ఇండో-గ్రీకు ప్రభావం


ఇండో-గ్రీకు ప్రభావం

క్రీ.పూ. 500 కాలంలో పర్షియా చక్రవర్తి దారియస్ పశ్చిమ ఆసియా, ఇరాన్, ఆప్షనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్ తజిక్ స్తాన్, ఉత్తర సింధు ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఆనాడు అయోనియాగా పిలువబడే పశ్చిమ ఆసియాలోని సిరియా, జోర్డాన్, యూరప్ లోని ఆల్బేనియా ప్రాంతాలు దారియస్ అధీనంలోకి వచ్చాయి. తన రాజ్యంలోని గ్రీకు సైన్యాలను ఆఫ్ఘనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్, తజిక్ స్తాన్ లలో దారియస్ మొహరించాడు. ఆవిధంగా దక్షిణ ఆసియాలో గ్రీకుల ప్రభావం ప్రారంభమయింది. పర్షియన్ సామ్రాజ్య పతనం తరువాత, అలెక్జాండర్ క్రీ.పూ 326 లో దక్షిణ ఆసియాలో సింధునదీప్రాతాల వరకూను, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలోని కొన్ని ఫ్రాంతాలను జయించటంతో, అతని తరువాత అతని సైనికాధికారులు గ్రీకు రాజ్యాలను ఏర్పరిచారు. ఆవిధంగా గ్రీకు రాజ్యాలు క్రీ.శ. 10 వరకూ కొనసాగాయి. అయితే, ఏదో ఒక రూపంలో భారతదేశంలో గ్రీకులప్రభావం క్రీ.శ. 750 వరకూ కొనసాగింది దాదాపు వెయ్యి ఏళ్ళ పాటు కొనసాగిన గ్రీకుల ప్రభావం భారత రాజకీయాలపైనా, సంస్కృతిపైనా, కళలపైనా ఉన్నది. భారత దేశ పశ్చిమోత్తర భాగాలకు పరిమితం కాకుండా, గ్రీకుల ప్రభావం తూర్పున మధుర, పాటలీ పుత్ర వరకూ దక్షిణాన సింధు, గుజరాత్, మహారాష్ట్రలవరకూ విస్తరించింది. గ్రీకు రాజైన మినాండర్ బౌద్దాన్ని స్వీకరించి, మిళిందునిగా ప్రసిద్ధిచెందాడు. భారదేశంలో అనేక బౌద్ధస్థూపాలను గ్రీకులు నిర్మించారు. గాంధార శిల్పంగా ప్రసిద్ధిచెందిన ఒరవడి గ్రీకు భారతీయ శిల్పకళల మేలి సమ్మేళనం. ఆతరువాత ఆ శిల్పకళా శైలి భారత దేశమంతటా, తూర్పు ఆసియాకు కూడా విస్తరించింది. గ్రీకు నాటకకళ పురాతన భారతదేశంలో ప్రజాదరణ పొంది, కాళిదాసు, అశ్వఘోషుని వంటి రచయతలకు స్ఫూర్తినిచ్చింది. రెండువైపులా చక్రవర్తి బొమ్మలతో నాణేలను ముద్రించే పద్ధతి గ్రీకులనుండే మనకు అలవడింది భారతీయ పురాణాలు, గ్రీకు ఇతిహాసాలపై పరస్పర ప్రభావం ఉన్నది. భారతీయ వస్త్రధారణలో, యుద్ధ విధానాలలో గ్రీకు ప్రభావం పడింది. గ్రీకు భాషనుండి సంస్కృతంలోకి మేల (ఇంకు) (గ్రీకు మూలం మేలన్), గ్రీకు పదం 'కలమోస్' కలం గా, పుక్సినియాన్ పుస్తకంగా వచ్చి చేరాయి. ఇండో గ్రీకు రాజ్యాలద్వారా భారతదేశానికి మధ్య ఆసియా యూరప్ లతో వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో గ్రీకులు అగ్రవర్ణాలలో స్థిరపడ్డారు

ముఖ్యంగా బీజగణితం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో భారత్, గ్రీకు పండితుల మధ్యన హెచ్చు స్థాయిలో ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగాయి. క్రీ. పూ. 250 కాలంలో పాణిని వ్యాకరణం పై భాష్యం చేసిన పతంజలి, యవనుల తెలివితేటలను మెచ్చుకుంటూ, "యవనులు మ్లేచ్చులైనా, వేద ధర్మాన్ని పాటించక పోయినా, వారి నుండి మనం నేర్చుకోవలసినది చాలా వున్నది. వారు తమ విజ్ఞానంలో, భారతీయ రుషులకు ఏమాత్రం తీసిపోరు. అందుచేతనే వారిని గౌరవిస్తున్నాము." అని వ్రాశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రజ్ఞుడైన వరాహమిహిరుడు "పంక సిద్ధాంత (ఐదు ఖగోళ సిద్ధాంతాలు) అనే పేరున రచించిన గ్రంధంలో రోమక, పౌలీస, సూర్య, (రోమన్, గ్రీకు, పారసీక) సిద్దాంతాలనే కాక, మరిరెండు భారతీయ సిద్ధాంతాల సారాన్ని వివరించాడు. "మ్లేచ్చ హీ యవనాహ్, తేసు సమ్యక్ శాస్త్రం ఇదం స్తితం/ రిస్వత్ తేపి పూజయంతే కిమ్ పునార్, దైవవిధ్ ద్విజహ్/", అని తన బ్రిహత్ సంహిత గ్రంధంలో, "మచ్చులైన యవనులకు, గొప్ప శాస్త్ర పరిజ్ఞానం వున్నది. వారు దైవజ్ఞులైన ద్విజులతో (బ్రాహ్మణులతో) సమానంగా గౌరవించాలి." అని
వరాహమిహిరుడు వ్రాశాడు. ఈ మ్లేచ్చ పదం వేదధర్మాన్ని పాటించని వారిగురించి వాడతారు. అదేవిధంగా, క్రీ.పూ. 6 వ శతాబ్దం నుండి తక్షశిల విద్యా కేంద్రంగా విలసిల్లింది. ఆనాటి అనేక నాగరికతలనుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించేవారు. ఆవిధంగా అనేక సంస్కృతులతో సంపర్కం అప్పుడే ఏర్పడింది. ఆ తరువాతి కాలంలో బీహారులోని నలందా విశ్వవిద్యాలయం కూడా ప్రపంచం నలుమూలలనుండీ విద్యార్ధులను ఆకర్షించింది. క్రీ. 5 వ శతాబ్దంలో అనేక ఖగోళ ఆవిష్కరణలు చేపట్టిన ఆర్యభట్ట అక్కడనే విద్యనభ్యసించి, ఆచార్యునిగా పనిచేశాడు. నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంధాలయంలో 13 లక్షలకు పైగా అనేక దేశాల నాగరికతల గ్రంధాలు నిక్షిప్తమై ఉండేవని చరిత్రకారులు వివరిస్తున్నారు. భాస్కరుడు, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు ఆదిగా గల అనేక భారతీయ గణిత, ఖగోళ శాస్త్రజ్ఞులు, చేసిన కొత్త ఆవిష్కరణల వెనుక గ్రీకులతో సంపర్కం ఉన్నది. వారు ఏనాడూ ఇతర దేశాల పండితులనుండి కొత్త విషయాలను గ్రహించామని చెప్పటానికి సందేహించలేదు. పరస్పర విజ్ఞాన సంపర్కం లేనిదే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి కాజాలదని అనాదిగా భారతీయ పండితులు భావించేవారు. ఈనాడు వేద విజ్ఞానంగా ప్రచారంలో ఉన్న జ్యోతిశ్శాస్త్రంలోని అనేక భావనలు మెసపొటేమియా నుండి గ్రీకులకు, వారిద్వారా మనకు సంక్రమించాయి రాశులపేర్లు గ్రీకు నుండి సంస్కృతంలోకి అనువదింపబడినవే. క్రీ.శ. 1 వ శతాబ్దంలో యవనేశ్వరుడనే గ్రీకు పండితుడు
ఈ యవన జ్యోతిశ్శాస్త్రాన్ని సంస్కృతంలోకి అనువదించాడు

M. Vijaya Kumar

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం