బౌద్ధం పునాదులపై వైదిక మతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన శంకరుని తాత్విక ధోరణులు
_బౌద్ధం పునాదులపై వైదిక మతానికి ప్రాణ ప్రతిష్ట చేసిన శంకరుని తాత్విక ధోరణులు_
నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇదిఅందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవిస్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం
కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు
శంకరుడు. (రజ్జు - తాడు, సర్పం - పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న
తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి
తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో
తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన
ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.
నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు.“మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఎందుకంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది.మార్పు చెందుతోంది, నశిస్తున్నది, రూపాంతరం చెందుతోంది. ప్రగతిశీలమైన,ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి పూర్వమున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషికాది ధోరణులన్నీ అంగీకరించాయి. శంకరుడు మాత్రం తనకంటే ప్రాచీనమైన ధోరణులలోని వాస్తవికతను విసర్జించాడు." అని ఏటుకూరి బలరామ్మూర్తి పేర్కొన్నారు.
భావవాదులలోని ప్రధాన దోషం ఏమంటే వీళ్ళు ప్రపంచం యొక్క సత్యాన్ని గురించి,
అసత్యాన్ని గురించి అది వస్తుగతమా? లేక వ్యక్తిగతమా? అని ప్రశ్నిస్తారు.దానికి సిద్ధాంత
దృష్ట్యా మాత్రమే సమాధానం చెపుతారు.వీళ్లు ఆచరణలో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
ప్రపంచం మిథ్య, ఆత్మ, పరమాత్మ ఒక్కటే నని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆదిశంకరుడు.
మానవుల ఆచరణంతా జ్ఞాన మీమాంసకు ఆధారంగా ఉండాలని ఫ్యూయర్ బాక్ చెప్పినారు. భావ వాదులు
కూడా 'నేను' “నీవు' అనేవాటి సత్యాన్ని గుర్తిస్తారు. ఐతే, ఈ దృక్పథాన్ని భావవాదులు వ్యవహార జీవితంలో అంగీకరిస్తారే గాని, తాత్త్విక యోచనకు కాదు. "ఏ తాత్త్వికాలోచన వాస్తవ జీవితానికి విరుద్ధంగా ఉంటుందో, ,
ఆత్మను ప్రమాణంగా తీసుకుంటుందో - అటువంటి తాత్త్వికాలోచన సత్యం దృష్ట్యా అది చచ్చిన దానితోనూ, అబద్దం తోనూ సమానం" అని ఫ్యూయర్ బాక్ అన్నారు.
ప్రపంచమంతా మిథ్యని బోధించిన శంకరాచార్యులు విగ్రహారాధనను సమర్థించడం ఆయన చెప్పిన దానికే విరుద్ధం.
బౌద్ధంలో బుద్ధుడిని దైవంలా చేయటం, ఆలయాలు నిర్మించటం గమనించిన శంకరాచార్యులు దేశమంతా పర్యటించి జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. శైవ
దేవాలయాలను స్థాపించారు. వైష్ణవ దేవాలయాలను ప్రోత్సహించారు. శివకేశవులు అభేదమని నిరూపించారు. ఒక ఝంఝా మారుతంలా దేశంలో వైదిక మతానికి మళ్లీ ప్రాణం పోశారు. శంకరాచార్యుల వాదన ధాటికి పండితులు తలక్రిందులయ్యారు. పతనావస్థలో నున్న బౌద్ధులు హైందవంలోకి తిరిగి రావాల్సి వచ్చింది. వారికి తమ బౌద్ధంలోని లోపాల్ని నిరూపించి, తర్కంతో ఓడించి శంకరాచార్యులు, మళ్లీ హిందువుల్ని చేశారు. దాంతో బౌద్ధం సమూలంగా దేశం నుంచి అదృశ్యమయింది.
“శంకరుని విజయం, అతని తాత్విక సిద్ధాంతపు విజయాన్ని ఆనాటి బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాలు ఆనాడు తక్కిన భారతీయ సమాజంపై సాధించిన విజయంగా
అర్థం చేసుకోవాలి. అందువల్ల శంకరుని తాత్విక సిద్ధాంతం ప్రస్తుత భారతదేశానికి గానీ,ప్రపంచానికిగానీ వర్తించే సిద్ధాంతంగా... సవ్యంగా ఆలోచించగలిగే ఏ వ్యక్తి
అంగీకరించలేడు. పెనుమార్పులతో శరవేగంగా ప్రపంచం ముందుకుపోతున్న నేటి
కాలంలో మానవజాతి ముఖ్యంగా మనదేశం ఆ వేగాన్ని అందుకోవాలంటే భావవాదపు
సిద్ధాంతాలను, అద్వైతంతోసహా తీవ్రంగా ఎదిరించి, ఓడించాలి. హిందూ పునరుద్ధరణ
వాదాన్ని వేద, పురాణాల తాత్విక భావజాలాన్ని ఎదిరించి ఒక ప్రజాతంత్ర లౌకిక,
నవీన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు సాగిస్తున్న పోరాటంలో ఇదొక విడదీయలేని
భాగం.” అంటూ నంబూద్రిపాద్ శంకరుని తాత్విక భావ జాలాన్ని తిరస్కరించారు.
నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో సాధారణ శకం . 788 లో శంకరుడు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు ఆరుద్రలో జన్మించారు. సా.శ.820లో 32 ఏళ్లకే అకాల మరణం పొందారు.
కాలడి ఇప్పటి త్రిచూర్ కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకును పోషిస్తూ చదువులు చెప్పించేది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు.
శంకరులు చిన్న తనంలోనే సన్యాసం తీసుకోవాలన్నారు. తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూ సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దాంతో ఆమె అంగీకరించింది. ఆమె అంతిమదశలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తానని మాట ఇచ్చి ఆమె అనుమతి తో గురువు కోసం అన్వేషిస్తూ
బయలు దేరాడు.గురువు కోసం అన్వేషిస్తూ నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద పాదుల దగ్గర శిష్యులుగా చేరారు.వారంతా బౌద్ధం గురించి అధ్యయనం చేసిన వారే. గౌడపాదుని పై మహాయాన బౌద్ధం ప్రభావం ఉంది.ఆయన దగ్గర విద్యాభ్యాసం పూర్తయ్యాక వారణాసి వెళ్లారు. అప్పుడాతని వయస్సు12 ఏళ్లే.
అక్కడాయన ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు.
అప్పటికి బౌద్ధం ఉచ్ఛస్థితిలో వుంది. వైదికధర్మం సరైననాయకత్వం లేక, శైవ మతం, వైష్ణవ మతం అని, మళ్ళీ వాటిలో వీర శైవం, వీర వైష్ణవం, కాపాలికులు, అఘోరాలు, అని అనేక శాఖలుగా ఏర్పడి వారిలోవారు ఘోరాతి ఘోరంగా, ఒకరినొకరు చంపుకుంటూ, మూఢమతవిశ్వాసాలతో, మా దేవుడు గొప్ప అంటే, మా మతం దేవుడు గొప్ప, అనిప్రజలను గందరగోళపర్చే స్థితిలో ఉన్నారు.
ఆ పరిస్థితుల్లో కాశీ (వారణాసి) నుండి బదరికి వెళ్లి అక్కడి పండితుల పండిత గోష్ఠులలో పాల్గొన్నారు.అప్పట్లో బౌద్ధం గురించి కూడా నేర్చుకునేవారు. బౌద్ధం 'అనేకం' తో ఈ ప్రపంచం ఉందని చెపుతుందని తెలుసుకున్నాడు.
బౌద్ధం ఆత్మ లేదని చెపుతుందని,
దేవుడు లేడని అంటున్నదని తెలుసుకున్నాడు.బౌద్ధం నిర్వాణ (LIBERATION) గురించి చెపుతుందని తెలుసుకున్నాడు.
వేదాల, ఉపనిషత్తుల, భగవద్గీతలను అర్థం చేసుకున్నాడు.
వైదిక మత ప్రచారం కోసం నడుం బిగించారు.
వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్నవన్నీ 'ఆప్తవచనాలే' అని అన్నాడు. అదంతా గొప్ప 'జ్ఞాన సంపద' అని చెప్పాడు.
'మీమాంస'-ను ప్రచారంలోకి తెచ్చాడు.
బౌద్ధానికి భిన్నంగా ఆత్మ, పరమాత్మ భావాలను ప్రవేశపెట్టాడు.నిర్వాణం స్థానంలో
'మోక్షం' అనే భావనను ప్రతిపాదించాడు.బౌద్దం సామాన్య జనాల భాష పాళీ లో చెపితే ఈయన సంస్క్రతంలో చెప్పాడు.
బదరి నుండి కాశీకి వచ్చి బౌద్ధానికి భిన్నంగా ఆత్మ, పరమాత్మ లు రెండుగా లేనివని ప్రతిపాదించాడు శంకరుడు. ఇదే అద్వైతం.తన అద్వైత సిద్ధాంతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు.
ఒకరోజు గంగానది కి వెళ్తుండగా మధ్యలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు ఎదురయ్యాడు. అప్పుడు శంకరుడు, ఆయన శిష్యులు అతనితో 'అడ్డు తొలగు తొలగు' అన్నారని ఒక కథనం ఉంది.
చండాలప్పుడు వారితో
"అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి" అంటూ ఆగాడు.
వాళ్ళు ఆశ్చర్యంగా అతనివైపు చూస్తున్నారు.వాస్తవానికి ఆనాటికి చండాలురకు చదువుకోవడానికి అవకాశం లేదు.మరి ఎలా చెప్పగలడు. బహుశా బహిష్కరణకు గురైన బ్రాహ్మణుడే అయి ఉండవచ్చు.లేదా కట్టుకథైనా ఉండాలి.
అతను మళ్ళీ"సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైంది ఈ శరీరం.ఇది నాలో గాని, బాపనయ్యలోగాని ఒకేవిధంగా పనిచేస్తుంది. మరి మీరు నా శరీరాన్ని తప్పు కోమంటారా? లేక లోపలనున్న ఆత్మనా? " అని అడుగుతాడు.
శంకరుని గురించి గొప్పగా చెప్పే వారు ఆ చండాలుడు శివుడని చెప్పుకున్నారు.ఆరకంగా తమ బ్రాహ్మణ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండే ప్రయత్నం చేసుకున్నారు.
అప్పటి నుండి శంకరులు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం చెప్పే సిద్దాంతం
అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" లో అద్వైతం గురించి ఇలా చెప్పారు.
(బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః)
బ్రహ్మమే సత్యం, ఈ ప్రపంచం మిథ్య. జీవునకు, బ్రహ్మం కు భేదం లేదు. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్ముక్తులవుతారన్నారు. సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రం, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు రాసినారు.
శంకరుల మాయావాదం(మిథ్యా వాదం) తీవ్రంగా విమర్శకు గురైంది. ఒకసారి శంకరుడు ఏనుగు పైన ఊరేగుతూ ఉండగా అక్కడి డప్పు మోతలకు అది భయపడి ఇష్టానుసారం పరుగెత్తింది. దాంతో శంకరుడు ఏనుగు పై నుండి కింద పడ్డాడు.
కాలు విరిగింది. శిష్యులు ఏమిటి స్వామీ ఇలా జరిగింది అని అడిగారట.అప్పుడాయన 'గజం మిథ్య పలాయనం మిథ్య' అన్నాడట.కాని కాలుకు దెబ్బ తగలడం మాత్రం వాస్తవం.
దీన్నే శ్రీశ్రీ తన మిథ్యావాది కవితలో ఇలా ప్రశ్నించాడు.
మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ!
ఏ మంటావు?
మాయంటావూ? లోకం
మిథ్యంటావూ? కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ! మాయ!
మాయంటావూ? అంతా
మిథ్యంటావూ?
జమీందారు రోల్సుకారు
మహారాజు మనీపర్సు
మాయంటావూ? స్వామీ
ఏమంటావూ?
మరఫిరంగి, విషవాయువు
మాయంటావూ? ఏం,
ఏ మంటావు?
పాలికాపు నుదుటి చెమట,
కూలి వానిగుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావు?
బ్రహ్మమొక్కటే సత్యమనే భావన వలన సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.
ఈ అద్వైత సిద్ధాంతాన్ని
రామానుజులు వ్యతిరేకించారు.
అంతేగాక ఆత్మ పరమాత్మ ఒకటైతే అందరిలో ఉన్న ఆత్మలు ఒకటేనా? అన్న ప్రశ్న వేశారు.
కాదు కాదు ఆత్మలు వేరు వేరు అన్నాడు శంకరుడు. పరమాత్మ ఒక్కడే. ఆయనే వేరు వేరు (అనేకం) ఆత్మ లుగా ఉన్నాడన్నాడు. తిరిగి బౌద్ధం చెప్పిన ఈ ప్రపంచం అనేకం అనే సిద్దాంతాన్ని శంకరుడు ఒప్పుకున్నాడని, ఆయన అద్వైతం లో ఇది ఇమిడి ఉందని పరోక్షంగా బౌద్ధం ప్రతిపాదించిన దానినే ఆయన మరో రకంగా చెప్పినాడని పండితులు భావించారు.అందుకని ఆయన్ను ప్రచ్ఛన్న బౌద్దుడన్నారు.
చీలిక పేలికలైన, వైదికధర్మాన్ని ఒకే త్రాటిమీదకు తీసుకుని రావడానికి శంక రాచార్య తన శిష్యగణాలతో ఆసేతుహిమా చలం పర్యటించాడు. వివిధ మతశాఖల పెద్దల్ని తన వాదనా పటిమతో వారిని ఓడించి, వారందరినీ తన శిష్యులుగా మార్చుకున్నాడు. శివ, కేశవులు ఒక్కటేనని, వారిమధ్య బేధం లేదని, ఆత్మ, పరమాత్మలు ఒక్కటేనని, ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించవచ్చని చెప్పి తన అధ్వైత సిద్ధాంతాన్ని ప్రభోదించాడు.
శైవ, వైష్ణవ మతాలను, వాటి ఉప శాఖలను ఏకంచేసిన ఘనత శంకరుని దే. సింధు ప్రజలుగా చెలామణి అవుతున్న ప్రజలను హిందూ ప్రజలుగా నామకరణం చేసినాడు. అందరినీ హిందువులుగా మార్చాడు. హిందువులుగా మారినవారు ఎక్కువమంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య కులాలవారే!
ఆ కాలానికి దళితులు, వెనుకబడిన జాతివారు, బౌద్ధానికి అంకితం అయ్యారు.
జనాభాలో 80 శాతంగావున్న శూద్ర, దళిత, వెనుకబడ్డ వర్గాలవారు బౌద్ధాన్ని ఆచరిస్తున్న పరిస్థితిలో, శంకరాచార్య అప్పటి రాజుల సహకారంతో, బౌద్ధాన్ని అణచివేసి, హిందూ మతానికి, శివ, కేశవుల ఆరాధనకీ దారులు తెరిచాడు. బౌద్ధారామాలను బలవంతంగా ఆక్రమించి, వాటిని అవకాశాన్నిబట్టి శైవాలయ, వైష్ణవాలయాలుగా మార్చివేసి, వాటి నిర్వహణబాధ్యతను పూజారివర్గానికి ఒప్ప గించి, సమాజంలో ఆ వర్గానికున్నత స్థానాన్ని కల్పించాడు.
పూజారి వర్గాన్ని ఎదిరించిన బౌద్ధ భిక్షువులపై అనేక రకాలుగా దాడులు చేయించారు. బౌద్ధాన్ని హిందూమతంలో భాగంచేసినాడు.దశావతారాలను సృష్టించి, విష్ణు మూర్తి 10వ అవతారంగా బుద్ధుడ్ని మార్చి వేశాడు. బుద్ధుడి శయనశిల్పాలను విష్ణుమూర్తి శయన శిల్పాలుగా మార్పులు చేయించారు. ఆంధ్రరాజధాని అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహల్లోని బుద్ధుని శయనశిల్పం,
విష్ణుమూర్తి శయనశిల్పంగా మార్చడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచా రామాలుగా చెలామణిఅవుతున్న శైవమందిరాలు ఒకప్పటి బౌద్ధారామాలే!
మెజారిటీ ప్రజలు బౌద్ధాన్ని అనుసరిస్తుండం వల్ల బుద్ధుడ్నిహిందూదేవునిగామార్చి దేవుడేలేడు అని ప్రచారం చేసిన బుద్ధుడిని విష్ణుమూర్తి 10వ అవతారంగా ప్రజలు విశ్వ సించే విధంగా, బుద్ధుడికి పూజా విధానాన్ని ప్రవేశపెట్టాడు.బౌద్ద ధర్మాలను హిందూ ధర్మాలుగా చలామణిలో పెట్టారు. ఆవిధంగా బౌద్ధ ధర్మాన్ని మెల్లగా నాశనం చేశారు. దాంతో వైదికులు హిందూమతానికి, వైదిక ధర్మానికీ ఆదిగురువు గా, జగద్గురువుగా ఆది శంకరుని కీర్తించడం మొదలు పెట్టారు. వైదిక ధర్మ ఉద్ధరణకు, హిందూ మత పూజా విధానాల ప్రచారం కోసం భారతదేశంలో ని నాలుగు మూలల్లో, నాలుగు శంకర పీఠాలు నెలకొల్పాడు. అంతా మిథ్య అన్న తన వాదాన్నే తాను తిరస్కరించాడు.తన ప్రియ శిష్యులను వాటికి ఆదిగురువు లనుచేసి, హిందూమత, వైదికధర్మ పరిరక్షణ బాధ్యతలను కేదార్, ఉజ్జయిని, ద్వారక, పూరి,శక్తి పీఠాలకు అప్పగించారు. నాలుగు పీఠాల అధిపతులూ జగద్గురువు శంకరాచా ర్యులుగా పిలవబడుతున్నారు. వారే వైదిక ధర్మ, హిందూమత పరిరక్షకులు. శంకరుల శిష్యులలో ఒకరు శృంగేరీలో, కంచిలోకూడా శంకర పీఠాలు స్థాపించారు. ఈ ఆరుగురు పీఠాధిపతులు కలిసి హిందూ మత యకార్యాచరణను,వైదికధర్మ పరిరక్షణను నిర్వహిస్తున్నారు.ఆ రకంగా ఆది శంకరాచార్యులనే హిందూమత స్థాపకులుగా భావించాలని డా.దేవరాజు మహారాజు పేర్కొన్నారు.
Courtesy: satyagrah.com
శంకరాచార్యులు 32 సంవత్సరాల చిన్న వయసులో నేటి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శంకర పీఠాన్ని స్థాపించి, అక్కడే చాలా వ్యాధులు చుట్టుముట్టడంతో అకాల మరణానికి గురయ్యారు.
__పిళ్లా కుమారస్వామి
9490122229
Comments
Post a Comment