భారతీయ తాత్వికచింతన గొప్ప మలుపు తిప్పిన బుద్ధుడు
బుద్ధుడు జీవిస్తున్న కాలంలో యజ్ఞయాగాదులు విపరీతంగా జరుగుతుండేవి. ఆయజ్ఞయాగాదుల్లో జంతుబలి తప్పనిసరిగా వుండేది. భగవంతుని సేవించటానికి భక్తిని ప్రదర్శించటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి వేలాది జంతువులను బలిచ్చేవారు. ఇప్పటిలాగా పూలు, పండ్లు, తియ్యని తినుబండారాలుపెట్టేవారు కాదు. ఆ సందర్భంలో జరిగే హింసాత్మకతతో కూడిన ప్రార్ధనలను, కర్మకాండలను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు.
బుద్దుడు హింసకు బదులుగా మానవీయ లక్షణాలను ప్రతిపాదించాడు. ఇతరుల
పట్ల దయ, కరుణ, ప్రేమవుండాలని చెప్పాడు. మనిషి మనిషిగా మనుగడ సాగించడానికి
పంచశీల బోధించాడు. ఆయన బోధనలు సమాజం సజావుగా నడవడానికి,మనిషి తన ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.ఇవి నేటికీ సమాజం అందుకోలేక పోతోంది.
బుద్ధుడు బోధించిన పంచశీల :
1 జీవహింస చేయకపోవడం 2. దొంగతనము చేయకపోవడం 3. వ్యభిచరించక పోవడం 4. అసత్యంచెప్పకపోవడం 5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించకపోవడం.
బుద్దుడు మానవతావాది. మానవున్ని కేంద్రంగా చేసుకొని మనిషి ఆనందంగా నివసించడానికి కావలసిన సామాజిక వాతావరణాన్ని కల్పించాలన్నాడు. బుద్ధుడు మనిషికి సంబందించిన నాలుగు ఆర్యసత్యాలు (నోబుల్
ట్రూత్స్) చెప్పాడు. అవి
1. మనిషికి దు:ఖం ఉంది.
2 దుఃఖానికి కారణం ఉంది
3. దుఃఖ నివారణ ఉంది.
4 దుఃఖ నివారణ మార్గం ఉంది.
బుద్ధుడు దు:ఖమంటే ఏమిటో వివరించాడు. జన్మదు:ఖం, ముసలితనం దు:ఖం, రోగం దు:ఖం, మరణం దు: ఖం, అప్రియమైన వాటితో సంగమం దుఃఖం, ప్రియమైన వాటి నుండి విడిపోవడం దు:ఖం, కోరినది లభించకపోతే
దుఃఖం, కోరికలంతా దు:ఖమే. మనుషులు దు:ఖంతో, కష్టాలతో, పేదరికంతో సతమతమవుతూ జీవిస్తున్నారనేది
ఆయన రెండో భావన. ప్రపంచమంతా దు:ఖమయం. ఈ దు:ఖాన్ని ప్రపంచం నుండి తొలగించడం ఎలాగన్నదే
ఆయన ధర్మం. మరేది ఆయన ధర్మం (మతం) కాదు. ప్రస్తుత ప్రపంచీకరణలో దు:ఖం అంటే మనిషి పరాయీకరణ చెంది మనిషి పొందే మానసిక సంఘర్షణగానూ లేదా మానసిక వ్యాకులతగానూ మనం తీసుకోవచ్చు. దీన్ని నివారించటానికి బౌద్ధం ఆచరణాత్మక సమ్యక్ మార్గాలను ఎనిమిదింటిని (అష్టాంగ) చూపింది. ఇక్కడ సమ్యక్ అనగా మంచి అని అర్థం.
అష్టాంగమార్గాలు :
1) సమ్యక్ దృష్టి (రైట్ వ్యూస్) : అవిద్య నాశనమే సమ్యక్ దృష్టి లక్ష్యం. పూజాకర్మకాండల మీద విశ్వాసం పదలమంటుంది.
శాపాల పవిత్రతను విశ్వసించవద్దంటుంది. ప్రాకృతిక శక్తులను, మూఢనమ్మకాలను వదిలివేయమంటుంది. అనుభవం
మీదగాని, వాస్తవిక విషయాలమీద గానీ ఆధారపడని అన్ని రకాల ఊహాసిద్ధాంతాలను త్యజించమంటుంది.
2) సమ్యక్ సంకల్పం (రైట్ డిటర్మినేషన్) : ఇది దృఢంగా నిశ్చయించుకోవడానికి మార్గాన్ని చెబుతుంది.
1) కోరికలకుకల్లెంవేయాలి 2) ఇంద్రియలోలుడు కాకుండా భోగలాలసత నుంచి బయటపడాలి.3) ద్వేషభావం మానుకోవాలి4) ఏ ప్రాణికి ఏవిధమైన హాని చేయరాదు.
3) సమ్యక్ భాషణం (రైట్ స్పీచ్) : ఇది ఇలా బోధిస్తుంది... 1) ఎల్లప్పుడూ నిజాన్ని చెప్పాలి.
2) అబద్ధం చెప్పరాదు.
3) ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు.
4) అపవాదులు వేయరాదు. 5) తోటివారిని తిట్టరాదు, కోపగించుకోరాదు.
6) అందరితో మర్యాదగా, దయతో ఉండాలి. 7) వ్యర్థ సంభాషణ చేయరాదు. ఏది మాట్లాడినా అర్థవంతంగా ఉండాలి.
4) సమ్యక్ ఆచరణ (రైట్ యాక్షన్) : ఇది సరైన ప్రవర్తనను బోధిస్తుంది.
1) ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి.
2) ఇతరుల హక్కులను గుర్తించాలి.
5) సమ్యక్ జీవనం (రైట్ లైవ్లిహుడ్) : ఇది వ్యక్తికి, సమాజానికి నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుంది.
1) జీవించడానికి
సరైన వృత్తిని అవలంబించాలి 2) ప్రాణికోటికి బాధ కలిగించే బానిసల వ్యాపారం, ఆయుధాలను, జంతువులను,
మద్యం, మాంసం విక్రయించే వ్యాపారాలు చేయకూడదు.
3) చేస్తున్న వృత్తిలో, వ్యాపారాలలో వంచన, అవినీతి,మోసం మొదలైనవి చేయరాదు.
6) సమ్యక్ కృషి (రైట్ ఎఫోర్ట్) : ఇది నాలుగు పనులు చేస్తుంది, మనస్సుకు శిక్షణ నిస్తుంది.ఆ నాలుగు ఏవంటే
1) మనసులో చెడు
తలంపులను ఇంద్రియ నిగ్రహంతో రాకుండా చేయడం 2) ఒకవేళ వస్తే వాటిని అణచివేయడం
3) మానసిక
దౌర్బల్యాలను అరికట్టి మనసును ప్రక్షాళన చేయడం, 4) మంచి ఆలోచనలను, మంచి విషయాలను పెంపొందించడం.
7) సమ్యక్ చైతన్యం (రైట్ కాన్షియస్ నెస్) : ఇది సరైన జాగరూకత, సరైన ఆలోచనలు ఉండాలని చెబుతుంది.
1)మనస్సు ఎప్పుడూ మేల్కొని ఉండటం, నిర్మలంగా ఉంచుకోవడం
2) మోహవికారాదులు కలుగకుండా చూసుకోవడం
3) దురాశకు దూరంగా ఉండటం
8) సమ్యక్ నిమగ్నత (రైట్ మెడిటేషన్) : ఇది మనస్సును ఏకాగ్రత సాధించడానికి శిక్షణ ఇస్తుంది. మంచి పనుల
గురించి ఆలోచించడానికి అది మనస్సుకు శిక్షణ ఇస్తుంది. చెడుపనులు, చెడు ఆలోచనలవైపు పోకుండా నిరోధిస్తుంది,
బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలు, పంచశీల ధర్మాల ఆధారంగా బౌద్ధం ఇప్పటికీ నడుస్తోంది. బుద్ధుడు తను చెప్పే ధర్మాలన్నింటిని ఆనాటి ప్రజల భాషైన పాళీ భాషలో ప్రచారం చేశాడు. ఆనాటి పాళీభాషలో తెలుగువారువాడే చాలా పదాలు ఉన్నాయని భాషాశాస్త్రవేత్తలు చెపుతున్నారు.

Comments
Post a Comment