టెక్నాలజీ ఎంత పెరిగినా తార్కిక హేతువాద భావాలను అందుకోని భారతీయ సమాజం
టెక్నాలజీ ఎంత పెరిగినా తార్కిక హేతువాద భావాలను అందుకోని భారతీయ సమాజం
అంతరిక్షంలో సుదూరంగా ఉన్న అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపిస్తున్నాం. చంద్రుడిపై మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. ఆలోచనలు సుదూర అంతరాళం వైపు దూసుకుపోతున్నా మన విశ్వాసాలు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. విమానాల్లో ప్రయాణిస్తున్నాం. కానీ కూపస్తు మండుకాల్లా జీవిస్తున్నాం. కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకుంటున్నాం. కానీ పనికిరాని నిరర్ధక ఆలోచనల్ని విడిచిపెట్టలేక పోతున్నాం. అక్షర జ్యోతులు వెలుగించు కుంటున్నాం. కానీ మూఢాచారాలతో అంధ కారంలో మగ్గిపోతున్నాం. అంధవిశ్వాసాలను ప్రశ్నించినవారిని, సరైన మార్గం చూపించేవారి ని నిర్హేతుకంగా హతమారుస్తున్నాం. ఆధునిక సమాజం సిగ్గుపడే మూఢ విశ్వాసాలతో మన మెదళ్లు కుంచించుకుపోతున్నాయి.
అశాస్త్రీయమైన మూఢవిశ్వాసాలకు అధికారానికి మధ్య దగ్గర సంబంధముంది. దీనికి కారణాలు అనేకం. ఇవి ప్రజల్లో ఉంటే అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా వుంటారని,దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి విషయంలోనూ చట్టబద్దులుగా వుంటారని అధికారవర్గాలు ఆశించేవారు.ఆనాటి సమాజం తార్కిక దృక్పథాన్ని పెంపొందించేందుకు సహకరించే స్థితిలో లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇది గ్రీకు దేశంలోనైనా, ఈజిప్టులోనైనా, భారతదేశంలో నైనా, అమెరికా లోనైనా ఒక్కటే. అయితే ఈనాటి సమాజం కూడా శాస్త్ర విజ్ఞానపు ఫలాలు అందుకుంటున్నా తార్కిక హేతువాద భావాలను పెంపొందించుకోలేదు. పైగా పాలకులు పాత పద్ధతులు అనుసరిస్తూ ప్రజల్ని మూఢ విశ్వాసాల్లోకి నెడుతున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటే అప్పుడు భౌతిక వాదులను మట్టు పెట్టేవారు. వారిగ్రంధాలను భావాలను నాశనం చేసేవారు. ఇప్పుడు అంతగా లేదు. కానీ ఇటీవల కల్బుర్గి,దబోల్కర్ మొదలైన వాళ్ళను చంపడం మళ్ళీ మూఢ విశ్వాసాలను పెంపొందించేవారు అధికారం లోకి రావడమే కారణం.
Comments
Post a Comment