భగవద్గీత _పూర్వపరాలు
- Get link
- X
- Other Apps
భగవద్గీత అంటే భగవంతుని గీత (పాట )అని అర్థం. మహాభారత కథలో కురు క్షేత్రంలో జరిగిన యుద్ధం ప్రారంభ సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన ఎదుటి పక్షం లో ఉన్న బంధువులను గురువులను చూచి వారందరినీ తాను చంపడం ఇష్టం లేక బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు .ఆ సందర్భంలో అర్జునునికి రథసారథిగా ఉన్న శ్రీ కృష్ణునికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ లోని భావాలే భగవద్గీత. ఇది మహాభారతంలో భీష్మ పర్వం లో 700 శ్లోకాలతో ( పద్యాలతో) 18 భాగాలుగా ఉంది. దీనిని సంస్కృతంలో వ్యాసుడు రచించారని అందరూ నమ్ముతారు. అయితే క్రీ.పూ.1000 లలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 8000 శ్లోకాలతో 'జయం' పేరుతో వ్యాసుడు ఒక కావ్యాన్ని రాస్తే, దానికి క్రీ. పూ. 400_ క్రీ.శ 400 మధ్యలో ఇతర పండితుల ద్వారా అనేక కథలను కలుపుతూ మహాభారతం గా రచింపబడినదని చరిత్రకారులు నిర్ణయించారు. ప్రారంభంలో భగవద్గీత మహాభారతంలో లేదని తన తదనంతర కాలంలో భగవద్గీతను మహాభారత యుద్ధ ఘట్టం లోకి చేర్చారని చరిత్రకారులు భావిస్తున్నారు. దీనికి కారణం కురుక్షేత్రంలో జరిపిన తవ్వకాలలో దొరికిన అనేక వస్తువులు క్రీ.పూ. 400 ముందు కాలానికి సంబంధించినవి కాకపోవడమే.
యుద్ధానికి ప్రారంభం ముందు యుద్ధానికి సమాయత్తం కమ్మని శ్రీకృష్ణ ,అర్జున్ తో చెప్పే సందర్భాన్ని ఉపయోగించుకుని అనేక తాత్విక భావాలను ప్రచారం చేయడానికి క్రీ.శ 150 _350 మధ్యలో భగవద్గీత ను రాసి ఉంటారని ప్రముఖ శాస్త్రవేత్త డి.డి.కోశాంబి పేర్కొన్నారు.స్వయం సంపూర్ణంగా ఉన్న గ్రామీణ వ్యవస్థ మెల్లగా పట్టణీకరణ చెందుతున్న సమయంలో అనేక వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయి వైదిక కర్మకాండలు ప్రాధాన్యత తగ్గి బౌద్ధం, జైనం విస్తరిస్తున్నాయి. ఆ సందర్భంలో శరవేగంగా మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో సమాజంలో శాంతి సుస్థిరత అవసరమైనాయి.చాలా మంది కుటుంబ వ్యవస్థలో వెలుపల తమ జీవితానికి సరైన పరమార్థాన్ని బౌద్ధం జైనం ద్వారా వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో భగవద్గీతను రాసి మహాభారత యుద్ధ ఘట్టంలోకి ప్రవేశపెట్టారని ప్రముఖ చరిత్ర రచయిత క్రిస్టియన్ వియోలాట్టి చెపుతారు. భగవద్గీత ను ఆంగ్లంలోకి క్రీ.శ. 1795లో సర్ చార్లెస్ వికిన్స్ అనువాదం చేశాడు.
18 ఎందుకో?
మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి .కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజుల పాటు 18 అక్షౌహినుల సైన్యం పాల్గొంటుంది. బ్రాహ్మణులలో 18 గోత్రాలు ఉన్నాయి. 18 సంఖ్యకు ఆనాటి కాలంలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది. కారణాలు తెలియడం లేదు. ఇప్పుడు 18 ఏళ్ళ వయసు దాటిన వారిని మేజర్ అని అంటున్నాం. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు కూడా ఇచ్చారు. గతంలో 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు రజస్వల అయ్యే వారట. ఏనుగు 18 నెలలు నిండాక బిడ్డను కంటుందట. బహుశా ఈ కారణాల వల్ల 18ని ముఖ్యమైన సంఖ్యగా తీసుకొని ఉంటారు.
భగవద్గీత ప్రభావం
భగవద్గీత ప్రభావానికి లోనైన వారు చాలా మంది ఉన్నారు. శంకరుడు, రామానుజుడు, కబీరు, తుకారాం, జ్ఞానేశ్వరుడు, జయ దేవుడు, చైతన్యుడు మొదలైన తాత్వికులు, తిలక్, గాంధీ ,అరవింద ఘోష్ మొదలైన స్వాతంత్ర్య సమరయోధులు, ఇలా చాలామంది భగవద్గీత ప్రభావానికి లోనయ్యారు.సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు రావడంతో నేటి ప్రపంచీకరణ యుగంలో భగవద్గీత ప్రాధాన్యత కోల్పోతున్నది. మానవత్వం కొరవడుతున్న సమాజంలో బుద్ధుని మానవీయబోధనల అవసరం బాగా పెరిగిందని విజ్ఞులు చెపుతున్నారు.
శైవుడైన శంకరుడు (క్రీ.శ 788_ 820 )అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు .ఇతను భగవద్గీతను వేదాల బోధనలకు ప్రతి రూపంగా భావించారు .ప్రతి వ్యక్తి అశాశ్వతమైన బాహ్యప్రపంచపు కోరికలను వదిలి తన ఆత్మ స్వరూపమైన శాశ్వతమైన పరమాత్మ గురించి ఆలోచించమని భగవద్గీత బోధిస్తోందని వ్యాఖ్యానించాడు.
శంకరుని వ్యాఖ్యానంతో విభేదించిన వైష్ణవుడైన రామానుజుడు భగవద్గీత ఆత్మ, పరమాత్మలో కలవడానికి గల మార్గాలను బోధించినదని చెప్పినాడు.వీరంతా విశ్రాంత వర్గానికి చెందినవారవడం వల్ల వీరి వ్యాఖ్యానాలు కనిపించని ఆత్మ పరమాత్మల చుట్టూ తిరిగాయి.
బహుజనుల వర్గం నుండి వచ్చిన జ్ఞానేశ్వర్ బ్రాహ్మణులతో వెలివేయబడ్డాడు .ఇతను క్రీ.శ. 1290 లో గోదావరి దక్షిణ తీరంలో రామచంద్రయాదవుని
రాజ్యంలో ఆశ్రమం నిర్మించుకొని సామాన్య ప్రజల భాషలో భగవద్గీత పై వ్యాఖ్యానం రాశాడని డి.డి.కోశాంబి పేర్కొన్నారు. జ్ఞానేశ్వర్ గీతా వ్యాఖ్యానంతో ప్రభావితుడైన తుకారాం విష్ణువుని ఆరాధించాడు. కబీరు ,జయదేవుడు, చైతన్యుడు మొదలైన వాగ్గేయకారులు గీత పై ఆధారపడ లేదు. జయదేవుడు గీతగోవిందం రాధాకృష్ణుల ప్రణయకలహాలపై రాసినాడు.
అరవింద ఘోష్ గీతను చదివి దాని అధ్యయనం కోసం భారత స్వాతంత్ర పోరాటాన్ని వదిలేశాడు .తిలక్ భగవద్గీత ప్రభావంతో గీతా రహస్యం రాశాడు.కానీ అదేమి అతని కార్యకలాపాలపై ప్రభావం చూపలేదు.గాంధీ మాత్రం భగవద్గీత సారాన్ని వంటపట్టించుకున్నాడు. భగవద్గీత శత్రుసంహారం గురించి ప్రేరేపించినా తాను గ్రహించిన సారాన్ని హింసకు కాకుండా పరమత సహనానికి, కర్తవ్య దీక్షకు ఉపయోగించుకున్నాడు.
ఎందుకు రాశారు?
వేద కాలంలో మతాలు లేవు. కేవలం ధర్మాలు మాత్రమే ఉన్నాయి .హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం , జైన ధర్మం .ఇలాగా. హిందూ ధర్మం హిందూ మతం గా మారింది గుప్తుల కాలంలోనే. వీరి కాలంలో హిందూ ధర్మానికి పెద్దపీట వేశారు .దానిని విస్తరించే పనిని కూడా చేపట్టారు. దానికోసం పురాణాలను భారతాన్ని తిరగ రాశారు అప్పుడే అది మహాభారతం అయింది. గుప్తుల కాలం నాటి బ్రాహ్మణులు ఈ పనికి పూనుకున్నారు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో . హ్యూయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించినప్పుడు తన రచనల్లో భగవద్గీత గురించి రాసుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు రాజు ఆదేశంతో యుద్ధం రెచ్చగొట్టడానికి ఇలాంటి పుస్తకాన్ని పాత దాని నుంచి కొత్తగా రాయడానికి తలపెట్టినట్లు ఆయన పేర్కొన్నాడని డి.డి.కోశాంబి భగవద్గీత చారిత్రక వాస్తవాలు అనే గ్రంథంలో ఉదహరించారు.
పాత వాటిని కొత్తగా రాయటం కన్నా తమకు అర్థమైన వాటిని ఆనాటి పాలకులకు సామాజిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ,తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలలో ప్రముఖులతో చెప్పించడం సులువైన పద్ధతి గా భావించారు. ఇప్పుడు రోజూ టీవీలో ప్రవచనాలు బోధించేవారు అంతా చేసే పని ఇదే. బౌద్ధం విస్తరించడం ద్వారా సమాజంలో పని విభజనకోసం ఏర్పడిన వర్ణ వ్యవస్థకు విఘాతం కలిగింది. తిరిగి దాన్ని నిలబెట్టి అధిపత్య వర్గం సమాజం పై తన పట్టు సాధించడానికి వర్ణ వ్యవస్థ గురించి భగవద్గీత లో శ్రీ కృష్ణునితో చెప్పించారు. సమాజం ఆహార సేకరణ దశ నుండి ఆహారోత్పత్తికి మారిన క్రమంలో వర్ణ వ్యవస్థ బాగా అమరింది. అందుకే దీన్ని అందుకే భగవద్గీతలో కృష్ణుడు గుణాలలో కర్మలలో తేడాలను బట్టి నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను(గుణకర్మ విభాగశః) అని అంటాడు వర్ణ వ్యవస్థ నిలబెట్టడం కోసమే ఈ గ్రంథంలో కృష్ణుడు చెప్పిన ట్లు రాశారని డిడి కోశాంబి చెపుతారు.
అనుగీత
మహాభారతంలో అశ్వమేధ యాగ పర్వం లో అనుగీత అనే పేరుతో మరో భగవద్గీత ఉంది. యుద్ధ కాలంలో శ్రీకృష్ణుడు చెప్పింది తాను మర్చిపోయానని మళ్లీ చెప్పాలని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనుగీత ను చెప్పినట్లు ఈ పర్వంలో రాశారు. ఇందులో బ్రాహ్మణులను ఆకాశానికి ఎత్తుకోవడం ప్రధానంగా ఉంటుంది . ఇందులో కర్మ సిద్ధాంతం,తలరాత సిద్ధాంతం,విధి మొదలైన విషయాలను చెప్పినట్లు రాసినారు.కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
శృంగార పురుషుడైన శ్రీకృష్ణుడు భగవంతుడు ఎలా అయ్యాడు?
వేద సాహిత్యం(క్రీ పూ 1500_600)లో పాపం భక్తి లాంటి భావాలు లేవు. భారతం (క్రీ. పూ 400_క్రీ.శ 400) రాసే కాలం నాటికి అవన్నీ వచ్చాయి. వేదాలలో ఇంద్రుడు దేవుడు .విష్ణువు దేవుడు కాదు. వీరిద్దరి మధ్య ఘర్షణలు జరిగినట్టుగా వేదాలలో గాథలున్నాయి .భారత కాలం నాటికి కృష్ణుడి దేవుడయ్యాడు. కృష్ణుడు ఒక్కరు కాదని వేరువేరు కృష్ణ లను కలిపి ఒకే కృష్ణునిగా చేసి మహాభారత కథలు రాశారని కోశాంబి అభిప్రాయపడినాడు. చాందోగ్యపనిషత్తులో కృష్ణ అంగీరసుని దగ్గర దేవత కొడుకు కృష్ణుడు చదువుకుంటాడు. భారతంలో కృష్ణుడు సాందీపుని దగ్గర చదువుకున్నట్లు చెప్తారు. కాలిందు అనే సర్పాన్ని చంపిన కృష్ణుడు, కంసుని వధించి న కృష్ణుడు వేరు వేరు . శుంగ యుగం చివరి కాలంలో కృష్ణుని భగవాన్ గా పిలుస్తూ పూజించేవారు. భగవాన్ అనేది గౌరవ నామం . బుద్ధునికి కూడా భగవాన్ అనే గౌరవనామం ఉండేది. పూర్వ రాతి యుగంలో ఒక యోధుడు చక్రాన్ని ఆయుధంగా చేసుకుని ఉపయోగిస్తున్నట్లు మీర్జాపూర్ గుహలబొమ్మల్లో ఉంది .ఇది క్రీ .పూ.800 కన్నా ముందున్నవి.వేర్వేరు ఆదిమ సమాజంలో కృష్ణుని గురించి ఉన్న అనేక కథలను కలిపేసి ఒకే కృష్ణకథగా రూపొందించా
రని అలాగే మాతృ స్వామిక సమాజంలో ఉన్న అమ్మ దేవతలను కృష్ణునికి భార్యలుగా చేయడం ద్వారా పితృస్వామిక సమాజంగా మార్చగలిగారని ఆ విధంగా అందరికీ ప్రేమాస్పదుడైన దేవుని గా అందరికీ ఆమోదయోగ్యమైన భగవంతునిగా చేయగలిగారని
డి.డి.కోశాంబి పేర్కొంటారు కృష్ణుని దేవుని చేయడం ద్వారా ఆర్య ద్రవిడ సమాజంలో ఐక్యతను తీసుకురాగలిగారు . వాస్తవానికి వేర్వేరు కాలాల్లో ప్రబలంగా ఉన్న భావాలను భగవద్గీత లోకి ప్రక్షిప్తం చేస్తూ వాటిని కృష్ణుడు చెప్పినట్టుగా రాశారు.
:
భగవద్గీత లో ఏముంది?
భగవద్గీతలో శంకరుడు చెప్పినట్లు ఉపనిషత్తుల్లో సారంగా ఉన్న భక్తి ,ఆత్మ ,పరమాత్మ, పునర్జన్మ ,స్థితప్రజ్ఞత ,శత్రువుని చంపడం, కర్మ సిద్ధాంతం ,చాతుర్వర్ణ వ్యవస్థ మొదలైనవి ఇందులోఉన్నాయి. అయితే ఇందులో ఇతరులను ప్రేమించమని చెప్పే ఒక్క మానవీయ వాక్యం కూడా లేదు. బౌద్ధంలో ఉన్న కర్మ సిద్ధాంతం గీతలో కర్మయోగం గా, నిర్వాణం బ్రహ్మ నిర్వాణం గా మారింది .సాంఖ్యం (కపిలుడు ప్రతిపాదించింది. ఇది వేదాలకన్నా పూర్వానిదన్న వాదన కూడా ఉంది) ,
మీమాంస లోని భావాలన్నీ గీత లో పొందుపరిచారు. కాకపోతే వైదిక కర్మకాండలను గీత ఖండించింది.
'కర్మ చేయడమే నీ బాధ్యత దాని ఫలితం కోసం చూడరాదు' అంటాడు గీతలో కృష్ణుడు.ఎలాంటి కర్మలు చేయాలో చెప్పడు.
మంచి పనులా? చెడు పనులా? అంతేగాక శ్రమ చేయడం మీ బాధ్యత .దాని ఫలితం తో మీకు సంబంధం లేదు, అని చెప్పడమే దీని ఉద్దేశం .ఫలితం యజమాని తీసుకుంటాడు. శ్రామికులు శ్రమ చేయాలి. అంతే. ఆనాటి ఉన్నత వర్గాల కోసం రూపొందించిందీసిద్ధాంతం. మట్టిని బంగారాన్ని ఒకే రకంగా చూడడాన్ని స్థితప్రజ్ఞత గా చెప్పాడు కృష్ణుడు. యుద్ధం చేసిన శత్రువులను మట్టు పెట్టమనే ప్రోత్సాహం ఉంది.
'పుట్టిన వాడు మరణించక తప్పదు. మరణించిన వాడు పుట్టక తప్పదు .అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకింప తగదు 'అని కృష్ణుడు చెబుతాడు. ఇది పునర్జన్మ సిద్ధాంతం. ప్రతి జీవికి ఏడు జన్మలు ఉంటాయని చివరిది మానవ జన్మని కూడా ఒక జనాభిప్రాయం ఉంది .మానవ జన్మలో పాపాలు చేసిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తాడని చెప్తారు. ద్విజునికి మాత్రమే పునర్జన్మ లేదని మహాభారతం చెబుతుంది. బుద్ధుడు పునర్జన్మ పై మౌనం వహిస్తాడు .దాంతో ఈ అంశం ఆధారంగా బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడనే వారు మహాయానులు గా, లేదు నిర్వాణమే (మరణం) చివరి దశ అని భావించే వారు థేరవాదులు అయ్యారు. పునర్జన్మ అనేది ఏ ప్రాణికి లేదు కాకపోతే వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు పిల్లల్లో ఎప్పుడో ఒకసారి బయటపడుతుంటాయి. దీనివల్లనే జీవి మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడన్న భావన ప్రజల్లో ఏర్పడింది.
(మిసిమి,జూన్,2019)
____ పిళ్లా కుమారస్వామి,9490122229
- Get link
- X
- Other Apps

ఇందులో ఏమీ లేదు
ReplyDelete