యం.యన్.రాయ్. మానవ వాద తాత్విక దృక్పథం

యం.యన్.రాయ్. ఒగోనెక్ మ్యాగజైన్ (మాస్కో), 5 ఏప్రిల్ 1925
యం.యన్.రాయ్. మానవవాద తాత్విక దృక్పథం
'స్వేచ్ఛాపోరాటాలు మనిషికి సహజంగా ఉంటాయి. మానజాతి చరిత్రంతా స్వేచ్ఛా పోరాటాల చరిత్రే' అని చెప్పిన యం.యన్.రాయ్ అసలు పేరు నరేంద్రనాధ్ భట్టాచార్య. పెద్దయ్యాక మానవేంద్ర నాథ రాయ్ గా పేరు మార్చుకున్నాడు .ఆయన మార్చి, 21, 1887 న బెంగాల్‌లో జన్మించారు .హేతువాది, మానవవాది. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయవేత్త, బహుభాషా ప్రావీణ్యం గల యం.యన్.రాయ్ జనవరి 25, 1954 లో కన్నుమూశారు.
అతను భారతీయ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే గొప్పదని భావించాడు. భారతదేశంలోని బ్రిటిష్ పాలన పోవాలంటే సాయుధ పోరాటం సరైనదనుకున్నాడు. పరిశీలకులు రాయ్ రాజకీయ ప్రస్థానంలో మూడు దశలను గుర్తించారు. అతను మొదట జాతీయ వాది. తర్వాత కమ్యూనిస్ట్ గా మారాడు,ఆ తర్వాత చురుకైన రాడికల్ హ్యూమనిస్ట్‌గా మారాడు.
స్వేచ్ఛ అనేది మానవజీవితానికి అత్యున్నత విలువగా యం.యన్.రాయ్ భావించాడు.రూసో చెప్పినట్లు మనిషి పుట్టుక తో స్వేచ్ఛాజీవి. తరువాత సమాజం వేసిన సంకెళ్లకు బందీ అవుతున్నాడు. సమాజం ఆచారాలు, సంప్రదాయాల రూపంలో మనిషిని బందీ చేస్తే, రాజ్యం నిబంధనల రూపంలో మనిషిని స్వేచ్ఛారహితుని చేస్తోందన్నాడు యం.యన్.రాయ్. ఫాసిజాన్ని వ్యతిరేకించాడు. ఫాసిజం ప్రపంచాన్ని అనాగరికతలోకి నడిపిస్తుందన్నాడు. ఫాసిజం వస్తే భారతదేశం ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండదు.భారతదేశం స్వేచ్ఛా ప్రపంచంలోనే స్వాతంత్ర్యం పొందగలదన్నాడు.
పద్దెనిమిది ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వ్యతిరేక విప్లవకార్యక్రమాలలో పాల్గొన్నారు.1915లో అమెరికా లోని కాలిఫోర్నియా కు ఆయుధాలు కోసం వెళ్లాడు. అక్కడ అతను అమెరికన్ రాడికల్స్‌తో సంబంధం ఏర్పడింది. ఎలిన్‌ను వివాహం చేసుకున్నాడు.కానీ వారిద్దరూ తక్కువ కాలంలోనే విడిపోయారు.అక్కడి నుంచి 1917 లో అతను మెక్సికోకు వెళ్ళాడు. అక్కడ మెక్సికన్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. 1919లో మార్క్సిజం అధ్యయనం చేసి మార్క్సిస్టు గా మారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికోను స్థాపించారు రాయ్.తరువాత భారతదేశంలో కమ్యూనిజం ఆలోచన ఆయన తెచ్చే వరకు తెలియదు. ఆయనే మొట్టమొదట రష్యాలోని తాష్కెంట్ లో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(cpi)ని 1920 లో స్థాపించాడు.ఆయనను " భారత కమ్యూనిజం పితామహుడ " ని పిలుస్తారు .
1929 వరకు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం లో చురుకుగా ఉన్నాడు.లెనిన్ తో కలిశాడు. కొన్ని విషయాలలో ఆ ఉద్యమం తో విభేదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గాంధీ విషయంలో లెనిన్ ఆయన ఒక విప్లవకారునిగా భావిస్తే, ఎం.ఎన్.రాయ్ గాంధీ సామాజికంగా రియాక్షనరీ అని రాజకీయంగా అతను రెవల్యూషనరీ అని వాదించాడు. భారతదేశంలో విప్లవానికి సంబంధించి కూడా లెనిన్ కు ఎంఎన్ రాయ్ కి మధ్య అవగాహనలో తేడాలున్నాయి.
దాంతో ఆ ఉద్యమం నుండి అతను బహిష్కరణకు గురైనాడు.
1930లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కానీ అతను ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర చేస్తున్నారని అరెస్టు చేసింది ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వం. జైలులో విస్తృతంగా అధ్యయనం చేశాడు.
అక్కడే ఆయన భావాలు మారిపోయాయి. జాతీయవాదం కేవలం భావోద్వేగ ఉప్పెన మాత్రమే నని, దానికి రాజకీయ లేదా సాంస్కృతిక ప్రాతిపదిక లేదన్నాడు. మార్క్సిజం మానవుల సృజనాత్మక పాత్రను విస్మరిస్తోందని, మానవ ప్రమేయం లేకుండా సమాజ అభివృద్ధి జరగదన్నాడు. మార్క్సిజం పట్ల విముఖుడైనాక తరువాత అతను రూపొందించిన మానవవాదం సరైన మార్గమని భావించాడు.
1936లో విడుదలైన తర్వాత ఎల్లెన్ గాట్స్‌చాక్‌ను వివాహం చేసుకుని డెహ్రాడూన్‌లో స్థిరపడ్డారు.అతను 'రాడికల్ డెమోక్రటిక్ పార్టీ' ని స్థాపించారు. హిట్లర్ ఫాసిజంతో మనిషి స్వేచ్ఛ,స్వాతంత్ర్యాలకు ముప్పు ఏర్పడింది. దాంతో జర్మనీ కి వ్యతిరేకంగా జరిగే యుద్ధం లో బ్రిటీష్ వారికి మద్దతు ఇచ్చాడు. తన భావాలను ప్రచారం చేయడానికి రీజన్, రొమాంటిసిజం, రివల్యూషన్ గ్రంథాన్ని వెలువరించారు. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని ప్రతిపాదించాడు.
అతని జీవిత విధానానికి సిద్ధాంతానికి వైరుధ్యంలేదు.1954 లో మరణించే వరకు రాడికల్ హ్యూమనిస్ట్ భావాలను వ్యాప్తి చేస్తూ వైజ్ఞానిక పునర్వికాసం కొరకు నిరంతరాయంగా కృషి చేశాడు.ఎంతో మంది విద్యావంతులు, మేధావులు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
రాయ్ ఆలోచనలను GD పారిఖ్, VM తార్కుండే , బెనోయేంద్ర నాథ్ బెనర్జీ - అనుసరించారు. వీరు ముగ్గురు భారత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం 1944లో పీపుల్స్ ప్లాన్ రచించారు.
ఈ ప్రణాళిక భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రజల ప్రణాళికగా ప్రసిద్ధి చెందింది. దీన్ని బొంబాయిలో ఆవిష్కరించారు. తెలుగు ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని అందుకున్న వారిలో రావిపూడి వెంకటాద్రి, నార్ల వెంకటేశ్వరరావు, దేవరాజు మహారాజు,మేడూరి సత్యనారాయణ, బి.యస్.ఎల్. హనుమంతరావు,కోగంటి రాధాకృష్ణమూర్తి, గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, జి.వి.కృష్ణారావు మొదలైన వారున్నారు. గురజాడ అప్పారావు రాసిన అనేక కవితల్లో ముఖ్యంగా
"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా"
"సొంత లాభం కొంతమానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్"
"మతములన్నీ మాసిపోవును,జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును".
"మనిషి చేసిన రాతి బొమ్మలకు మహిమ కలదని సాగిమొక్కుతో మనుషులంటే రాయిరప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బేలా?" మొదలైన కవితల్లో మానవ వాద దృక్పథం వెల్లివిరుస్తూ ఉంటుంది.
ఏ విప్లవం రావాలన్నా ముందుగా సాంస్కృతిక విప్లవం రావాలన్నాడు రాయ్.విప్లవాలు సామాజిక భావవిప్లవం ఆధారంగా రావాలన్నాడు.రాజకీయ పార్టీల లక్ష్యం అధికారమేనన్నాడు. ప్లేటో కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేసినాడు.ప్లేటో ప్రకారం రాజకీయ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయన్నాడు. రాజకీయ పార్టీ ఏ స్థాయికైనా దిగజారుతుంది. అధికారాన్ని పొందడానికి, నిలుపుకోవడానికి ఏ మార్గాన్నైనా ఆశ్రయిస్తుంది. ఈ ప్రక్రియలో మొత్తం వ్యవస్థలను, రాజకీయ శ్రేణులను దుర్వినియోగం చేస్తుంది. అవినీతికి, నైతిక పతనానికి దారితీయవచ్చు. పార్టీలోని అధికారం సహజంగానే వారి చుట్టూ ఉన్న కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. రాయ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, పార్టీ రహిత ప్రజాస్వామ్యం అమలు కావాలని కోరుకున్నారు. ముందుగా 1948లో తాను ఏర్పాటు చేసిన పార్టీని రద్దు చేసి దానిని రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమం(నవ్య మానవవాద ఉద్యమంగా) మార్చాడు. ఆలోచన చేయగల ప్రజలు ప్రజా కమిటీలుగా ఏర్పడి తమ అధికారాన్ని చలాయించుకోవాలన్నాడు.తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రతినిధులను వెనుక్కు పిలిచే రీకాల్ హక్కు ఉండాలన్నాడు.మనిషిపై సంపూర్ణ అధికారాన్ని రుద్దే హక్కు రాజ్యాధికారానికి లేదన్నాడు.
సమాజం వ్యక్తుల సమూహమే. సమాజం మారడమంటే అందులోని వ్యక్తులు మారడమే నన్నాడు. హేతుత్వం,జ్ఞానం,సత్యం,స్వేచ్ఛ ఉత్తమ మానవ విలువలన్నాడు.మానవుడి ఉద్వేగాలు, ఉద్రేకాలు హేతుత్వ అదుపులో ఉండాలన్నాడు.
మానవుడి లక్ష్యం స్వేచ్ఛేనన్నాడు. రాడికల్ హ్యూమనిజం ఉద్యమ రూపంలో కొనసాగాలన్నాడు.
ఏదీ శాశ్వతమైనది, పవిత్రమైనది కాదన్నాడు. ప్రపంచాన్ని మార్చడానికి మనిషి తనను తాను మార్చుకోవాలన్నాడు.
రాజ్యానికి, సమాజానికి ,వ్యక్తికీ మధ్య సయెూధ్య కోసం నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది.అదే స్వేచ్ఛా పోరాటమంటే.నేడుప్రజాస్వామ్యం లో ఉన్నాం.కాని ప్రతిచోటా స్వేచ్ఛాపోరాటాలు జరుగుతున్నాయి.కారణం అధికారం కోరేవాడు నిరంతరం ఎక్కువ అధికారాన్ని కోరుకుంటాడు. స్వేచ్చను కోరే వాడు నిరంతరం స్వేచ్ఛను గురించి ఆలోచిస్తాడు.ఇదే మనిషి పోరాట స్ఫూర్తికి నిదర్శనమంటాడు రాయ్.
బానిసత్వం పలు రకాలుగా ఉంటుంది.కొంత మంది ఆచార బానిసలు, మరికొందరు పార్టీ బానిసలు, ఇంకొంతమంది దైవ బానిసలు, చాలా మంది జాతి బానిసలు.ఈ బానిసలు స్వతంత్రంగా ఆలోచించ లేరు. స్వతంత్ర నిర్ణ యాలు చేయలేరు.వీరు తాము ఆలోచిస్తున్నా మనుకుంటూనే బానిసత్వంలో మునిగి పోయుంటారు. వారి ఆలోచన అంతా పరాధీనం. వారి ఆలోచనంతా మనస్సులో ఎవరి గురించి ఆలోచిస్తారో వారిదే. కాని వారి గురించి వారాలోచించరు. వారే భావ బానిసలన్నాడు రాయ్.మానవ వాదులు బానిసలుగా కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నాడు.దీనికి హేతువాదం ఆలంబన కావాలన్నాడు.
దేవుడు,మతం అనే భావాల నుంచి బయట పడినప్పుడే మనిషి మనిషి గా మిగులుతాడు. అలాంటి వ్యక్తులే లౌకిక మానవులు. వారితో నిర్మించే సంఘాలే లౌకిక సంఘాలు. వారే సమాజాన్ని మార్చగలరన్నాడు యం.యన్. రాయ్.
ఐరోపాలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం సంస్కరణల వల్ల మానవతావాదం వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్ విప్లవాలలో అది పూర్తిగా వికసించింది.భారత దేశంలో సుమారు 1500 BCEలో
అతీంద్రియ శక్తులను తిరస్కరించిన లోకాయతుల తత్వశాస్త్రంలో ఈ మానవవాద బీజాలు ఉన్నాయి. రుగ్వేదంలోని నాసాదియ సూక్తం ఇదే చెపుతుంది. 6వ శతాబ్దం BCEలో గౌతమ బుద్ధుడు మానవవాద బోధనలు చెప్పడమే గాక ఆచరించి చూపినాడు.
రాయ్ ప్రవేశ పెట్టిన రాడికల్ హ్యూమనిజం( నవ్య మానవ వాదం) కూడా మనిషి కేంద్రంగా సాగింది.అతని ప్రకారం స్వేచ్ఛ మనిషి సహజ లక్షణం. ప్రతి మనిషీ కోరేది, పోరాడేది, ఉద్యమాలు చేసేది స్వేచ్ఛకోసమే. కాని మనిషిలోని స్వేచ్ఛాపిపాస ఆతనిని నిదురపోనియ్యదు. ఒక కోరిక తీరితే, వేరొక కోరిక వచ్చినట్లుగా స్వేచ్ఛ నిరంతర ప్రవాహం.
రాడికల్ హ్యూమనిజం అనేది వ్యక్తి స్వేచ్ఛ,కారణం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే తత్వశాస్త్రం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, కమ్యూనిజం రెండింటినీ తిరస్కరిస్తుంది. రెండు వ్యవస్థలు అంతిమంగా మానవులకు హానికరం అని వాదించింది. బదులుగా, రాడికల్ హ్యూమనిజం సహకారం, పరస్పర సహాయంపై ఆధారపడిన సామాజిక వ్యవస్థను ప్రతిపాదిస్తుంది.
రాయ్ తాత్వికత మార్క్సిజం, హిందూ మతం, బౌద్ధమతంతో ప్రభావితమైంది . అతను శాస్త్రీయ ఆలోచనకు, హేతువాదానికి పెద్దపీట వేశాడు. రాడికల్ హ్యూమనిజం భారతీయ రాజకీయ ఆలోచనలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇది భారత ప్రజాస్వామ్య అభివృద్ధిని రూపొందించడంలో సహాయపడింది. నేటికీ భారతదేశంలో ఒక ముఖ్యమైన తాత్విక ఉద్యమంగా నడుస్తోంది..
రాడికల్ హ్యూమనిజం చెప్పిన ముఖ్య సిద్ధాంతాలు
ప్రపంచం పదార్థంతో నిర్మితమైంది. అన్ని దృగ్విషయాలను భౌతిక ప్రక్రియల పరంగా వివరించవచ్చు.
మానవ చర్యలు భౌతిక కారణాల ద్వారా నిర్ణయించబడతాయి. మానవులకు తమ స్వంత లక్ష్యాలను, విలువలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. మానవ ప్రగతికి వ్యక్తి స్వేచ్ఛ ఎంతో అవసరం.
రాడికల్ హ్యూమనిజం అనేది సంక్లిష్టమైన, సూక్ష్మమైన తత్వశాస్త్రం. ఏది ఏమైనప్పటికీ, భారతీయ రాజకీయ తాత్వికత లో ఇది ఒక ముఖ్యమైన శక్తి అని ఎటువంటి సందేహం లేదు.
హేతువాదం, మానవవాదాలు ఆయన చెప్పిన రాడికల్ హ్యూమనిజం లో భాగాలు. మనుషులందరికీ మానవవాదం అందాలని, సామాజిక మూలాల నుండి మార్పు వస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెపుతుంది రాడికల్ హ్యూమనిజం. ప్రజలలో స్వేచ్ఛ, హేతుబద్ధత , లౌకికత, నైతికత స్ఫూర్తిని వ్యాప్తి చేయడమే రాడికల్ హ్యూమనిజం లక్ష్యం.
పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించింది రాడికల్ హ్యూమనిజం. వ్యక్తులతో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక వర్గం చేతుల్లో వుండదు కనుక ఎవరినీ శాసించే సాధనంగా ఉండదు.
కానీ ఆ వ్యక్తులు కూడా ఏదో ఒక వర్గానికో చెంది ఉన్నప్పుడు వారు స్వేచ్ఛా పోరాటాల హేతుబద్దతను పలిశీలించి హేతుబధ్ధమైన వాటిని సమర్ధిస్థుంది మానవవాదం .
ఆస్దికునికి దేవుడున్నాడనే భావనే ప్రధానం. తనకన్నా దేవునికే ప్రాధాన్యత నివ్వటం వలన దైవం చుట్టే ఆలోచన తిరుగుతుందే కాని తన చుట్టూ తిరగదు. ఆస్దికుని నిర్ణయం స్వంతమైనా దానిపై ప్రభావం దేవునిదే కాని తనది కాదను కుంటాడు.ఇది తరతరాలుగా మనిషిలో గూడు కట్టుకున్న భయం వలన ఏర్పడింది. ఇది మానసిక పరాధీనతకు కారణమైంది. పరాధీనుని ఆలోచన పరాధీనంగానే ఉంటుంది కాని స్వతంత్రంగా ఉండదు. అందుకే మన సమాజంలో ప్రజల నిర్ణయాలలో పరాధీనతను, భావ బానిసత్వాన్ని చూస్తాం.ఆ స్దితి పోవాలి.మనిషి స్వతంత్రంగా ఆలోచించాలి. స్వతంత్రుని నిర్ణయాలలో నేను నిమిత్తమాత్రుడని ఉండదు.తన నిర్ణయం పట్ల సంతృప్తిఉంటుంది. తన నిర్ణయానికి తనే బాధ్యత వహించగలుగుతాడు.తన వైఫల్యాలకు , విజ యాలకు దేవుడే కారణమనే భావన పోవాలి. అన్ని రకాల అతీత శక్తులను అది ఖండిస్తుంది.
స్వేచ్ఛ కోసం, సత్యాన్వేషణ కోసం, మానవుడు తన మనుగడకోసం జరిపే పోరాటం అత్యున్నత స్థాయి పోరాటం. ఈ పోరాటం వల్ల మనిషి ప్రకృతి విజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని, భావ వికాసంతో క్రమాభివృద్ధితో ముందుకు వెళుతున్నాడు. విజ్ఞాన శాస్త్రం సామాజిక నిర్మాణాన్ని సమైక్య పరుస్తుంది. వ్యక్తిత్వాన్ని సమిష్టి జీవితంతో సమన్వయపరుస్తుంది. స్వేచ్ఛకు నీతి, జ్ఞానాలతోబాటు సామాజిక విలువనిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి , సామాజిక శ్రేయస్సు రాడికల్ హ్యూమనిజంకు గుండెకాయలాంటివి.
మానవవాదులంతా మానవతావాదులే.కానీ, మానవతావాదులందరూ మానవవాదులు కారు. మానవతా వాదులు పుణ్యం కోసమని,అయ్యో పాపం అని, మానవసేవే మాధవ సేవ అని భావిస్తూ సహజ మానవీయ గుణాలతో మానవత్వాన్ని ప్రదర్శిస్తారు. మానవవాదులు హేతువాదభావాలతో మనిషిని మనిషిగా గుర్తించి కులమతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తారు. మనుషులు ఏ మేరకు సహేతుక చింతన చేయగలిగితే ఆ మేరకు వారి చర్యలతో సమాజంమార్పుకు లోనవుతుందని చెపుతుంది మానవ వాదం.మానవ వాదం ఆధునిక విజ్ఞానం ఆధారంగా జీవన తత్వాన్ని రూపొందించుకుని మనుషులు ముందుకు సాగాలంటుంది.సమాజంలోని వ్యక్తుల భావాల్లో సమూల మార్పులు రావాలంటే ముందుగా సమాజంలోని వ్యక్తుల భావాల్లో సమూల మార్పులు రావాలని ఆశిస్తుంది. దాన్నే భావ విప్లవం అంటాం. తాత్విక రంగంలో, సాంస్కృతిక రంగంలో భావ విప్లవం సంభవించనిదే సామాజిక విప్లవం సాధ్యం కాదని భావిస్తుంది.
వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే అన్ని రకాల నియంతృత్వ విధానాలను అది వ్యతిరేకిస్తుంది. జాతి కుల మత వర్గాది సంకుచిత భావా లను వ్యతిరేకించి విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తుంది. మానవ సమస్యలను పరిష్కరించడానికి హేతుబద్ధమైన మార్గాలను అన్వేషిస్తుంది మానవ వాదం. మానవుడు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని ,అభివృద్ధి చెందడానికి సరైన అవకాశాలను అందిస్తే, గొప్ప ఎత్తుకు చేరుకోగలడని మానవవాదం చెపుతుంది.
___pillaa kumaraswaamy,9490122229
References:
మేడూరి సత్యనారాయణ వ్యాసం
వికిపీడియ
అనురాగ్ భరద్వాజ్, న్యూస్ క్లిక్
తెలుగు సాహిత్యం లో మానవ వాదం పై గుమ్మా వీరన్న రాసిన వ్యాసం
Comments
Post a Comment