పర్వ “ను నడిపిన ముగ్గురు మహోన్నత స్ర్రీమూర్తులు
భారతీయ సవలా రచయితలలో ప్రముఖులైన డా. ఎస్.ఎల్. భైరప్ప గారు కన్నడ భాషలో రచించిన గొప్ప నవల “పర్వ”. ప్రాచీన వ్యాస భారతానికి ఇదొక ఆధునిక నవలారూపం. అయితే భారతం లోని మాయలు, మంత్రాలు వంటివి నిజంగా సంభవమా అనే హేతువాద ధృక్పధంతో ఎంతో పరిశోధన జరిపి భైరప్పగారు ఈ నవలను రచించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు సామాన్య పాఠకులకు కూడ అర్థమయ్యేలా తేటతెలుగు పదాలతో, చక్కని వాక్యనిర్మాణంతో తెలుగులోకి “పర్వ” నవలను అనువదించారు.
ప్రఖ్యాత కన్నడ నవలా సామ్రాట్టు డా. ఎస్.ఎల్. భైరప్ప గారి అత్యంత ప్రసిద్ధి చెందిన నవల “పర్వ” ప్రచురణై 40 ఏళ్ళు గడిచాయి. గత సంవత్సరం డిసెంబరులో బెంగుళూరులో భైరప్ప గారి రచనలపై జరిగిన సాహిత్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రసాహిత్య అకాడమి అద్యక్షులు శ్రీ చంద్రశేఖర కంబార మాట్లాడుతూ “ భైరప్పగారు వ్యాస భారతం లాంటి మహా కావ్య కృతిని పర్వ నవలగా రాసి ఎన్నో శతాబ్దాల మన సంప్రదాయాన్నిరక్షించారు. దాని ద్వారా మనలను ఒక గొప్ప సాంప్రదాయానికి వారసులుగా చేసార”న్నారు. ఉపాద్యక్షులు డా. మాథవ్ కౌశిక్ మాట్లాడుతూ “భైరప్ప వ్యాస భారతాన్ని భారతీయ దృష్టి కోణంలో రచించారు. ఇతరులు రాసిన మహాభారత రచనల కంటే భైరప్పగారి కృతి భిన్నమైనది. పాఠకులకు ఆప్తమైనది. ప్రతి పాత్ర అంతరాళాన్నిభైరప్ప చూపిన రీతే ఈ కృతికి నవ్యతకు కారణం” అన్నారు.
మహాభారతం అంటే దాయాదుల యుద్ధం , రాజ్యాధికారంకోసం జరిగిన యుద్ధం అనుకొంటారు. కాని, అసలేం జరిగింది అని భైరప్పగారు కొన్ని ఆధారాలతో , హేతుబద్ధమైన ఆలోచనలతో ఈ నవల రాసి, కొన్ని ఊహించని సత్యాల్ని వెలికితీసారు. ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాల్లో ... ప్రధానమైన ‘ స్త్రీల మానసిక క్షోభ ‘. ఆనాడు స్త్రీలు మౌనంగా ఎంతటి దుఃఖాన్ని దిగమింగుకున్నారు! తీవ్రమైన కామం తుఫానులో చిక్కుకుని ఊపిరాడక చచ్చిపోయారు కొందరు. రాజకీయ ఒప్పందాలతో సంబంధాలు కలుపుకొని, దానికి ‘పెళ్ళి’ అనే అందమైన అబద్ధపు పేరు పెట్టి వంచిస్తే , తెలిసి కొంత... తెలియక కొంత నలిబిలి అయిపోయారు కొందరు.
ఆర్య... అనార్య... అర్ధార్య అనే ముసుగుల చర్చోపచర్చల వల్ల ‘ జీవించే’ ప్రక్రియ కోల్పోయి ‘బ్రతికేసారు’ కొందరు. స్త్రీల అశ్రువులతో తడిసి ముద్దయిపోయింది కదా మొత్తం. ఆ కన్నీరు నాడూ నేడూ కూడ కొన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నాయి. వాటికి సమాధానాలు నాడూ లేవు, నేడూ లేవు. “ ఆనాటి సాంఘిక రాజకీయాలను గుర్తుపెట్టుకొని విమర్శించాలి కానీ, నేటి ఆధునిక ధర్మాలతో నాటి భారతాన్ని విమర్శించ కూడదు” అని కొందరు అంటారు. మహాభారతం లోని స్త్రీ పాత్రలను గమనిస్తే ముందుగా స్ఫురించేది.... పృథ , కృష్ణ. భారత కథ మొత్తం వీరి త్యాగంతో, అశ్రువులతో తడిచి ముద్దయిందని చెప్పవచ్చు. తర్వాత ప్రధాన పాత్ర గాంధారి.
అత్యంత ఆధునిక దృక్పథం ఉన్నవారిమి అని చెప్పుకునే కొందరు పృథ గురించి, కృష్ణ గురించి హేళనగా, చులకనతో వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతూ, మహోన్నత వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి వారెంతో ప్రయత్నాలు చేసారు. శాస్త్రీయ దృక్పథంతో, తార్కికంగా, హేతుబద్ధంగా పరిశీలించినప్పుడు పృథ, కృష్ణ పలికిన వలుకుల్లో ఉన్న సత్యం గోచరమౌతుంది.
“పర్వ” నవలను పరిశీలిస్తే , భైరప్ప గారి సృజనలో ... *పృథ* !
పాండురాజు దౌర్బల్యం తెలిసే ‘పృధ’తో వివాహం జరిగింది. అతని నిస్సహాయత కి తోడు “విపరీత” మనస్తత్వానికి పృధ శారీరకంగా మానసికంగా ఎంతో హింసను అనుభవించింది. ‘శక్తి’ వంచన లేకుండా ప్రయత్నించి ప్రయత్నించి, ఓడిపోయి, అతడు తన ‘నిస్సహాయత’ ని ఒప్పుకోకుండా పృధని, ఆమె కుటుంబాన్ని ఆడిపోసుకుంటాడు. చివరికి తన నిస్సహాయతని ఒప్పుకొని పృధ ఒడిలో వాలిపోయి బావురుమన్నప్పుడు భూదేవంత పెద్ద గుండెలకు అతన్ని హత్తుకొని , పెద్ద పెద్ద చేతులతో ఓదార్చింది ఆమే కదా!
మద్రదేశపు స్త్రీలు శృంగారమర్మాలను తెలిసినవారు. వారైనా పాండున్ని ఉద్దీపింపచేయ గలుగుతారని మాద్రిని తెచ్చి వివాహం చేసారు. అంతటి నైపుణ్యం గల మాద్రికూడ , తన ప్రయత్నాలన్నీ ‘నిర్వీర్యం’ కాగా పృధ చెంత చేరి విలపించింది. దృతరాష్ట్రునికి పిల్లలు పుట్టేస్తారేమో నన్న ఆతృతతో రాజ్యం వదిలి, కొండలు గుట్టలు దాటి, ప్రకృతి ఒడిలో , ఆశ్రమంలో , ప్రశాంతమైన మానసిక స్థైర్యం పొందుతూ, దేవగణాలకి చెందిన అశ్వనీసోదరుల వద్ద శారీరక స్థైర్యం కోసం వైద్యం చేయించుకున్నాడు.
ఎన్నాళ్ళిలా ప్రయత్నించడం! ఒక కొడుకు కావాలి, లోకంలో తను తండ్రి అనిపించుకోవాలి అనుకొన్నాడు. ‘నియోగ’ పద్ధతి వుంది, అది ‘ఆర్య సమ్మతమైంది’ అని పృధను ఒప్పించి పర పురుషుడి వద్దకు పంపాడు ఈ ఆర్యపుత్రుడు. “భర్త అంగీకరిస్తే” నియోగ ప్రక్రియ తప్పుకాదట. దానికి బదులు, వివాహపూర్వమే ఆమెకు జన్మించిన కానీనుడు కర్ణుడిని వారు అంగీకరిస్తే పోయేది కదా! ఆర్య సమ్మతం కాదని తెలిసే కదా పృధ భయపడింది, కానీనుని గురించి చెప్పలేక పోయింది.
నియోగం అంటే... కేవలం గర్భధారణ కోసమే అని మనసుకు చెప్పుకోవాలట. శరీరం, మనసు స్పందించకూడదట. అక్కడ వుంది స్త్రీ . ప్రాణం లేని బొమ్మ కాదు. గర్భం ధరించగానే ఆ పర పురుషుణ్ణి తండ్రిగా భావించాలి, ప్రేమ పెంచుకోకూడదు , జీవితంలో మళ్ళీ తలుచుకోకూడదు. ఇదీ నియమం. అప్పుడైనా ఇప్పుడైనా “ఆమె” స్త్రీ కాదా! శారీరక, మానసిక స్పందనలు ఉండకూడదా! ఇదేమి ‘ధర్మం’! ఈ ధర్మాన్ని నాడూ నేడూ కూడ మనం నెత్తిన పెట్టుకుని పూజిద్దాం అనడం ఎంత వరకు సమంజసం!
యముడనే దేవగణానికి చెందినవాడు వచ్చినప్పడు ఎంత సంఘర్షణ పొందింది పృధ! సరే, ధర్ముడు పుట్టాడు. కానీ, పాండునికి మరో (బలమైన) పుత్రుడు కావాలనిపించి దేవగణ సేనాని , మహత్తర బలవంతుడైన మరుత్తుని ఆహ్వానించాడు. మళ్ళీ ఒట్టు, ప్రమాణాలు వేయించి పృధని పంపాడు. మరుత్తు బలమైన చేతుల మధ్య పృధ నిజంగానే శారీరకంగా, మానసికంగా ఆనందించింది. మనస్పూర్తిగా ఇద్దరూ ఇష్టపడ్డారు. “ ఇవన్నీ వదిలేసి వచ్చెయ్” అన్నాడు కూడ మరుత్తు.
భయం...! అంతటి పృధ మనసుని కూడ భయం వెనక్కి లాగింది. తనవిశాలమైన ఒడి నిండిపోయేంత బలమైన భీముడు జన్మించాడు.
అయిందా! ఈ ఉదంతమంతా తెలిసి, పృధ గురించి విని, మోహంతో వచ్చాడు ఇంద్రుడు. భర్త ఒప్పుకోలు అవసరం కదా! ఒప్పించాడు తెలివైన ఇంద్రుడు. రాబోయే మహా సామ్రాజ్యాన్ని జయించే , కాబోయే వీరుడు పుట్టాలిగా అన్న ఆశ పాండురాజులో. మళ్ళీ ఒట్లు. మళ్ళీ నియోగం. మళ్ళీ సంయోగం. ఈసారి అర్జునుడు.
ఇక చాలు. పృధ మనసుని గట్టి చేసుకొని పిల్లల పెంపకంపై కర్తవ్యదీక్ష స్వీకరించింది.
మరి మాద్రి! పృధ ఈ క్రియ లో వున్నప్పుడు పాండురాజు, పిల్లలు ఆమె దగ్గరే వున్నారు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసు. అసలే మద్రదేశపు శృంగారదేవత. ఆమెకూ ఒక మనసుంది. శారీరక కోరికలున్నాయి. పాండురాజు, పృధ అనుమతితో అశ్వనీసోదరులు ( వాళ్ళు ఏదైన ఇద్దరూ కలిసే చేస్తారట. హతోస్మి.) వల్ల నకుల సహదేవులకు జన్మనిచ్చింది. ఈలోగా పాండురాజులో వైద్యం పనిచేసి, కాసింత శారీరక మానసిక స్ధైర్యం పొడచూపినట్లుంది. అతని ఆతృతకు తోడు మద్రదేశపు శృంగారకళలతో వున్న మాద్రితో ఏకాంతం! ఫలితం... పాండురాజు విజయంతోనో, పరాజయంతోనో మరణం. దానికి కారణం తానేనన్న పశ్చాత్తాపంతో భర్త నిర్జీవ శరీరంతో పాటు కాలి బూడిదైపోయింది. ఇది త్యాగమా! భయమా! పిల్లలను పెంచలేనన్న నిస్సహాయతా! పృధ అయితే పెంచగలదన్న నమ్మకమా! ఏదైనా, ఒక స్త్రీ జీవితం ఇలా ముగిసిపోయింది.
మళ్ళీ కుంతి వ్యక్తిత్వం మనకు ప్రస్పుటంగా కనిపించేది.... భీమున్ని హిడింబితో వివాహానికి ఒప్పించడం, “కృష్ణ” ను ఐదుగురు పాండవులకు పత్నిగా ఒప్పించడం... రాబోయే యుద్ధంలో రాక్షస , పాంచాల సైన్యం తమకు అండగా వుండాలనే. చాల సందర్భాలలో కుంతి నిదానంగా, ఎంతో ఆలోచించి నిర్వహించింది స్ధిరచిత్తయై. పదమూడేళ్ళ తర్వాత వచ్చిన పాండవులు తమతో రమ్మన్నప్పుడు ‘ యుద్ధంలో జయించి, రాజ్యాన్ని పొంది , నన్ను పిలవండి వస్తాను’ అని ఖచ్చితంగా చెప్పింది.
కానీనుడైన కర్ణుని కలిసినప్పుడు ఎన్నేళ్ళనుండో దాచుకున్న వేదన పెల్లుబికింది. అతడు యుద్ధరంగంలో మరణించాడని తెలిసి, రణస్ధలి కేగి, పుట్టినప్పుడు జాతకకర్మలు చేయలేదు ఇప్పుడు అంతిమకర్మలన్నా చేయాలని శవాల మధ్య తన ప్రధమ సంతానం కోసం వెదుక్కుంది , భూదేవంత సహనం గల పృధ.
మహాభారతంలో కానీ, భైరప్ప గారి కన్నడ నవల “పర్వ” లో కానీ కుంతి వ్యక్తిత్వం మహోన్నతం గా చూడగలం. ఆచార్య గంగిశెట్టిగారి తెలుగు అనువాదంలో “ వాడుకలో వున్న తెలుగు పదాలు సహజంగా, అలవోకగా పడ్డాయి. వచనరూపంలో ఉన్నా అంతర్లీనంగా ఒక ‘రిధం’ కొనసాగింది మొదటి నుండి చివరివరకు. వాక్యనిర్మాణం సందర్భోచితంగా, ఒద్దికగా ఒదిగిపోయింది కధనంలో. తెలుగువారికి “పర్వ” ను పదిలంగా అందించడంలో కృతకృత్యులయ్యారు ఆచార్య గంగిశెట్టిగారు.
*కృష్ణ*
కృష్ణ. ఆమె పుట్టినప్పుడు పెట్టిన పేరు. ఆమెను అర్ధం చేసుకోవాలంటే బుద్ధి వల్ల కంటే హృదయం వల్లే అర్ధం చేసుకోవాలి. ఒక స్త్రీని ఎంతలా అవమానించాలో, ఎంత దిగజార్చాలో అంతగా ఆమెను అవమానించారానాడు. నేటికీ అవమానిస్తూనే వున్నారు. ఆమె తండ్రి దేశం పేరు పేరిట పిలవడం - అంటే ద్రుపద రాజపుత్రి కనుక “ద్రౌపది” అయింది. కాని శబ్దాన్ని అర్ధాన్ని అర్ధం చేసుకోలేని విషపూరిత వాచాలత్వం గలవారు ద్రౌప “తి” అంటూ , ఎందరో “భర్తలు” కలది అని హేళనగా అన్నారు. ఆమెకు కలిగిన అవమానాలు, ఎదురైన సవాళ్ళు మహాభారతంలో చూసి నాడూ, నేడూ కూడ ఏ స్త్రీ హృదయమైనా క్షోభిస్తుంది. ఎన్నోసార్లు నవ్వుల భారాన్ని ముఖానికి తగిలించుకున్న కృష్ణ మనసులోపలి బాధ ఎవరికి తెలుసు!
భైరప్పగారి “పర్వ” నవలలో కూడ కృష్ణని అలానే చిత్రించారా అన్న భయం, చదవబోతుండగా ఓ రకమైన బెరుకు!! కాని ఎక్కడా ఆయన ‘కృష్ణ’ ని తను వర్ణించేటప్పుడు కానీ, ఇతర పాత్రల సంభాషణ లలో కానీ ఆమె గౌరవానికి భంగం కలిగేటట్లు రాయలేదు. పైగా- మిగిలిన పాత్రల ద్వారా ఆమె ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పించారు అనేక సందర్భాలలో.
హిడింబ శారీరకంగా బలమైన రాక్షసస్త్రీ. భీముడిలాంటి వాడిని కూడ ఒడిసిపట్టి ఎత్తుకో గలదు, కోపంవస్తే నాలుగు పిడిగుద్దులు వీపుపై వాయించగలదు. పరిగెత్తడంలో, వేటలో, శృంగారంలో భీమునితో సరిసమానంగా నిలబడగల శక్తి గల స్త్రీ. అలాంటి (తన మొదటి) స్త్రీని తలుచుకుంటున్నప్పుడు కూడ భీమునికి ‘కృష్ణ’ గుర్తుకువస్తుంది అని భైరప్ప గారు రాయడం ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్పినట్టుంది.....! “ఆమె సుకుమారి. ఒక పువ్వు. ఆమె మాటల్లో, కనుబొమల విరుపుల్లో, కనుకొలకుల నిశ్శబ్దతతో, కంటి మెరుపులోనే ఆమె ఆశయం అర్ధం చేసుకోవాలి. ఆర్య స్త్రీ అంటే అలానే వుండాలి” అని, “ ఆడదంటే .. తాను చూసింది కృష్ణను ఒక్కదాన్నే.ఏదీ నేరుగా చెప్పదు. ఆవిడ లోపలిమనసును ఎవరు బయటకు లాగుతారు?” అనుకుంటాడు. అవును, ఆమెబైటకు చెప్పక పోయినా ఆమె గుండెలో రగిలిన చిచ్చును చల్లార్చగలిగాడు తను మాత్రమే.
అర్జునుడు తమ ఐదుగురికి కలిసి ఒక భార్యగా వున్నా, తనకు మాత్రమే ప్రత్యేకమైన భార్యగా సుభద్రను తెచ్చుకుంటున్నప్పుడు మనసులో అనుకుంటాడు - “ *కృష్ణా, నీ శక్తి ప్రసారం జరిగినంత* *క్షేత్రంలో* *మిగిలినవారందరు తమ* *అస్తిత్వాన్ని నిలుపుకోలేరు”*- అని. అంతటి ‘శక్తి ప్రవాహం’ మూర్తీభవించిన మహోన్నత స్త్రీ మూర్తి ‘కృష్ణ’.
జూదం తర్వాత దుశ్శాసనుడు ఆమె చీర లాగినప్పుడు, అరణ్యంలో జయద్రధుడు ఆమెను పట్టుకొని పోతున్నప్పుడు , కీచకుడు ఆమెమీద కన్ను వేసినప్పుడు అవమానభారంతో, దుఃఖంతో ఆమె గుండెలు రగిలిపోలేదా!
అర్జునుడు విలువిద్యనైపుణ్యంతో క్లిష్టమైన గురిని ఒకేదెబ్బతో కొట్టి పోటీలో జయించి, తనను గెలుచుకున్నాడు. ఇక్కడ భైరప్ప గారి భావనని గంగిశెట్టిగారు చక్కగా అనువదించారు. “ కృష్ణ తన తండ్రి తోటలో నుంచి రాలి సూటిగా అతని ఒళ్ళో పడింది” . అంటే ఆ పండుని ఇంతకుముందు ఎవరూ కోయలేదు. రుచిచూడలేదు అన్నమాట.
గెలుచుకున్న ‘సొత్తు’ ను తన వెంట, కుమ్మరి వాని గుడిసె వెనుక ఉన్న గుడిసె లోకి తెచ్చినప్పుడు , మిగిలిన నలుగురు అన్నదమ్ములు ఆమెవైపు ఆకర్షితులైనప్పుడు ఒకానొక అయోమయానికి గురైంది. కుంతి ఆమె ప్రక్కనే కూర్చొని చేతిని పట్టుకుంది. ( రాజతంత్రం చాల క్లిష్ట మైంది కదా). “ నిజంగానే చాల అందంగా వున్నావు. రంగు కొద్దిగా తక్కువైనా నీ ముఖమూ, కళ్ళూ, ముక్కు, నోరు, ఒంటి ఒంపుసొంపులు , ఆకర్షణ అద్భుతం. అసాధ్యం. అనన్యం. నా అయిదుగురు కొడుకులను ఒకటిగా నువ్వు పెళ్ళి చేసుకో. నీ అంతటి దాంపత్యసుఖసమృద్ధి మన ఆర్యావర్తంలో మరో స్త్రీకి ఉండదుగాక” అని ఆశీర్వదించింది.
హిమవత్పర్వత ప్రాంతంలో ఇలాంటి సంప్రదాయం వుంది. ఆర్యుల మూల సంప్రదాయాలను ఇప్పటికీ ఆచరించే దేవజాతి ఒకటి హిమాలయంలో వుంది. కొన్ని ఆర్యేతర ప్రజల్లోనూ ఉంది అనుకుంది కృష్ణ.
పైగా కుంతి మాట ఇచ్చింది “ నా అయిదుగురు కొడుకులు నీ యిష్టాన్నిఒక అంగుళమైనా దాటకుండా నేను కట్టుదిట్టం చేస్తాను” అని.
అయిదుగురు పాండవులను ఒక చేతికున్న అయిదు వేళ్ళుగా ఒకటిగా కలిపి పట్టి భరించడం కృష్ణకొక నిష్ఠ అయింది. ఆ నిష్టను పాటించడంలోఆమె గెలుపు సాధించింది. రోజుకొకరు చొప్పున దృఢ కాయులైన అయిదుగురూ కృష్ణను ప్రణయప్రవాహంలో ముంచివేసారు. ఒకరు ఒకరోజు వచ్చి మిగిలిన నాలుగురోజులు కృష్ణ కోసం తపించిపోయేవారు. కాని తర్వాత ‘సంవత్సరానికి ఒకరు ‘అనే నియమం ఏర్పరచింది కుంతి. వారి అభ్యుదయం కోసం, ఐకమత్యం కోసం, ఆ ధర్మాన్ని పాలించడం కోసం కృష్ణ, తానెంత కష్టపడింది! అయిదుగురికి స్వయం సమర్పణ చేసింది.
కృష్ణ గర్భమంటే ఫలవంతమైన గర్భం. పెళ్ళయిన వెంటనే గర్భం ధరించింది. అయిదుగురికి అయిదుగురు పుత్రుల నిచ్చింది. ప్రతివింద్య, శ్రుతసోమ, శ్రుతకీర్తి, శతానీక, శ్రుతసేనుడు.
జూదంలో ధర్మరాజు ఓడిన తర్వాత జరిగిన అనేక పరిణామాలలో కృష్ణ జీవితంలో ఎన్నెన్నో కష్టాలు. కన్నీళ్ళు.
“పర్వ” లో చాల అద్భుతమైన, కృష్ణ మనసులోని కడలి కల్లోలాల్ని , చదువరుల గుండెను కలిచివేసే సన్నివేశం....
“నిజమైన ఆర్యధర్మమంటే ఏమిటి?” అడిగాడు ప్రతివింద్యుడు.
కిలకిల నవ్వింది కృష్ణ. కారణం తెలియకున్నా అతడూ నవ్వాడు.
“ఆర్యధర్మమంటే — వేట, తాగడం, ఆడవాళ్ళసహవాసం, జూదం” అంది మరింత నవ్వుతూ కృష్ణ. ఆనవ్వు... మనసులోని జ్వాల. ఒక అగ్నిపర్వతం. ఉబుగుతున్న లావా. ఇంకా...ఏమో. ఆ నవ్వు లోని అర్ధాలు ఎన్నెన్నో!! మన మనసుకి ఆమె ఆవేదన, ఆక్రోశం తాకుతుంది ఆ నవ్వుతో. చాల లోతైన పరిశోధన చేసాక భైరప్పగారు ఈ సన్నివేశాన్ని ఇలా చెప్పారు అనిపిస్తుంది.
నిజమే. మహాభారత కథ మొత్తం ఆ నాలుగింటి చుట్టూనే తిరిగింది కదా! వీటి వల్ల పరోక్షం గా హింస పడింది స్త్రీలే. మరీ ముఖ్యంగా జూదంవల్ల కృష్ణ జీవితమే తల్లక్రిందులైంది. ధర్మరాజు జూదంలో రాజ్యాన్నంతా ఓడి, తమ్ములను ఓడి, తన్ను తానే ఓడి, కృష్ణను కూడ పణంగా పెట్టి ఓడిపోయాడు. ఏకవస్త్రగా ఉన్న కృష్ణను సభాస్ధలికి లాక్కునివచ్చినప్పుడు పెద్దలైన వారెవ్వరూ వారించలేకపోయారు. దుష్టచతుష్టయం వదరే వికృత కూతలను ఎవరూ అడ్డగించలేకపోయారు.
ఆసారికి గాంధారి దృతరాష్ట్రులు వచ్చి ఆ దురాగతాన్ని ఆపారు. తర్వాత, మరోసారి జూదానికి సన్నద్ధమౌతున్న ధర్మరాజును వద్దని వేడుకొంది కృష్ణ. కాని “ఇది తప్పు” అని మగవారిని ఎదిరించే ధైర్యం “అప్పట్లో” లేదు అంటుంది కృష్ణ తన అయిదుగురి కొడుకులతో.
“మరి ఎప్పుడు ధైర్యం వచ్చింది నీకు “ అని శ్రుతసోముడు అడిగినప్పుడు —“ ధర్మమంటే తెలిసినవాడు ఒకడే. కృష్ణ వాసుదేవుడు. పంతానికి మళ్ళీ జూదానికి వెళ్ళిన ధర్మరాజుని మొహం వాచేలా చీవాట్లు పెట్టాడు. ‘ దుర్యోధనుని వంటి దాయాది మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకునే తెలివి నీకు లేకపోయింది. ఆ సమయంలో నేను అక్కడికి వచ్చి వుంటే అది అధర్మమని నీకూ దుర్యోధనునికి బుద్ధి చెప్పి వుండేవాడిని. వినకుంటే ఇద్దరి చేతుల్ని నరికి వుండేవాడిని.జూదమాడే వారికి అదే శిక్ష.” అన్నాడు కృష్ణుడు.
ధర్ముడు తననిలా జూదంలో ఒడ్డడం ధర్మమా అని కృష్ణ ప్రశ్నిస్తే భీష్మ ద్రోణాదులు సమాధానం చెప్పలేదు. అయిదుగురు భర్తలు మౌనంగా వుండిపోయారు. ఆ సమయంలో పలికిన భీముని ప్రతిజ్ఞలే కదా తనకు భవిష్యత్ మీద ఆశను కలిగించింది.ఆ దుర్మార్గులు తనను వివస్త్రను చేస్తారేమో నన్న అనుమానంతో , వీరులైన తన తండ్రి సోదరుల ప్రస్తావన తెచ్చి భయపెట్టాలని ప్రయత్నించింది. వారు లెక్క చేయలేదు. “ రాజసూయంలో శిశుపాలుని కుత్తుక కత్తిరించాడు కదా ఆ యాదవ కృష్ణుడు నాకు అన్న. ఆయన వస్తాడు మీ పని పట్టడానికి “ అంది తను. అందరూ భయపడింది అప్పుడేగా!
కృష్ణకు జీవితమంతా కర్తవ్యపు కట్టుబాటు, వ్రతం కట్టుబాటు, ధర్మం కట్టుబాటు. స్వయం ప్రకటిత కారాగృహం.
యుద్ధరంగంలో అభిమన్యుడు వీరమరణం పొందినప్పుడు పాండవులు, కృష్ణుడు అందరూ సుభద్రను ఓదార్చారు. తర్వాత ప్రక్క గదిలో గర్భవతి అయిన ఉత్తర తలను కృష్ణ తన ఒడిలో వుంచుకుని ఓదార్చుతోంది. అది చూసి అర్జునుడు “ నీకు కాక ఈమెను ఓదార్చే శక్తి ఇంకెవ్వరికి లేదు” అంటాడు. అదీ కృష్ణ!
కానీ, పంచపాండవులు ద్రౌపది కన్నబిడ్డల్ని అశ్వద్ధామ అన్యాయంగా హతమార్చినప్పుడు- గుండెలు పగిలేలా ఏడుస్తూ నిస్సహాయంగా అనుకుంటుంది “ అభిమన్యుడు చనిపోయినప్పుడు సుభద్రను అందరూ ఓదార్చారు. అర్జునుడైతే ఆమెను పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఘటోత్కచుడు చనిపోయినప్పుడు భీముడు శవాన్ని మోసి తెచ్చి కన్నీటితోనే రక్తపుమరకల్ని కడిగేసాడు. ఇప్పుడు నా అయిదుగురు కొడుకుల్ని కోల్పోయినప్పుడు తనని అక్కున చేర్చుకొని ఓదార్చేవారు ఎవరూ లేరు” అని.
అయిదుగురు భర్తలున్నా ఆమె గుండెలో ఒంటరితనం గూడుకట్టుకుని వుందేమో!
“పర్వ” లో చివరిలో— ఉత్తరగర్భం నుండి జన్మించిన శిశువులో చలనంలేదు. కుంతి ద్రౌపది వద్దకు వచ్చి “ నువ్వు గర్భవతివి కావాలి. లేకుంటే ఈ వంశం అంతం అవుతుంది” అంటుంది. ద్రౌపది కళ్ళలో ధిక్కారంనిండుకుంటుంది . తల అడ్డంగా ఊపుతూ “ ఈ వంశం అంతం అయితే ఏమిటట” అంటుంది. ఆ పలుకులలో ఎంత నిరసన! ఎంత పదును, బాణపు ములుకులులా! ఆమెలో ఎన్నో సముద్రాలు పోటెత్తాయేమో!
భైరప్పగారిలా మరికొందరు మహాభారత కాలం నాటి స్త్రీల దుఖాన్ని, అనుభవించిన అప్రకటిత హింసను ‘ సహ అనుభూతి’ చెందారు. రచనలు చేసారు. కొందరైతే రచయిత్రుల కంటే అద్భుతంగ స్త్రీల హృదయాన్ని ఆవిష్కరించారు.
“పర్వ” కన్నడ నవలను తెలుగులోకి అనువదించిన గంగిశెట్టి లక్షీనారాయణ గారన్నట్లు భైరప్ప గారు పండితుల కోసం కాక ఈ ఇతిహాసం సామాన్యులందరికీ అర్ధమయ్యేట్లు ప్రజలు మాట్లాడుకునే భాషలో రాసారు. అనువాదంలో కూడ అలానే ఆద్యంతం ఒకే రకమైన భాషాస్వరూపంతో, వాక్య నిర్మాణంలో సాగింది. “చిరు ప్రయత్నం” అన్నారు కానీ గంగిశెట్టిగారు చాల పెద్ద కార్యాన్ని తల కెత్తుకొని తెలుగు పాఠకులకి ఆనాటి చారిత్రక , సంస్కృతీ పరిణామ క్రమాన్ని అందించి పరిపూర్ణత సాధించారు.
*గాంధారి*
మహాభారతంలోని మరో ముఖ్యమైన మహోన్నతమైన స్త్రీమూర్తి “ గాంధారి”. భైరప్ప గారు కూడ ‘పర్వ’ నవలలో గాంధారి మూసిన కళ్ళ వెనక
కదలాడే నీలినీడలని అవగతం చేసుకొని మనకు అందించారు. భారతం లోని చాల పాత్రలు, ముఖ్యంగా స్త్రీ పాత్రల మనసుల్లోని లోతైన గంభీరమైన భావాలు ఈ ప్రపంచం ఎలా తెలుసుకోలేక పోయిందో అలానే గాంధారి మనోప్రపంచాన్ని ఈ లౌకిక లోకం ‘చూడ’ లేకపోయింది.
తన ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తండ్రి, సోదరులు నిర్ణయించిన ‘ అంథుని’తో వివాహానికి ఎంత నిశ్శబ్దంగా ఒప్పుకుందో, ఆ తర్వాత తన జీవిత కాలమంతా అదే నిబద్ధతతో, నిశ్శబ్దతతో భర్తని అనుసరించింది గాంధారి.
గాంధారదేశం! ఎత్తయిన కొండలు, వాటిని కప్పివేసేటట్లు పెరిగిన పచ్చటి చెట్లు, చేమలు, పొదలు, శిఖరాలు, స్వచ్ఛమైన ప్రకృతి ప్రాంతం , సహజమైన వాతావరణంలో పెరిగింది గాంధారి. నీలాకాశం, అన్ని ఋతువుల్లోనూ ఒకటి కాకుంటే మరొకటి చక్కగా పూలు పూచే మొక్కలు, తీగలు, తియ్యటి నీళ్ళు, వేడి అన్నదే లేని గాలి. బహుశా అంత అందమైన దేశం మరోటి లేదేమో. కానీ సారవంతమైన అంతగా లేదు. లోహాల, బంగారాల సంపద లేదు.
గాంధారి మేని ఛాయ చక్కటి ఎరుపు. పర్వత ప్రాంతపు సహజ ప్రకృతి వల్ల గట్టి మైకట్టు, మృదువైన చర్మం. స్వచ్ఛమైన నీటి మడుగులో అందంగా, ఎలాంటి మురికీ లేని తన ముఖారవిందాన్ని తనివితీరా చూసుకొని మురిసిపోయేది. స్నేహితులు కూడ ఆమెమీద అపురూపమైన స్వప్నకథలను అల్లేవారు.
దృతరాష్ట్రుడికి పిల్ల నివ్వమని భీష్ముడు గొప్ప గొప్ప కానుకలు, వస్త్రాభరణాలు,బయలుసీమలో పండే ధాన్యం దినుసులు, పెద్ద సైన్యాన్ని పంపాడు. వైభవాన్ని ప్రదర్శించి ఆశే చూపాడో, సైన్యాన్ని చూపి బెదిరించాడో , తండ్రికి లోభమే పుట్టిందో, భయమే వణికించిందో కానీ పుట్టుగ్రుడ్డికి పిల్ల నివ్వడానికి ఒప్పుకున్నాడు. కనీసం తనని సంప్రదించకుండా తన జీవితాన్ని నిర్దేశించడంతో ఆయన ఎదుటే పైన కప్పుకున్న మేలు వస్త్రం చెరుగొకటి చర్రున చించి ‘గుడ్డివాడికి కట్టబెడితే నేను అతని ముఖం చూడను’ అనే నిరసనతో కళ్ళకు గంతలు కట్టుకుందేమో! లేదా, భర్తకు లేని దృష్టి తనకూ వద్దనుకుందో కానీ - పుట్టింటి నుండి వచ్చేటప్పుడే కళ్ళకు గంతలతో వచ్చింది.
అత్తవారింటి కొచ్చాక ఒక్కసారీ పుట్టింటికి వెళ్ళలేదు. “ అక్కడికి వెళ్ళి మాత్రం ఎవర్ని చూడాలి గంతలు కట్టుకున్న కళ్ళతో! ఎలాగూ అన్నదమ్ములు ఇక్కడికే వచ్చారు కదా” అని సరిపుచ్చుకుంది. పుట్టి పెరిగిన గాంధార దేశం, అక్కడి అందమైన చక్కని పరిస్ధితులు వేరు, ఈ అత్తవారిల్లు, అంతఃపురం వేరు. ఏ నియమాలకు తనను తాను బంధించుకుందో కానీ ఒకానొక జడత్వంమనసు నిండా ఆవరించుకుందేమో! స్వేచ్ఛగా, సహజంగా పెరిగిన పుట్టిల్లు వదిలి వచ్చాక తనది కాని జీవితాన్ని మొదలుపెట్టింది. సంపూర్ణంగా భర్తని అనుసరించిన అంతర్ముఖి గాంధారి. అందరిచే మహాసాధ్వీమణి అనిపించుకుంది. “ నలుపు తెలుపుల” తారతమ్యం తెలీదామెకి. కానీ, ధర్మమే జయిస్తుంది అన్న స్ధిర నిశ్చయమామెది. ఆ విషయంలో ఎలాంటి విఘ్నత కలిగినా ఉన్న విషయం ఉన్నట్లు కటువుగానైనా చెప్పేస్తుంది. తన భర్త గుడ్డివాడైనా కొందరి దాసీజనంతో సంబంధాలున్నాయని ఆమెకు తెలుసు.
దృతరాష్ట్రుడు పైకి ప్రకటించక పోయినా అంతరాంతరాల్లో సింహాసనం మీద ఆపేక్ష, తన అంధత్వం మీద చెప్పలేనంత నిరసన గాంధారి గ్రహించింది. అతనికి లేని చూపు తనకు వద్దనుకుందో, తనకు లేని చూపు భార్యకు ఉంటే ఓర్చుకోలేడని గ్రహించిందో తెలీదు కానీ - దృతరాష్ట్రుని వంటివాడితో అన్నేళ్ళు సఖ్యంగా కాపురం చేసిన మహాసతి గాంధారి గంభీరహృదయ. పూజనీయ. అందరిచేత దేవతలా గౌరవింపబడుతున్న భార్య పట్ల దృతరాష్ట్రునికి గర్వం వుంది. “సకల కురుకులంలో మాత్రమే కాదు మొత్తం ఆర్య జగత్తుకే అద్వితీయ దేవి” అని మనసులో గౌరవం వుంది.
కర్ణుని మనసులో గాంధారి పట్ల ఎంత ఉన్నతమైన భావం వుందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కురుక్షేత్రసంగ్రామానికి ముందు కుంతి కర్ణుని వద్దకు వచ్చి అతని జన్మవృత్తాంతం తెలియజేస్తుంది. అప్పుడు కర్ణుడు “ నన్ను పెంచిన తల్లి రాధ చనిపోయిన తర్వాత నా స్నేహితుని తల్లి గాంధారీమాత ఆ లోటును తీర్చింది. హస్తినావతిలో మాత్రమే కాదు, ఏ దేశంలో నైనా గాంధారి వంటి మహామాత ఉన్నారని నేను వినలేదు. భర్త కోసం అంత త్యాగం చేసే స్త్రీ లోనే మాతృత్వపు పరిపూర్ణత సిద్ధిస్తుందేమో! ఎప్పుడు ఆమెను సమీపించి ‘ తల్లీ, నీ కాళ్ళను తాకిన నేను కర్ణుణ్ణి’ అన్నా , ఆపేక్షతో నా తలను తన రెండు చేతులతో పట్టుకుని ‘ దీర్ఘాయువు కా నాయనా’ అని ఆశీర్వదిస్తుంది. ఆమె తన ప్రేమను, హృదయాన్ని, తన బిడ్డలతో పాటుగా నాకూ అంతో ఇంతో పంచి ఇచ్చింది”... అనడం ఆమెలోని మాతృత్వపు భావనకు గొప్ప సాక్ష్యం.
గాంధారికి మనోనేత్రంతో చుట్టూజరిగేవి గ్రహించే నేర్పు, మంచి మనసు ఉంది. కుంతి హృదయంలోని భావాలు తెలుసామెకు. ద్రౌపది పడిన అవమానాలు, అల్లకల్లోలమైన ఆమె మనసుని గ్రహించగలిగింది. నిండు సభలో జరిగిన అవమానానికి ఒక స్త్రీ ఎంతగా క్షోభ పడగలదో ఊహించగలదు. అందుకే ఆ దుశ్చర్యను భర్తతో కలిసి వెళ్ళి ఆపగలిగింది. ఇంతటి దురాగతాలు చేసిన తన కుమారులకు శిక్ష పడుతుందని భయపడుతూనే వుంది. వారించినా వినరని తెలిసి నిస్సహాయంగా వుండిపోయింది.
కురుక్షేత్రంలో వరసగా తన బిడ్డల మరణవార్తలు విని గుండెలు పగిలేలా ఏడ్చింది. సంజయుడు చెప్తున్న దుర్వార్తలకి , కఠోరమైన విషయాలకి తట్టుకోలేకపోయింది. కడుపారా కన్న బిడ్డల్ని కోల్పోయన ఆ తల్లి హృదయం బద్దలైంది. క్రమంగా, ఎంత వద్దనుకున్నా , ఆమె గర్భశోకం శాపంగా మారరతోంది- కృష్ణభగవానుని వంశానికే శాపం పెట్టేంత!
చివరకు కృష్ణుడు అడిగాడు గాంధారిని “ నీతో ఒక ఆత్మీయ విషయం మాట్లాడాలని చాలకాలం నుండి ఆశ వుంది. ఏమీ దాచకుండా నిజం చెప్పివేసే సమయం జీవితంలో ఒకసారైనా రావాలి. నీ అంతరంగాన్ని విప్పి చెప్పు. మహారాజయితే గుడ్డివానిగానే పుట్టాడు. నువ్వెందుకు గంతలు కట్టుకున్నావు?” ఆమె అంతరంగాన్ని తడుముతున్నట్టు.
“ గుడ్డివాడికి కట్టబెడితే నేను అతని ముఖం చూడను అని రెండు కళ్ళకు గంతలు కట్టుకున్నాను. తర్వాత నన్ను నేను చూసుకోలేదు. చూసేటంత మొగుడూ దొరకలేదు. అయినా ‘సాధ్వీ, మహా పతివ్రత అన్న పొగడ్తల రుచి ఎక్కిందేమో, ఆ దేవీ పట్టం పోగొట్టుకోడానికి మనసు రాలేదు. నేను కళ్ళకు కట్టేసుకున్న నిజమైన కారణాన్ని నేనే మరచి ఈ హస్తినావతి అంతఃపుర జనం ఆరోపించి పెట్టిన పావనతలో మునిగిపోయాను. నువ్వు నా మనసును తట్టి అడిగావు. ఇంతవరకు నా బిడ్డల్లో ఎవరూ కూడ ‘ అమ్మా, నువ్వెందుకిలా గుడ్డిదానివయ్యావు? మమ్మల్ని చూడటానికైనా కళ్ళు విప్పు’ అని అడగలేదు, ఆడపిల్ల కూడ. తల్లి గుడ్డితనం మీదే పావనత, దివ్యత నిలబడి వుందని కాళ్ళు ముట్టి నమస్కరిస్తుండేవాళ్ళు....” గాంధారి మాటలకు చుట్టూ గాలి కూడ ఘనీభవించిందేమో ఆమె మనసులా.
కృష్ణభగవానుడన్నాడు ‘ తల్లీ , నువ్వు పుట్టుగుడ్డి వైతే కాదు. పైన గంతలు కట్టుకున్నంత మాత్రాన దృష్టి శక్తి నష్టమైపోదు. ఇప్పుడైనా ఎందుకు దాన్ని తీసేసి చుట్టూ చూడరాదూ!” మృదువుగా ఆమె కంటిపట్టీలను విప్పేసాడు. “ కళ్ళు విప్పు తల్లీ. పట్టీలు కట్టుకోడానికి ముందు నిద్ర నుండి లేచాక కళ్ళు విప్పేదానివి కదా , అలా విప్పు “ ఆమె రెండు రెప్పల మీద వేళ్ళతో సున్నితంగా నిమిరాడు. నిదానంగా కళ్ళు విప్పిందామె.
పాండవులందరూ ఆమె ముందుకు వచ్చి కాళ్ళకు మొక్కారు. “ కృష్ణా, వచ్చి నమస్కరించు” అని ఆయన చెప్పగనే ద్రౌపది వచ్చి మొక్కింది. ద్రౌపది తలను నిమిరింది. తన వేళ్ళను ఆమె తలవెంట్రుకలలో జొనిపి నిమిరింది. ఆప్యాయంగా కౌగిలిలోకి తీసుకుంది.
అన్నీ కోల్పోయిన దృతరాష్చ్రునికి గాంధారిని కూడ కృష్ణుడు తనకు దూరం చేసాడని మధనపడ్డాడు. ఆమెకైతే అంతా పోగొట్టుకున్న తర్వాత ఏమిటో పొందిన భావన. ఇన్నేళ్ళ అంథత్వం తర్వాత దేన్ని చూడాలి అనుకుంది . కానీ, బ్రతికుండగా ఏనాడూ చూడని తన కుమారుల్ని ఇప్పుడు నిర్జీవంగానైనా చూడాలి అని కృష్ణుని వేడుకుంది. యుద్ధరంగానికి వెళ్ళింది. అక్కడంతా శవాలు, విరిగిన శరీరభాగాలు, ఆభరణాలు, విల్లులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు.... చూడలేకపోయింది.
భయంకరమైన ఆ దృశ్యాలకి ఆమె చూపు చెదిరిపోయిందో, తనే మళ్ళీ అంథత్వాన్ని ఆహ్వానించిందో!! తెలీదు....!! అంతా కృష్ణమాయ...!!
*ముగింపు"*
మంత్రాలు, మానవాతీత సంఘటనలు చూసి ‘అసలు రామాయణ భారతాలు జరిగిన కథలేనా’ అన్న అనుమానం యువతకు రావడం సహజమే. ఆ అనుమానాల్ని తీర్చేవారు, తీర్చే పరిస్థితిని మన విద్యావ్యవస్థ కల్పించే అవకాశం లేదు. సహేతుకమైన ‘పర్వ’ లాంటి పుస్తకాలను పాఠ్యగ్రంధాలుగా వుంచడం కాదుకదా, కనీసం రిఫెరెన్స్ గా కూడ వుంచే ధైర్యం విశ్వవిద్యాలయాలకు లేదనుకోవాలి.
కన్నడంలో గొప్ప రచయిత భైరప్ప గారి ‘పర్వ’ నవలను సరళ భాషలో, అందరికీ అర్ధమయ్యేలా తెలుగు చేసిన ఆచార్య గంగిశెట్టి లక్షీనారాయణ గారికి తెలుగువారు ఎంతైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజానికి పర్వ నవల ఎంత గొప్పదో ‘ నేనెందుకు రాస్తాను’ అన్న వ్యాసం కూడ చాల ముఖ్యమైంది.
ఒక రచయిత సత్యాన్వేషణ కొరకు ఎంత శ్రమించాలో తెలుసుకోవాలంటే భైరప్ప గారి శారీరక మానసిక ప్రయాణం చదివితీరాలి. తన స్వంత ధనం ఖర్చుచేసుకొని ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో, ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకున్నారో తెలుసుకోవాలి. పుంఖాలుపుంఖాలుగా చారిత్రక, పౌరాణిక గాథలు రాసి పడేస్తున్న ఎందరో రచయితలకు కనువిప్పు కలగాలంటే ‘ నేనెందుకు రాస్తాను’ చదివితీరాలి. మహాభారతం జరిగిన అన్ని ప్రాంతాలకు వెళ్ళి, అక్కడి వారితో సంభాషించి, ఆయా ప్రాంతాల్ని చూసి, మమేకమై పోయి ‘ ఇక రాసి తీరాలి’ అన్న తీవ్రమైన ఉద్వేగంతో పర్వ ప్రారంభించారాయన. ఆరోగ్యాన్ని లెక్కచేయలేదు.
కానీ ఆయన చేసిన ఆ గొప్ప ప్రయత్నం ఎంతమందికి చేరింది! పర్వ తెలియక పోయినా ఫరవాలేదు. నేనెందుకు రాస్తాను అన్న వ్యాసం అయినా తెలుగు భాషాసాహిత్యాలు అధ్యయనం చేసే విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్దేశిస్తే భారతకథ జరిగిన ప్రాంతాల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. పరిశోధన అంటే ఎంత నిబద్ధతతో చేయాలో, ఎంత కృషి చేయాలో తెలుస్తుంది.
ఆయా దూరదూర ప్రదేశాలకు పర్యటించడం, సమాచారాన్ని సేకరించడం, వాటినే నిత్యం " చింతిస్తూ", రాత్రంతా రాస్తుండటం తో భైరప్ప గారి ఆరోగ్యం దెబ్బతిన్నదట. "ఆ తలలో వున్నదంతా వ్రాతలోకి దించితే గానీ ఆరోగ్యం కుదుటపడదు " అన్నారు డాక్టర్ . దాదాపు నాలుగేళ్లు పట్టిందట పర్వ పూర్తి కావడానికి. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్ళు మాత్రమే.
ఆధునిక దృష్టి కోణం లో భైరప్ప గారు కన్నడం లో నవలా రూపం లో రాస్తే, మూలాన్ని ఏమాత్రం మార్పులు లేకుండా తెలుగు చేసారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. నిజానికి ప్రపంచం లోని అన్ని భాషల లోకి అనువదించబడాల్సిన గొప్ప నవల " పర్వ ".
*** *** ***
___ డా. సిహెచ్. సుశీల
Comments
Post a Comment