సమాజంలో అసమానతలు
- Get link
- X
- Other Apps
ఆదిమ సమాజంలో
మానవుడు ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ జీవించేవాడు. క్షణం క్షణం క్రూరమృగాల తో పోరాడుతూ అడవుల్లోని గుహల్లో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండేది. ఈ సంఘర్షణలో మనిషి చాలా దృఢకాయుడుగా ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండేవాడు. అనారోగ్యం బారిన పడేవాడు కాదు .మనిషి ఎప్పుడూ ప్రమాదానికి చేరువగా జీవించేవాడు. అంతే. తనను తాను కాపాడుకోవడమే ముఖ్యంగా ఉండేది. అతని ఆలోచనలన్నీ ఆహార సేకరణ, తన్ను సంరక్షించుకోవడం,ఈ రెండింటి మీద ఉండేది.ఆ క్రమంలో అవి అతని పంచేంద్రియాల పై ప్రభావాన్ని కలిగించాయి. జంతువులు మాత్రం ప్రకృతికి లోబడి ఉండేవి. మనిషి మాత్రమే ప్రకృతి కి ఎదురుతిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో మానవుల్లో అవగాహన శక్తి మెల్లగా పెరిగింది. అతని అనుభూతులు ఆవేశాలు దీనికి అవకాశం కలిగించాయి. ఆది మానవుడికి భౌతిక అవసరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఆకలి తీరాక లైంగిక సుఖం కావాలి. ఈ రెండే. అతను మృత్యువు గురించి ఆలోచించలేదు. ప్రకృతి గురించి అవగాహన పెరిగేకొద్దీ మృత్యువును గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. నైతిక పరమైన మంచిచెడ్డలు అతనికి తెలీవు. సుగుణాలు వ్యసనాలు అతనికి అసలు తెలియవు.స్త్రీ పురుషులు కోరికలు తీర్చుకునే వారు .తండ్రి ఉంటాడని ఎవరికీ తెలియదు. పిల్లల్ని తల్లి సహజ ప్రేరణ వల్ల కొంత కాలం పెంచేది. ఆహారం వెతుక్కో గల దశ రావడంతోనే పిల్లలు తల్లిని వదిలి వెళ్లిపోయే వారు. తర్వాత మళ్ళీ కలిసిపోయే పరిస్థితి కూడా ఉండదు.క్రూరమృగాల నుంచి తనను తాను కాపాడుకునే దశలో దయా గుణం ఏర్పడింది. ఇది సహజాతం. ఇతరులు బాధ పడుతు న్నప్పుడు కూడా వారి కోసం తాను బాధపడేవాడు. ఈరోజు గురించి ఆలోచనే తప్ప రేపటి గురించి ఆలోచన ఉండేదికాదు. జంతువుల నుండి తన్ను తాను రక్షించుకునే దశలో గుహల్లో
ఉండటం నేర్చుకున్నాడు. ఆయుధాలను కనుక్కున్నాడు. వాటిని తయారు చేసి పెట్టుకోవడం నేర్చుకున్నాడు. జంతువులను అదుపులో పెట్టుకోవడం కూడా నేర్చుకున్నాడు . ఇది అనుభవం మీద సాధ్యమైంది. మంచి అనుభవం ఉన్న వాడు తక్కినవారికన్న సమర్థవంతంగా ఉండేవాడు. ఆనాటి అవసరాలు ఒకరికి ఒకరు తోడుగా ఉండే సంఘజీవనానికి దారితీసింది. ఆ దశలో గుంపు సమాజం ఏర్పడింది. జంతువులను మచ్చిక చేసుకోవడం తో అవి ఆ గుంపు సంపద గా మారిపోయింది. ఈ సంపద కోసం మరో గుంపు వారితో ఘర్షణ పడేది.
గుహల్లో నివసించే ఆదిమానవులు గుహలో నుండి బయటకు వచ్చి చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉండటం నేర్చుకున్నారు .స్త్రీ పురుషులు కలిసి ఉండడం మొదలైంది. గుంపులో తల్లి తండ్రి గుర్తింపు మొదలైంది .దాంతో స్త్రీ పురుష సంబంధాల్లో కట్టుబాట్లు మొదలైనాయి. ఈ విధంగా ఇల్లు కుటుంబాలు ఏర్పడడం మొదలయినాయి.
ప్రకృతితో భౌతిక అవసరాల కోసం పడే సంఘర్షణలో ఆలోచనలు వికసించాయి. తోటి మానవులతో సంభాషించటం కోసం మౌన సంకేతాలు ఉపయోగించేవాడు.గుహల్లో
బొమ్మలు గీచేవాడు.మెల్లగా ప్రకృతి ని అనుకరిస్తూ పదాలను, భాషను అభివృద్ధి చేసుకున్నాడు. ఆహార సేకరణ లో కొత్త మార్గాలను కనిపెట్టాడు. భూమిని దున్ని విత్తనాలు చల్లి పంటలు పండించే వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నాడు.కొత్త ప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పరచుకోవడం మొదలుపెట్టాడు. కొంత భూమిని సొంతం చేసుకొని సొంత ఆస్తిని ఏర్పరచుకున్నాడు. అప్పటినుండి అసూయలు,తగాదాలు, బాధలు మొదలయ్యాయి. సొంత ఆస్తులు కలిగి ఉండడంలో ఆనందం కన్నా లేకపోవడం వల్ల కలిగే బాధ అధికమైంది .అంత ముందు మానవుల్లో లేని క్రూరత్వం మొదలైంది . తన తెలివితేటలు వల్ల సమాజంలో గుర్తింపు పొందడం గౌరవం కోసం పోరాటం మొదలైంది .అవి పొందిన వారు గర్వపడటం లేని వారు అసూయపడటం మొదలైంది.
ఒకే చోట నివాసం ఏర్పరచుకున్న తెగలన్నీ కలిసి ఒక జాతిగా ఏర్పడ్డాయి .ఆ జాతిలో అసమానతలు హెచ్చుతగ్గులు జాతి విభేదాలు మొదలయ్యాయి. అడవులను కొట్టి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవడం, లోహాలను కనిపెట్టడంతో మానవ నాగరికత మొదలైందని చాలామంది కీర్తిస్తుంటారు .కానీ మానవులకు వినాశనం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. వ్యవసాయం చేయడానికి అవసరమైన పరికరాలు తయారు చేసే వాళ్ళు అవసరమైనారు. దాంతో శ్రమ విభజన, వృత్తుల విభజన ఏర్పడింది .ఈ క్రమంలో తోటి మానవులను బానిసలుగా చేసుకుని తమ ఆస్తులను పెంచుకునే తెలివితేటలు పెంచుకున్నారు .తమ
ఆస్తులు రక్షించుకోవడానికి తగిన చట్టాలు కూడా తయారు చేసుకున్నారు .ఆ చట్టాలను అమలు చేయడానికి కొంత సైన్యాన్ని రక్షక భటులను నియమించుకున్నారు. కానీ పేదవారితో మాత్రం మిమ్మల్ని బలవంతుల నుండి కాపాడటం కోసం చట్టాలను సైన్యాలను తయారు చేస్తున్నామని
చెప్పారు. వారు నమ్మి తమ స్వేచ్ఛను వారికి అర్పించారు.ఆ విధంగా ఆదిమానవుడు అనుభవించిన స్వేచ్ఛ నాగరికత వికాసంతో హరించుకుపోయింది. అన్ని అసమానతలకు సంఘర్షణ
లకు మనం గర్వపడుతున్న నాగరికతే కారణం.
(అంత్రోపాలజీ అభివృద్ధి చెందని దశలో రూసో పై విషయాలన్నీ చెప్పాడు )
___రూసో (1712_1778)
(డిస్కోర్స్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ ఇనీక్వాలిటీ)
vijay pilla
9490122229
9490122229
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment