వేద సాహిత్యం _చారిత్రక దృక్పథం
- Get link
- X
- Other Apps
వేద సాహిత్యం _చారిత్రక దృక్పథం
భారతీయ ప్రాచీన సాహిత్యం వేద సాహిత్యం తో మొదలవుతుంది. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రకు ఆధారంగా నిలుస్తుంది. వేద అంటే విజ్ఞానం అని అర్థం. ఇవి నాలుగు .అవి రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వేదాలు మొదటలో మూడుగా ఉండేవి తరువాత నాలుగుగా విభజించారు
1. రుగ్వేదం (చందోబద్ధ కవితలు లేదా సూక్తాలు)
2. యజుర్వేదం (గద్యంగా ఉండే సూక్తాలు)
3. సామవేదం (గానానికి అనుకూలంగా ఉండే కవితలు)
4. అధర్వణ వేదం (యజ్ఞయాగాదులకు చెందిన శ్లోకాలు)
వేద "విధ్"( తెలుసు కోవడం) అనే ధాతువు నుండి "వేదం" అనే పదం వచ్చింది.వేదాలను శ్రుతులు (వినబడినవి) అని కూడా పిలుస్తారు.
రుగ్వేదం ఆర్యులకు సంబంధించింది.ఈ
ఆర్యుల విషయంలో చరిత్రకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ఆర్యులు బహుశా బయటి నుంచే భారత ఉపఖండానికి వచ్చి ఉంటారనే విషయం ఇటీవలి డీఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది.వారి ఆచారవ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బహుశా ఆర్యులు గిల్గిత్ సమీపం నుంచే ఈ ఉపఖండానికి వలస వచ్చి ఉండొచ్చు. అయితే, ఆర్యులకు సంబంధించిన చాలా ప్రశ్నలకు ఇంకా జవాబులు వెదకాల్సే ఉందనేది కూడా వాస్తవమే. బ్రోక్పా సముదాయానికి చెందిన ల్హామో. ‘‘మాది బియామా ప్రాంతం. బియామా ఆర్యన్లకు ప్రసిద్ధి. మమ్మల్ని మేం అసలైన ఆర్యులుగా భావిస్తాం’’ అని ఆమె చెప్తున్నారు.సింధూ నది ఒడ్డున ఉండే గ్రామాల్లో నివసిస్తున్న బ్రోక్పా సముదాయానికి చెందిన దాదాపు 5,000 మంది మాత్రం ఇదే నమ్ముతారు.(బీబీసీ,29 సెప్టెంబర్ 2018)
"ఆర్యన్" అనే పదం మరియు జాతి గుర్తింపుకోసం వాడారు. వాయువ్య మధ్య ఆసియాలోని చారిత్రాత్మక ఇండో-ఇరానియన్లు మరియు దక్షిణాసియాలోని ఇండో-ఆర్యన్ మాట్లాడేవారు , ఇరానియన్ ప్రజలు ఈ పదాన్ని ఉపయోగించారు.
ఇది ఇండో-ఇరానియన్లు తమను, సమూహం లోని సభ్యులు, గౌరవప్రదమైన వ్యక్తులు మొదలైనవాటిని సూచించడానికి ఉపయోగించే పదం.
ఈ ఆర్యన్లు లేదా ఇండో-ఇరానియన్లు వాయువ్య మధ్య ఆసియా మరియు తూర్పు ఐరోపాలోని పశ్చిమ స్టెప్పీస్‌లో ఉద్భవించారు. వారు తదనంతరం మధ్య ఆసియాలోకి, తరువాత దక్షిణాన, మధ్యప్రాచ్యంలోకి , భారతీయ ఉపఖండంలోకి స్థానిక ఆధిపత్య వ్యవసాయదారులతో కలిసిపోయారు, కానీ వారి భాషలు మరియు సంస్కృతులను విజయ వంతంగా వ్యాప్తి చేశారు.
వేదాలు ఆర్యులలో ఒకరి నుంచి మరొకరికి పాడు కుంటు చెప్పుకుంటూ వచ్చినవే తప్ప ఒకరు రాసినవి కావు. సంక్రమించాయి. వేదాలలో చాలా పాతది రుగ్వేదం. వేదాలను అధ్యయనం చేసిన తర్వాత వాటి కాలాన్ని పలువురు పండితులు నిర్ణయించారు. క్రీ.పూ 1500 __1000 కాలాన్ని తొలి వైదిక కాలం అన్నారు. ఈ కాలంలో రుగ్వేదం వచ్చింది. క్రీ.పూ 1000__ 600 కాలాన్ని వైదిక కాలం అన్నారు ఈ కాలంలో మిగిలిన మూడు వేదాలు వచ్చాయి .వాటి ఇతర శాఖలు కూడా వచ్చాయి. ఈ వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే ఆర్యుల చరిత్ర కూడా తెలుస్తుంది.
మెసొపొటేమియా లో క్రీ.పూ. 18వ శతాబ్దంలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు హమ్మురాబి.అతని తర్వాత ఆ ప్రాంతాలకు ఆర్యులు వచ్చినట్లు క్యూనిఫాం రచనల వల్ల తెలుస్తోంది. వారిలో కొన్ని బృందాలు సింధూ నది ప్రాంతం వరకు కూడా వచ్చి ఉంటాయి. వీరందరికీ వున్న ఒకే రకమైన సంప్రదాయం , సంస్కృతి లక్షణాలు కొన్ని రుగ్వేదంలోనూ కనపడతాయి. రెండింటిలోనూ గోవులది ప్రముఖ స్థానం పార్సీ వారు అగ్ని ని పూజిస్తారు .రెండు సంప్రదాయాల్లోనూ సోమరసానికి( మత్తు పానీయం) సంబంధించిన తంతులున్నాయి. మొదట్లో తమను ఆర్యులు గా, పొరుగువారిని దాసులు గా చెప్పుకున్నారు .ఆర్యులకు దాసులకు మధ్య విభేదాలు జాతిని బట్టి కాక వారి సంప్రదాయాలల్లో వచ్చిన తేడా వల్ల వచ్చినాయి. ఆర్యుల్లో రాజన్యులు ,రుత్విజులు, కవులు ఉండేవాళ్ళు. ఆర్యులు కొత్తగా వచ్చినప్పుడు దాసుల పురాలను ,ఆవులను కొల్లగొట్టే వారు.శతపథ బ్రాహ్మణంలో అసురులు స్థిరాస్తి వ్యవసాయం చేసేవారని చెప్పినారు.వారి ఆస్తి గోవులు, గుర్రాలు. వేద సాహిత్యంలో లో ఇతరుల పై దాడి చేసి గోవులు ,గుర్రాలు తీసుకోవడం గొప్పగా వర్ణించారు. కుటుంబానికి మారుపేరు గోత్రం .
జొరాస్ట్రియన్ మత గ్రంథమైన జంద్ అవెస్తాలో అహుర మజ్ద అనే సృష్టికర్త ఉన్నట్లు తెలుస్తుంది .వారికి దైవ శబ్దం దయ్యం తో సమానం. తెలుగులో దైవానికి వికృతి దయ్యం. తమకు నచ్చని స్థానికులను అసురులుగా రాక్షసులుగా భావించారు
తమను దేవతలుగా చెప్పుకున్నారు. దీనిని బట్టి ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిలో ఒక తెగ ఇరాన్ లోని తెగ తో విభేదించి వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకనగా వీరికి దైవ శబ్దం దేవతలతో సమానం. దేవతల శిల్పి విశ్వకర్మ .రాక్షసుల శిల్పి మయుడు . మయసభఅద్భుతమైన కట్టడం. ఆర్యుల, ద్రావిడుల మధ్య ఘర్షణ జరిగేది. కాల క్రమంలో వారి మధ్య పెళ్లిళ్లు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగిన తర్వాత కలిసిపోయారు. ఆర్యుల పురోహితులు ద్రావిడ పురోహితులు ఒకరయ్యారు.
రుగ్వేదంలో 1028 కవితలు( సూక్తాలు) ఉన్నాయి.రుక్ అంటే దేవతలను పొగడుతూ చెప్పే
కవితలు. యజ్ఞయాగాదుల్లో దేవుళ్లను స్తోత్రం చేసే కవితలు ఉన్నాయి. రుగ్వేదం క్రీ.పూ 1500 కాలానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు.రుగ్వేద కాలంలో ప్రజలకు లిపి తెలియదు 4వ శతాబ్దికి ముందు అక్షరాలు ఉన్నాయని కూడా ఆధారాలు లేవు. ఆల్బెరూనీ ప్రకారం క్రీ.శ. 10వ శతాబ్దం తర్వాత మాత్రమే వేదాలకు లిపిరూపం ఇవ్వబడింది. క్రీ.శ.14వ శతాబ్దంలో సాయణుడు ఒక సమగ్ర వ్యాఖ్యను వేదాలపై వెలువరించాడు.రుగ్వేదంను ఒకరి నుండి మరొకరికి మౌఖికంగా నేర్పుకుంటూ వెళ్లారు .మౌఖిక సంప్రదాయం అప్పటి విద్యలో భాగంగా ఉండింది .రుగ్వేదంలో ఒకచోట శిష్యులు గురువు చెప్పిన పాఠాలు వల్లె వేయడానికి వర్షాకాలంలో కప్పలన్నీ ఒకచోట గుమిగూడి బెక బెక లాడినట్లు సామ్యం చెప్పినారు.
రుగ్వేదానికి ఇరానియన్ మత గ్రంథం అవెస్థాకు దగ్గర సంబంధం ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. రుగ్వేదం లోని పదాలు, అవెస్తా లోని పదాలు ఒకటే లాగా ఉండడమే దీనికి కారణం.
రుగ్వేదం లో ఏముంది?
రుగ్వేదం లో ఆనాటి ఆర్యులు ఇంద్రుడు, వరుణుడు,అగ్ని,అశ్విని,సోమ దేవతలను స్తుతిస్తూ సాగిన కవితలు(సూక్తాలు) ఎన్నో ఉన్నాయి ,వాటిలో విశిష్టమైన ఒక గొప్ప సూక్తం, పదవ మండలంలోని 129వ సూక్తం ,అదే సృష్టి సూక్తం లేదా నాసదీయ సూక్తం అంటారు .దీనిలో 7 కవితలు ఉన్నాయి.
రుగ్వేద కాలంలో అనేక వృత్తులు ఉండేవి .బట్టలు నేసేవారు. కుమ్మరి పని సర్వసాధారణం . ఉపర ( రోకలి), ద్రిషద (రోలు) మొదలైన రాతి పనిముట్ల ప్రస్తావన ఉంది .అల్లికపని( పెషాస్కరి) రంగులద్దడం (రజయిత్రి )స్త్రీలు చేసే పనులుగా పురుష మేధ సూక్తం చెప్పింది. రజక స్త్రీని గురించి వాజసనేయ (30 . 9 .12) చెపుతుంది.అంతేగాక ధనస్సును, వింటినారిని తయారు చేసేవారు .తాళ్లు పేనే వారు .తోళ్లను పదును చేయడం ,వెదురుతో వాడి గల వస్తువులు లేపనాలు ,కత్తులు తయారు చేసే మహిళలు, రాళ్లు పగులగొట్టడం , అశ్వసంరక్షణ ,దుంగలు మోయడం, నిప్పును మండించడం, ఆవులు కాయడం ,వేటాడడం, చేపలు పట్టడం మొదలైన పనులు చేసేవారు. స్వర్ణకారుడు, వ్యాపారి, వైద్యుడు, జ్యోతిష్కుడు వంటివారు ఆనాడు ఉన్నారు.
రుగ్వేద కాలంలో ' నిష్క' ను డబ్బుకు చిహ్నంగా వాడేవారు.
నిష్క అనేది ఒక ముద్రిక .దానికి నిర్దిష్టమైన బరువు ఉండి ఉండవచ్చు. నిష్కను బంగారం లేదా వెండితో తయారు చేసేవారు. రుగ్వేదంలోనూ ,అధర్వణ వేదం లోనూ(20:1.27) ఒక రుషి 100 నిష్కములు, 300 అశ్వములను బహుమతిగా పొందినట్లు చెపుతాడు. శతపథ బ్రాహ్మణంలో పురోహితునికి సంభావన ఇచ్చే బంగారం 100 గింజలు ఎత్తు(13.2.3.2) అని చెపుతోంది.
నాసదీయ సూక్తం ఉంది.ఈ కవితలో సృష్టి గురించి చర్చ ఉంది. బహుశా ఆర్యులలో ఉన్న భౌతిక వాదులు లేదా చార్వాకులు వేసిన ప్రశ్న అయి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ కవిత ఇలా ఉంది.
"నాసదాసీన్నో సదాసీత్త దానీం/
నాసీద్ర జోనో వ్యోమాప రోయత్/
కిమావరీవః కుహకస్య శర్మ న్నంభః/
కీమాసీద్గ హనంగభీరం.."
దీని భావము ఏమంటే:
*అప్పుడు సృష్టికి పూర్వం సత్తు ( ఉండడం) లేదు. అసత్తు (ఉండకపోవడం) లేదు. భూమి లేదు. సమున్నత ఆకాశము లేదు. మూత వంటిది ఒకటి ఉన్నదే? అదేమిటి .అది ఎక్కడ ఉన్నది ?దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది ?సుఖదుఃఖాల అనుభవం ఎవరికి .అక్కడ గంభీరమైన అగాధమైన కొలవలేని ఈ జలరాశి (వెల్లువ )అప్పుడు ఉన్నదా!?"
ప్రకృతి గురించి ఏమీ తెలియని రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం.
యజుర్వేదం(క్రీ.పూ. 1000_600) యజ్ఞ నిర్వహణ గురించి చెప్తుంది . ఇందులో లో యాగాలు చేస్తున్నప్పుడు రుత్విక్కులు (యజ్ఞం చేసేవారు) పఠించే కవితలున్నాయి. యజుర్వేదం పై వ్యాఖ్యానం గా శతపథ బ్రాహ్మణం వచ్చింది.
రుగ్వేదాన్ని జ్ఞానం గానం చేసే విధానం సామవేదం . ఇది క్రీ.పూ.1100 లలో వచ్చింది. సామవేదంలో సామూహికంగా రాగ బద్ధంగా గానం చేసే రుక్కులు(గీతాలు) ఉన్నాయి. అధర్వణ వేదం(క్రీ.పూ 1200)లో అనారోగ్యాన్ని పోగొట్టడానికి చదివే మంత్ర తంత్రాలు ఉన్నాయి.
వేదాలపై వ్యాఖ్యానాలే బ్రాహ్మణాలు( క్రీ.పూ. 1000 700 ),అరణ్యకాలు (క్రీ.పూ 500 600), ఉపనిషత్తులు (క్రీ.పూ 1000_500).
వేదాలకు వ్యాఖ్యానం చెప్పేది బ్రాహ్మణం అని పిలుస్తారు. ఒక్కొక్క వేదానికి కొన్ని బ్రాహ్మణాలు ఏర్పడ్డాయిఐతరేయబ్రాహ్మణం రుగ్వేదం గురించి చెప్తుంది .
శ్వేతాశ్వతర బ్రాహ్మణం యజుర్వేదం గురించి మాట్లాడుతుంది.
గోపథ బ్రాహ్మణం అధర్వణ వేదం గురించి చెబుతుంది .
ఇలా రకరకాల బ్రాహ్మణాలు ఉన్నాయి . వానప్రస్థాశ్రమంలోఉన్నప్పుడు చేసే కర్మకాండ గురించి అరణ్యకాలు చెప్తాయి. ఈ బ్రాహ్మణాలు ,ఆరణ్యకాలు యజ్ఞాలు గురించే మాట్లాడుతూ ఉంటాయి.
ఉపనిషత్తులు కూడా వేదాలపై వ్యాఖ్యానాలే. ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేదని అర్థం .ఇవి 108 ఉన్నాయి. వీటిల్లో పేరెన్నిక గన్నవి ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు మొదలైనవి.
ప్రశ్నోపనిషత్తు లో సృష్టి ఎలా ఏర్పడింది , రుతువులు ఎలా ఏర్పడ్డాయి, ఆయనములు ఎలా ఏర్పడ్డాయి ,ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతి సంబంధమైన విశేషాల గురించి చర్చిస్తుంది.
విశ్వామిత్రుడు రచించిన గాయత్రి మంత్రం లో భూర్ భువర్ సువః అనేవి మూడు లోకాలను సూచిస్తాయని చెపుతారు సాయి పాపినేని. భూ అంటే భూలోకం ,భువర్ అంటే భువర్లోకం ,స్వ అంటే స్వర్గలోకం అని అర్థం. లోకం అంటే ప్రదేశమని. రుగ్వేదంలో సింధూ, సరయు, సరస్వతి నదులు కనిపిస్తాయి .అందువల్ల ఈ మూడు మహా నదుల పరివాహక క్షేత్రాన్ని భూలోకం గా మనం భావించవచ్చు . భువర్ లోకాన్ని పితృలోకం అంటాయి పురాణాలు. క్రీ. పూ7000 నాటికి సింధూ నదికి పశ్చిమాన ఉన్న హిందూ కుష్ కనుమల్లో ఉన్న ఎగువ మైదానాల్లో క్రీస్తుపూర్వం 3100 కు ముందు కాలం లో సాగిన సంస్కృతిని భువర్లోకం గా గుర్తించారు. స్వర్గం దేవతల నివాసం ఇది గంధర్వుల అధీనంలో ఉండేది.అసురులు గంధర్వులు తరిమి వేసి దానిని తీసుకున్నారు. అసురులను నిర్జించి దేవతలు స్వీకరించారు దానికి అధిపతి దేవేంద్రుడు అయ్యాడు.దీనికి రాజధాని అమరావతి. ఇది స్వర్గలోకం చరిత్ర. సింధూ నది కి పాయగా నారా నది ఉండేది. రుగ్వేదం ప్రకారం గంధర్వులు స్వర్గానికి మూలవాసులు. ఈ గంధర్వులు నారాయణుడి బిడ్డలు నారాయణుడు అంటే నారా అనే నది మీద నివసించే వాడు అని అర్థం. గంధర్వుల మూల స్థానం అయిన స్వర్గం సింధూ-సరస్వతి దిగువ లో నారా నది కేంద్రంగా నర్మద వరకు ఉన్న తీర ప్రాంతంలో విస్తరించిన సంస్కృతిగా గుర్తించవచ్చు.ఆర్యులు చెప్పిన స్వర్గం అంటే పనీపాటా లేకుండా పండ్లు ఫలాలు సేకరించి తినే దేశ.ఇది ఆహారసేకరణ దేశ.ఇది పర్వత ప్రాంతాలలో ఉన్నప్పటి దేశ. లోక్ ప్రాంతాన్ని స్వర్గం గా వర్ణించారని విజయభారతి పేర్కొన్నారు.
ఆధారాలు: ఆంధ్రప్రభ: 23/3/2023,కేదారి రాఘవ
పురాణాలు మరో చూపు విజయభారతి
భారత దేశ చరిత్ర బాలగోపాల్ పరిచయం
__పిళ్లా కుమారస్వామి 9490122229
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment