ఈశ్వర చంద్ర విద్యాసాగర్
దార్శనికుడు
విద్యావేత్త, తత్త్వవేత్త,రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు అయిన ఈశ్వర చంద్ర విద్యా సాగర్ బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు.
ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామము (ప్రస్తుత పశ్చిమ బెంగాల్) లో ఒక పేద కుటుంబములో జన్మించాడు. బాల్యమంతా పేదరికముతో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించాడు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము చేత కొడుకు కూడా ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడముతో కలకత్తాకు మారాడు. ఆయన సమీప బంధువు మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపారు.
1839 లో హిందూ న్యాయశాస్త్రములో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదును పొందాడు. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజిలో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందాడు. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టాడు. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము వల్ల కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగింది.
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలముతో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగములో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించింది. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరాడు. పాఠశాల ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను స్థాపించాడు. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యాడు.
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుంటారు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించాడు. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వరూ లేరు" అన్నాడు.
విద్యా సాగర్ అతని వితంతు వివాహాలు :మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ టాగోర్, క్రైస్తవ మతముకు చెందిన అలెక్సాండర్ డఫ్, కృష్ణ మోహన్ బెనర్జీ, లాల్ బెహారీ డేలు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త, ఇతర సమాజములు సంస్కరణ పద్ధతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసమాజము లోలోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించాడు. ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్‌గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచాడు. శాస్త్రములు చదువుట వలన, పందొమ్మిదవ శతాబ్దములో అణగదొక్కబడిన మహిళల స్థితిని హిందూ ధర్మ శాస్త్రములు ఒప్పుకోవని, అధికారములో ఉన్నవారి మూర్ఖత్వమే దీనికి కారణమని తెలుసుకొన్నాడు. న్యాయశాస్త్రములో మహిళలకు ధనము సంపాదనలో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టతను కనిపెట్టాడు.
అప్పటివరకూ బ్రహ్మసామాజములో అక్కడక్కడా జరుగే వితంతు వివాహములను ప్రధాన హిందూ సమాజములోకి విద్యాసాగర్ ఒంటిచేత్తో తీసుకొని వచ్చాడు. బెంగాలీ కొన్ని ప్రాంతాల్లో బహుభార్యత్వము విస్తృతంగా ఉండేది. కాటికి కాలుజాపి ఉన్న ముసలివారైన మగవారు యువతులను పెళ్ళిచేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారు.
ఇక ఆ పిల్లలు కొద్దికాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికము, వివక్షత వారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి తినడం నిషిద్ధం. ఉదయాన్నే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరికీలేనన్ని ఆంక్షలు, పూజానియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్థనతో పరిశుద్ధులవ్వాలనే తలంపుతో తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు.
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం ప్రతిపాదించి దాని అమలుకు అన్నివిధాలుగా కృషిచేశాడు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించాడు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్థికమైన ఇబ్బందులలో పడ్డాడు.
1847 లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము మరియు తాళ పత్ర గ్రంథములను భద్రపరచు కేంద్రమును అమ్హెర్స్ట్ వీధి, కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించాడు. కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న ఆనందమంగళ కావ్యము, ఆ తరువాత భేతాళ పంచవింశతి (ప్రముఖ విక్రమభేతాళ కథలు) ని సంస్కృత కథాచరితసాగర్ నుండి అనువదించాడు. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్షను ప్రారంభించాడు. భొధోధోయ్ ను రచించాడు. ఐదు సంవత్సరముల తరువాత వర్ణ పరిచయము (బెంగాలీ అక్షర సంగ్రహము) ను రచించాడు. ఆ పాఠ్యపుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాలలో వాడుతున్నారు.
విద్యాసాగర్, తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన శిశు భోదకము, బాల బోధము, వర్ణ బోధము, ఇతర పాఠ్య పుస్తకములను జానపదములు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకములు, శాప విమోచన మార్గములు, మహా పురాణాల నుండి కథలు గల ఇంటిపుస్తకములుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ బెంగాలీలో టైపు చేయు విధానమును 12 అచ్చులు, 40 హల్లులలో సర్దెను. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ, ఖర్చుతో కూడిన సంయుక్త అక్షరము లను సులభము చెయ్యడానికి ప్రయత్నించాడు. 1857 లో సంస్కృత ప్రెస్ లో 84, 200 పుస్తకముల కాపీలను ప్రచురించి అమ్మారు.
వారసత్వముగా గాని, సొంతముగా గాని ఆస్తి లేకపోవడము వలన విద్యాసాగర్ కు, సంస్కృత ముద్రణాలయం (ప్రెస్) విజయము చాలా అవసరమయ్యింది. అంతే కాకుండా బెంగాలీ ప్రజలతో మాట్లాడుటకు ఒక సాధనమును కూడా సమకూర్చాడు. దుకాణములో గిరాకీ పెరగడము వలన విద్యాసాగర్ కు వ్రాయడానికి ఉత్సాహము కలిగింది. సందేశములను పుస్తకముల ద్వారా అందించుట, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా వాద కార్యములకు కూడా పనికి వచ్చింది. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణలో పెట్టి ఉదాహరణ ద్వారా ప్రజలకు చూపించడానికి వీలు కలిగింది.
విద్యా సాగర్ స్పూర్తితో దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం పంతులు అనేక వితంతు పునర్వివాహాలు చేశారు.తెలుగునాట నేటి కొండూరు మండలంలోని రేపూడి గ్రామం తొలి వితంతు పునర్వివాహనికి వేదికగా నిలిచింది. అందుకే కందుకూరిని దక్షిణ భారతదేశ
విద్యా సాగరుడు అని పిలుస్తారు.
నేడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ జయంతి
యం.రామ్ ప్రదీప్
తిరువూరు
9492712836
Comments
Post a Comment