దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన

దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన 

         దీనదయాళ్ ఉపాధ్యాయ  సెప్టెంబర్ 25, 1916 రాజస్థాన్‌లోని ధంకియాలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తమ్మున్ని కోల్పోయారు.అతను పిలానీలోని GD బిర్లా కళాశాలలో , కాన్పూర్ విశ్వవిద్యాలయంలోని సనాతన్ ధర్మ కళాశాలలో చదివాడు.   సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైనా ఉద్యోగం లో చేరకుండా ప్రజాసేవకే అంకితమయ్యాడు ఉపాధ్యాయ. 
         1937లో 26 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) లో చేరి జీవితకాల ప్రచారక్‌గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు.  స్వయంసేవక్ సంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆర్ఎస్ఎస్ కొలనులో పుట్టినదే జన సంఘ్.  అదిప్పుడు   భారతీయ జనతా పార్టీ గా మారింది. జనసంఘ్ ప్రారంభం నుండి 1967 వరకు దాని ప్రధాన కార్యదర్శి పనిచేశాడు. భారతీయ జనసంఘ్‌లో 51 ఏళ్ల వయసులో అధ్యక్షుడైనాడు.
         ఆర్ ఎస్ ఎస్ రాజకీయ అంగమే  జనసంఘ్. ఆర్.ఎస్.ఎస్. తన హిందూత్వ సిద్దాంతాన్ని అమలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ కావాలని నిర్ణయించి, దాని కోసం జనసంఘ్ ను ఏర్పాటు చేసింది. 1950లో, అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించి  తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేసి  అంకితభావంతో కూడిన యువకులను ఏర్పాటు చేయడంలో డా.ముఖర్జీ, దీనా సహాయాన్ని కోరారు. దీనదయాళ్  సెప్టెంబరు 21, 1951న UP లో రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి భారతీయ జనసంఘ్ అనే కొత్త పార్టీ రాష్ట్ర విభాగాన్ని స్థాపించారు.   డాక్టర్ ముఖర్జీ అక్టోబరు 21, 1951న జరిగిన ఆ పార్టీ మొదటి అఖిల భారత సమావేశానికి అధ్యక్షత వహించారు.
         అధ్యక్షుడైన కొన్నాళ్లకే దయాళ్ ఫిబ్రవరి 11, 1968 న ఇప్పటికీ అంతుచిక్కని విషాదకర పరిస్తితిలో  మరణించాడు.మొఘల్ సరైయోన్‌లోని రైల్వే ట్రాక్‌లో మరణించి ఉన్నాడు.  
         ఆర్ఎస్ఎస్‌లో  పని చేస్తున్నప్పుడు, స్వదేశ్‌తో పాటు వారపత్రిక పాంచజన్యను కూడా ప్రారంభించాడు.  భారతీయ అర్థనీతి_ వికాస్ కి దిశ , రాష్ట్ర జీవన్ కీ సమస్యయేన్, ది గ్రేట్ డివాల్యుయేషన్, పొలిటికల్ డైరీ ,సమగ్ర మానవతావాదం(ఇంటెగ్రల్ హ్యూమనిజం),ది టూ ప్లాన్స్, అఖండ భారత్ ఔర్ ముస్లిం సమస్య, హిందూ సంస్కృతి కి విసెక్తా,  సామ్రాట్ చంద్రగుప్తా మొదలైన గ్రంథాలు రాశాడు.
              ఇతను గోల్వాల్కర్ కు శిష్యుడు. ఉపాధ్యాయ “ గురూజీ" (గోల్వాల్కర్) ఆలోచనలతో పూర్తిగా ఏకీభవించారని  అనేక మంది RSS సిద్ధాంతకర్తల అధికారిక జీవిత చరిత్రల రచయిత CP భిషికర్ రాశారు .  ఉపాధ్యాయ  సాపేక్ష మితవాదం,  గోల్వాల్కర్ దార్శనికతను కొద్ది మార్పులతో రాజకీయ రంగంలోకి ముందుకు తీసుకెళ్లగల వ్యక్తిగా చేసింది.
        అరవిందు ఘోష్ లాగానే  దీనదయాళ్ కూడా సమగ్ర మానవతావాదాన్ని ప్రతిపాదించాడు. కానీ అరవిందుడు ప్రతిపాదించిన దానికి దీన్ దయాల్ ప్రతిపాదించిన దానికి చాలా తేడా ఉంది.
దీన దయాళ్   తన తాత్వికతను సావార్కర్ హిందూత్వ సిద్దాంత పరిధిలోనే తన చింతనను ఇమిడ్చినాడు. వాస్తవానికి ఈ వాదం ఉపన్యాస రూపాల్లో సాగింది. దీన్ని భారతీయ జనసంఘ్  అంటే నేటి భారతీయ జనతా పార్టీ  తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రమని చెపుతోంది.  అందువల్లనే దీనదయాళ్ ను గాంధీకి పోటి గా నిలిపి ప్రచారం చేయాలని ప్రయత్నిస్తోంది.
               అరవిందుడు కమ్యూనిజం ని వ్యతిరేకించలేదు మొదట్లో .   కానీ దీనదయాళ్ మాత్రం లౌకికవాదం,  ప్రజాస్వామ్యం, కమ్యూనిజం,  మొదలైనవన్నీ  పాశ్చాత్యమని చెపుతూ  వాటిని వ్యతిరేకించాడు. ప్రజాస్వామ్యం పెట్టుబడీదారులకు అనుకూలంగా ఉందని, మనదేశానికి అనువైన దేశీయ ప్రజాస్వామ్యం రావాలని కోరుకున్నాడు. ప్రజాస్వామ్యం లో  మత విశ్వాసాలను  విశ్వాసాల దృక్కోణంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని  ఆయన కోరుకున్నాడు.దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని పరిమితంగా సమర్థించారు. కానీ పెట్టుబడిదారీ వ్యక్తివాదం, మార్క్సిస్ట్‌ సోషలిజం రెండింటినీ వ్యతిరేకించారు. వ్యవసాయ ఉత్పాదక, చేతివృత్తులకు సంబంధించిన పనుల్లో పవిత్రత, మాలిన్యం లాంటి అశాస్త్రీయ అంశాలను పక్కన పెట్టి  శ్రమను గౌరవించించింది మార్క్సిజం.   శ్రామిక  దోపిడీని రద్దు చేయాలని కోరుతుంది మార్క్సిజం.
 శ్రామికులు ఉత్పత్తిచేసే సరుకులు, వస్తువుల విషయంలో  ఎలాంటి భేదభావాన్ని ప్రకటించలేదు కమ్యూనిజం. కానీ  పవిత్రత, అపవిత్రత, వర్ణ వ్యవస్థ, కుల,లింగ అసమానత్వం,  అస్పృశ్యతను ప్రతిపాదించే బ్రాహ్మణవాద విలువల చుట్టూ ఏర్పడిన ఆరెస్సెస్‌ అదే భారతీయం అనే  పరంపరతో కొనసాగుతోంది. వీటిని ఏమాత్రం ఖండించలేదు ఉపాధ్యాయ.

         ఉపాధ్యాయ ప్రకారం మానవ సమాజం, ధర్మం (నైతిక విధులు),అర్థం(సంపద), కామం (కోరిక), మోక్షం (పూర్తి విముక్తి ) అనే నాలుగు  అంగాలు కలిగి ఉంటుంది.వీటి కనుగుణంగా శరీరం, మనస్సు , బుద్ధి , ఆత్మ అనే నాలుగు క్రమానుగతంగా వ్యవస్థీకృత లక్షణాలు ఉంటాయి.  ధర్మం 'ప్రాథమికం'.  మోక్షం మానవ సమాజానికి, ఆత్మ లకు 'అంతిమ' లక్ష్యం. పెట్టుబడిదారీ విధానం లో, సోషలిస్టు విధానం లో శరీరం, మనస్సు యొక్క అవసరాలను తీర్చేపనిమీద మాత్రమే  ఉంటాయి. అందువల్ల   భౌతిక సుఖాలకు సంబంధించిన కోరిక , సంపద లపై అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటిని తిరస్కరించాలన్నాడు. దీన దయాళ్ మార్గం గాంధేయ మార్గానికి దగ్గరగా ఉంటుంది.
         అస్పృశ్యత మినహా హిందూ వర్ణ ధర్మాన్ని బలపర్చిన మహాత్మాగాంధీ సర్వోదయ, గ్రామ్‌ స్వరాజ్‌లను మిళితం చేయడానికి దీన్‌దయాళ్‌ ప్రయత్నించారు.  వీరిద్దరూ హిందూ మతంలోని  వర్ణ ఆధారిత ధర్మమున్న సమాజానికి అనుకూలం. ఆధునిక సమాజంలోని వ్యక్తివాదాన్ని తిరస్కరించారు.
          రాజకీయాల్లో మతపరమైన, నైతిక విలువల పెంపుదల కోరుకున్నారు. సాంస్కృతికంగా హిందూమత విలువలను రక్షించే ఆధునికీకరణ విధానం కోరుకున్నారు. ఇద్దరూ సోషలిజం , పెట్టుబడిదారీ విధానంలోని భౌతిక  సుఖాలను తిరస్కరించారు. తేడా అంతా లౌకికవాదం లోనే ఉంది .గాంధీ ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటే, ఈశ్వర్ వేరు అల్లా వేరు అని దీన దయాళ్ వాదన.
          భారతదేశ సాంస్కృతిక నేపథ్యంలో   దేశీయ, పాశ్చాత్య ఆలోచనల మధ్య సమతుల్యతను సాధించాలన్నాడు దీనదయాళ్. నెహ్రూవియన్ సోషలిజం,  పారిశ్రామికీకరణ ద్వారా భౌతిక సంపదను పెంచిందే గానీ,అది సామాజిక అసమానతలను  ఆర్థిక వృద్ధిలో ప్రాంతీయ అసమానతలను సృష్టించడమే కాకుండా, దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో  విఫలమైందన్నాడు. గాంధేయం వంటి సమగ్ర మానవతావాదం హద్దుల్లేని వినియోగవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయ సంస్కృతి ఒకరి కోరికలపై నియంత్రణలు విధించడాన్ని నొక్కి చెబుతుంది , అంతే గాక భౌతిక సంపద కోసం వెంపర్లాడటం  కంటే ఆధ్యాత్మికత సంతృప్తినిస్తుందన్నాడు. 
    ఇలాంటి ఆలోచనలున్న  ఉపాధ్యాయ మన దేశానికి అనువైన ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడం  అత్యంత ముఖ్యమైనదని  భావించారు. అందరికీ ఓటు రాజకీయ ప్రజాస్వామ్యానికి గీటురాయి అయితే, ప్రతి  ఒక్కరికీ పని కల్పించడం ఆర్థిక ప్రజాస్వామ్యానికి కొలమానమన్నాడు. భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధి ని వ్యతిరేకించాడు. ఇది దాదాపు గాంధేయానికి అత్యంత దగ్గరగా ఉంటుంది.అందువల్లనే 1970ల ప్రారంభంలో JP నారాయణ్ నాయకత్వంలో సాగిన  గాంధేయ సర్వోదయ ఉద్యమంతో హిందూ జాతీయవాద ఉద్యమం పొత్తు పెట్టుకోవడం సాధ్యమైంది . ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి ఆనాటి జనసంఘ్ కు తోడ్పడింది.

          ముస్లింలను  ముద్దుచేయెద్దు, వాళ్లను దూరం పెట్టొద్దు.ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడకుండా వారిని  శుద్ధి  చేయాలని  కోరారు.ముస్లింల విషయం లో మాత్రం గాంధీ తో విభేదించారు దీనదయాళ్. శుద్ధి' అనే భావన హిందూ మతం యొక్క కుల వ్యవస్థతో స్పష్టంగా ముడిపడి ఉంది.   హిందూ పునరుజ్జీవన రూపకర్త,  ఆర్య సమాజాన్ని స్థాపకుడైన
స్వామి దయానంద్, ఇతర మతంలోకి మారిన వారిని తిరిగి హిందూ మతం లోకి తీసుకురావడానికి  శుద్ధి ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిం లు, క్రైస్తవులు  తిరిగి హిందూ మతంలోకి రావాలంటూ ఘర్ వాపసీ నినాదాన్ని ఇటీవల ఆర్ ఎస్ ఎస్ ఇచ్చింది కూడా.

        హిందూత్వ తత్వవేత్తలు వర్ణవ్యవస్థ లో  శూద్ర, దళిత, ఆదివాసులకు కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా కలిగించలేక పోయారు. పైగా వారిని మాత్రం మైనారిటీలకు వ్యతిరేకంగా  బలమైన శక్తిగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.  మనుషులందరినీ దేవుడు సమానులుగా సృష్టించాడని భావించినప్పుడే దీన దయాళ్ ఏకాత్మవాద భావనకు  అంతో ఇంతో బలం వస్తుంది.  
    ‌‌.    ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘హిందూత్వ అనేది వామపక్షమూ కాదు, మితవాద పక్షమూ కాదు,సంపూర్ణ మానవతావాదమే దాని సారాంశం’ అని పేర్కొన్నారు. లింగ సమానత్వాన్ని, కులనిర్మూలనను, అస్పృశ్యత రద్దును ప్రతిపాదించని, ఆచరించని సిద్ధాంతం సంపూర్ణ మానవతావాదం ఎలా అవుతుందో వీరు స్పష్టం చేయవలసి ఉంది.కానీ బిజెపి తన పార్టీ వెబ్సైట్లో చెప్పినట్లు హిందూత్వ అనేది సాంస్కృతిక జాతీయవాదమే గానీ అది  మతపరమైన భావన కాదని పేర్కొంది.
           "ఆధునిక ప్రపంచంలో సమానత్వం భావన లేవనెత్తినప్పటికీ, సమానత్వ భావనను విచక్షణతో అంగీకరించాలి. మా వాస్తవ అనుభవం ఏమిటంటే, ఆచరణాత్మక  భౌతిక దృక్కోణంలో, ఇద్దరు పురుషులు ఒకేలా ఉండరు.హిందూ ఆలోచనాపరులు రూపొందించిన సమానత్వం ఆలోచనను  జాగ్రత్తగా అధ్యయనం చేస్తే పురుషులకు వారి గుణాలు లేదా సామర్థ్యాల ప్రకారం వారికి వివిధ  రకాల విధులు కేటాయించినప్పటికీ, అన్ని విధులు సమాన గౌరవంగా ఉంటాయి. దీన్నే స్వధర్మం అంటారు. స్వధర్మాన్ని అనుసరించడం కూడా భగవంతుని ఆరాధనతో సమానం. కాబట్టి, స్వధర్మాన్ని నెరవేర్చడానికి చేసే ఏ విధుల్లోనైనా, ఉన్నత లేదా తక్కువ గౌరవం , అప్రతిష్ట అనే ప్రశ్న అస్సలు తలెత్తదు. స్వార్థం లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, చేసే వ్యక్తిపై ఎలాంటి నిందలు ఉండవు." ఇలా కమ్యూనిజం చెప్పిన సమానత్వ సిద్దాంతాన్ని స్వధర్మం తో పోల్చి చెపుతారు.కానీ  వర్ణ ధర్మాన్ని పాటించడమే స్వధర్మం అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. స్వధర్మం సమానత్వంను సమర్థిస్తుందన్న నెపంతో వర్ణవ్యవస్థ ను సమర్థించాడు దీనదయాళ్.

      దీనదయాళ్  స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకపోవటం వల్ల ఆయన ఆ పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంగా చూడలేదు. ఆయన  "స్వాతంత్ర్యం అనేది కేవలం విదేశీ పాలనను పారద్రోలడమే అనే తప్పుదోవ పట్టించే భావనతో మనమున్నాం. విదేశీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే మాతృభూమి పట్ల నిజమైన ప్రేమను సూచించాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకతపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. బ్రిటీష్ వారిని ఎదిరించే వారెవరైనా దేశభక్తులే అనే నమ్మకం ఏర్పడింది. మన దేశంలోని ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు, కష్టాలకు బ్రిటీష్ వారినే బాధ్యులుగా చేసి వారిపై పూర్తి అసంతృప్తిని కలిగించడానికి ఆ రోజుల్లో  ప్రచారం చేశారు." అని అన్నారు.
      
          వేదాలు, పురాణాలు, ధర్మ శాస్త్రాలు ఇతర సాంస్కృతిక  వ్యవస్థల నుండి జాతీయవాద   సూత్రాలను అనుసరించాలన్నారు   దీనదయాళ్.  ఆయన భారత జాతీయవాదం స్థానంలో   హిందూ జాతీయవాదాన్ని ప్రతిపాదించాడు.  భారతదేశంలో పుట్టిపెరిగిన  ముస్లింలు, క్రైస్తవులను జాతీయ వాదులుగా అంగీకరించడానికి అతను నిరాకరించాడు. అతని ప్రకారం హిందువులు మాత్రమే మాతృభూమిని ఆరాధిస్తారు. వారికి మాతృభూమి పది ఆయుధాలు పట్టిన దుర్గాదేవి లాంటిది. హిందువులు జీవితం పట్ల సాధారణ దృక్పథాన్ని కలిగి ఉన్నందున స్థిరమైన దేశాన్ని ఏర్పరుచుకున్నారన్నారు.
        దీనదయాళ్  భారత రాజ్యాంగంలో అంతర్భాగమైన సమాఖ్యవాదాన్ని అసహ్యించు
కున్నారు. అధికార కేంద్రీకరణ అవసర మన్నారు.  అతని   రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌లో, 'భారత్ ఒక ఏకీకృత రాజ్యంగా ఉంటుంది' అనే స్పష్టమైన ప్రకటన ఉండాలన్నారు.
        ఒక సారి జనసంఘ్ పార్టీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చింది.   కాని పాంచజన్య పత్రిక వ్యతిరేకించింది. ఇలాంటి ద్వంద్వ విధానాలను ఆయన సమర్థిస్తూ "పార్టీ ప్రయోజనాలు వేరు. దేశ ప్రయోజనాలు వేరని" చెపుతూ తమ తమ స్థానాలలో సరైన నిర్ణయం తీసుకున్నారని  అభిప్రాయపడ్డాడు. 
        భారతీయ జాతీయవాదం యొక్క అత్యంత ముఖ్యమైన విషయం  ఏమిటంటే, ముస్లిం లు, క్రైస్తవులు ఇండోనేషియా లేదా చైనీస్ ముస్లింలు ఇండోనేషియా లేదా చైనీస్ పేర్లను కలిగి ఉన్నట్లే వారు భారతీయ పేర్లను తప్పనిసరిగా స్వీకరించాలన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే వారు తమ మతం పట్ల భారతీయ దృక్పథాన్ని, జాతీయ వైఖరిని అవలంబించాలన్నాడు.
    హిందూత్వ విధానాన్ని మరింత స్పష్టంగా ఉపాధ్యాయ వివరించారు.  ముస్లింలు కత్తితో ఇక్కడకు వచ్చారు, కాబట్టి ముస్లింలతో యుద్ధం మతం కాదు, రాజకీయం అని మర్చిపోకూడదని అన్నారు.
    “మా గొడవ మహమ్మద్‌తో లేదా ముల్లాస్ మరియు మౌలావీలతో కాదు. రాజకీయ అభిలాషను మతతత్వంతో ముడిపెట్టి ముస్లింలు ప్రవర్తించే తీరుతో మా గొడవ.  అందుకే ఈ యుద్ధం మతపరమైనది కాదు రాజకీయమైనది. ఛత్రపతి శివాజీకి దీని గురించి పూర్తిగా తెలుసు, అందుకే అతను మసీదులను పడగొట్టలేదు కానీ ఔరంగజేబుతో పోరాడాడు.  ఈ రోజు మన యుద్ధం ముస్లింలు భారతీయ జాతీయవాద ప్రధాన స్రవంతిలో చేరనందుకు " అని స్పష్టం చేశాడు.
   
          ముస్లిం మతోన్మాదాన్ని ఓడించడానికి ఒకే ఒక మార్గం ఉంది అదేమంటే వారిని రాజకీయంగా ఓడించడమే. అదే ముస్లిం సమస్యకు నిజమైన పరిష్కారం అన్నారు దీన దయాళ్. రాజకీయంగా ఓడిపోనంత కాలం తెగులు పెరుగుతూనే ఉంటుంది. ఓటమి మాత్రమే వారికి రెండవ ఆలోచనను కలిగిస్తుంది. అప్పుడు హిందూ-ముస్లిం సహకార ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటమి వారిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుందన్నారు. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉపయోగపడే సిద్ధాంతంగా మారిపోయింది.

    దేహానికి ఆత్మ ఉన్నట్లే దేశానికి కూడా ఆత్మ ఉంటుందన్నాడు దీన దయాళ్. ఇది భావ వాదం తప్ప మరొకటి కాదు. దానికి చితి అని పేరు పెట్టాడు.  ఇది దేశ  సమూహం యొక్క సహజ స్వభావం. వ్యక్తుల యొక్క ప్రతి సమూహానికి సహజమైన స్వభావం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సమాజానికి సహజసిద్ధమైన స్వభావం ఉంటుంది, అది పుట్టుకతో వచ్చిందేగానీ  చారిత్రక పరిస్థితుల ఫలితం కాదన్నాడు దీన దయాళ్.దేశం సాంస్కృతికంగా ఏ దిశలో ముందుకు సాగాలనే చితి నిర్ణయిస్తుంది. ఏది చితికి అనుగుణంగా ఉంటుందో అది సంస్కృతిలో చేర్చబడుతుంది.
దేశ "చితి"ని ముందుకు తీసుకుపోవడంలో ఒక వ్యక్తి కూడా సాధనంగా ఉంటాడన్నాడు ఉపాధ్యాయ.
   "ఇక్కడ ఒకే సంస్కృతి ఉంది. ఇక్కడ ముస్లింలకు, క్రైస్తవులకు ప్రత్యేక సంస్కృతులు లేవు. సంస్కృతి ఆరాధన విధానం లేదా శాఖకు సంబంధించినది కాదు; అది దేశానికి సంబంధించినది. కబీర్, జయసీ, రసాఖాన్‌లు ముస్లింలకు ఆదర్శంగా నిలవాలి. నేడు వారి విధేయత కేంద్రం భారత్ వెలుపల ఉంది. ముస్లింలు తమ మనోభావాలను, దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాలి." అని అన్నారాయన.ఒకే సంస్కృతి నినాదాన్ని ఆర్ ఎస్ ఎస్ అందుకోవడానికి కారణం ఇదేనేమో.
            ప్రముఖ రచయిత AG నూరానీ అతనిని  'ద్వేషపూరిత వ్యాపారి' గా అభివర్ణించాడు.ఇతని భావజాలం ముస్లిం సమాజాన్ని దేశ వ్యతిరేకిగా చూపిస్తుంది .లౌకికవాదాన్ని భారతదేశ ఆత్మపై దాడిగా భావిస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిలుస్తుంది . ఈ భావాలను  భారతీయులు ఎవరు హర్షించరు.
            దయాళ్ భారత దేశ బహుళత్వాన్ని, భిన్న సంస్కృతులను విస్మరించాడు. ముస్లిం విద్వేష రాజకీయ విధానమైన హిందూత్వ విధానం ద్వారా భారత దేశంలో రాజకీయాధికారాన్ని సాధించాలనుకున్నాడు. ఆ విషయంలో బిజెపి విజయం సాధించిందనే చెప్పాలి. అయితే అది ముస్లింలను , క్రైస్తవులను ఏమేరకు ఆయన చెప్పిన భారతదేశ చితి లోకి తీసుకు వచ్చారన్నదే ప్రశ్న. ఇది భారత దేశ ప్రజలను ఏమార్చుతూ , కార్పొరేట్ వర్గాలకు ఎంతో ఉపయోగపడుతూ
తద్వారా వారు మరింత దోపిడీకి గురవడానికి దోహదం చేస్తోందని గమనించాలి. అదే సమయంలో ఒకే జాతి ఒకే భాషా ఒకే సంస్కృతి పేరిట జరిగే అనేక కార్యక్రమాలు భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి మతసామరస్యానికి జాతి సమైక్యతకు విఘాతం కలుగుతున్నదని గమనించాలి.

           పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  భారతీయ సంస్కృతి పునాదిపై బలమైన, సంపన్నమైన భారత దేశాన్ని నిర్మించాలని  కోరుకున్నాడు ఇది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం  న్యాయం (ధర్మరాజ్యం), అందరికీ దాదాపు మేలు (సర్వోద్య మరియు అంత్యోదయ)  కలగాలని కోరుకున్నాడు. అంబేద్కర్  చెప్పినట్లు కులాం పునాదుల పైన, మతవిద్వేష పునాదుల పైన  పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించలేం కదా!


__ పిళ్లా కుమారస్వామి,9490122229 

ఆధారం
ఈ మానవతావాదం ‘సంపూర్ణ’మేనా?___ ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌
(7-11-2021 సాక్షి దినపత్రిక)
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పునరుత్థానం_షమ్మ్యుల్ ఇస్లాం(counter currents.org)
వికిపీడియా ( సమగ్ర‌మానవతా వాదం)
gujaratbjp.com
www.questjournals.org
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  సమగ్ర హ్యూమనిజం ఫిలాసఫీని డీకోడింగ్ చేయడం (సురీందర్ సింగ్)(క్వెస్ట్ జర్నల్స్,
Vol 10- సంచిక 7 (2022) pp: 102-105)
దీనదయాళ్ ఉపాధ్యాయ: ద్వేషపూరిత వ్యాపారి__ AGనూరాని(Oct 26, 2016, frontline)
దువాసు__ మధుర
bjp.org

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం