జెండర్ విప్లవ వైతాళికురాలు


జెండర్ విప్లవ వైతాళికురాలు

ప్రొఫెసర్ తాటికొండ రమేష్
వైస్- ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ
                                            (రేపు సావిత్రిబాయి ఫూలే జయంతి)

ఆంధ్రజ్యోతి

Jan 2 2022 @ 02:55AM

ప్రపంచ వ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు, పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలే అద్వితీయురాలు. కారల్ మార్క్‌్సకు జెన్నీ ఉద్యమాలలో వెన్నుదట్టి ఎంతో సహకారాన్ని అందించింది. సావిత్రి బాయి తన భర్త జ్యోతిరావు ఫూలే నిర్వహించిన సమస్త ఉద్యమాలలో ఆయనకు అండగా నిలిచింది. స్వీయ సృజనాత్మకతను, వ్యక్తిత్వాన్ని చాటి పలు విషయాలను చరిత్రకు అందించింది.

మహారాష్ట్ర సతారా జిల్లాలో నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి పూలే ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తన 9వ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. సామాజిక మార్పుకు, చైతన్యానికి, లింగ సమానత్వానికి విద్యే ఆయుధమని ఫూలే దంపతులు భావించారు. భారతదేశం వెనుకబడటానికి కారణం దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమే అనే సత్యాన్ని గుర్తించిన జ్యోతిరావు పూలే తన భార్యను విద్యావంతురాలుగా తీర్చిదిద్దారు. స్త్రీలు విద్యను అభ్యసించక పోవడం వల్లనే మూఢాచారాలతో సనాతన భావాలతో చిక్కుకుపోతున్నారు అని భావించి 1848 లో బీడేవాడలో దళిత బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బాలికలకు విద్యను అందించడం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు దారి తీసింది. ఈ దేశ తొలి మహిళా టీచర్‌గా సావిత్రిబాయి నిలిచారు. దేశ చరిత్రలోనే స్త్రీ విముక్తి ఉద్యమానికి ఓనమాలు దిద్దారు. పీష్వాల కాలంలో సనాతన బ్రాహ్మణుల ఆధిపత్యం సమాజంలో బలీయంగా ఉండేది. స్త్రీ విద్యకు అనేక అవమానాలు, ఆటంకాలు స్పృష్టిస్తున్నప్పటికి, మరోవైపు ఆమె బాలికల పాఠశాలకు వెళ్తుంటే బురదతో, మట్టితో, పేడ నీళ్లు చల్లి సనాతన పిడివాదులు అవరోధాలు కల్పించారు. ఆమె ధరించిన వస్త్రాలతో పాటు అదనంగా మరో జత పాఠశాలకు తీసుకొని వెళ్ళేది. అవసరానికి ఆ జతను ఉపయోగించుకునేది. సంప్రదాయవాదులు చేసిన ఎన్నో ఒత్తిడిలకు, అవమానాలకు గురి అయిన ఆమె ఆత్మస్థైర్యం మనోనిబ్బరం చెక్కుచెదరలేదు. సమాజం, కుటుంబం బహిష్కరణ నడుమ ఎలాంటి రాజీ లేకుండా సావిత్రిబాయి ఒక మహోన్నతమైన విద్యా ఉద్యమాన్ని సాహసోపేతంగా నడిపింది. సమాజంలో కుల వివక్ష కారణంగా మహార్లు, మాంగ్‌లు అస్పృశ్యులుగా సమాజం నుంచి నెట్టివేయబడ్డారు. వారి పిల్లలు కనీస ప్రాథమిక విద్యకు నొచుకోలేకపోయారు. ఫూలే దంపతుల సత్యశోధక ఉద్యమ ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వారికోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించింది. కానీ అవి కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైనాయి. ఈ పరిస్థితి గమనించి ఫూలే దంపతులు మహార్, మాంగ్ ఇతర నిమ్న జాతి కులాల జనాభా అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాలలో అక్కడే పాఠశాలలను నెలకొల్పాలని విక్టోరియా రాణికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే కుల వివక్ష వల్ల వారిని సాధారణ పాఠశాలలోకి అనుమతి నిరాకరించడం వల్ల ఈ ఏర్పాటు అవసరం అయింది. నాలుగు సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. ఆ తదనంతరం మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించారు. ఆ పాఠశాలల్లో 174 సంవత్సరాల క్రితమే విద్యను ప్రోత్సహించడానికి విద్యార్థులకు స్వంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. దాని కొనసాగింపుగా నేటికీ భారతదేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలో విద్యను ప్రోత్సహించడానికి నిమ్న, పేద వర్గాలకు ప్రత్యేక విద్యాలయాలను, మధ్యాహ్నభోజన పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఫూలే దంపతులు ఆ కాలంలోనే సామాజికాభివృద్ధిలో విద్య ప్రామాణికతను గుర్తించి ఉద్యమించారు. ఆయన కొనసాగించిన ఎజెండా ఇప్పటికీ అసంతృప్తిగానే మిగిలింది. సామాజికాభివృద్ధిలో విద్య ప్రాముఖ్యతను ఒక అంశంగా వివరించిన అమర్త్యసేన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 174 సంవత్సరాల క్రితమే ఫూలే దంపతులు అదే విషయాన్ని వివరించడమే కాదు, ఆచరణాత్మకంగా నిరూపించారు. వారి ఎజెండాకు కొనసాగింపుగా అంబేడ్కర్ విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు. అయినప్పటికీ వారి ఆశయాలు పూర్తి స్థాయిలో నేటికీ అమలు జరగడం లేదు. మానవాభివృద్ధి సూచీలో భారతదేశం 131వ స్థానంలో ఉండడమే ఇందుకు ఉదాహరణ.
మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించింది సావిత్రిబాయి పూలే. స్త్రీలను చైతన్య పరచడానికి ‘మహిళా సేవా మండల్’ అనే మహిళా సంఘాన్ని ఆమె స్థాపించారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలకు, మద్యపానానికి, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి, వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి ఆశ్రయం కల్పించి వారి కళ్లలో వెలుగులు చూశారు. సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం ఏర్పాటు చేసి స్త్రీలను చైతన్యపరచడమే కాక వారి హక్కులకోసం ఉద్యమ బాట చైతన్యాన్ని రగిల్చింది. శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని సావిత్రిబాయి ప్రారంభించింది. 1854లోనే ఆమె తమ కవితా సంపుటి ‘కావ్య ఫూలే’ను ప్రచురించారు. కవితా సంపుటి ‘పావన కాశీ శుభోద్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. జ్యోతి రావు ఫూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ దుఃఖం లో నుండి మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. మన దేశంలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన అది. సనాతన వాదులు, అభివృద్ది నిరోధకులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికి ఆమె వెనక్కి తగ్గలేదు. 
1897లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. ప్రాణాలను కాపాడుకోవడానికి జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులానికి చెందిన చిన్న పిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. అయితే ఆ ప్లేగు వ్యాధి ఆమెకూ సోకింది. 1897 మార్చి 10న సావిత్రిబాయి మరణించింది. 
భారతదేశ చరిత్రలో రెండు విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ఆధిపత్య కులాల స్త్రీల చరిత్ర, రెండోది అణగారిన వర్గాల, దళిత బహుజన స్త్రీల చరిత్ర. మొదటి వర్గానికి చెందిన వారి చరిత్ర ప్రధానంగా 19వ శతాబ్ది నుంచి కొంత వరకు ప్రాచుర్యంలో ఉన్నది. రెండో వర్గానికి చెందిన స్త్రీలు వివక్ష, దోపిడీకి గురికావడం, నిరక్షరాస్యులు కావడంతో చరిత్ర పుటలలో వారి త్యాగం కనుమరుగైంది. దీనికి భిన్నంగా నిస్సహాయ స్త్రీల అభ్యున్నతికి అక్షరమే ఆయుధంగా పాటుపడ్డ సావిత్రిబాయి ఫూలేను చూడవచ్చు. విద్యతోనే మత ఛాందస మూడ నమ్మకాల విముక్తి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక గుర్తింపు, స్వావలంబన ముడిపడి ఉంటుందని ఫూలే దంపతులు గుర్తించి భారత సమాజానికి కొత్త సిద్ధాంతాలు, విశ్లేషణలు చేయడమే కాకుండా ఆచరణాత్మకంగా నిలిచారు. 
ఆడపిల్లలు చదువుకోకూడదని మను ధర్మ శాస్త్రం శాసిస్తున్న కాలంలో సావిత్రిబాయి పూలే మహోన్నతమైన తిరుగుబాటు చేసింది. స్త్రీ విద్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని భారత స్త్రీ జాతి భూమ్యాకాశాలు ఉన్నంతవరకు నిరంతరం గుర్తు చేసుకుంటుంది. స్త్రీలూ మనుషులేనని వారి హక్కులే మానవ హక్కులని దేశానికి చాటిచెప్పిన ధీరవనిత. అంటరానితనాన్ని, కుల వ్యవస్థను ఆమె ఎదిరించిన తీరు భారతీయ మహిళా ఉద్యమాలకు ఆదర్శనీయం. భారతీయ స్త్రీ వాదం, దళిత స్త్రీ వాదాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించిన నాయకురాలు సావిత్రిబాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి. ఆమె 174 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఉద్యమ లక్ష్యాలు నేటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. మహిళలు, సమాజంలోని సమస్త వర్గాలు, లింగ, కుల, మత రహిత సమాజ శ్రేయస్సు, సంక్షేమం, సమానత్వం కోసం పని చేసిన వీర నారి సావిత్రి బాయి. ఆమె ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత ముఖ్యంగా నేటి యువ భారతీయుల భుజస్కంధాలపై ఉంది. 


ప్రొఫెసర్ తాటికొండ రమేష్
వైస్- ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ
                                            (రేపు సావిత్రిబాయి ఫూలే జయంతి)

స్పూర్తిప్రధాత-సావిత్రిబాయి పూలె

రోగులకు సేవలు అందించిన మహిళలు అనగానే మనకు ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్,ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు.వారి స్థాయిలో, వారికంటే ముందుగానే సావిత్రి బాయి పూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేశారు.
దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే పేరు పొందారు.

1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తన తొమ్మిదవ యేటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు పూలేతొ 1840 లో వివాహం జరిగింది. నిరక్షరాస్యులైన ఆమె, భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో, వారి వద్దనే  విద్యనభ్యసించి, విద్యా వంతురాలు అయింది. ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 జనవరి1న  భర్త జ్యోతిబాపూలే తో కలిసి అణిచివేతకు గురైన కులాల బాలికల కోసం పూణేలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది.

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఎదిరించి,విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి,గెలిచారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే.  జీవితకాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య  భావజాలం గల వారి నుండి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో చివరికి 1849లో భర్త తో కలిసి గృహ బహిష్కరణ కు గురి కావలసి వచ్చింది. స్త్రీ, పురుషులు కుల మతాలకతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి - అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మూర్తి సావిత్రి బాయి.                                        
 ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనబడే మహిళా సంఘాన్ని స్థాపించింది. లింగ వివక్ష  సమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ పని చేసేది. మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రిబాయి పూలే.

అసత్యాలతో అగ్రవర్ణాల దురహంకారపు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో, సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త జ్యోతిబాపూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించింది.బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతిసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు బలమైన ఉద్యమం నడిపారు. దాని మహిళా విభాగం సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో నడిచేది. పురోహితులు లేకుండా వివాహాలను, ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి, వారి జీవితాలకు వేలుగునిచ్చారు. ఆ విధంగా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకుని యశ్వంత్ గా పేరు పెట్టి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పెంచి, పెద్దచేశారు, డాక్టర్ గా సమాజానికి అందించారు. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక, క్షురకులను చైతన్యపరిచి, వితంతువులకు శిరోమండనం చేయబోమని వారి చేత 1860లో సమ్మె కుడా చేయించారు. 1870లో ఒకసారి 1896లో మరొకసారి దేశంలో తీవ్ర కరువు ఏర్పడినప్పుడు  ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని, వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందిచారు. మరో మిత్రురాలు ఫాతిమా బేగంతో కల్సి విద్యా విప్లవానికి నాంది పలికారు.ఆంగ్ల విద్యని నేర్చుకోవడం ద్వారా బహుజనులు తమ హక్కుల గురించి తెలుసుకోగలుగుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.                            

1890లో భర్త జ్యోతిరావ్ పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి, అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయింది.

సావిత్రీబాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప  రచయిత్రి. 1854లో “కావ్య పూలే” అనే ఒక కవితా సంపుటి రచించారు. “అభంగ్” అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే లా ఉండేది. సూటిగా, సరళంగా, ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో “ప్వాన్ కాశీ సుభోధ్ రత్నాకర్ 11”  పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసే వాళ్ళను విమర్శిస్తూ "కర్జ్" అనే వ్యాసం రాశారు. మూఢవిశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి తన కవితల్లో హేతుబద్ధత ప్రతిబింబించే విధంగా రచనలు చేశారు. క్రాంతి బాయి గా ప్రజలందరూ పిలుచుకునే  సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుంది.

1897 లో ఆమె మరణం కూడా ప్రజా సేవలోనే పొందింది. పూణే నగరంలో ఒక వీధిలో ప్లేగు వ్యాధి భయంకరంగా విలయతాండవం చేస్తున్న రోజులు. ఆమె వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న క్రమంలో పాండురంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారిన పడటం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చేవారు ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడంవల్ల తాను కూడ వ్యాధిబారిన పడింది. ఆ బాలుడు బ్రతికాడు కాని, ఆమె మరణించింది.

సావిత్రిబాయిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రంగాలలో రాణించిన మహిళలు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. వారు డాక్టర్ ఆనంది బాయి జోషి. ఈమె పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. పండిత రమాబాయి సంఘసంస్కర్తగా, మహిళల విద్య కోసం, విముక్తి కోసం మార్గదర్శకులుగా గుర్తింపు పొందింది. రమాబాయి రనాడే మహిళా హక్కుల కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. తారాబాయి షిండే సామాజిక కార్యకర్తగా, మహిళా హక్కుల కార్యకర్తగా కృషి చేశారు. 

సావిత్రిబాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయం మధ్యాహ్న భోజన పథకం, అందరికీ విద్య, పేరెంట్స్ మీటింగ్స్, సంక్షేమ హాస్టళ్లు,బోర్డింగ్ స్కూల్స్ నిర్వహణ ఇలాంటివి ఎన్నో,.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంతైనా తక్కువే.ఆమె జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది.నేటి కరోనా కాలంలో అనేక మంది బాలికలకు లేతప్రాయం లోనే వివాహాలు చేస్తున్నట్లు యునెస్కో తెలిపింది. వరకట్నం, గృహహింస, లైంగిక వేధింపులు వంటివి ఆధునిక కాలంలో కూడా మహిళలపై జరుగుతూనే ఉన్నాయి.ఆమె ఆదర్శాలను నేటి సమాజంలోని ప్రతి ఒక్కరం స్ఫూర్తిగా తీసుకొని మెరుగైన సమాజ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దాం.అదే మనం అమెకు ఇచ్చే నిజమైన కానుక.

యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం