అసలు భగవంతుడి సృష్టి ఎలా జరిగింది?



ఈ విశ్వాన్ని, మనిషిని దేవుడే సృష్టించాడని చాలా మంది భావిస్తారు. అయితే అందుకు రుజువు లేదు. పోనీ, చెప్పే కల్పనలు, ఊహలేమైనా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? అంటే అదీ లేదు. అవి హేతుబద్ధంగా ఉండవు. తర్కానికి నిలబడవు. సరే, ఆ విషయం అట్లా ఉండనిచ్చి - మనిషే దేవుణ్ణి సృష్టించాడని అనుకుందాం. ఈ విశాల విశ్వంలో తనకు అండగా ఉండేవాడు, తనను రక్షించేవాడు, తనకు కావల్సినవి ఇచ్చేవాడు ఎవరో ఒకరున్నారన్న భరోసాతో జీవించడమన్నది మంచిదే కదా? అనుకుని, మనిషే దేవుణ్ణి సృష్టించుకుని ఉంటాడు. ఆ రకంగా మనిషికి దేవుడు అవసరమయ్యాడని అనుకుందాం. సరే, మరి దీనికి రుజువులేమైనా ఉన్నాయా అన్నది విశ్లేషించుకుంటే విషయం అర్థమౌతుంది.
మనిషి రూపొందించుకుని, తీర్చిదిద్దుకున్న దేవుడు గనుక, దేవుళ్ళంతా మనిషి రూపంలోనే ఉన్నారు. వేరు వేరు మతాల దేవుడి రూపాలు వేరు వేరుగా ఉండొచ్చు. కానీ, మనిషి దేవుణ్ణి తన రూపంలోనే నెలకొల్పుకున్నాడు. దర్శించుకున్నారు. తన లక్షణాలు, తన అలవాట్లు, తన వ్యక్తిత్వం, తన సమాజంలోని నియమ నిబంధనలు వగైరాలన్నీ దేవుడికి ఆపాదించుకున్నాడు. దీన్నే 'ఆంత్రపో మార్ఫిజం' అని అన్నారు. ఒక్కోసారి దేవుణ్ణి ప్రతీకాత్మకంగా కూడా భావించాడు. హరిహరాదులకైనా అప్పు చేయడం రోత (అప్పు దూయ రోత హరిహరాదులకైన) అని వేమన అన్నాడంటే, తన ఈతి బాధలు మనిషి, దేవుడికి ఆపాదించినట్టే కదా? మనిషిలాగా ఆలోచించే శక్తి ఏ చీమకో ఉంటే, చీమ దేవుణ్ణి తన రూపంలోనే దర్శించుకునేదేమో! ఓ గేదె దేవుణ్ణి గేదెరూపంలోనే చూసుకుంటుందేమో మనకు తెలియదు. మనిషి మాత్రం తన దేవుణ్ణి తన ఆకారంలోనే, తన ఆలోచనలతోనే, తన ఆహారపు అలవాట్లతోనే, తనకున్న కోర్కెలతోనే సృష్టించుకున్నాడు. మనుషులు తాము తినే పదార్థాలనే దేవుడికి నైవేద్యం పెడతారు. దాన్నే మళ్ళీ ప్రసాదంగా స్వీకరిస్తారు. తమకు పడనిది తమకు నచ్చనిది లేదా తాము తినలేనిది దేవుడికి చచ్చినా సమర్పించరు. ఎందుకంటే దేవుడు స్వీకరించడం అనేది ఉత్తదే - అది తామే తినాల్సి ఉంటుందని వారికి తెలుసు. ఇక అనాగరిక ఆచారాలు ఇంకా వాడుకలో ఉన్నచోట మాంసాన్ని కూడా నైవేద్యంగా పెట్టడం, కల్లు పొంగించడం, సారా పారించడం వగైరా ఉన్నాయి. అంటే తమకు ఇష్టమైనవన్నీ తమ భగవంతుడు ఆస్వాదిస్తాడని ఒక వెర్రి భావన.
మనుషుల్లో ఉండే కామవాంఛ దేవతల్లోనూ కనిపిస్తుంది. అందుకే వారికి సంసారం భార్యా పిల్లలూ ఉన్నారు. అంతే కాదు, మనిషి తన లైంగిక వాంఛల్ని దేవతలకు ఆపాదించాడు. ఫలితంగానే దేవుళ్ళలో కూడా అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలు కనబడుతున్నాయి. దేవుడనేవాడు మనిషి కన్నా మహోన్నతుడై ఉండి ఉంటే, అతను మనిషికి ఆదర్శప్రాయుడు కావల్సింది. కానీ నాగరికుడైన మనిషికన్నా దిగజారి ఉన్నాడు కదా? గురిపత్నినే చెరబట్టడం, కూతురినే చెడగొట్టడం వగైరా.. అన్ని పవిత్ర గ్రంథాలలో 'అతి పవిత్రమైన' బూతు ఎంతో ఉంది. మనిషి తన మానసిక బలహీనతల్ని తను కల్పించుకున్న దేవుడి పాత్రల ద్వారా తీర్చుకున్నాడని అర్థమవుతూ ఉంది. స్త్రీ పురుషుల మధ్య అనాగిరక సంబంధాలు, రాక్షస సంబంధాలు, దైవత్వ సంబంధాలు ఇప్పుడు అక్కరలేదు. గౌరవమైన, మానవీయ విలువలతో కూడిన సమానత్వ, సౌహార్ద్ర సంబంధాలు అవసరం!
మనిషి తనకున్న జాలి, దయ, కోపం, ప్రతీకారం వంటి లక్షణాల్ని దేవుడికి ఆపాదించుకున్నాడు. భగవంతుడు రక్షకుడు, తండ్రి లాంటి వాడు మాత్రమే అయితే జాలి, దయ ఉండటం అవసరమే! కానీ ప్రతీకారం, కోపం దేన్ని సూచిస్తున్నాయి? జగద్రక్షకుడయిన వాడికి తన బిడ్డల మీద కోపం తెచ్చుకోవడం, వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం అసంబద్ధంగా ఉంది. ఇది కేవలం మనిషి అవగాహనా రాహిత్యమే. ఉదాహరణకు మనిషి పురాణాలు రాసుకున్న సమయానికి నాటి సమాజంలో ఉన్న విలువలు, స్థితిగతులు, యుద్ధ పరికరాలు, సంధి ఒప్పందాలు మాత్రమే అందులో నమోదయ్యాయి. పురాణ యుద్ధాల్లో కత్తులు, బల్లేలు, బాణాలు, రథాలు, కిరీటాలు తప్ప.. ఏకే 47లు, ఆటంబాంబ్‌లు, మిస్సైల్స్‌, హేట్లు, బూట్లు లేవు. ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇవన్నీ నాటి మనుషులకు తెలియదు. ఎంత గొప్ప మేధావి రచయితకైనా వెయ్యేండ్ల క్రితం నాటి జీవితం గూర్చి రాయడం కష్టం. అలాగే వెయ్యేండ్ల తర్వాత ఉండబోయే సమాజం గురించి రాయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల దేవుడి 'జీవిత చరిత్ర' మనిషి తన అవగాహన మేరకే గ్రంథస్థం చేస్తూ వచ్చాడనేది నిజం.
మనిషి ఆటవిక జీవనం గడిపినప్పుడు దేవుళ్ళు, ఆటవిక రూపాల్లోనే ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచంలో దట్టమైన అడవులున్న చోట ఆటవిక జాతులు జీవిస్తున్నాయి. నాగరిక జీవనంతో పోలిస్తే, వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. మనిషి ఆటవిక జీవితంలోంచి ఆధునిక జీవితంలోకి వచ్చినట్టే, మనిషి దేవుళ్ళను ఆయన ప్రార్థనా స్థలాలను ఆటవిక రూపాల్లోంచి ఆధునిక రూపంలోకి మార్చుకుంటూ వచ్చాడు. మనిషికి స్థిరనివాసాలు వచ్చాకనే, అతను దేవుళ్ళకు నివాసాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. నాగరికతలో భాగంగా మనిషికి లభిస్తున్న ప్రతి వసతి, సౌకర్యం దేవుడికి కల్పిస్తున్నది మనిషే! ఒకప్పుడు గుడి, మసీదు, చర్చలలో మైకుల్లేవు. మైకులొచ్చాక సుప్రభాతాలు, మేల్కొల్పులు, భక్తి ప్రార్థనలు అనీన గ్రామఫోన్‌ రికార్డ్సు వేసేవారు. తర్వాత కేసెట్లు, ఇప్పుడు సీడీలు వాడుతున్నారు. ఒకప్పుడు ప్రార్థనా స్థలాల్లో ఫ్యాన్‌లు లేవు. ఇప్పుడున్నాయి. ఇవన్నీ మనిషి తన కోసం తాను ఏర్పాటు చేసుకున్నవి తప్పిస్తే, ఆ దేవుడి కోసం కాదు. మనిషి కల్పించుకున్న మహిమలు కాక, దేవుడికి మహిమలే గనక ఉండి ఉంటే, అన్నీ దైవక్షేత్రాలలో గాలీ, వెలుతురూ ధారాళంగా ఉండాలి. ప్రసాదాలు వాటంతట అవే తయారవ్వాలి. ఆన్‌లైన్‌ బుకింగ్‌లు, క్యూలూ ఉండకూడదు. 'ఎందెందు వెదకిన చక్రి అందందే గలడు' అన్న విధంగా ఎవరి దేవుడు వారికి వారి వారి స్థలాల్లోనే కనపడాలి కదా? వారి వారి కోర్కెలు తీర్చాలి కదా? వేల వేల సంవత్సరాలు గడుస్తున్నా మనిషిలోని భావన, ఊహ, కల్పన, భ్రమ అలాగే ఉంది. నిజం కాలేదు.
ఎక్కడో నిర్జన ప్రదేశంలో ఎవరో ఓ రాతివిగ్రహం ప్రతిష్టిస్తే దానికి ఓ ధనవంతుడు కాస్త నీడ ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత ఏ జమిందారో, ఏ రాజుగారో పునరుద్ధరిస్తే అది ప్రాచుర్యంలోకి వస్తుంది. తర్వాత తర్వాత గుడి తలుపులకు వెండి తాపడాలు, గర్భగుడి గోపురానికి బంగారు తాపడం వగైరా సమకూరుతాయి. కాలక్రమంలో మనిషి, తను సాధించిన ప్రగతి ఫలితాల్ని ప్రార్థనా స్థలాల మీద పెట్టాడు. దేవుడికే మహిమ ఉంటే అన్ని మతాల ప్రార్థనా స్థలాలు బంగారు గోడలతో నిర్మితమై ఉండేవి. భక్తులు రావాలనుకుంటే ఆ దేవుడే బస్సు మార్గాలు, రైలు, విమాన మార్గాలే కాదు, ఏకంగా 'రోప్‌ వే'నే ఏర్పాటు చేసేవాడు. కానీ అలా జరగలేదు. నానా యాతనా పడి మనిషే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మానవ నాగరికతకు అనుగుణంగానే దేవుళ్ళకు వసతులు పెరుగుతున్నాయి. భద్రాద్రి-కంచర్ల గోపన్న కట్టించిన గుడి ఇప్పుడు ఆ విధంగా లేదు కదా? తనను ప్రార్థించడానికి రమ్మని ఏ దేవుడూ ఉన్న ఫళాన భక్తుల కోసం వసతులు ఏర్పరిచింది లేదు. ఉదాహరణకు ముప్పయ్యేండ్ల క్రితం ఉన్న షిరిడీకి, ఇప్పుడున్న దానికి తేడా గమనించి ఆలోచించండి. పుణ్య కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి కావడం స్పష్టంగా చూడొచ్చు. ఇందులో దేవుడి పాత్ర ఏమీ లేదు. అంతా మనిషి మాయే!
తనకంటే దేవుడు గొప్పవాడని భావించినందుకే మనిషి, దేవుళ్ళకు మూడు తలలు, నాలుగు చేతులు తగిలించాడు. పైగా పైన ఎక్కడో ఉండి తనను నడిపిస్తున్నాడన్న భావనే దేవుళ్ళను ఎత్తయిన కొండల మీద ప్రతిష్టింపజేసింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. మహ్మద్‌ ఇస్లాంను స్థాపించే నాటికి నేటి అరబ్‌ ప్రాంతాల్లో విగ్రహారాధన ఉండేది. తర్వాత కాలంలో దేవుడు 'నిరాకారుడు' అనే భావనతో ముస్లిం మతం దేవుడికి రూపం లేకుండా చేసింది. ఇక మూడు తలలు, నాలుగు చేతుల సంగతి చూడ్దాం. అవన్నీ ఊహలు, కల్పనలే. అయితే అవి మనిషి మెదడు వికసించని దశలోని భావనలు. వాస్తవానికి ఇవి తక్కువ స్థాయి అంటే అభివృద్ధి చెందని వెన్నెముక లేని జంతువులలో కనిపించే లక్షణాలు. వందకాళ్ళ జెర్రి మనకు తెలుసు. దానిలో జరిగేదేమంటే.. తల-శరీరం విడగొడితే అవి మళ్ళీ పోయిన భాగాల్ని అభివృద్ధి చేసుకుంటాయి. అలాగే జన్యుపరమైన లోపాల వల్ల, మూడు తలల పాములు, ఐదు కాళ్ళ ఆవులూ పుడుతుంటాయి. తక్కువ స్థాయి జీవరాసుల్లో చూసిన ఇలాంటి లక్షణాలన్నీ ఆదిమానవుడు ''మహిమ'' అని అనుకున్నాడు. అలాంటి లక్షణాల్ని తమ దేవుళ్ళకు ఆపాదించి కథలు రాసుకున్నాడు. పది తలలు, పది చేతులు ఉండడం శక్తికి ప్రతీకలయితే.. మన పూర్వీకులు ఆ ప్రాథమిక అవగాహనతోనే రాసుకున్న రామాయణంలో పదితలలు రావణుడు మరి ఒక్క తల ఉన్న రాముడి చేతిలో ఎందుకు హతమయ్యాడూ? విషయ పరిజ్ఞానం ముఖ్యంగా సైన్సు లేని రోజుల్లో ఏర్పడ్డ ఊహలు, వాటికి అనుగుణంగా రూపొందిన ప్రార్థనా స్థలాలు.. వాటి చుట్టూ ప్రచారం చేసుకున్న మహిమలుగా మనం వీటిని అర్థం చేసుకోవాలి. మనుషుల్లోనూ మూడు కనుల శిశువులు, పొడుగు మూతి శిశువులు జన్యు లోపాల వల్ల పుడుతుంటారు. అవగాహన లేని జనం దేవుడి ప్రతిరూపాలు పుట్టారని ఆర్భాటాలు చేస్తుంటారు.
మహిమలనేవి గతంలో లేవు. ఇప్పుడూ లేవు. భవిష్యత్తులోనూ ఉండవు. ఉన్నదంతా వాస్తవం! ఉదాహరణకు సైన్సు వాస్తవం. దానితోనే ఆధునికుడు అద్భుతాలు చేస్తున్నాడు. శరీరం మీద కత్తిగాటు పడకుండానే లోపల పాడైపోయిన అవయవ భాగం డాక్టర్లు తీసేస్తున్నారు. డ్రైవరు లేకుండా నడిచే కార్లు మెకానికల్‌ ఇంజనీర్లు తయారు చేశారు. వైఫై స్థానంలో ఇప్పుడు లైఫై వస్తోంది. అతి సామాన్యుడు కూడా ఇంటర్నెట్‌ సహాయంతో ప్రపంచంలోని ఏ భాగానికైనా వర్తమానం పంపగలుగుతున్నాడు. కంప్యూటర్‌ నిపుణుల ప్రోగ్రామింగ్‌ వల్ల మిలియన్ల విలువగల ప్రాజెక్టులు నిర్వహించగలుగుతున్నారు. ఇంకా మూడువేల యేండ్ల కిందటి భావజాలంతో చెక్కభజన చేసుకుంటూ కూర్చునే సమయం అవసరం ఎందరికుందీ? ఉన్నవాళ్ళను కూర్చోనిద్దాం. వాళ్ళ వల్ల ఈ అత్యాధునిక సమాజానికి ఎలాగూ ఉపయోగంలేదు. అసలు విషయయమేమంటే, మహిమల పేరుతో సైన్సు మోసం చేయదు. మహిమల పేరుతో జనాన్ని మోసం చేసేవి మతాలు.. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవులయినట్టు, సామాన్యుల డబ్బులు కొల్లగొట్టి ధనవంతులు పారిపోతారు. మానసిక బలహీనులంతా కలిసి ప్రార్థించే దేవుడు- క్రమంగా బలవంతుడవుతాడు. గాలిలో ఎత్తున ఎగిరే 'గాలిబుడగ' ఎప్పుడో ఓసారి పగలక తప్పదు!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసరచయిత: సుప్రసిద్ధ సాహితీవేత్త, 
బయాలజీ ప్రొఫెసర్‌, సెల్‌: 9573706806
నవ తెలంగాణ నుండి,6.7.2018

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం