మహా భారతం నుంచి ఏం నేర్చుకుంటాం?


   
        భారతాన్ని అనువాదం చేసిన కవులు, వ్యాస మూలంలో ఎంత అవసరమైన సందర్భాల్లో కూడా అణువంత విమర్శ అయినా చెయ్యలేదు. ప్రతి ధర్మానికి పొగడ్తలే తప్ప రెండో లక్షణం లేదు.
         భారతంలో వందలాది కధలు వున్నా, ఏ రెండు కధలు చెప్పే అంశాలకి తేడా లేదు. చెప్పే ధర్మాలకీ తేడా లేదు. అన్నిటి గుణమూ, అన్నిటి సారాంశమూ, ఒకటే. చాతుర్వర్ణాలూ, రాజుల ఈశ్వరత్వమూ, పురుషులకు
భోగాలూ, స్త్రీలకు త్యాగాలూ, అన్ని చోట్లా అవే. అసలు కథా నాయకుడైన ధర్మరాజు వెన్నెల పాలనలో, సమస్త రుగ్మతలూ ఉన్నాయి. కలిమి లేములు, సేవకులూ, యాచకులూ,సానులూ, బందిపోటు దొంగలూ, కేవలం దానాలే హక్కుగా బతికే సోమరుల మందలూ, అన్ని కధల్లోనూ అవే.
      మహా భారతం, చరిత్రని చూపించే గ్రంధమా కాదా? - అనే ప్రశ్న,మొట్ట మొదటి ప్రశ్న. 
       ఏ కట్టు కధ అయినా ఎంతో కొంత చరిత్రను చూపిస్తుంది. ఏ కట్టు కథలో అయినా, మానవ చరిత్ర లక్షణాలే కనపడతాయి. ఒకళ్ళ పశువుల్ని ఒకళ్ళు ఎత్తుకు పోయారంటే, చారెడు భూమి కోసం తలలు నరికే యుద్ధాలు చేసుకున్నారంటే, ఒక మగ వాడి చితిలో ఒక
ఆడదాన్ని కూడా తగలపెట్టేశారంటే రాజు పేరు తో ఒక మనిషి సింహాసనం మీద ఈశ్వరుడై వెలిగాడంటే, మనుషుల్ని పవిత్రులని - అపవిత్రులని నిర్దేశించే ధర్మాలు రాజ్యం చేశాయంటే, ఆ అంశాలన్నీ ఏదో ఒక చరిత్ర
కాదా? అది ఆ కాలం మనుషులు అలా జీవించిన కాలం కాదా? ఏ కట్టు కథలో అయినా, ఏ పిట్టల కధలో అయినా, మనుషులు జీవించిన లక్షణాలుకనపడతాయి.
       మనుషుల్ని పవిత్రులుగానూ, అపవిత్రులు గానూ విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్ర ధర్మంగా చెప్పే ఏ గ్రంధం అయినా, దుర్గంధమే. చెడ్డ వాసనని దుర్వాసన అంటాం. చెడ్డ ధర్మాల గ్రంధాన్ని దురంధం" అనాలి.
       బౌద్ధ మతమూ, జైన మతమూ వంటి మతాలు, హిందూ మతంలో ధర్మాన్నీ యజాల్ని వ్యతిరేకించాయని. దాని వల్లనే హిందూ పండితులు తమ మతాన్ని మరింత దృఢతరం చేసుకోవడం కోసం ఈ భారతం రచనని ప్రారంభించి సాగించారనీ, హిందూ మత వాదులు చెపుతారు. హిందూమతంలో ఏవైనా దోషాలు వుంటే, వాటిని ఇతర మతాల వాళ్ళు సరిగా వివరించి వుంటే, హిందూ పండితులు తమ మతంలో వున్న ఆదోషాలేమిటో పరిశీలించి చూసుకుని, అవి తప్పుగా వుంటే వాటిని సరిదిద్దుకోవాలి. అంతే గానీ దోషాలనే దృఢతరం చేసుకోవడమా పద్దతి? కావాలంటే, వాళ్ళ మతాల్లో దోషాల్ని వీళ్ళు చెప్పాలి. 

        పాత కాలంలో, ముస్లిం రాజులు, హిందూ రాజుల మీద దాడులుచేసి, హిందూ రాజుల్ని చంపేసి, వాళ్ళ భార్యల్ని ఎత్తుకు పోయే వారని,అందుకే హిందూ మతంలో, భర్త పోగానే ఆ భార్య ముస్లింల పాలబడకుండా భర్తతో పాటే చితిలో తగలపెట్టి రక్షించేవారని, హిందూ
పండితులు వాదిస్తారు. అవన్నీ పచ్చి అబద్దాలని సతీ సహగమనం" అనేది హిందూ మతంలో పాత కాలం వించీ, ముస్లిం రాజుల రాకకు ముందేవుందనీ, భారతాన్ని పరిశోధించిన విమర్శకులు చెప్పిన సమాచారాలు కొన్ని ఉన్నాయి. దాడులు చేసిన శతృ రాజులు పరాయి ఆడ వాళ్ళని ఎత్తుకు
పోవాలంటే, ఆ ఆడవాళ్ళ భర్తలు పోయే దాకా ఆగాలా? భర్తలు పోయిన స్త్రీలనే గానీ, భర్తలు వున్న స్త్రీలనీ, పెళ్ళిళ్ళు కాని స్త్రీలని, ఎత్తుకు పోలేరా?
        హిందూ మతంలో వున్న ప్రతి సహగమనం ధర్మానికి, ముస్లిం రాజుల
దాడులకూ, ఏం సంబంధం? ఎత్తుకు పోయే నీచులతో పోరాడుతూ, ఆ పోరాటాల్లో మరణించాలి గానీ, ఆ నీచుల నించి రక్షణ పేరుతో ఆడ వాళ్ళని తగలబెట్టుకుంటారా హిందూ పండితులు. పైగా దాన్ని మతంలో పుణ్య సంప్రదాయం పేరుతో!
        బెంగాలీ రచయిత శరత్ బాబు, సతీ సహగమనం ఎంత కౄరంగా జరుగుతుందో
ఒక పుస్తకం వివరించారు.  ప్రాణాలతో తగలబడి పోవలసిన ఆ అమాయకురాలికి మొదట పురోహితులందరూ చేరి పూజలతో మత్తు మందు తాగిస్తారు. తర్వాత ఆమెని బండిలోనో,నడకతోనో, బాజాల మధ్యభర్త శవంతో పాటు స్మశానానికి తీసుకుపోతారు.
శవాన్ని చితి మీద పెట్టి ఆ  పక్కనే ఆమెని పడుకోబెడతారు. నూనెలు నేతులూ గుమ్మరించడాలు, మంత్రాలు జరుగుతూ వుండగా మగధీరుడు చితిని అందిస్తాడు. శవం పక్కన ప్రాణం వున్న మనిషి కల్ని
పడగొట్టుకుని లేచి పొతుందేమోనని, నలుగురు బలిషులు, పొడుగాటి పచ్చి కట్టెలతో ఆమె శరీరాన్ని నొక్కి పెడతారు. ఆమె వేసే కేకలు ఏ మాత్రమూ పైకి వినపడకుండా పెద్ద పెద్ద బాజాలు వాయిస్తూనే వుంటారు. ఆ చితి
మంటల్లో ఆ కట్టెల కింద,నిస్సహాయురాలు అరవడం మాత్రం ఎంతసేపు చెయ్యగలదు? గాలి అందడం ఆగిపోగానే ఆమె ప్రాణాలు
వదులుతుంది.
       " క్రీ. పూ. 3వ శతాబ్దానికి ముందు భారత దేశంలో ప్రవర్తిల్లి ఉన్న వేద సంస్కృతి, మ్లేచ్చ దండ యాత్రల వల్ల, కొత్త సమస్యలు నెదుర్కొన్నది. ప్రకృతి ఆరాధనా,యజ్ఞయాగాది క్రతువులు క్రమంగా సన్నగిల్లడంతో, వాటిని గురించి అనేక ప్రశ్నలు రేకెత్తాయి. మహారాజులు,చక్రవర్తులు, వైదిక ధర్మం వదిలి, జైన, బౌద్దాలను స్వీకరించి వాటి ప్రచారానికి తోడ్పడ్డారు. దానితో చాతుర్వరాశ్రమ ధర్మాలూ, యజ్ఞ యాగాది కర్మకాండలూ, శిధిలమై పోసాగాయి. జైన బౌద్దాల ప్రాబల్యం వలన
దెబ్బతిన్న కుటుంబ వ్యవస్థనూ, వేద ధర్మాన్ని పునరుద్ధరించు కోవలసిన అవసరం ఏర్పడింది.ఆ  సామాజికమైన పునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా, వేద వ్యాస మహర్షి రచించిన 'జయ' కావ్యాన్ని ఆయన శిష్యులు
బలమైన వాజ్ఞ్మయ సాధనంగా వాడుకున్నారు. అందువలననే మహాభారతం పంచమ వేదంగా రూపొందించబడింది. "( కవిత్రయం,
సంపుటం-1, పీఠిక, పే.25)
         కవిత్రయ సంపుటాల్ని ఇస్తూ, తిరుపతి దేవస్థానం వారు చెపుతున్నదేమిటి? జైన, బౌద్ధ మతాల వల్ల ఆనాటి హిందూ రాజులూ చక్రవర్తులూ, హిందూ మతానికి దూరమవు తున్నారని, దానివల్ల చాతుర్వర్ణాశ్రమ
ధర్మాలు శిథిలమై పోసాగాయి" అని, ఆ చాతుర్వర్ణాన్ని నిలబెట్టడానికి మహా
భారతం అవసరమైందని చెప్పారు. అంటే, మానవుల్లో కుల విధానాన్ని నిలబెట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ గ్రంధాన్ని గౌరవించడం అంటే కుల విధానాన్ని నిలబెట్టుకోవడమే.
       ఈ పంచమ వేదం చెప్పేది ఏమిటి? చతుర్వర్ణాలనే. కొన్ని కథల్లో బ్రాహ్మణ భక్తి. కొన్ని కథల్లో రాజుల భక్తి.కొన్ని కథల్లో ధనికుల భక్తి.కొన్ని కథల్లో పురుషుల అన్ని కథల్లోనూ దేవుళ్ళ భక్తి ఈ తప్పుడు భక్తులన్నిటికి వ్యతిరేకమైన మానవ భక్తి ఏ కథలో అయినా ఉందా? ఏ కథలోనూ లేదు.
     భారతం మీద, ఒక పరిశోధకుడి వ్యాఖ్య ఇలా ఉంటుంది: 'కవితా శక్తి లేని భక్తులు, వంకర టింకరగా రాసే రచయితలూ (అన్ పొయెటికల్ థియాలజిస్ట్స్ అండ్ క్లమ్జీ స్త్రెబ్స్) ఒక దానితో ఒకటి సంబంధం లేని
కధనాల్ని విడి విడిగా, ఒక వరసా వాయీ లేని దానిగా, కుప్ప పోసినట్టు ఉంటుంది. ఈ కావ్యం
"పాత కాలపు తెగల మధ్య ఎప్పుడూ కొట్లాటలే కనపడతాయి. ఒక కొట్లాటని, అతి పెద్ద యుద్ధంగా అతిశయోక్తితో చూపారు. (ఎగ్లాగరేటెడ్ వర్షన్ ఆఫ్ ఎ స్మాల్ బ్యాటిల్)'.
'కురుక్షేత్రం, కురుక్షేత్రం' అని, అక్కడ జరిగినట్టు చెప్పి, క్రీస్తు పూర్వం నాటి కొట్లాటని గొప్ప చెయ్యడం అంటే, నిన్న మొన్న జరిగిన మొదటి
ప్రపంచ యుద్ధాన్ని, నిన్న జరిగిన రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా చెప్పలేనంతగా గొప్ప చేసుకోవాలి. ఇరు పక్షాలా రాజులే, దోపిడీ పాలకులే వున్న యుద్ధాల్లో కూడా, ఆ ప్రత్యేక సందర్భంలో, ఎటో ఒక వేపు కొంత
న్యాయం ఉంటుంది. ఆ న్యాయం కోసం, ఆ యుద్ధాన్ని గొప్ప చేసుకోనక్కర లేదు. శ్రామిక ప్రజల క్షేమానికి సంబంధం లేని ప్రతీ యుద్ధమూ, అందులో న్యాయం ఎటు వేపు ఉన్నా, ఆ యుద్ధం శ్రామిక ప్రజలనే సర్వ నాశనం చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో చచ్చిన వాళ్ళందరూ సైనికులే. అంటే, శ్రామిక వర్గాలవారే!
      వ్యాస మూలాన్ని, ఏ కవి ఎన్ని వర్ణనలతో పెంచినా, ఆ వర్ణనలు మనుషుల జీవితాల్ని సంస్కరించవు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సముద్రాల్నీ,పర్వతాల్ని పూజించే వర్ణనలు, మానవుల్లో కుల భేదాల్ని తీసివెయ్యవు.
భారతం మొత్తంలో ఉన్నదంతా, చాతుర్వర్ణ వ్యవస్థ, రాజుల ఆధిపత్యపాలనా, కుప్పల తెప్పల మూఢ విశ్వాసాలూ, పురుషాధిక్యతా - ఇవన్నీ కలిసిన దోపిడీ వర్గ భావజాలమే. కవిత్వ వర్ణనల్లో ఎన్ని సొగసులు ఉన్నా, ఆ
సొగసులు, చదివే వాళ్ళకి ఏ జ్ఞానాన్ని ఇవ్వవు. ఆ సొగసులు, చదువరుల్ని, భ్రమల్లోకి లాక్కుపోతాయి. ఆ సొగసుల్లో వుండే సమాజం ఎటు వంటిది -అనేదే చదివే వాళ్ళు గ్రహించాలి గానీ, “సూర్యుడు ధగ ధగామెరుస్తున్నాడు" అంటే, దాన్ని సౌందర్యంగా తీసుకోనక్కర లేదు.
            భారతంలోని అనేక తెగల మధ్య, ప్రకృతి వనరుల కోసమూ,ఆవుల మందలూ భూమీ వంటి ఉత్పత్తి సాధనాల  కోసం జరిగిన 
ఘర్షణలే కనబడతాయి.ఆ ఘర్షణలు గ్రంధస్తం అయ్యే నాటికి, తెగల దశ దాటి భూమి ప్రధానమైన సమాజము దానధర్మాలు లక్షణాలు కనిపిస్తాయి.
             ఆనాటి రాజ్యాలు, ఈ రాజు నించి ఆ రాజుకో, ఆ రాజు నించి ఈ రాజుతో మారుతూ, ఒకడు దిగిన సింహాసనం ఒకడు ఎక్కుతాడు. ఆ సుందర దృశ్యాలనే ఈ నాడు పార్టీల పేరుతో చూస్తున్నాం. రాజు పోయి పార్టీ ఎక్కుతుంది సింహాసనం. ఈ నాటి పార్టీ అధిపతి కూర్చునే కుర్చీ,సింహాసనాన్ని పోలి వుంటుంది చూడండి! ఈ ఆధునిక పార్టీ రాజులు, చండీయాగాలు, సర్పదోష యాగాలు, అనేక పేర్ల యాగాలూచేయించుకుంటూ, వాటి వల్ల దొరికే పుణ్యాల్ని నమ్ముతూ, తమ
సింహాసనాల మీద ధీమాగా కూర్చుంటారు. యాగాలు బహిరంగంగాచేయించని పాలకులు, రహస్య మార్గాల్లో జ్యోతిష్యాల్నీ, హస్త సాముద్రికాల్నీ,బాబాల్ని, స్వాముల్నీ, నమ్ముకుంటూ పాలనలు చేస్తారు.
        పాతకాలపు మునులకూ, రుషులకూ వారసులే ఈనాటి పీఠాధిపతులూ, బాబాలూ, స్వాములూ, గురూజీలు. వీళ్ళు వరాలూ,
శాపాలూ, వదిలేసినా, దీవెనలూ, ఆశీర్వాదాలూ, శుభాకాంక్షలు,నిర్వహిస్తూనే వుంటారు. విమానాలన్నీ భారతం నాడే ఉన్నాయనీ, బిడ్డలు తల్లి గర్భం నించి పుట్ట నక్కర లేదనీ, కుండలోనో, గడ్డిలోనో, పుట్టగలరనీ, ఒక బాణం శతృవుని పొడిచి వెనక్కి రాగల శాస్త్ర విద్య ఆ నాడే పెరిగి పోయి
వుందని, ఇటువంటి అవాకులు చవాకులూ ఎన్నయినా స్వాములు పేలగలరు. భారతాన్ని ఆధారం చేసుకుని. అది ఆ కాలపు కట్టు కధల
రచనా విధానమనీ, పక్షిలాగ ఎగరాలనే కోరికే ఆ నాటి విమానం అనీ, ఏ చిన్న విషయాన్నీ స్వాములు అర్ధం చేసుకోరు. భారతం పంచమ వేదమనీ,అది అణు శాస్త్ర గ్రంధమని నమ్మే వాళ్ళూ, వాదించే వాళ్ళూ, ఈ నాటికీ
కొల్లలు.
        ఈ నాటికి ప్రభుత్వాధ్వర్యంలో సురక్షితంగా నడిచే దేవ స్థానాలూ, మత
సంస్థలు, ప్రజల్ని మూఢ నమ్మకాల నించి బైట పడకుండా చెయ్యడాన్నే తమ లక్ష్యంగా పెట్టుకుంటాయి.
      ఈ నాటి ప్రభుత్వాలన్నీ, అన్ని దేశాలలోనూ, మతానుకూల ప్రభుత్వాలే.
మత గ్రంథాల ప్రచురణ, ప్రచారమూ, వాటి లక్ష్యం. కానీ, ఏ కవులూ, ఏ పండితులు, స్వతహాగా, వర్గ రీత్యా, దోపిడీదారులు కారు. వారు మేధాశ్రమ కళాకారులే. కానీ వారి మేధస్సంతా, మానవ క్షేమానికి వ్యతిరేకమైన
 భావజాలంతో కూరుకుపోయి వుంటుంది.
అందులోకి మరింత చొచ్చుకుపోయే శ్రమలే చేస్తారు గానీ, దాని నుంచి బయటపడే భావాలవైపు మొహాలు తిప్పరు.
        

        మతాలలో, మత ఆశ్రమాలలో, మత పీఠాలలో, దేవస్థానాలలో కూచుని, ఆధ్యాత్మికత పేరుతో, ప్రసంగాలు, ప్రవచనాలు,
గ్రంధాల కథలూ, జనాల బుర్రల్లోకి ఎక్కించే స్వాములవార్లూ, ఆచార్యుల వార్లూ, బాబాల వార్లూ, హరి కథల వార్లూ, ఆ జాబితావాళ్లంతా పూర్తిగా పరాన్న జీవులు. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టే కష్టం ఉండదు. వారికి వారు
నిత్యం దోపిడీ పాలక వర్గాలకు ఆధ్యాత్మిక బంట్లుగా వుంటూ అమాయక జనాల్ని అజ్ఞానాల్లో, మతం మత్తులో ముంచి వుంచుతారు. ఒక్క హేతు వాద సందేహం అయినా ప్రజల బుర్రలకు తాక నివ్వరు.
      వందల వేల నాటి పురాణ పాత్రల్ని ఈ నాడు ఎందుకు విమర్శించు కోవాలి? ఎందుకంటే, అమాయక జనం ఆ పురాణ పాత్రలకే ఈ వాటికి భక్తులై వుండి పోతున్నారు గనకే!
          భారతం, ప్రకృతి సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక వందల ఏళ్ళ కిందట రాసింది. పైగా మూల మూలనా మూఢ నమ్మకాలతో, శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణ గ్రంధాలకు చేతులు జోడిస్తున్నామంటే, మనం ఆధునిక మానవులం కాదు.క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం. ప్రాచీన కాలపు మానవులం.అలా వున్నందుకు తల లెత్తుకో కూడదు. సిగ్గుతో చావాలి. ఇలా బతుకు తున్నామా అని!
 (రంగనాయకమ్మ రాసిన ఇదండీ మహాభారతం నుండి)

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం