హిందూత్వమనేది భారతీయ విలువలకు వ్యతిరేకం
హిందూత్వమనేది భారతీయ విలువలకు వ్యతిరేకం
అసమానతలకు వ్యతిరేకంగా నిలబడిన బౌద్ధ మతాన్ని అస్పృశ్యకులాలు, బహుజనులకు చెందిన ప్రజలు ఎక్కువగా ఆదరించారు.
పతంజలి (క్రీ. పూ. 150) తన ‘మహాభాష్యం’ లో శ్రమణులు బ్రాహ్మణులు పాము ముంగిస లాగా శత్రువుల వంటివారని రాశాడు. బ్రాహ్మణమతం, బౌద్ధమతాల మధ్య ఈ చిరకాల విరోధం ఉన్నట్లు రెండు మత సాహిత్యాల్లోనూ విస్తారంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బౌద్ధ స్మారకాలను ధ్వంసం చేయటం లేదా సంలీనం చేసుకున్న పురావస్తు ఆధారాలు భారీ స్థాయిలో ఉండటం దీనిని నిర్ధారిస్తోంది.
నిజానికి, దేశంలో బౌద్ధమతం అంతర్థానమవటం వెనుక ప్రధాన కారణం, దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణమతం దాడి చేయటమే. బ్రాహ్మణమతం ఎన్నడూ బౌద్ధమతంతో సయోధ్య కుదుర్చుకోలేదని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి, హిందూమతం సహనశీల మతమనే ఆలోచనకు సరైన ప్రాతిపదిక లేదు.
భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేయడంలో బౌద్ధం ఆ తర్వాతఇస్లాం మతం నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. పాశ్చాత్య దేశాల వర్తకుల ద్వారా యీ దేశంలోకి ప్రవేశించినక్రైస్తవం కూడా కింది కులాల ప్రజలను ఆకర్షించింది. ఈ విధంగా ఎన్నో రకాల సంస్కృతులతో సాహచర్యం వల్ల భారతదేశంలోని సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. మొగల్ చక్రవర్తుల పాలనలో ఆవిర్భవించిన సూఫీ, భతత్వాలు కింది వర్గాల ప్రజలకు ఎంతో సన్నిహితంగా వచ్చాయి. సరళమైన ఆచరణ ద్వారానూ, సమైక్యం ప్రబోధం ద్వారానూ అవి కింది వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి. సామాజిక విలువలను వున్నతీకరించే ప్రయత్నంలో కబీర్, నానక్, తుకారాంల వంటి తత్వవేత్తలు చేసిన కృషి అద్భుతమైనది. వీరి బోధనల వల్ల సాటి మానవుల పట్ల ప్రేమ, యితరుల విశ్వాసాలను గౌరవించటమూ, పరమత సహనమూ వంటి విలువలు భారత ప్రజల సంస్కృతిలో భాగమయ్యా యి. ఇందుకు భిన్నంగా హిందూత్వ రాజకీయాలెప్పుడూ అగ్ర వర్గాల ప్రయోజనాలకూ, విలువలకు ప్రాతినిధ్యం వహించాయి. సమాజంలోని మెజారిటీ ప్రజల మీద పరిమిత సంఖ్యలోని ఒక వున్నత వర్గపు అధికారాన్ని స్థాపించాయి.స్థానిక మత విశ్వాసాలను ధ్వంసం చేసి ఏకీకృతమైన ఒక మతాన్ని నెలకొల్పటానికి ప్రయత్నం చేశాయి. వెనుకబడిన
వర్గాల ప్రజల అవసరాలనూ, ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.
బౌద్ధుల పట్ల బ్రాహ్మణులు ఎల్లప్పుడూ విరోధంగానే ఉన్నారని ఝూ రాసిన ‘అగెనెస్ట్ ద గ్రెయిన్’ గ్రంథం లో వివరించారు.కాక పోతే, ఎక్కువమంది బౌద్ధమతస్తులుగా ఉన్న దళితుల పట్ల నేటి శత్రుత్వం, హిందూమతానికి కేంద్రకమైన కుల వ్యవస్థ పునాదుల్లో, వారి ఆహార సంస్కృతిలో పాతుకుని ఉంది. నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థలో దళితులకు అథమ స్థానాన్ని కేటాయిస్తుంది కుల వ్యవస్థ. దళితుల ఆహార సంస్కృతిలో ఆవు మాంసం తినటం భాగం. ఆవు మాంసం తినటాన్ని హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.అందుకే, పశు వ్యాపారులను కానీ బీఫ్ తినేవాళ్లని కానీ మూకదాడులు చేసి కొట్టి చంపుతున్న చాలా ఘటనలకు హిందుత్వవాదులే బాధ్యులు కావడం ఆశ్చర్యం కలిగించదు. వీరే హిందూమతాన్ని ఏక జాతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏకశిలా సదృశమైన అఖండ మతమని చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. హిందూమతం అన్నది ఈ దేశంలో విస్తరించివున్న విభిన్న మత శాఖలు, విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనం. కానీ హిందుత్వవాదులు భిన్నత్వాన్ని నిరాకరించే ధోరణి ఒక అంతుచిక్కని హిందూ అస్తిత్వాన్ని సృష్టించింది. అది ఆవేశం, అరాచకత్వాలకు దారితీసింది.
ఆవును పూజించటం, అందరి దేవుళ్ళ కన్నా రాముడే గొప్ప దేవుడని ప్రచారం చేయడం, ఇతర మత గ్రంథాలకన్నా రామాయణం సర్వోన్నతమైనదని చెప్పడం, మనుస్మృతిని ఈ కాలానికి అనుగుణంగా తిరిగి రాయడానికి ప్రయత్నం చేయడం దేశంలో మత, సాంస్కృతిక, రాజకీయ చర్చలను కలుషితం చేసింది. సమకాలీన భారతదేశాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే "హిందూత్వమనేది భారతీయ విలువ లకూ, సంస్కృతికీ, స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనది. మతం పట్ల సహేతుకమై వైఖరి కచ్చితంగా సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కానీ, మూఢత్వం మత దురభిమానాన్ని పెంచి పోషిస్తుందని నిర్ద్వంద్వంగా ప్రకటించారు ఝూ.
Comments
Post a Comment