మనువాదం అంటే ఏమిటి
*మనువాదం అంటే ఏమిటి?*
మనువాద మంటే సంకుచిత తత్వం, మనుష్యులను తన సాటి మనుషులుగా చూడక పోవడం, మానవత్వం లేక పోవడం, సమాజంలో కులం ఆధారంగా హెచ్చుతగ్గులను పాటించడం, తాను, తనకు సంబంధించిన వారే అభివృద్ధి చెందాలను కోవడం, ఇతర కులాల వారిని అణచి వేయాలని చూడడం, దోపిడీ చేయాలని కోవడం, కర్మ సిద్ధాంతం పాటిస్తూ హేతుబద్ధంగా ఆలోచించక పోవడం, స్త్రీలు - ఇతర కులాల ఎదుగుదలను సహించలేక పోవడం, హిందూ సంప్రదాయాలను పాటించడం. ఈ లక్షణాలున్న వారందరూ మనువాదులతో సమానమే
మనువాదానికి మూలం కులవాదం. అది భారతీయుల రక్తంలో జీర్ణించుకు పోయింది. మనం మనువాదులుగా జీవించినంత కాలం మనం, మన దేశం అభివృద్ధి చెందదు.
హిందూ మతానికి ఆయువు పట్టైన కుల తత్వాన్ని, ఆ మత సంప్రదాయాలను పాటించడం ద్వారా అగ్రవర్ణాల వారు ఆర్థికంగా లబ్ది పొందుతారు.
కానీ క్రింది కులాలుగా చెప్పబడుతున్న వారికి కులం ద్వారా ఎలాంటి ఉపయోగాలు లేకపోయినా కులాన్ని, హిందూ మత సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ వారు కూడా మనువాదులుగా జీవిస్తున్నారు.
హిందూ మతం లో కుల వ్యవస్థ ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. రాజకీయ అధికారం ద్వారా అమలు చేసిన అశాస్త్రీయమైన విధానాలు ఈ క్రింద కులాల వారిలో ఒక రకమైన మానసిక బానిసత్వాన్ని అలవాటు చేసింది. దాంతో మనువాద సంస్కృతిని తగ్గాక పోగా దానినింకా పాటిస్తున్నారు.
మనువాద సంస్కృతి లక్షణాలు
1)ఎవరైనా ఒక వ్యక్తిని మీరెవరని అడిగితే, తాను మనిషిని అని కాకుండా నేను ఫలానా కులం, మతం వాడిని అని చెప్పుకుంటారు.
అందుకే దీన్ని ఖండిస్తూ ఒక కవి
"కులమతాలు మల మూత్రాల్లాంటివి
ఒకటి విసర్జిస్తే దేశానికి మంచిది. రెండోది విసర్జిస్తే దేహానికి మంచిది " అనంటాడు.
2)తనకు ఎంత నష్టం జరిగినా ఇది నా కర్మ
అనుకుంటాడే గాని దానిని ఎదుర్కోడు.ఇది కర్మ సిద్ధాంతం.
3)దేవుని దర్శనానికి వెళుతూ ప్రమాద వశాత్తూ మరణించినా భూమి మీద నూకలు అంత వరకే రాసివున్నాయని మన చేతుల్లో ఏమీ లేదని తలరాత సిద్దాంతం చెపుతారు.
4)కులాంతర వివాహాలు తమ ఇళ్లల్లో అనుమతించరు. అదొక నేరంగా భావిస్తారు. పెళ్లిళ్లు తమకు సంబంధించిన ఉప కులంలోనే చేసుకుంటారు. కుల కట్టుబాట్లను అతిక్రమించరు.
5)వీలున్నచోట తన కులం వారికే సహాయం చేయ ప్రయత్నిస్తారు.కులాభిమానం అధికంగా కలిగి ఉంటారు.
6)వేరే కులం వారికి అన్యాయం జరిగినా, వారిపై దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా అయ్యో పాపం అని సానుభూతి చూపరు, సహాయం చేయరు. ఆ కులం వారు అంతే అని ఒక ముద్ర కూడా వేస్తారు.
7)ఇతర కులాల వారిని అసభ్య పదాలతో కులం పేరుతో తిడుతుంటారు.
8)కష్టపడకుండా అక్రమ సంపాదనతో ఆస్తులు కూడబెడుతుంటారు.
9)అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. ఇతరుల మాటకు విలువ ఇవ్వరు.
10)అవసరానికి మించి విలాస వంతమైన జీవితాన్ని గడపుతుంటారు.
11)తిథి, నక్షత్రాల ప్రకారం జాతకాలు ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
12)గర్బ ధారణ వేడుకలు నిర్వహిస్తుంటారు.
13)పుట్టిన బిడ్డకు నామకరణం, క్రాడిల్, నూతన వస్త్రాలంకరణ ఉత్సవాలు పూజారులతో చేయిస్తుంటారు.
14) ఉపవాసాలు, వారాలు, ఏయే రోజు ఏమి తినాలో, ఏమి తినకూడదో పిల్లలకు నేర్పిస్తుంటారు.
16)గృహ నిర్మాణాన్ని వాస్తు ప్రకారం లేకపోతే తనకు కీడు కలిగిందని భావిస్తుంటారు.
17)అనారోగ్యంలో, ఆర్ధిక ఇబ్బందుల్లో తాయిత్తులు కట్టడం, భూత వైద్యులను సంప్రదించడం చేస్తుంటారు.
18)ఉదయాన్నే సంద్యా వందనం, పూజలు చేస్తుంటారు.
19)తీర్థ యాత్రలు చేస్తూ గుళ్లు గోపురాలు దర్శించి అదే ముక్తికి మార్గమని భావిస్తుంటారు.
20)దేవునికి మొక్కుబడి తీర్చడానికి తల వెంట్రుకలు, కానుకలు, కోళ్లు, గొర్రెల ను బలిస్తుంటారు.
21)ఎంతో పౌష్టికాహార విలువలు కలిగిన పాలు, పాయసం పాముల పుట్టకు సమర్పిస్తుంటారు.
22)పౌష్టికాహారమైన నేయిని యజ్ఞం చేపిస్తూ మంటల్లోఆహుతి చేయిస్తారు.
23)మతం పేరిట, కులాల వారీగా వనభోజనాలకు వెళుతుంటారు.
24)మతం పేరుతో హోలీ ఆడతుంటారు.
25)దాన ధర్మాలు మతాలు, కులాల వారీగా చేస్తుంటారు.
26)వేరే క్రింద కులాలకు చెందిన ఉద్యోగస్తులను, అధికారులను అనేక విషయాల్లో ఇబ్బందులు పెడుతుంటారు.
27)అన్య మతంలో చేరినా తమ కుల సంకుచిత్వం వీడరు.
28) పేద వారికి ఎంత సహాయం చేసినా వారు అభివృద్ధి లోకి రారని వారంతా సోమరులని ప్రచారం చేస్తుంటారు.
29)వితంతు స్త్రీలను శుభ కార్యాలకు దూరంగా పెట్టడం, అపశకునాలు పాటించడం, ప్రయాణాలకు మంచి ముహూర్తాలు, గడియలు మూఢ నమ్మకాలు పాటిస్తుంటారు.
ఇలాంటి మనువాద పద్దతులు ఆచరించడం వల్ల మనుషులందరూ మానవ జాతికి చెందిన వారమేననే మానవత్వ స్పృహ అత్యథిక విద్యాధికులు, అధికారులు, చదువుకున్న ఉద్యోగస్తులలో కూడా లేకపోవడం తో మనువాదం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. వేల కిలోమీటర్ల దూరాన వున్న అమెరికా, ఇంగ్లాండు, కెనడా, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు కూడ మనువాదులుగా జీవించడం మానవత్వానికే సిగ్గుచేటు.
75 సంవత్సరాల మన భారత దేశం, పేద దేశంగా కీర్తించ బడటానికి కారణం మనం మానసికంగా అభివృద్ధి చెందక మనువాదంలో కూరుకు పోయి ఉండటమే.
మనువాదాన్ని విశ్వసించడం గుడ్డివాడి చేతిలో లాంతరు లాంటిది. ఈ 'గుడ్డితనం' అనేది ఒక కులానికి, వర్గానికి, వర్ణానికి, మతానికి, ప్రాంతానికీ సంబంధించింది కాదు. అదేమతమైనా అంధ విశ్వాసాల్లో కూరుకుపోయిన వాళ్ళంతా గుడ్డివాళ్ళే.
దేశాన్ని ప్రేమించే వారు, అందరం మానవులమే అని నమ్మే వారు, అందరూ అభివృద్ధి చెందాలను కునే వారు ముందుగా మనువాదానికి మూలమైన కులాన్ని నిర్మూలన చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు. పేదవారి ఎదుగుదలకు సహకరించాలి. అన్యాయాన్ని వ్యతిరేకించాలి.మానవత్వం ఉన్న మనుషులుగా జీవించాలి. తద్వార అసమానతలు లేని సమసమాజ దేశంగా భారత దేశాన్ని అభివృధ్ధి కి సహకరించాలి. రాజ్యాంగ పరంగా ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తూ కలిసి కట్టుగా కృషి చేయాలి.
Comments
Post a Comment