భగత్ సింగ్ తాత్విక దృక్పథం


అతడు దేశభక్తికి నిర్వచనం! విప్లవానికి పర్యాయ పదం!!
“అతడు దేశాన్ని ప్రేమించాడు
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రేమించాడు
విప్లవాన్ని ప్రేమించాడు
ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై
ఉరికంబాన్నే వధువుగా వరించాడు
అతడు శిలువనే పెళ్ళాడిన స్పార్టకస్”
85 సంవత్సరాల క్రితం నేడు పాకిస్తాన్ లో వున్న లాహోరులో బ్రిటీషు సామ్రాజ్యవాదులచే రాజద్రోహం నేరం 
క్రింద షహీద్ సుఖదేవ్, రాజగురులతో పాటు ఉరితీయబడిన వాడు భగత్ సింగ్. ఈనాటి మన పార్లమెంటు భవనం లోపల సమావేశం
జరుగుతుండగా (అప్పుడు దానిని సెంట్రల్ అసెంబ్లీ అనేవారు) సందర్శకుల స్థానం నుండి 8-4-1929న బాంబులు విసిరిన వారిలో
బటుకేశ్వరదత్ తో పాటు భగత్ సింగ్ కూడా వొకరు. కార్మికుల ఉద్యమ హక్కుల్ని, పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్నీ అణచివేసే చట్టాలు
చేయడాన్ని నిరసిస్తూ వారిరువురూ  ( విఠల్ భాయ్ పటేల్, పండిట్ మోతీలాల్ నెహ్రూ, కేల్కర్, జయకర్, జిన్నా
మొ||వారు) చాలామంది ప్రముఖులు చర్చిస్తున్న సందర్భంలో బాంబులు వేశారు. 

'దేశభక్తి అంటే చట్టాల మీద భక్తి   కాదు' పీడిత
వర్గాన్ని అణచివేయటాన్ని వ్యతిరేకించటమే దేశభక్తిగా భగత్ సింగ్ తన ఆచరణద్వారా ఆనాడు రుజువుపర్చాడు. అంతేకాదు బాంబులు విసిరిన
తర్వాత వారిరువురూ యిచ్చిన నినాదాలు,

 🌹సామ్రాజ్యవాదం నశించాలి!
 విప్లవం వర్థిల్లాలి!! కార్మికవర్గం వర్ధిల్లాలి!!!
 
పంచిన కరపత్రాలు కూడా దేశభక్తికి ఉండాల్సిన విస్పష్ట ప్రమాణాన్ని దేశం ముందు నిలిపాయి. 

లాహోరు పట్టణంలో పోలీసు స్టేషన్ వెలుపల సాండర్స్ అనే బ్రిటీషు పోలీసు అధికారిని 17.12.1928న కాల్చిచంపినందుకు
సుఖదేవ్, రాజ్ గురు భగత్ సింగ్ లను 23.3.1931న ఉరితీశారు. 
ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ బాంబుకేసు సందర్భంగా 23 ఏళ్ళ భగత్ సింగ్ తమకు విధించిన యావజ్జీవ కారాగారవాస శిక్షను
ప్రశ్నిస్తూ లాహోరు హైకోర్టులో అప్పీలు చేసి యిచ్చిన (13.1. 1930 నాటి) వాంగ్మూలం న్యాయశాస్త్ర కోవిదులందరూ తప్పక చదవాల్సినది. ఒక చర్య వెనుక ఉద్దేశాలను పరిగణలోనికి తీసుకొకపోతే ప్రపంచంలోని సైన్యాధికారులందరూ హంతకులే అవుతారనీ, *“ఉద్దేశాలను విస్మరిస్తే ప్రతి మత ప్రచారకుడూ అబద్ధాన్ని ప్రచారం చేసేవాడుగా కన్పిస్తాడు.* కోట్లాది అమాయకులను, అజ్ఞానులను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ప్రతివొక్క ప్రవక్త మిద నేరారోపణ చేయాల్సి వుంటుంది” అంటూ  "ఏ ప్రభుత్వమైతే మనిషికి లభించే
జీవించే హక్కును గుంజుకుంటుందో *అటువంటి ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఎంత మాత్రమూ లేదనీ.”* తామిచ్చిన “ఇంక్విలాబ్
జిందాబాద్” “సామ్రాజ్యవాదం నశించాలి” నినాదాల్ని సరిగా అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాడు.

భారత స్వాతంత్రోద్యమంలోకి వందేమాతరం నినాదం స్థానంలోకి *“ఇంక్విలాబ్ జిందాబాద్'* ను దేశవ్యాపిత ప్రాచుర్యంలోకి
తెచ్చినది భగత్ సింగ్ బృందమే. టెర్రరిజమే విప్లవపంధా అనుకునేవారికి కనువిప్పు కలిగేలా విప్లవమంటే బాంబుల, పిస్తోళ్ళ సంస్కృతి కాదనీ, *అసమానతలు నిండిన దోపిడీ వ్యవస్థను పీడితులైన కార్మిక-కర్షకుల ఉద్యమశక్తితో పరిమార్చటమనీ* స్పష్టం చేసిన వాడు భగత్ సింగ్. గదర్ వీరుల ఆచరణనుండి స్వీకరించి, హేతువాద తాత్విక
జ్ఞానం నుండి గ్రహించి, *'రాజకీయాలలోకి మతాన్ని రానివ్వకూడదు'* అని స్పష్టంగా ప్రకటించటమే కాక తాము నిర్మించిన 'నవ జవాన్ భారత్ సభ' అనే యువజన సంఘం ప్రణాళికలో *మతవాదులకు సభ్యత్వం యివ్వరాదని* (దాని రూపకర్తలు దుర్గాబాబీ భర్త భగవతీ చరణ వోహ్ర, భగత్ సింగ్ లు ) లౌకికవాదాన్ని పాటించాలని నిర్దేశించుకున్నారు. *బ్రిటీషు వలసవాదులది కేవలం రాజకీయ ఆక్రమణగా భావించి వారిని వెళ్ళగొడితే సరిపోతుందన్నట్టు తమకు ముందు విప్లవకారులు భావించేవారు* . భగత్ సింగ్ బృందం మరింత ఉన్నత చైతన్యంతో సమస్త సామాజిక రంగాలనూ తమ
దోపిడీ పీడనలతో పీల్చిపిప్పి చేసే *సామ్రాజ్యవాదాన్ని సంపూర్ణంగా ఓడించాలను కున్నారు.* భవిష్యత్తులో భారతదేశం సోషలిస్టు వ్యవస్థగా
నిర్మాణం కావాలనే లక్ష్యంతో తమ సంస్థ పేరును 1928 సెప్టెంబరులో *హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్* గా
మార్పించటంలో భగత్ సింగ్ దే కీలక పాత్ర. నేడు లౌకికవాదమూ, సోషలిజమూ అనే పదాలనే భరించలేని వర్గాలున్నాయి. 'భగత్ సింగ్
తమ్ములం' అంటూ నినదించే వారు తమ నిజాయతీని ఆచరణలో రుజువుపరుచుకోవాలంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణకూ, మతవిద్వేష రాజకీయాలకూ వ్యతిరేకంగా నిలబడాల్సివుంటుంది.

భగత్ సింగ్ రాసిన “నేనెందుకు నాస్తికుడను?” అనే పుస్తకాన్ని చాలామంది ఉటంకిస్తారు కానీ ఆయన యింకా
'మతకలహాలూ- వాటి నివారణోపాయాలూ' 'భగవంతుడు-మతము' 'మతము-మన స్వాతంత్ర్య సమరమూ' 'అసశ్యతా సమస్య' అనే
వ్యాసాలు కూడా రాశాడు. “మన పూర్వులయిన ఆర్యులు అస్ప్రుశ్యుల యెడల చాలా అన్యాయంగా ప్రవర్తించారు. నీచులని
చీదరించుకున్నారు. నికృష్టమైన పనులకు వారిని బలవంతంగా వినియోగించారు. ఇలా చేయటంతో పాటుగా కొంపదీసి వీళ్ళు
తమ మీద తిరుగుబాటు చేయరుగదా! అనే ఆలోచన రాగానే ఆర్యులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. *దళితుల్ని తీవ్రమైన అణచివేతకి గురిచేసిన ఆర్యులు చాలా అన్యాయం చేశారు*. ఈనాడు వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే తరుణం ఆసన్నమయింది.” అన్న భగత్ సింగ్ దేవుడ్నీ, మతాన్నీ రాజ్యం సాయంతో సంపన్నులు తమ దోపిడీ సాధనంగా మార్చుకున్నారు అంటాడు.

1928లోనే దళితులకు భగత్ సింగే యిచ్చిన పిలుపు చారిత్రాత్మకమైనది.
*"సంఘటితపడి మీ కాళ్ళమీద నిలబడి మొత్తం*
*సమాజాన్నే సవాలు చెయ్యండి. మీరొకరి పావుగా మారకండి.* *బ్యూరోక్రాట్ల మోసంలో పడకండి, మీ బానిసత్వానికీ పేదరికానికి*
*మూలకారణం యీ పెట్టుబడిదారీ బ్యూరోక్రసీయే*. *అందువల్ల వాళ్ళతో ఎన్నడూ మీరు చేతులు కలపకండి*. *అసలైన శ్రామికులు మీరే. మీరే సంఘటితం కండి. సంఘటితపడితే మీకు*
 *పోయేదేంలేదు. బానిస సంకెళ్ళు తెగిపోవటం తప్ప. లేవండి! నేటి వ్యవస్థ మీద* *తిరగబడండి. అతి నెమ్మదిగా జరిగే సంస్కరణల వల్ల ఏమి ప్రయోజనం లేదు. సాంఘికోద్యమాన్ని లేవదీసి విప్లవం తీసుకురండి. రాజకీయ ఆర్ధిక విప్లవాల కోసం సమాయత్తం కండి. మీరే దేశానికి పట్టుగొమ్మలు. నిజమైన శక్తి మీరే. నిదురిస్తున్న సింహాల్లారా! లేవండి!! తిరుగుబాటు చేయండి!!!.”*

భగత్ సింగ్ చెప్పిన ఆర్య సంస్కృతి అంటే నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు మూలమైన ఫ్యూడల్ సంస్కృతే. బ్రాహ్మణీయ భావజాలపు ఈ ఆధిపత్య సంస్కృతే నేటికీ మనకు గ్రామాల నుండి విశ్వవిద్యాలయాల దాకా సరికొత్త రూపాలలో కొనసాగుతోంది. భగత్ సింగ్
భయపడ్డట్టే భారత స్వాతంత్ర్య పోరాటం సామ్రాజ్యవాదులతో రాజీతో ముగిసింది. అది నేటికి ప్రపంచబ్యాంకు షరతుల ద్వారా
దొడ్డిదారిన ప్రవేశించి అసమానతలనూ అమానవీయతనూ పెంచి పోషిస్తోంది. గడిచిన 68 ఏళ్ళుగా *ప్రశాంత విప్లవం ద్వారా సమాజాన్ని మార్చేస్తామని* *వాగ్దానం చేసిన పాలకులు జెండాలనైతే* *మార్చుకుంటున్నారు కానీ వ్యవస్థను రోజు రోజుకీ సంక్షోభంలోకి నెడుతున్నారు.*

భగత్ సింగ్ అంచనా ప్రకారం గాంధీకి సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకత కంటే విప్లవం పట్ల భయమే ఎక్కువ. హేతువాదీ,
నాస్తికుడూ అయిన భగత్ సింగ్ లాగా మతవాదానికి గాంధీ వ్యతిరేకి కాడు. అలాంటి *గాంధీనే సహించలేక హత్య గావించిన వారి*
*వారసులు నేడు అధికారంలో వున్నారు. వీరు భగత్ సింగ్ బోధనలను తప్పకుండా దేశద్రోహం కింద జమకడతారు.* పీడితులను
తిరుగుబాటు చేయమని ప్రేరేపించటమూ, విప్లవాన్ని నడపమని బోధించటమూ నేటి పాలక సంస్కృతి లెక్కన జాతి విద్రోహకరమే అవుతుంది. భగత్ సింగే బతికొస్తే వీరు మరొకసారి ఉరికంబమెక్కిస్తారు.

నిజానికి *భగత్ సింగ్ బోధనల సారాంశం ఎన్నడూ లేనంతగా దేశానికి నేడుంది.* 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటే ఏమిటని
కోర్టువారి ప్రశ్నకూ, కలకత్తా నుండి వెలువడే 'మోడరన్ రివ్యూ' పత్రికకూ భగత్ సింగ్ యిచ్చిన జవాబులు ఆయన భావాల స్పష్టతకూ,
పరిణతికి నిదర్శనం. ఆయన చిట్టచివరగా దేశ యువతకి యిచ్చిన పిలుపు (వీలునామాగా ప్రసిద్ధి) పూర్తి పాఠం యొక్క సారాన్ని నేటి యువతరం అర్ధం చేసుకొని, అన్వయించు కోవాలి. భగత్ సింగ్ రచనల్లోని 'మతమూ-మన స్వాతంత్ర్య సమరం' లోని చివరి వాక్యాలతో
దీన్ని ముగిద్దాం.
 “ *స్పృశ్యత, అస్పృశ్యత అనే పదాలని కూకటివేళ్ళతో పెకలించి వేయాలి. మనం మన సంకుచిత దృష్టిని విడనాడనంత కాలం* *మనలో వాస్తవిక ఐక్యత ఏర్పడదు. మన స్వాతంత్ర్యానికి అర్థం తెల్లవారి చేతుల్లోంచి విముక్తి పొందట మొక్కటే కాదు.* *సంపూర్ణ స్వాతంత్ర్యం, ప్రజలు పరస్పరం కలసిమెలసి వుండటంతో పాటు మానసిక బానిసత్వం నుంచి కూడా విముక్తి పొందాలి”*

     


ఆధునిక, సమైక్య భారతదేశాన్ని నిర్మించుకునే కృషికి బీజం వేసినవాడు భగత్‌సింగ్‌. భారత జాతీయోద్యమంలో ఒక పెద్ద మథనం జరుగుతున్న కాలమది. 1920-21లో సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్న కాలంలోనే 'చౌరీ చౌరా' ఘటన జరిగింది. ఈ ఘటనతో గాంధీజీ, భావి పాలక వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడి అప్రమత్తం అయ్యారు. 

దేశ ప్రజలలో లేస్తున్న విప్లవ వెల్లువను అదుపు చేయకపోతే తమకు భవిష్యత్తులో ప్రమాదం తప్పదని భావించారు. ఆ విప్లవ జ్వాల చెలరేగితే దేశాన్ని బ్రిటిష్‌ వలస పాలనా బంధాల నుండి విముక్తి చేయడంతోబాటు స్వదేశీ దోపిడీ వర్గాలను కూడా విడిచి పెట్టదని గ్రహించారు. అందుకే గాంధీజీ తాను 'హిమాలయ పర్వతమంత తప్పు' చేశానని ప్రకటించి సహాయ నిరాకరణోద్యమాన్ని విరమించారు.

ఈవిధంగా ఉద్యమాన్ని ఉపసంహరించడంపై ఆనాటి విప్లవకారులే కాక పలువురు కాంగ్రెస్‌ నేతలు సైతం గాంధీజీని ప్రశ్నించారు. అప్పటికి జైలు నిర్బంధంలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ లేఖ రాస్తూ ఆ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన, విస్తృతమైన స్పందన వచ్చిందని... దానిని ఉపసంహరించడంతో తానెంతో నిరాశ చెందానని అన్నారు.

దీని పర్యవసానంగా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన యువత, బ్రిటిష్‌ వారిపై పోరాటాన్ని ముందుకు కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకనారంభించారు. ఈ నేపథ్యంలో భగత్‌సింగ్‌, అతని సహచరులు ముందుకు వచ్చి ఒక స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. స్వాతంత్య్రానంతరం కాలంలో సైతం దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

తన సహచరులతో పాటు భగత్‌సింగ్‌ను ఉరితీసే నాటికి అతనికి 24 ఏళ్లు కూడా నిండలేదు. అంత స్వల్ప జీవిత కాలంలో సైతం అతను చేపట్టిన కార్యక్రమాలు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు చాలా గొప్పవి. లాఠీచార్జితో లాలా లజపతిరారు ప్రాణాలను బలి తీసుకున్న శాండర్స్‌ను కాల్చి చంపడం, ఢిల్లీ పార్లమెంటులో బాంబులు వేయడం వంటి చర్యల వెనుక అతని ఆలోచనల్లో వ్యక్తమైన స్పష్టత, ఉద్యమం ఏవిధంగా ముందుకు సాగాలన్న దానిపై అతని ఆలోచనలు చాలా స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంత భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. భారతీయుల విముక్తి విప్లవం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్న లక్ష్యం మనకి కనపడుతుంది.

భావాల మధ్య సంఘర్షణ
--------------------------------- 
ఆ కాలంలో స్వతంత్ర భారతం ఏవిధంగా ఉండాలన్న అంశంపై విభిన్న భావాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. కాంగ్రెస్‌ నేతృత్వం లోని ప్రధాన స్రవంతి భారతదేశం ఒక లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ఉండాలన్న వాదనను ముందుకు తెచ్చింది. ఈ భావనను అంగీకరిస్తూనే, ఒక లౌకిక ప్రజాస్వామిక దేశంగా మన మనుగడ కొనసాగాలంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం వస్తే చాలదని, ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలని, ప్రతి భారతీయుడూ దోపిడీ నుండి విముక్తి పొందాలంటే సోషలిజం సాధించాలని కమ్యూనిస్టులు వాదిస్తూ వచ్చారు.

ఈ రెండు వాదనలకూ పూర్తి భిన్నంగా మూడో వాదన ముందుకు వచ్చింది. స్వతంత్ర భారతదేశపు స్వభావాన్ని ప్రజల మత విశ్వాసం నిర్ణయిస్తుందన్నదే ఆ వాదన. ఈ వాదన నుంచే 'హిందూ రాష్ట్ర' అన్న నినాదం, 'ఇస్లామిక్‌ రాజ్యం' అన్న నినాదం రెండూ కవలల్లా పుట్టుకొచ్చాయి. మొదటి దానిని ఆరెస్సెస్‌ ముందుకు తెస్తే, రెండో దానిని ముస్లింలీగ్‌ ముందుకు తెచ్చింది. ద్విజాతి సిద్ధాంతాన్ని వి.డి సావర్కర్‌ ప్రతిపాదిస్తే దానికి మహమ్మద్‌ ఆలీ జిన్నా కూడా వంత పాడాడు.

అనంతర పరిణామాలు దురదృష్టవశాత్తూ దేశ విభజనకు, పాకిస్తాన్‌ ఒక ఇస్లామిక్‌ దేశంగా ఆవిర్భవించడానికి దారి తీశాయి. తక్కిన దేశం యావత్తూ లౌకిక, ప్రజాస్వామిక భారత రిపబ్లిక్‌గా కొనసాగడానికే నిశ్చయించుకుంది. 'హిందూరాష్ట్ర' భావనను దేశం తిరస్కరించినందు వల్లనే రెచ్చిపోయిన మతోన్మాదులు తెగబడి గాంధీజీ హత్యకు పూనుకున్నారు. 

అప్పటి నుంచీ ఆరెస్సెస్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వుంది. ఈ లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను, దానికి ప్రాతిపదికగా రూపొందిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 'హిందూ రాష్ట్ర' స్థాపన చేయడమే లక్ష్యంగా ఆరెస్సెస్‌ పని చేస్తోంది.

ఈ రోజు మనం దాని పర్యవసానాలనే ఎదొర్కొని పోరాడుతున్నాం. సోషలిజం వైపు అడుగులు వేయకపోతే, ప్రజలు ఆర్థిక స్వాతంత్య్రం పొందలేకపోతే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మనుగడ కొనసాగించడం సాధ్యం కాదన్న కమ్యూనిస్టుల దూరదృష్టి ఎంత వాస్తవమైనదో స్వాతంత్య్రానంతర పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భగత్‌సింగ్‌ ఆనాడు చెప్పినదీ ఇదే. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే ఆయన పాటుపడ్డాడు.

బలమైన ప్రభావం
----------------------- 
భగత్‌సింగ్‌ ఆలోచన లోని స్పష్టత మన ప్రస్తుత ఉద్యమాలను సైతం ప్రభావితం చేస్తోంది. 'నౌ జవాన్‌ భారత్‌' సభ కోసం భగత్‌సింగ్‌ రూపొందించిన నిబంధనలలో ఒకటి : 'మతతత్వ సంస్థలతో గాని, మతతత్వ భావజాలాన్ని ప్రచారం చేసే రాజకీయ పార్టీలతో గాని ఎట్టి సంబంధమూ ఉండకూడదు'. ఇంకొకటి : 'మతం అనేది ఆయా వ్యక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశంగాను, వివిధ మత విశ్వాసాల పట్ల సహనం కలిగి వుండే విధంగాను మన అవగాహన ఉండాలి'.

'హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ ఆర్మీ' పేరును 'హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ'గా మార్చిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలను, సంబంధిత క్రతువులను నిషేధించాలని భగత్‌సింగ్‌ ప్రతిపాదించాడు. జన్మత సిక్కు మతానికి చెందిన భగత్‌సింగ్‌ ఈ ప్రకటన తర్వాత ఆ సిక్కు వేషధారణను విసర్జించాడు. హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ ప్రణాళికలో 'ఈ దేశ యువత మతపరమైన, మూఢ నమ్మకాలు నిర్మించిన మానసిక శృంఖలాలను తెంచుకుని విప్లవాన్ని ఆహ్వానించాలని ఆరాట పడుతున్నది' అని పేర్కొన్నారు.

విదేశీ, స్వదేశీ దోపిడీదారుల మధ్య ఉన్న లింకును భగత్‌సింగ్‌, అతని సహచరులు స్పష్టంగా చూడగలిగారు. అందుకే స్వాతంత్య్రాన్ని, దోపిడీని అంతం చేయాలనే లక్ష్యంతో ముడిపెట్టారు. 'ఈ దేశ రైతాంగం విదేశీ దోపిడీ భారం నుండే గాక స్వదేశీ భూస్వాముల, పెట్టుబడిదారుల నుండి కూడా తమను తాము విముక్తి చేసుకోవాల్సి వుంది.' అని జైలు నుంచి పంపిన ఒక సందేశంలో భగత్‌సింగ్‌ పేర్కొన్నారు.

ఢిల్లీ బాంబు కేసు
---------------------- 
ఢిల్లీ బాంబు కేసు విచారణ కొనసాగినంత కాలమూ భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌దత్‌ ఇద్దరూ కోర్టులోకి అడుగు పెట్టేటప్పుడు, తిరిగి వెళ్లి పోయేటప్పుడు 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని ప్రతిసారీ నినదించేవారు. ఆ నినాదానికి అర్థం ఏమిటని జడ్జి వారిని అడిగితే వారిద్దరూ అందుకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం లోని చివరి రెండు పేరాల్లో (7,8 నంబర్ల పేరాలను దిగువన ఇస్తున్నాం) స్వతంత్రం కోసం జరిగే పోరాటం సోషలిజం కోసం జరిగే పోరాటంతో ఏవిధంగా పెనవేసుకుపోయి వున్నదీ వాళ్లు గుద్దినట్టు చెప్పారు ( ఈ సమాధానాన్ని రికార్డుల నుండి తొలగించాలని 1929 జూన్‌ 9న న్యాయమూర్తి ఆదేశించాడు. అయితే భగత్‌సింగ్‌ అమరుడై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1981లో ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో రికార్డుల నుండి ఈ సమాధానాన్ని తిరిగి వెలికితీసి ప్రచురించారు ).

 7)   భగత్‌ సింగ్‌ అనే నన్ను దిగువ కోర్టు వారు 'విప్లవం' అంటే ఏమిటని ప్రశ్నించారు. విప్లవం అంటే తప్పనిసరిగా రక్తాన్ని పారించే ఘర్షణే అయి వుండాలని గాని, అదొక వ్యక్తిగత ప్రతీకార చర్య అని నేను భావించడం లేదు. అన్యాయం మీద రూపొందిన ప్రస్తుత వ్యవస్థను మొత్తంగా మార్చడాన్నే విప్లవం అని మేమంటున్నాం. 

ఈ సమాజానికి అత్యంత అవసరమైన శ్రమజీవులు, సంపద సృష్టికర్తలు దోపిడీ వర్గాల చేత కొల్లగొట్టబడుతున్నారు. వారి శ్రమ ఫలితం వారికి దక్కడం లేదు. వారికి ప్రాథమిక హక్కులూ లేవు. మనందరికీ ఆహారాన్ని పండించే రైతు కుటుంబానికి తిండి లేదు. ప్రపంచ మార్కెట్‌ అంతటికీ బట్టలు నేసి పంపుతున్న నేతగాడి కుటుంబ సభ్యులు ఒళ్లు కప్పుకోడానికి గుడ్డ లేదు. పెద్దపెద్ద భవంతులను నిర్మిస్తున్న మేస్త్రీలు, కార్పెంటర్లు, కమ్మర్లు మురికి వాడల్లోనే మగ్గిపోతున్నారు. 

ఇంకోపక్క సమాజం మీద పడి బతికే పరాన్న భుక్కుల్లాంటి పెట్టుబడిదారీ దోపిడీదారులు లక్షల కొద్దీ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఈ దుర్భరమైన అసమానతలు, బలవంతంగా రుద్దబడిన వివక్షత ఒక అల్లకల్లోల పరిస్థితికి దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎంతోకాలం కొనసాగలేదు. బద్దలవనున్న అగ్నిపర్వతంపై కూర్చుని మన సమాజం ప్రస్తుతం సంబరాలు చేసుకుంటోంది. ఇదేమీ తెలియని చిన్నపిల్లలు మాత్రం ప్రమాదకరమైన కొండచరియ అంచున ఉన్నారు. సకాలంలో రక్షించకపోతే ఈ వ్యవస్థ యావత్తూ కుప్పకూలిపోయి నాగరికత ధ్వంసం అవుతుంది. 

ఒక సమూలమైన మార్పు ద్వారానే ఈ వినాశనం నుంచి కాపాడగలం. ఈ సంగతి బోధపడిన ప్రతి ఒక్కరూ సమాజాన్ని సోషలిస్టు ప్రాతిపదికన పునర్నిర్మించడానికి పూనుకోవాలి. మనిషిని మనిషి, దేశాన్ని ఇంకో దేశం దోచే విధానం అంతం కానిదే, సామ్రాజ్యవాదం పేర చలాయిస్తున్న పెత్తనాన్ని అంతం చేయనిదే మానవజాతి అనుభవిస్తున్న బాధలు, దోపిడీ నివారింపబడవు.

దీనిని అంతం చేయకుండా యుద్ధాలు వద్దని, శాంతి కావాలని చెప్పే కబుర్లు ఒట్టి నయవంచనే. సోషలిజం అంటే సమాజంలో ఒక సమ వ్యవస్థను నెలకొల్పడం, అందులో ఎటువంటి సంక్షోభమూ తలెత్తదు. శ్రమ జీవులకే సర్వాధికారాలూ ఉంటాయి. యావత్‌ ప్రపంచమూ ఒక సమాఖ్యగా ఏర్పడి పెట్టుబడిదారీ దోపిడీ నుండి, సామ్రాజ్యవాదులు రుద్దే యుద్ధాల వినాశనాల నుండి మానవ జాతిని పరిరక్షిస్తుంది.

( 8 ) ఇదే మా ఆదర్శం. దీని ప్రేరణతోనే మేం స్పష్టంగా అందరికీ వినిపించేలా ఒక హెచ్చరిక చేశాం. దీనిని గనుక పట్టించుకోక పోతే, ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ తలెత్తుతున్న సహజసిద్ధమైన శక్తులను ఆటంకపరచాలని చూస్తే ఒక తీవ్ర పోరాటం తప్పదు. అన్ని అడ్డంకులనూ అధిగమించి శ్రామిక వర్గ నియంతృత్వం ద్వారా విప్లవం మహదాశయాన్ని మేం నెరవేర్చి తీరుతాం.

విప్లవం మానవజాతి విడదీయలేని హక్కు. స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ పుట్టుకతోటే సంక్రమించే హక్కు. శ్రామికుడే సమాజాన్ని నడిపే శక్తి. ప్రజల చేతుల్లో అధికారం శ్రామికుల అంతిమ గమ్యం.

మమ్మల్ని ఎటువంటి బాధలకు గురిచేసినా సరే మేం పై ఆదర్శాల కోసం, ఈ ఆశయ సాధన కోసం ఆ బాధలను స్వాగతిస్తాం. విప్లవం అనే ఈ వేదికకు మా యవ్వనాన్ని హారతిగా అర్పిస్తున్నాం. ఇంత గొప్ప లక్ష్యం కోసం ఎంతటి త్యాగమైనా సరే చిన్నదే అవుతుంది. మేం సంతృప్తిగా ఉన్నాం. విప్లవం వెల్లువెత్తడం కోసం ఎదురు చూస్తుంటాం. విప్లవం వర్థిల్లాలి'.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో...
------------------------------------------- 
ప్రస్తుతం ఒకవైపు సిఎఎ/ఎన్‌పిఎ/ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా మరింత లోతుగా, విస్తృతంగా ప్రతిఘటన పెరుగుతూంటే, ఇంకోవైపు మోడీ ప్రభుత్వం అధిక శాతం ప్రజల కష్టాలను ఇబ్బడి ముబ్బడి చేసే విధంగా, దోపిడీని తీవ్రం చేసే విధానాలను అమలు చేస్తోంది. ఆర్థికమాంద్యం కమ్ముకొస్తుంటే ఇంకోపక్క జాతి సంపదను, ఆస్తులను, ప్రభుత్వ రంగాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టే పనిలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు మునిగితేల్తున్నాయి.

దీనికితోడు కార్మిక సంస్కరణ పేరుతో శ్రామిక ప్రజల హక్కులపై దాడి జరుగుతోంది. ప్రజాతంత్ర హక్కులను, పౌర హక్కులను కాలరాస్తున్నారు. ఏ రూపంలో నిరసన తెల్పినా దానిని దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. హేతుబద్ధత, విచక్షణ లేకుండా పోతోంది. ప్రస్తుత దాడులకు వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలను బలోపేతం చేయడానికి ప్రజా హక్కులను పరిరక్షించుకోవడం అవసరం. ఈ హక్కులను గ్యారంటీ చేసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అవసరం. 

ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను, లౌకిక ప్రజాతంత్ర పునాదులను పరిరక్షించుకునే పోరాటాలను మిళితం చేయాలి. ఈ పోరాటాలు ప్రజల రాజకీయ స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించే దిశగా కూడా సాగాలి. అందుకోసం ప్రజల సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలి.

89 సంవత్సరాల క్రితం భగత్‌సింగ్‌ కావించిన బలిదానం నేటికీ మనకు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలిచి మన పోరాటాలను మరింత బలంగా ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడుతుంది.

 మన దేశాన్ని, రాజ్యాంగాన్ని మతోన్మాద శక్తుల దాడుల నుండి పరిరక్షించుకుని సమైక్య ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా కదలాలని భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా ప్రతిన పూనుదాం. ఈ దిశగా మనం సాగిస్తున్న పోరాటాలను, కృషిని ముమ్మరం చేద్దాం.

- సీతారాం ఏచూరి


Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం