Skip to main content

క్రైస్తవమత తాత్విక చింతనా ధోరణులు

_క్రైస్తవమత  తాత్విక చింతనా ధోరణులు_


      pc teluguoneindia.com

   ‌‌ప్రపంచచరిత్ర రాసిన  క్రిస్  బ్రేజియర్ ప్రకారం అగస్టస్ సీజర్(క్రీ.పూ. 27 నుండి క్రీ. శ 14) 
 రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో  అతని అధీనంలో ఉన్న జుడియా రాష్ట్రంలో  జీసస్ జన్మించాడు. అతని గురించి బాల్యాన్ని గురించి మనకు తెలియదు. అతను 30 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి అతడు మత ప్రవక్త గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనికి కూడా అనుయాయులు తయారయ్యారు. దేవుడు ఒక్కడే అని బోధించడం ప్రారంభించాడు. తాను ఆ దేవుని దూత అని చెప్పుకున్నాడు. జీసస్  యువతీ యువకులకు అనేక  బోధనలు తన మాతృ భాష హిబ్రూలో  చేప్పేవాడు. కాకపోతే ఆయన చెప్పిన దేవుడు మాత్రం అన్ని జాతులకు చెందిన దేవుడు. 
         'ఇసయా' అనే ప్రవక్త హిబ్రూల కోసం అప్పటికే ఒక ఎడారి దేవున్ని పేదలను కాపాడతాడని ప్రచారం   చేశాడు. ఆ దేవుడు అన్యాయాలను అక్రమాలను ప్రతిఘటిిిిిస్తూ   పేదలను ఆదుకుంటాడని జనం నమ్ముతున్నారు.ఆ నమ్మకాన్ని ఉపయోగించుకుని  తాను చెప్పిన దేవుడు కూడా ఇదే భావాలతో ఉన్నాడని జీసస్ ప్రచారం చేశాడు . ఇతరులను ప్రేమించమని, పరుల పట్ల కరుణ,దయ ఉండాలని దేవుడు చెప్పినట్టుగా జీసస్ అందరికీ బోధించాడు. ఇలా జీసస్ తన భావాలను మూడు సంవత్సరాలు మాత్రమే ప్రచారం చేశాడు. జీసస్ చెప్పిన సామాజిక రాజకీయ  బోధనలు తమ అధికారానికి ముప్పు తెస్తాయని భావించి జూయిస్,  రోమన్ అధికారులు  జీసస్ పై రాజద్రోహం నేరం ఆరోపించి కుట్ర దారునిగా ప్రకటించి మరణశిక్ష విధించారు. ప్రజా చైతన్యం తెస్తున్న వాడెప్పుడు పాలకుల దృష్టి లో కుట్ర దారుడే.

క్రీస్తు బోధించిన ధర్మాలు:
 
1.నీతికోసం పోరాడేవారికి, హృదయం శుద్ధిగా  ఉన్నవారికి దైవ దర్శనం కలుగుతుంది.

2.నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.నీ పొరుగువాని ఇల్లు (దేనినైనా) ఆశింపకూడదు. 

3.వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే. 

4.మిమ్మల్ని హింసించినవారిని క్షమించండి.

5.నీవు ధర్మం చేసేటప్పుడు రహస్యంగా చేయి.  నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదు.

6.వినాశనానికి పోయే మార్గంలో  చాలామంది వెళతారు.కానీ  మంచి దారిలో పోయేవారు దారి  ఇరుకుగా, సంకుచితంగా ఉంటుంది.అలాంటి దారిని కనుగొనేవారు కొందరే ఉంటారు.

7.మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభమవుతుందన్నాడు.అంటే నీ కష్టాన్ని తొలగించుకుంటే ఎదుటివారి కష్టాలను తొలగించడానికి సులభ మవుతుందని అర్థం.

8.ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు.  విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.

9. నిన్ను ఎలా ప్రేమిస్తావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు.
       థామస్ పేన్ (1737_1806) ప్రకారం క్రీ‌స్తు జెరూసలేం లో నైతిక విలువలు బోధించాడు. మానవులంతా సమానమే అని చాటి చెప్పాడు. అంతేకాదు యూదు పురోహితుల అవినీతిని ఖండించాడు. ప్రజల్లో వారిపై జుగుప్స కలిగించ గలిగాడు. అందుకు ప్రతీకారంగా ఆ పురోహితులు ఆయన ప్రభుత్వం పై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఆయన సిద్ధాంతాలను విని భయపడి రాజద్రోహం నేరం మోపి ఆయనకు సిలువ వేసింది.
       జీసస్ ఒక మహా వ్యక్తి. గొప్ప విప్లవ కారుడు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసంప్రాణాలర్పించాడు. ఇంతకు మించి అతీత శక్తులు ఉన్నాయని నమ్మవలసిన పనిలేదన్నాడు థామస్ పేన్.

        pc telugu one india.com
     జీసస్ మరణం తర్వాత అతని జీవితాన్ని బోధనలను new testament లో నాలుగు gospels లో వివరించారు. అతని బోధనలు చెప్పడానికి చర్చి
(గుడి) ఏర్పడింది. saint paul  అనే బోధకుడు  జీసస్ ' తన ప్రాణాన్ని మానవుల పాపాలను  ప్రక్షాళన చేయడం కోసం త్యాగం చేశాడు' అని చెప్పినాడు. వాస్తవానికి జీసస్ స్వయంగా తాను ఏనాడూ ఆ విధంగా చెప్పలేదు. స్త్రీలు అవినీతిని ప్రోత్సహించే తళుకు కత్తెలని వారు నిశ్శబ్దంగా వినయంగా ఉండాలని సెయింట్ పాల్ చెప్పినాడు .అతడు పురుషాధిపత్యం ఉన్న చర్చి వ్యవస్థను  స్థాపించాడు. అంతేకాకుండా బానిసలు తిరుగుబాటు చేయరాదని చెప్పినాడు.ప్రతి వ్యక్తి తిరుగుబాటు చేయవచ్చన్న జీసస్ అభిప్రాయానికి భిన్నంగా సెయింట్ పాల్ బోధించాడు. తాను దేవుడు కాదని చెప్పినా బుద్ధుని దేవునిగా చేసినట్లే జీసస్ ను కూడా భగవంతుని గా చేసినాడు.అన్ని మత సంప్రదాయంలో జరిగినట్లే క్రైస్తవ మతం లో కూడా జరిగింది.అప్పటికే ప్రజాభిమానాన్ని పొందిన మతాలలోని అంశాలను క్రైస్తవ మతం సొంతం చేసుకుంది.భగవంతుడు ఒక్కడైనా అతనికి మూడు అంశాలు ఉంటాయన్న సూత్రాన్ని అలెగ్జాండ్రియనిజం నుంచి క్రైస్తవ మతం తీసుకుంది. రక్తతర్పణం పునర్వికాసానికి దారి చూపుతుందన్న నమ్మకాన్ని మిథరాయిజం నుంచి గ్రహించింది. వారి ప్రార్థనా వేదికలను దేవాలయాలను తనలో కలుపుకుంది .వారు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేసే సంప్రదాయాన్ని  కూడా క్రైస్తవ మతం గ్రహించింది. ఆ విధంగా క్రైస్తవ మతం ఆనాటి ప్రజానీకంలో కి బాగా చొచ్చుకొనిపోయింది. 
      బానిసత్వంలో మగ్గుతున్న వారందరికీ క్రైస్తవ మతం బోధించిన విలువలు ఎంతగానో  ఆకర్షించాయి. జీసస్ క్రీస్తు మరణించిన తరువాత 2000 సంవత్సరాలలో అతని సందేశం విస్తృతంగా వ్యాపించింది. కానీ డయోక్లీషియన్   చక్రవర్తి  సాధారణ శకం 303 లో చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు .క్రైస్తవ సాహిత్యాన్ని నాశనం చేశాడు. చాలా మంది క్రైస్తవులను హతమార్చాడు. అయినప్పటికీ క్రైస్తవులు ప్రశాంతంగా గంభీరంగా ఈ అణచివేతను ఎదుర్కొన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి రోమన్ చక్రవర్తి గలేరియన్ సీజర్  వారిపట్ల సహనం చూపించాడు. తర్వాతి చక్రవర్తులు క్రైస్తవాన్ని ఆదరించడం మొదలుపెట్టారు. సాధారణ శకం 324 నాటికి క్రైస్తవ మతం రోమ్ సామ్రాజ్యపు అధికారమతమైంది. ఆ తర్వాత ప్రపంచంలో అది ఒక ప్రబలమైన శక్తిగా మారింది.
      చరిత్రకారులు మానవ చరిత్రను  క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని B.C - Before Christ అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని A.D - Anno Domini, In the year of our lord అని అనేవారు. సైన్సు అభివృద్ధి చెందడంతో మానవ వాదం అభివృద్ధి చెందింది.వారిప్పుడు దీనిని మార్చివేసారు. A.D. ని common era (C.E.)అంటే సాధారణ శకం అని,B.C. ని సాధారణ శకం కు ముందు(before common Era) అని అంటున్నారు.

          జీసస్ మరణించిన తర్వాత చాలా కాలానికి బైబిల్ రాయబడింది.బైబిల్ లో చెప్పిన నీతి సూక్తులను భక్తి భావనలను  కవిత్వం కింద పరిగణించాలి. బైబిల్ కాలంనాటికి ప్రవక్త అంటే కవి అని అర్థం చేసుకోవాలి. ప్రవక్త అనే పదానికి తర్వాత చెప్పిన అర్థం వేరు.అందులోని కవిత్వం సాహిత్య సంగీత సమ్మేళనం. ఇందులో మాథ్యూ,  మార్క్ ,లాక్ ,జాన్ అను నలుగురి పేరుతో కొన్ని సంఘటనలు కథనం చేయబడ్డాయి.అవి అన్నీ ఒక విధంగా లేవు.వాటిని బట్టి స్పష్టంగా తెలిసేది ఒకటే .18 నెలల పాటు మాత్రమే జీసస్ బోధకుడిగా ఉన్నాడని .16 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడు ఎక్కడున్నారో మనకు తెలియదు. ఆయన గొప్ప నీతి వేత్త .మానవ నైతిక పునర్జీవనం కోసం కృషి చేసిన మహా వ్యక్తి . జీసస్ కు హిబ్రూ భాష   మాత్రమే తెలుసు. మానవజాతికంతా సందేశాన్ని ఇవ్వడం కోసం జీసస్ ను భగవంతుడే పంపించాడని చెబుతూ ఉంటారు. తన జీవిత కాలంలో మొత్తం మానవజాతికి సందేశం ఇవ్వడం జీసస్ కు సాధ్యమయ్యే పనేనా? భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మత గ్రంధాన్ని వెతికి ప్రయోజనం లేదు. సృష్టి అనే పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించండి. అప్పుడే భగవంతుని గురించి అర్థమవుతుందంటాడు థామస్ పేన్.

     మతం అంటే భగవంతుని నమ్మటమే.అదొక చట్రం.మతం కొన్ని సత్యాలకు నీతికి విలువనిస్తుంది.  కానీ అది మాయలతో మంత్రాలతో సంబంధం కలిగి ఉంది. అది భగవంతుని పై నమ్మకాన్ని విశ్వాసం ద్వారా పెంచుతుంది. ఇందులో హేతువుకు తావులేదు.  వ్యాపార రహస్యాలను నేర్చుకున్నట్లుగా మానవుడు మతాన్ని గురించి తెలుసుకోలేడు. తను చూసిన దాన్ని, విన్న వాటిని,చదివిన విషయాలను అనుభవంతో జోడించి ఆలోచించి అన్వేషించడం వల్ల మతాన్ని గురించి తెలుసుకోవాలి. అంతే తప్ప కేవలం విశ్వాసంతో కాదు.మాయలతో అద్భుతాలతో జ్యోతిష్యులతో కూడిన మతాన్ని మానవజాతిపై రుద్దడం అంటే వ్యాపారంచేయడమే.మతం హేతువాద భావాలను నిరోధిస్తోంది. అయినప్పటికీ విజ్ఞానం పెరిగేకొద్దీ మతంసంకెళ్లు ఒక్కొక్కటి తెగి పడుతుంటాయని చెపుతాడు థామస్ పేన్.
                          
          bible (source Wikipedia)

       క్రీస్తు గురించి తెలియాలంటే బైబిల్ లోకి వెళ్లాలి. 
 బైబిల్లోని మొదటి భాగాన్ని  పాత నిబంధన   గ్రంథం  అని అంటారు.పాత నిబంధన భూమి పుట్టుకతో ప్రారంభమౌతుంది. ఇందులో  యెహోవా దేవుడు. ఇతనే ప్రాటి కోటిని సృష్టిస్తాడు. ఇప్పుడు భూమి 450  యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలిసినా బైబిల్ లో చెప్పిందే నిజమని నమ్మే జనాలు ప్రపంచమంతా ఉన్నారు.ఇవే గాక ఇశ్రాయేలీయుల యూదుల యథార్థ గాథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు, దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హీబ్రూ భాషలో రాశారు. ఇందులో 39 పుస్తకాలున్నాయి.   కేథలిక్కులు విశ్వసించే పాతనిబంధనలో అదనంగా 7 పుస్తకాలు ఉన్నాయి. అంటే పాతనిబంధనలో మొత్తం 46 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు గల పాతనిబంధనలో 929 అధ్యాయాలు  ఉన్నాయి.
      హెబ్రియ బైబిలు(పాత నిబంధన గ్రంథం) భారత దేశానికి వలస వచ్చిన ఆర్యుల వేద కాలానికి చెందింది. దీన్ని సుమారు సాధారణ శకం కు ముందు (BCE)1800 సంవత్సరాల్లో  గ్రాంధిక హీబ్రూ (Old Hebrew) భాషలో రాశారు. ఇందులోయూదుల ఆచారాలు, యూదులకు తమ దేవుడైన యెహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి. హెబ్రియ బైబిలులో మొదటి 5 పుస్తకాలు మోషే (Moses)అనే ప్రవక్త రాశాడు. మొదటి మానవులైన ఆడం (Adam) ఈవ్ (Eve) ల జీవితం, నోవాహు (Noah) అను దైవ భక్తుడి కాలంలో జల ప్రళయం (Great Flood), దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారి ఏర్పరచడం, దేవుడి పది ఆజ్ఞలు మొదలైనవి ఈ పాత నిబంధన గ్రంథం లో ఉన్నాయి. వేద కాలంలో మాదిరి ఇందులో కూడా జంతు బలులు ఉన్నట్లు రాశారు.  ఇశ్రాయేలీయులను దేవుడు తన కోసం ఏర్పరుచుకోవడం, వారిని మోషే ద్వారా నడిపించడం లాంటి ప్రవక్తల కథనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో క్రీస్తు గురించి కొంచెం కూడా లేదు.

       బైబిల్లోని రెండవ భాగాన్నికొత్త నిబంధన గ్రంథం లో  క్రీస్తుపుట్టుక, ఆయన జీవితం గురించి రాశారు.దీన్నిపాత నిబంధన గ్రంథం బైబిల్ కి జతపరిచారు.దీనిని గ్రీకు(Greek) భాషలో రాశారు. మత్తయి లాంటి వారు  ఏసు జీవిత విశేషాలను గ్రంథస్థం చేశారు. వాటిని సువార్తలు అని పిలుస్తున్నారు. పౌలు పేతురు లాంటి చర్చి నాయకులు వారు నడిపిన సంఘాల మార్గ దర్శకం కొరకు,ఆచరణలో వచ్చే సందేహాల కోసం  వివిధ ప్రాంతాలలో ఉన్న సంఘాల ప్రధాన వ్యక్తులకు లేఖలను వ్రాశారు. వీటిని లేఖన(పత్రిక) పుస్తకాలు అని పిలుస్తున్నారు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో కొన్ని 27 పుస్తకాలు లో 260 అధ్యాయాలు 31, 173 వచనాలు ఉన్నాయి. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అన్నీ కలిపి బైబిల్ అన్నారు. దీంట్లో మొత్తంగా ఇప్పుడు పాత,కొత్త నిబంధనలు కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి.            
    కొత్త నిబంధన యేసు క్రీస్తు జీవితాన్ని తెలుపుతుంది. దీనిలో క్రీస్తు పుట్టుక, బోధనలు, మరణం, పునరుత్థానం వివరించారు. కొంతమంది భక్తులు రాసిన పత్రికల కథనాల సమాహారమే ఈ గ్రంథం. పాత నిబంధనలోని యెహోవా దేవుడు కొత్త నిబంధనలో కనిపించడు. కొత్త నిబంధనలోని క్రీస్తు పాత నిబంధనలో మచ్చు కైనా కనిపించడు. ఏసు యెహోవా పేరును ఒకసారి కూడా ప్రస్తావించలేదు. వీరిద్దరు వేరు వేరు. అయితే క్రైస్తవ గురువులు కలగాపులగంగా యెహోవా, ఏసు, తండ్రి, పరిశుద్ధాత్మ వగైరాలన్నీ ఒక కొలిక్కి రాక పోయినా చిలుక పలుకులు, పలుకుతూ జనానికి చెపుతూ ఉంటారు. యూదులకు పాత నిబంధనయే పవిత్ర గ్రంధం. కొత్త నిబంధన పట్ల తూష్ణీ భావం వహిస్తారు.
    క్రీస్తుపూర్వం 14, 15 శతాబ్దాల నుండి క్రీస్తు శకం 1,2 శతాబ్దాల మధ్యకాలంలో దాదాపు నలభై మందికి పైగా వ్యక్తులు రాసిన పుస్తకాలను అన్నిటిని కలిపి కూర్చిన గ్రంథమే 66 పుస్తకాల బైబిలు.
        సాధారణ శకం 325 లో నికయా కౌన్సిల్ సమావేశమైంది. వారు బైబిల్ లో చేర్చదగిన పుస్తకాల విషయమై తర్జనభర్జన చేశారు. అలాగే క్రీస్తుశకం 364 లో లార్డ్ కియా కౌన్సిల్, 393 కౌన్సిల్ 397 419 లో కౌన్సిల్ కూడా ఇదే విషయం పై చర్చించాయి. చివరకు కు అథనాసియస్ క్రీ.శ 367 లో కూర్చిన 73 పుస్తకాల బైబిల్ ను  ఆమోదించారు.
        క్రీ.శ. 1238 లో కార్డినల్ హ్యూగో బైబిల్ ను అధ్యాయాలు గానూ, 1428 లో ఆర్ నాథన్ పాత నిబంధన ను,1951లో రాబర్ట్ స్టీవెన్ కొత్త నిబంధనను వచనాలుగా విభజించారు.
         వేదాలను శూద్రులు, స్త్రీలు చదవరాదని నిషేధించినట్లే బైబిల్ను మతగురువులు తప్ప సామాన్యులు చదువరాదని నిషేధం కూడా ఉండేది. క్రీస్తు శకం 1526లో విలియం టిండేల్ బైబిల్ ను ఆంగ్లం లోకి తర్జుమా చేశాడు.15వ శతాబ్దం నాటికి కానీ బైబిల్ సామాన్యులకు అందలేదు. 1560 లో బైబిల్ ను మొట్టమొదటగా ముద్రించారు. దాంతో బైబిల్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది.
        1727 లో పాత నిబంధన గ్రంధాన్ని  జర్మనీ దేశస్థుడైన బెంజిమన్ షుల్జ్  తెలుగులోకి అనువదించాడు. ఆయనే 1732 లో కొత్త నిబంధన కూడా అనువదించాడు తెలుగులోకి. అందువల్లనే అందులోని తెలుగు చదివేవారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బెంజమిన్ తెలుగు నేర్చుకొని స్వయంగా అనువాదం చేయడం వల్ల ఇలా జరిగింది. కానీ అది ముద్రణకు నోచుకోలేదు. అయితే 1518లో మద్రాసు బైబిల్ సొసైటీ వారు కొత్త నిబంధన గ్రంథాన్ని తెలుగులో ప్రచురించారు.

      pc teluguoneindia.com
 

జీసస్ 
                   pc: bbc.com
         క్రైస్తవం ప్రస్తుత ఇజ్రాయిల్ దేశం లో పుట్టినా యూరప్ లోకి అడుగుపెట్టిన తర్వాతనే అది విశ్వవ్యాప్తి చెందింది. రాచరికాలు అధికార మతంగా స్వీకరించిన తర్వాత మరింత వేగంగా పుంజుకుంది. యూరప్ లో ఒక్క టర్కీలో తప్పితే అన్ని దేశాల్లో ప్రజలు క్రైస్తవాన్ని స్వీకరించారు. అక్కడనుంచి అమెరికాకి కూడా అంతే వేగంగా విస్తరించింది. ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద మతంగా అవతరించింది. కానీ ప్రస్తుతం అమెరికా లో, యూరప్ లో చర్చీలకు వెళ్ళేవాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోతున్నారు. అదేసమయంలో ఆసియా, ఆఫ్రికా లలో ఇస్లాం తోపాటు వేగంగా విస్తరిస్తోంది. అలాగే లాటిన్ అమెరికా లో కూడా.

       2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో క్రైస్తవులు కేవలం 2.3 శాతం మాత్రమే. అయితే రాష్ట్రాలవారిగా చూస్తే ఈశాన్య భారతం లో అస్సాం, త్రిపుర, సిక్కిం లు మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ తోనో , దాదాపు మెజారిటీ తోనో వున్నాయి.  గోవా, కేరళ లో గణనీయంగా వున్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర లో క్రైస్తవ జనాభా కేవలం 1.3 శాతం ఉంది.
  
         ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ క్రైస్తవ సమాజాల్లో భాగమయ్యింది. యూరప్ పునరుజ్జీవన వుద్యమంతో మొదలై ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దాదాపు క్రైస్తవ మెజారిటీ దేశాల్లో వేళ్ళూనుకుంది. ఎక్కువ దేశాల్లో మతం రాజ్యాన్నుంచి వేరుచేయబడింది. ఇతరమతస్తులు స్వేచ్చగా తమ మతాచారాల్ని పాటించే హక్కు ఈ దేశాల్లో వుంది.
    

     ఆధునికభారత సమాజ  నిర్మాణం లో క్రైస్తవం ప్రముఖ పాత్ర పోషించింది. పురాతన కాలం లో భారతీయ సమాజం ప్రపంచం లోని అతి కొద్ది నాగరికతల్లో ఒకటిగా వికసించినా తర్వాతికాలంలో పూర్తి వెనకపట్టు పట్టింది.  మూఢ నమ్మకాల్లో, పురుషాధిక్యత తో కునారిల్లింది. ముఖ్యంగా ముస్లిం దండయాత్రలతో ముస్లిం రాజుల పాలనలోకి వెళ్లాక వారు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలలో జోక్యం చేసుకోక పోవడం వల్ల ఆనాటి భారతీయ సమాజంలో పెనుమార్పులు రాలేదు.కాక పోతే వారి ప్రభావం వల్ల రకరకాల దేవుళ్ళ స్థానం లో ఏకేశ్వరోపాసన మొదలైంది.చిల్లర రాళ్ళకు మొక్కడం కన్నా చిత్తంలో శివుని మొక్కడం మేల్కొన్న అభిప్రాయం పెరిగింది.

      ఆ తర్వాత  బ్రిటిష్ వారు మన దేశం లోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళతో వచ్చిన క్రైస్తవం సమాజం పై సానుకూల ప్రభావం చూపించింది.

      ఆంగ్లేయులు భారతీయ సమాజంలో ఉన్న అనేక సామాజిక దురాచారాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు.బ్రిటిష్ పాలకులు కొందరు తటస్థ వైఖరిని ప్రోత్సహించగా, మరికొందరు క్రైస్తవ మత ప్రచారాన్ని కాదనలేదు. కనుక మత ప్రచారకులు 1705 నుండీ తమ కార్యకలాపాలు పరిమితంగా సాగించారు. భారతదేశంలో మత ప్రచారాన్ని ప్రభుత్వపరంగా చేయాలనే ప్రయత్నాన్ని 1793లోనే బ్రిటిష్ పార్లమెంట్ నిరాకరించింది. 1813 నాటికి దేశంలో క్రైస్తవ మత ప్రచారకులకు అధికారిక స్థానం కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమానుషమైన హిందూ ఆచారాలు కొన్ని తొలగించాలని మిషనరీలు ప్రయత్నించాయి. సతీ సహగమనం, అంటరానితనం మొదలైనవి ఇందులో  ఉన్నాయి. లార్డ్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ గా సతీ సహగమనాన్ని నిషేధించడానికి భారతీయుల మద్దతు, సహకారం కోరాడు.దాంతోరాజా రామ మోహన రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ఆంగ్లవిద్య  చదవడంతో హిందూ మతం లో ఉన్న దురాచారాలను అర్థం చేసుకున్నారు.దాంతో సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాల పై పోరాడారు.ఆధునిక విద్య కోసం ఆరాట పడినారు. అందరికీ విద్య కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . స్త్రీ సమానత్వం కోసం తర్వాత ఎంతోమంది సంఘ సంస్కర్తలు పాటుబడినారు. వీటన్నింటిపై క్రైస్తవ మిషనరీల ప్రభావం అపారంగా వుంది.

       ఈశాన్య భారతం లో ఆదివాసీలు ఆధునిక నాగరికతకు అలవాటు పడటం లో క్రైస్తవ మిషనరీల పాత్ర ను ఎవరూ విస్మరించలేరు. నాగాలాండ్ లో వున్న తెగలు ఒకరి తల ఇంకొకరు నరుక్కునే ఆచారం అనాదిగా వుంది. ఎన్ని తలలు అవతలి తెగ వాళ్ళవి సేకరిస్తే అంత ఘనత. ఆ సంస్కృతి ని మార్చి తెగల మధ్య సఖ్యతను తీసుకురావటం లో నాగా చర్చి గణనీయమైన పాత్ర పోషించింది. అలాగే మిజోరాం సమాజ అభివృద్ధి లో కూడా. ఈ రోజు మిజో రాష్ట్రం సాంఘిక ప్రామాణికాల్లో దేశ సగటు కన్నా చాలా ముందుండటానికి చర్చి పాత్ర ఎంతో వుంది. క్రైస్తవ మత వ్యాప్తి లో అక్షరాస్యత భాగంగా వుంది. కేరళ దేశం మొత్తం మీద అక్షరాస్యత లో ముందుంటే కేరళ లో మిగతా మతస్తుల కన్నా క్రైస్తవులు అత్యధిక అక్షరాస్యత కలిగివున్నారు.అలాగే కుటుంబ నియంత్రణ పాటించటం లో క్రైస్తవ సమాజం భారత్ లో ముందుంది. మిగతా మతస్తులతో పోలిస్తే జనాభా వృద్ధి రేటు క్రైస్తవుల్లో తక్కువుంది.

      భారత రాజ్యాంగం ప్రకారం మతస్వేచ్ఛ అందరికీ వుంది. మతాన్ని యధేచ్ఛగా అనుసరించవచ్చు, ఆచరించవచ్చు,ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వం యీ విషయంలో కేవలం ప్రజారోగ్యం, విద్య, మౌలిక వసతులు, శాంతిభద్రతలు వంటి వాటిలో జోక్యం చేసుకోవచ్చు. ఆయా మత సంస్థలు తమ సంస్థల్ని కొనసాగించవచ్చు. ఆస్తుల్ని సంక్రమింపజేసుకోవచ్చు. చట్టానికి లోబడి తమ సంస్థల, ఆస్తుల పాలన సాగించడానికి రాజ్యాంగ రీత్యా మతపరమైన హక్కులు అందరికీ ఉన్నాయి.

        కేరళలో క్రైస్తవ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు భారీగా అందుతుండేవి. 1957లో సంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, క్రైస్తవుల మతాధికారాల్ని తగ్గించే చట్టం తెచ్చారు. దీని ప్రకారం కొన్ని పరిస్థితులలో మత విద్యాసంస్థల యాజమాన్యాన్ని అవసర మనుకుంటే ప్రభుత్వం చేబట్టవచ్చు. సుప్రీంకోర్టు యిందుకు అభ్యంతరపెట్టింది. అయితే ఫీజుల వసూళ్ళు, ఉపాధ్యాయుల నియామకం, జీతాల చెల్లింపులో క్రమబద్ధత పాటించేటట్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేరళలో క్రైస్తవులు కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రతరం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేరళలో క్రైస్తవుల ప్రవర్తన, దీనికి కాంగ్రెసు వారిచ్చిన మద్దతు వలన, సెక్యులరిజం అర్థం మారిపోయింది. మతం విజృభించి తన పరిధిని విస్తరించింది.

        లోక్ సభలో తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు సభ్యుడుగా బిల్లు ప్రవేశపెడుతూ రాజకీయల్లోకి మతం చొచ్చుక రావడాన్ని ఆపాలన్నారు. కేథలిక్ చర్చిని రాజకీయ ప్రయోజనాలకు వాడడాన్ని ఆపాలని బిల్లు ఉద్దేశించి డిమాండ్ చేశారు.

       లోక్ సభలో మరో కమ్యూనిస్టు సభ్యుడు ఎస్.వి.పరులేకర్ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదించలేదు. ప్రార్థనా ప్రదేశాలు, యాత్రాస్థలాలు రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని యిందులోని సారాంశం. 1961 ఫిబ్రవరిలో వచ్చిన యీ అనధికార తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విధంగా సెక్యులర్ వ్యతిరేక ధోరణులు చట్టసభలలో అధికారపక్షం ప్రదర్శిస్తూనే వచ్చింది.

      భారతదేశంలో ప్రపంచసాహిత్యం, మానవ విలువలు, వ్యక్తి స్వేచ్ఛ వ్యాపించడానికి క్రైస్తవ మిషనీరీలు అందిస్తున్న విద్య చాలావరకూ ఉపకరించిందన్నది కాదనలేని సత్యం. కాని దేశంలో ఉన్న అన్ని మతపరమైన వ్యవస్థలు, కులాలు, ప్రచారాలు, మతోన్మాదం లౌకిక వాదానికి అడ్డుగా నిలుస్తున్నాయి.

 ___పిళ్లా కుమారస్వామి, 9490122229    

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం