో సంబంధం కలిగినపుడు ఆత్మ చైతన్యవంతంగా వుంటుందన్నారు. ఆత్మను
అంగీకరించడంతో మోక్షం మొదలైన వేదాంత భావాలు ఈ దర్శనంలోకి చొరబడినాయి.
బుద్ధుని(క్రీ. పూ. 563-463) సమకాలీనుడైన అసిత కేశకంబరుడు భౌతికవాది. ఆయన ప్రకారం పంచభూతాల కలయికవలన మనిషి ఏర్పడుతున్నాడు. మనిషి చనిపోగానే భూమి అంశం భూమిలోనూ, నీటి అంశం నీటిలోనూ, అగ్ని అంశం అగ్నిలోనూ, వాయువు అంశం వాయువులోనూ,
ఇంద్రియాలు ఆకాశంలోనూ కలిసిపోతాయి. మూర్ఖులైనా, ప్రజ్ఞావంతులైనా ఎవ్వరైనా ఒకే రీతిగా శ్మశానంలో కాలి మసైపోతారు. అక్కడ కొన్ని ఎముకలు మాత్రమే మిగులుతాయి. చనిపోయినవాన్ని శ్మశానందాకా స్తుతిస్తారు. యజ్ఞాలుకానీ, దానంకానీ, తపస్సుకానీ అట్లాంటివి ఏమీలేవు.
పుణ్యం, పాపం లాంటివి ఏవీలేవు. వాటి ఫలితాలు ఏమీలేవు. దానాలు, ధర్మాలు అని చెప్పడం తెలివి తక్కువతో కూడినది.
శరీరం కంటే భిన్నంగా ఆత్మ అనేది ఏదీ లేనందువల్ల ఆత్మ స్వర్గానికి పోవడం, కర్మ ఫలితాన్ని అనుభవించడం, మోక్షం పొందడం లాంటివి ఏమీ లేవని చార్వాకులు చెప్పినారు. నిప్పుకు కాంతి, వేడి అనే గుణాలుంటాయి. అలాగే శరీరానికి ప్రాణం, చలనం, చైతన్యం, జ్ఞాపకశక్తి మొదలైనవి వుంటాయి. ఇవి సహజ లక్షణాలు. శరీరం లేకుండా ఇవి ప్రత్యేకంగా వున్నట్లు చెప్పలేం. ఆత్మను అంగీకరించేవాళ్ళకు ఇవి ఆత్మగుణాలుగా కనిపిస్తాయి. శరీరంకంటే భిన్నమైన
ఆత్మ లేదన్నదే మా అభిమతమని చార్వాకులు చెప్పినారు. చార్వాకులను లోకాయతులు అని కూడా అన్నారు. లోకాయత దర్శనాన్ని పురందరుడు' క్రీ.శ. 7వ శతాబ్దంలో రాసినట్లు దాస్ గుప్తా చెప్పినాడు.
చార్వాకులు చెప్పిన అనేక విషయాలను గురించి భావవాదులు చులకనగా మాట్లాడారు. వీరిని సుఖవాదు లన్నారు. అతిగా తినడం, అతిగా తాగడం, గర్వం,
కాముకత్వం, దురాశ, పేరాశ, పీనాసితనం, దోపిడి మొదలైనవన్నీ చార్వాకులకు అంటగట్టారు. కాని మహాభారతంలోని శాంతిపర్వంలో చార్వాకుల దృక్పథం వేరుగా ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది.
మోక్షం పొందినపుడు ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుందని, గుణరహితంగా వుంటుందని,చైతన్యరహితంగా వుంటుందని, దానికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్ర విజ్ఞానం ద్వారా చూచినపుడు
అర్ధరహితంగా వుంటుంది. అయితే ప్రాచీన కాలంలోనే ప్రజలను మోసగించడానికి తమ పబ్బం గడుపుకోవడానికి దేహమే ఆత్మ అని ప్రచారం చేస్తున్నారని చార్వాకులు లేదా లోకాయతులు
విమర్శించేవారు.
బుద్ధుడు భగవంతుని భావనను నిరాకరించాడు. బుద్ధుడు ఉపనిషత్తులోని ఆత్మజ్ఞానం మోక్షం సాధించడానికి మార్గమనే విషయాన్ని విశ్వసించలేదు. తనచుట్టూవున్న సాఘింక, నైతిక,లేదా రాజకీయ దురాగతాలను నివారించడానికి భగవద్భక్తిగాని, ప్రార్ధనలుగాని, యజ్ఞయాగాది
క్రతువులుగాని తోడ్పడతాయని బుద్ధుడు భావించలేదు.
నిత్యం మారుతూవుండేదే పదార్థాల ఉనికికి ఆధారమని బౌద్ధ సిద్ధాంతం చెప్పింది.మనసికావస్థలన్నీ సత్యం కాబట్టి ఆత్మ అసత్యం అని బౌద్ధం చెప్పింది. సమాజంలో వున్న ప్రజల
దు:ఖాన్ని నివారించాలంటే ఒక ఆచారణాత్మక సిద్ధాంతం అవసరమని భావించాడు బుద్ధుడు. కలతలు
లేని మనస్సు ను పొందటానికి ఆర్యసత్యాలు బోధించాడు. అష్టాంగమార్గాలు బోధించాడు. కార్యాకారణ సిద్దాంతం ప్రతిపాదించాడు.ప్రపంచం నిరంతరం మార్పు చెందుతుందన్నాడు.ఈ రకంగా బుద్ధుడు పూర్తిగా భౌతికవాదంపై ఆధారపడి తన ధర్మాలను బోధించాడు.
బుద్ధునికి పూర్వమున్న జైనం కూడా భౌతికవాదాన్నే ఆధారంచేసుకుంది.
వేద ప్రమాణాన్ని అంగీకరించినవారిని ఆస్తికులని, అంగీకరించనివారిని నాస్తికులుగా నిర్వచించాడు మనువు. ఆరకంగా లోకాయత లేదా చార్వాక మతం, బౌద్ధదర్శనం (బౌద్ధం), జైనం లను నాస్తిక మతాలన్నారు.
వేదంలోని చివరిభాగాలకు ఉపనిషత్తులని పేరు. దీన్నే వేదాంత దర్శనమన్నారు. వీటిలో ఒకేరకమైన తాత్విక భావాలు లేవు. వీటిపై అనేక వ్యాఖ్యాలు రాసినారు. వీటికి వేదాంత సూత్రాలు బ్రహ్మసూత్రాలు అనే గ్రంథంలో ఒక రూపాన్ని ఇచ్చారు. వీటిని బాదరాయణుడు రాశాడని కొందరి అభిప్రాయం. ఇవి క్రీ.పూ. 2వ శతాబ్దంలో రూపొందించారని ప్రొఫెసర్ దాస్ గుప్త, క్రీ.శ. 200 కాలంలో 500 మధ్యలో రూపొందాయని జాకోబి భావించారు. పరబ్రహ్మ తప్ప దేన్నీ
సత్యంగా అంగీకరించనందువలన ఈ వేదాంత దర్శనాన్ని 'అద్వైతం' అన్నారు. పరబ్రహ్మ, ఆత్మ ఒకటేనని చెప్పడం ఉపనిషత్తుల విశిష్టత. 'తత్వమసి', 'అహంబ్రహ్మాస్మి' అని చెప్పడం ద్వారా అద్వైత భావాలు ప్రచారం చేయబడినాయి.
బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు ఆత్మ గురించి వినడం వలన, ధ్యానించడం వలన ప్రపంచాన్ని గురించిన సమస్తజ్ఞానం వస్తుందని చెప్పినాడు.
ఛాందోగ్యోపనిషత్తులో ప్రజాపతి "ఆత్మ పాపరహితమైనది. జరామరణము లేనిది, దిక్కాలాతీతమైనది,ఆకలిదప్పులు లేనిది, దుఃఖరహితమైనది" అని ఆత్మ లక్షణాలు వివరిస్తాడు. యాజ్ఞవల్క్యుడు ఆత్మ గురించి ఇలా చెపుతాడు. 'ఒక ఆకు మీద వుంటూ అదే ఆకును భక్షిస్తూ ఆ ఆకు చివరి దాకా
వచ్చిన గొంగళి పురుగు ఆ ఆకును వదిలివేసి మరొక ఆకు పైకి ఏ విధంగా తన శరీరాన్నంతా కూడ గట్టుకొని పోతుందో, అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదలివేసి మరొక దానికై యత్నిస్తుంది. అతని కర్మలను బట్టి, అతను మరొక దేహంలో ప్రవేశిస్తాడు. పుణ్యకార్యాలను చేసినవారు పుణ్యాత్ములు గా
పాపకార్యాలు చేసినవారు పాపులుగాను జన్మిస్తారు. కామం లేనివారు, తృప్తకాములు, ఆత్మకాములు,బ్రహ్మ స్వరూపులే కనుక వారు బ్రహ్మలో ఐక్యమవుతారు". ఇంత చెప్పిన యాజ్ఞవల్క్యుడు వేల సంఖ్యలో గోవులను, అనేక ధనరాసులను జనకుని దగ్గర దానంగా తీసుకొన్నట్లు ఒక కథలో
వుంది. వీరు ఈ ప్రపంచాన్ని, దేహాన్ని ఆత్మే సృష్టించిందని ప్రచారం చేశారు. ఏ చైతన్యం నుండిభావవాదులు ఈ వాదాన్ని తయారు చేశారో ఆ చైతన్యాన్ని వదిలివేసి మరణంలోకి వెళ్ళిపోయారు.
చైతన్యం గురించి లోకాయతులు, చార్వాకులు మాత్రం స్పష్టంగా మన మేధస్సు నుండి వస్తుందని ధైర్యంగా చెప్పినారు.
ఏమి తెలియని రోజుల్లో ఆత్మ శరీరంలో నివసిస్తుందని, మరణానంతరం శరీరాన్ని వదిలివేస్తుందని భావించారు.
ఆత్మకు శరీరానికి సంబంధం గురించి చర్చించిన వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. 1. ప్రకృతిపై ఆత్మ ఆధిక్యాన్ని అంగీకరించినవారిని భావవాదులని అన్నారు. 2. ఆత్మకు నిరాకరించి ప్రకృతి ఆధిక్యతను గుర్తించిన వారిని భౌతికవాదు లని అన్నారు.
చారిత్రకంగా పరిశీలిస్తే సిద్ధాంతానికీ ఆచరణకు సంబంధం లేకుండా పోయినందువలన భావవాదం పుట్టింది. ఆచరణకు సిద్ధాంతానికి ఎక్కడా పొత్తు కుదరదని శంకరుడు వాటి మధ్య తేడాను సమర్థించాడు. జ్ఞానం, కర్మ రెండు పరస్పర విరుద్దాలన్నాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి
కర్మ పెద్ద ఆటంకమన్నాడు. కర్మ అంటే వైదిక కర్మ అనీ, జ్ఞాన మంటే బ్రహ్మజ్ఞానమనీ చెప్పినాడు.శంకరుడు పూర్తిగా జ్ఞానంపై దృష్టిని నిలిపి,జ్ఞానం వలన మోక్షం వస్తుందనీ, కర్మ మోక్షానికి
ఆటంకమని భావించి జ్ఞానాన్ని మోక్ష స్వరూపంగా స్వీకరించాడు. జ్ఞానంపై ఆయనకున్న అపారమైన ప్రేమ వలన,
కర్మను తిరస్కరించాడు. ఆయన తీసుకొన్న జ్ఞానం కూడా అలౌకికమైనది. దాంతో ఆయన తార్కిక జ్ఞానాన్ని లౌకిక జ్ఞానాన్ని ఆయన ఖండించాడు. ఇది నిర్లక్షంతో చేసిన పని. అందువల్లే శంకరుని భావవాదం శిఖరాగ్రానికి చేరి మన దేశంలో విజ్ఞానశాస్త్రాల పురోగమనాన్ని అది నిరోధించింది.
భూమినీరు, గాలి నిప్పు మొదలైన వాటిల్లో ప్రత్యేకంగాగానీ సమ్మిశితంగా గాని చైతన్యంలేదు. కాని అవి ప్రత్యేకమైన పాళ్ళలో కలిసినపుడు ఒక శరీరంగా ఏర్పడినపుడు వాటిలో నుంచి చైతన్యం ఉత్పన్నమవుతుందని లోకాయతులు భావించారు. రకరకాల వస్తువులను కలిపి పులియబెట్టి మరగకాచి వడగట్టినపుడు వచ్చే ద్రవ పదార్థంలో 'మత్తు' గుణం ఎలావస్తుందో అలాజ్ఞానం కూడా శరీరంతోపాటే వస్తుందన్నారు. అందువల్ల చైతన్నవంతమైన శరీరమే మానవుడు అని నిర్వచించారు.ఆలోచన చైతన్యం రెండు మన మేధస్సు నుండి వస్తాయని ఏంగెల్స్ చెప్పినాడు.
అశాస్త్రీయమైన మూఢవిశ్వాసాలకు అధికారానికి మధ్య దగ్గర సంబంధముంది. దీనికి కారణాలు అనేకం. ఇవి ప్రజల్లో ఉంటే అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా వుంటారని,దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి విషయంలోనూ చట్టబద్దులుగా వుంటారని అధికారవర్గాలు ఆశించేవారు.
ఆనాటి సమాజం తార్కిక దృక్పథాన్ని పెంపొందించేందుకు సహకరించే స్థితిలో లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇది గ్రీకు దేశంలోనైనా, ఈజిప్టులోనైనా, భారతదేశంలోనైనా ఒక్కటే. అయితే ఈనాటి సమాజం కూడా శాస్త్ర విజ్ఞానపు ఫలాలు అందుకుంటున్నా తార్కిక హేతువాద భావాలను
పెంపొందించుకోలేదు. పైగా పాలకులు పాత పద్ధతులు అనుసరిస్తూ ప్రజల్ని మూఢవిశ్వాసాల్లోకి
నెడుతున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటే అప్పుడు భౌతిక వాదులను మట్టు పెట్టేవారు. వారిగ్రంధాలను భావాలను నాశనం చేసేవారు. ఇప్పుడు అంతగా లేదు. కానీ ఇటీవల కల్బుర్గి,దబోల్కర్ మొదలైన వాళ్ళను చంపడం మళ్ళీ మూఢవిశ్వాసాలను పెంపొందించేవారు అధికారంలోకి
రావడమే కారణం.
శాస్త్రప్రమాణానికి విరుద్ధంగా వుండే తర్కం, వేద నిందకులు, భౌతికవాదులు అనుసరించే తర్కం నిషిద్ధమని మనుధర్మశాస్త్రకర్తలు శాసించినారు. మనువు తన ధర్మ శాస్త్రాలలో పాషాండులతో,వేద నిరోధకులతో మాట్లాడరాదని, శాసించాడు. వేదాంతులు వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు.
ఆఖరుకు భౌతికవాదులైన న్యాయవైశేషకులు కూడా వేదప్రమాణాన్ని అంగీకరించారు. వేదాలనూ పూర్తిగా నిరాకరించిన వారు బౌద్ధులు, జైనులు, లోకాయతులు. కాకపోతే బౌద్ధులకు, జైనులకు ప్రామాణిక గ్రంధాలు వున్నాయి. వీటన్నింటిని తోసిపుచ్చినవారు లోకాయతులు.
“బ్రాహ్మణులు తమ భుక్తి కోసం చచ్చినవారికి చేసే శ్రద్ధకర్మలు మొదలైనవన్నీ తయారుచేశారు. కర్మ సిద్ధాంతం వాస్తవం కాదు. వేదాలను రాసినవారు మూర్ఖులు, దొంగలు, మోసగాళ్ళు” అని
లోకాయతులు చెప్పినారు.
పై దర్శనాలన్నింటి పరిశీలిస్తే రెండు తాత్వికవాద ధోరణులు భారతీయ సమాజంలో సమాంతరంగానే సాగినాయని తెలుస్తుంది. అయితే వీటిల్లో భావవాదం గరిష్టస్థాయికి చేరింది. అందువల్ల మనకు లభించే దర్శనాలన్నింటిలో మోక్షం ఆదర్శంగా నిలుస్తుంది. ప్రకృతిని ఆధీనంలోకి తీసుకునే శక్తిలేకపోవడం వల్ల ప్రకృతి శక్తులను దేవుళ్ళుగా కీర్తిస్తూ 'మోక్షమనే' ఆదర్శాన్ని, దార్శనికులు
సృష్టించారు. అదే సందర్భంలో భౌతికవాద దర్శనాలుగా పేరుగాంచిన లోకాయత, చార్వాక, బౌద్ధ దర్శనాలలో లోకాయత దర్శనం భౌతికవాద ప్రాపంచిక దృక్పథాన్ని ప్రచారం చేసింది. కానీ దీన్ని ఎక్కువమంది ఆమోదించకుండా చేసేందుకు పాలకులు ప్రయత్నించారు. ప్రస్తుతం కూడా ప్రయత్నిస్తూనే వున్నారు.
ఇతర దేశాలలో సాగిన తాత్విక చింతనకు భారతదేశ తాత్విక చింతనకు చాలా తేడావుంది. ఆసక్తికరంగా వుంటుంది. వర్తమాన కాలంలో ఆమోదిస్తున్న భావాలను మీమాంసకులు చెప్పడం గమనార్హం. మానవ కార్యకలాపాల్లో జరిగే ఫలితాలలో ఏదో ఒక శక్తి జోక్యం చేసుకుంటుందనే వాదాన్ని ఖండించారు. సృష్టివాదాన్ని, ప్రళయాన్ని గురించే చెప్పే విషయాలను అపహస్యం చేశారు.
ఈ విధంగా రెండు ప్రధాన ధోరణులుగా సాగిన తాత్విక చింతన రెండు భిన్న ధృక్పథాల మధ్య సంఘర్షణగా విజ్ఞులు తేల్చారు.
- పిళ్లా కుమారస్వామి
(మిసిమి, ఏప్రిల్,2018)

Comments
Post a Comment