త్రిమతాచార్యులు



భౌతిక వాదాన్ని నాశనం చేసి తాత్వికంగా భారతదేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్లిన త్రిమతాచార్యులు

           అద్వైతమంటే రెండుగానిది.
ఆత్మ పరమాత్మ రెండు గాదు, ఒకటే నని అర్ధం. ఈ దిశ నుండి శంకరుడు భారతీయ భౌతిక దర్శనాలపై వ్యాఖ్యానం చేసి వాటి మూలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. భారత రాజకీయ వ్యవస్థ ఇతనికి అనుకూలంగా ఉండటం ఇతని విస్తరణకు అవకాశం కల్పించింది. హిందూ ధార్మిక వాదులు రాజ్య శక్తిని తమకు అనుకూలంగా ఉపయోగించు కోవటంలోను, నిర్మించుకోవటంలోనుఅద్వితీయులుగా ఉన్నారు. 

         విచిత్రమేమంటే, శంకరుని మాయా వాదాన్ని, రామానుజుని విశిష్టాద్వైతం పూర్తిగా ఖండించింది.
        ఆత్మ-పరమాత్మ రెండూ ఒకటే.కాని, ఆత్మ పరమాత్మను చేరాలంటే, అది భక్తి ద్వారానే సాధ్యం అని చెప్పి, విశిష్టాద్వైతం శంకరుని మాయావాదంపై దాడి చేసింది. 
         ఈ రెండు వాదాల్ని మధ్వాచార్యుడు తన ద్వైతవాదంతో ఖండించాడు. ఆత్మ-పరమాత్మ రెండూ ఒకటి కావు. రెండూ వేరువేరు అని ఆయన సిద్ధాంతీకరించాడు. 
         పూర్తి భిన్నమైన వాదాలు చేసిన ఆచార్యులు హిందూ ఆధ్యాత్మిక వాదులుగా భారతీయ భౌతికవాదుల మీద ఉమ్మడి దాడి చేశారు. హిందూ మతంలోని కుతంత్రం ఇదే. భౌతిక వాదాన్ని, భౌతిక వాద దర్శనాన్ని నాశనం చేసేటప్పుడు వీరందరూ ఐక్యశక్తిగా రూపొందుతారు. అంతర్గతంగా మాత్రం విభిన్న వాదాలతో కుమ్ములాడుకున్నట్లు కనిపిస్తారు.
___ కత్తి పద్మారావు (చార్వాక దర్శనం నుండి)





శంకరుని మిథ్యావాదం నేటి సమాజానికి వర్తించే సిద్ధాంతం కాదు.

            నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇదిఅందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవిస్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం
కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు
శంకరుడు. (రజు - తాడు, సర్పం - పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న
తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి
తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో
తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన
ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.

       నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు.“మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఎందుకంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది.మార్పు చెందుతోంది, నశిస్తున్నది, రూపాంతరం చెందుతోంది. ప్రగతిశీలమైన,ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి పూర్వమున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషికాది ధోరణులన్నీ అంగీకరించాయి. శంకరుడు మాత్రం తనకంటే ప్రాచీనమైన ధోరణులలోని వాస్తవికతను విసర్జించాడు." అని ఏటుకూరి బలరామ్మూర్తి  పేర్కొన్నారు.

భావవాదులలోని ప్రధాన దోషం ఏమంటే వీళ్ళు ప్రపంచం యొక్క సత్యాన్ని గురించి,
అసత్యాన్ని గురించి అది వస్తుగతమా? లేక వ్యక్తిగతమా? అని ప్రశ్నిస్తారు.దానికి సిద్ధాంత
దృష్ట్యా మాత్రమే  సమాధానం చెపుతారు.వీళ్లు ఆచరణలో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.    
       మానవుల ఆచరణంతా జ్ఞాన మీమాంసకు ఆధారంగా ఉండాలని ఫ్యూయర్ బాక్ చెప్పినారు. భావ వాదులు
కూడా 'నేను' “నీవు' అనేవాటి సత్యాన్ని గుర్తిస్తారు. ఐతే, ఈ దృక్పథాన్ని భావవాదులు వ్యవహార జీవితంలో అంగీకరిస్తారే గాని, తాత్త్విక యోచనకు కాదు. "ఏ తాత్త్వికాలోచన వాస్తవ జీవితానికి విరుద్ధంగా ఉంటుందో, , 
ఆత్మను ప్రమాణంగా తీసుకుంటుందో - అటువంటి తాత్త్వికాలోచన సత్యం దృష్ట్యా అది చచ్చిన దానితోనూ, అబద్దం తోనూ సమానం" అని ఫ్యూయర్ బాక్ అన్నారు.
        ప్రపంచమంతా మిథ్యని బోధించిన శంకరాచార్యులు విగ్రహారాధనను సమర్థించడం ఆయన చెప్పిన దానికే విరుద్ధం.

       బౌద్ధంలో బుద్ధుడిని దైవంలా చేయటం, ఆలయాలు నిర్మించటం గమనించిన
శంకరాచార్యులు దేశమంతా పర్యటించి జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. శైవ
దేవాలయాలను స్థాపించారు. వైష్ణవ దేవాలయాలను ప్రోత్సహించారు. శివకేశవులు అభేదమని నిరూపించారు. ఒక ఝంఝా మారుతంలా దేశంలో వైదిక మతానికి మళ్లీ ప్రాణం పోశారు. శంకరాచార్యుల వాదన ధాటికి పండితులు తలక్రిందులయ్యారు. పతనావస్థలో నున్న బౌద్ధులు హైందవంలోకి తిరిగి రావాల్సి వచ్చింది. వారికి తమ బౌద్ధంలోని లోపాల్ని నిరూపించి, తర్కంతో ఓడించి శంకరాచార్యులు, మళ్లీ హిందువుల్ని చేశారు. దాంతో బౌద్ధం సమూలంగా దేశం నుంచి అదృశ్యమయింది.
         “శంకరుని విజయం, అతని తాత్విక సిద్ధాంతపు విజయాన్ని ఆనాటి బ్రాహ్మణ,
ఇతర అగ్రవర్ణాలు ఆనాడు తక్కిన భారతీయ సమాజంపై సాధించిన విజయంగా
అర్థం చేసుకోవాలి. అందువల్ల శంకరుని తాత్విక సిద్ధాంతం ప్రస్తుత భారతదేశానికి గానీ,ప్రపంచానికిగానీ వర్తించే సిద్ధాంతంగా... సవ్యంగా ఆలోచించగలిగే ఏ వ్యక్తి
అంగీకరించలేడు. పెనుమార్పులతో శరవేగంగా ప్రపంచం ముందుకుపోతున్న నేటి
కాలంలో మానవజాతి ముఖ్యంగా మనదేశం ఆ వేగాన్ని అందుకోవాలంటే భావవాదపు
సిద్ధాంతాలను, అద్వైతంతోసహా తీవ్రంగా ఎదిరించి, ఓడించాలి. హిందూ పునరుద్ధరణ
వాదాన్ని వేద, పురాణాల తాత్విక భావజాలాన్ని ఎదిరించి ఒక ప్రజాతంత్ర లౌకిక,
నవీన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు సాగిస్తున్న పోరాటంలో ఇదొక విడదీయలేని
భాగం.” అంటూ నంబూద్రిపాద్ శంకరుని తాత్విక భావ జాలాన్ని తిరస్కరించారు.



Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం