మెదడు-మనసు
మనసు లేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడని అంటాడు ఆత్రేయ. మనసే మనిషికి తీరని శిక్ష అని కూడా అంటాడు.అసలు మనసు అంటే ఏమిటి శరీరం అదెక్కడుంటుంది?
మనసు కూడా ఆత్మలాంటి ఒక భావనే. దీని పైన ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలున్నాయి. మనసు,మెదడు ఒకటే అని,అవి వేరు వేరు అని భావించేవారున్నారు. ఏదేమైనా మనసుకు అస్తిత్వం లేదు. అయినప్పటికీ కవులు రచయితలు మనసు ఆధారంగా ఎంతో సాహిత్యం సృజించారు.సృజిస్తున్నారు.
అరిస్టాటిల్ తన చింతనని మెదడు మీదికి సారించి మనస్సుకి, చైతన్యానికి ఉపాధి మెదడు కాదని, గుండె అని బోధించాడు. ఒక విధంగా శరీరంలో ప్రాణం
నిలవడానికి మెదడు కన్నా గుండే ముఖ్యం అన్నది నిజమే. కాని మన ఆలోచనలకి, అనుభూతికి ఆధారం
మెదడే. బహుశ గుండె యొక్క ప్రాముఖ్యతని పురస్కరించుకుని అరిస్టాటిల్ అలా భావించి వుండవచ్చు.
ఇలాంటి ప్రాచీన గ్రీకు తాత్వికులు మెదడు పై ,
గందరగోళ వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితిలో మెదడుకు సంబంధించి కాస్త స్పష్టత తెచ్చిన వాడు గాలెన్. ఇతగాడు కూడా ప్రాచీన గ్రీకు దేశానికి చెందిన వాడే. కాని ఇతడు తాత్వికుడు కాడు - వైద్యుడు!
తాత్వికులకి, వైద్యులకి ఓ ముఖ్యమైన తేడా వుంది. తాత్వికులు తమ ఊహాశక్తిని బట్టి, ధీశక్తిని బట్టి విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ పోతుంటారు. అది నిజమా కాదా అన్న విషయం బాహ్య ప్రపంచం చెప్పే
సాక్ష్యం మీద కాక, తర్క మీమాంసల మీద ఆధారపడి వుంటుంది. అలా కాకుండా తన సిద్ధాంతాలను పరిశోధనల ఆధారంగా చెప్పినాడు.చనిపోయిన కుక్క మేక వంటి జంతువుల మెదడును పరిశీలించాడు.మెదడు రెండు అర్ద గోళాల కలయిక గా గుర్తించాడు.
మెదడు పై పొరలో డ్యూరా,పయోమేటర్ ఉన్నాయన్నాడు.మెదడు ఖాళీ జాగా లైన వెంట్రికల్స్ గురించి తెలుసుకున్నాడు.ఆ విధంగా మెదడు నిర్మాణం గురించి చెప్పగలి గినా దాని పని విధానాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు గాలన్.
రెనె డెకార్ట్ అసలు మనస్సు, శరీరం పూర్తిగా భిన్నమైన తత్వాలన్నాడు. గణితంలో రేఖాగణితాన్ని ప్రవేశ పెట్టినవాడీయన.. మనస్సు, దేహం రెండూ వేరు వేరు ప్రపంచాలకు చెందినవని, రెండిటినీ వేరు వేరు నియమాలు పాలిస్తున్నాయని చెప్పినాడు. మనకు తెలిసిన భౌతికధర్మాల ననుసరించి శరీరం పని చేస్తుంది. కాని మనస్సు మాత్రం శరీరంతో సంబంధం లేని, విస్తృతి గాని,చలనం గాని లేని ఓ అభౌతిక తత్వం. అయితే ఈ రెండూ ఒక దాని మీద ఒకటి ప్రభావం చూపించుకోగలవు.మనస్సు గురించి ఈ రకమైన దృకథాన్ని 'ద్వైతం' (dualism) అంటారు. (భారతీయ తత్వ శాస్త్రంలోని ద్వైతానికి దీనికి పెద్దగా సంబంధం లేదు.) అంటే మనస్సు, శరీరం వేరు వేరుగా ఉన్నాయన్న భావన. దీనికి భిన్నంగా 'అద్వైతం' కూడా వుంది. ఆ దృక్పథం ప్రకారం అసలు మనస్సు అనేది శరీరానికి వేరుగా లేదు.శరీరంలో, ముఖ్యంగా మెదడులోని న్యూరాన్లలో కలిగే విద్యుత్ చలనాలే 'మనస్సు' అని పిలుస్తాం.
ద్వైతం, అద్వైతం - రెంటిలో ఏది నిజం అన్న ప్రశ్నకి ఇప్పటికీ కచ్చితమైన సమాధానం
లేదు.
దేకార్త్ మాత్రం మనస్సు, శరీరం వేరు అన్న ద్వైతాన్ని ప్రతిపాదించాడు.దీంతో మామిడి పండు లోని టెంకని తీసేసి తీయని గుజ్జుని హాయిగా తిన్నట్లు, శరీరానికి చెందిన 'ఆత్మ', 'మనస్సు' మొదలైన అయోమయమైన అంశాలను పక్కన పెట్టి, శరీరాన్ని మాత్రం ఓ 'యంత్రం'లా పరిగణిస్తూ భౌతిక శాస్త్ర విధానాలతో విశ్లేషించడం మొదలైంది.
'మనస్సు అంటే ఏంటి?' 'చైతన్యం అంటే ఏంటి?' 'ఆత్మ అనేది వుందా?' మొ||న వాటిని పక్కనబెట్టి, కళ్ళు చూసే దృశ్యాలను మెదడులోని న్యూరాన్లు ఎలా విశ్లేషిస్తాయి? మొ||న వాటిని విశ్లేషించారు.మెదడు ఆలోచనలనే పనిని చేస్తుంది. ఆ ఆలోచన మనసు చేస్తున్నదని మనం అనుకుంటున్నాం. మెదడు లేకపోతే మనసులేదు. ఆలోచన లేదు. మెదడునరాల కణాల నుంచి విడుదల అయ్యే విద్యుత్ రసాయనిక చర్యల్ని మినహా మెదడులో ఏమీ ఉండదు. కాబట్టి, మనసు అనేది ప్రత్యేకంగా వుంటుందనీ,దానికి మూలం మెదడు అనడం సరికాదు. అది వాస్తవం కాదు.భావవాదులు అలా భావించారు.
మెదడు ఎలా పనిచేస్తూంటే మానసిక చర్య అనేది బయలుదేరుతున్నదో శాస్త్రవేత్తలు
తెలుసుకొన్నారు. కృత్రిమ జీవి(రోబో)లో మానసిక చర్యను కూడా వారు చొప్పించగలిగారు.అందువల్ల జీవమూ, మనసూ అనేవి పదార్ధ ప్రవృత్తిలో బయటపడే లక్షణాలు మాత్రమే.అంతేగాని పదార్థం పరోక్షంలో వాటికి విడిగా ప్రత్యేక అస్తిత్వంలేదు.
పదార్థం - మనసు అనే రెండు భాగాలుగా ఆధునిక విజ్ఞానశాస్త్రం ఆమోదించదు. భౌతిక వాస్తవిక వాదం అమోదించదు. జీవనిర్జీవ పదార్థాల మధ్యవిభజనరేఖ ఎన్నడో చెరిగిపోయింది. జీవ పదార్థానికి నిర్జీవ పదార్థంకంటే భిన్నమైనఅస్తిత్వాన్ని కట్టబెట్టడానికి భావవాదులు చేసే ప్రయత్నాన్ని రెండున్నరవేల సంవత్సరాలనాడేచార్వాకులు మట్టికరిపించారు.
Comments
Post a Comment