భక్తి సూఫీ ఉద్యమాల మేలు కలయిక భారతీయ తాత్విక చింతన కు మేలుకొలుపు

_భక్తి సూఫీ ఉద్యమాల మేలు కలయిక భారతీయ తాత్విక చింతన కు మేలుకొలుపు_


భక్తి ఉద్యమ తాత్విక ధోరణులు

శంకరాచార్యులు పరమాత్మ గురించి తెలుసుకోవాలని ఆయన పై భక్తి కలిగి ఉండాలన్నాడు. ఆయనలో ఐక్యం కావడమే మోక్షమన్నాడు. తరువాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అదే బాటలో పయనించారు. అయితే దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో వీరశైవం శివభక్తిని ప్రచారం చేయడమే గాక ప్రజలభాషలో అనేక శైవసాహిత్యం తీసుకువచ్చారు. 
తమిళదేశంలో క్రీ.శ. 5వ శతాబ్దంలో 'భక్తి' అనే పదాన్ని పేర్కొన్నారు. ఆళ్వార్లు, నయనార్లు తమ బోధనలు, కీర్తనల ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరు వైష్ణవ మతస్థులు.

కర్నాటకలో కూడా 12వ శతాబ్దిలో బసవ(1134_1196CE)వీరశైవాన్ని ఒక ఉద్యమంగా మొదలు పెట్టాడు.అతను కుల వ్యవస్థను తిరస్కరించాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. కర్మ త్యాగాన్ని ఖండించాడు.  శైవా రాధన కోసం పట్టుబట్టాడు. అతని అనుచరులను వీర-శైవులు అని పిలిచేవారు, దీని అర్థం "శివారాధకులు". ఉత్తరాదిలో ఒక ప్రముఖ భక్తురాలు మీరా బాయిని అక్క మహాదేవి అని కూడా పిలుస్తారు.

దక్షిణాదిలో మొదలైన భక్తి ఉద్యమం క్రమేణా ఉత్తరభారత దేశంలోకి ప్రవేశించింది.
14 నుండి 17వ శతాబ్దాలలో, చైతన్య, రామానంద, రవిదాస్, శ్రీమంత, శంకరదేవ, వల్లభాచార్య, సూరదాస్, కబీర్, తులసీదాస్, నామ్‌దేవ్, నానక్, తుకురామ్ మరియు రామ్‌దాస్ వంటి అనేక మంది సాధువులచే ప్రారంభించబడిన భక్తి ఉద్యమం మధ్య మరియు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించింది. , అన్నమాచార్య, భద్రాచల మరియు త్యాగరాజు దక్షిణ భారతదేశంలో ప్రబోధించారు. 

భక్తి ఉద్యమకారులు ప్రేమతత్వాన్ని ఆరాధించారు. గ్రంథాలను పఠించడం వల్ల మానవులు పండితులు కాలేరన్నారు.పూజారులు చెప్పే   ఆచారాన్ని మరియు కులవివక్ష ను విడనాడాలని , దేవుని పై భక్తి కలిగి ఉండాలని  వారు ప్రజల్లో ప్రచారం చేశారు.
ఈశ్వరుడి ఏకత్వం (ఏకేశ్వరో పాసన)పై గాఢమైన అనురక్తి ఉండటమే సరైన భక్తి అన్నారు. మోక్షసాధన కోసం భగవంతుడి కృపను పొందడమే భక్తుడి ప్రధాన లక్ష్యం.

ప్రాచీన కాలం నుంచి ఉన్న పూజాపునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించారు.  పవిత్ర మనసు, స్వచ్ఛమైన జీవనం, మానవత్వ విలువలు పాటించడం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని ప్రచారం చేశారు. 

 దేవుడు అనేక రూపాలు, గుణాలతో ఉంటాడని భావించే చైతన్యుడు, సూరదాసు, శంకరదాసు, మీరాబాయి, తులసీదాసు లాంటి వారు సగుణోపాసనను ప్రబోధించారు. కబీర్, గురునానక్, దాదుదయాళ్ లాంటి వారు భగవంతుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి, ఎలాంటి రూపం, గుణ లేనివాడని భావించారు. వీరు నిర్గుణోపాసనను ప్రబోధించారు.


జ్ఞానార్జనలో భక్తి ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. నిజమైన జ్ఞానం పొందాలంటే గురువు అవసరం ఎంతో ఉందని భక్తి ఉద్యమకారులు భావించారు.

మొఘలాయిలు వచ్చే నాటికి అనేక వెనుక బడిన కులాలు ముఖ్యంగా చేతి వృత్తుల వారు ఆర్థికంగా సామాజికంగా ముందుకు వచ్చారు.
నిమ్నకులాలు, తరగతులకు చెందిన వ్యక్తులే ప్రధాన భక్తి ఉద్యమకారులుగా పేరొందారు. ధన్నా భగత్ నిమ్న కులం; కబీర్ దిగువ కులం; నామదేవుడు దర్జీకులం; తుకారం శూద్ర కులానికి చెందినవారు.
ఈ నేపథ్యంలో వచ్చిన  
భక్తి ఉద్యమ కారులు బ్రాహ్మణ ఆధిక్యాన్ని,
సంస్కృత భాషను, కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు.వీరు ప్రాంతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిలోనే తమ రచనలు చేశారు.
భక్తి ఉద్యమకారులు వృత్తి పనివారిని, హస్తకళా నిపుణులను ఆకర్షించి మత, సామాజిక వ్యవస్థల్లో ప్రజాస్వామిక, సమానత విలువలు రావాలనే లక్ష్యాలను ప్రచారం చేశారు.


జ్ఞానదేవుడు,నామదేవుడు,తుకారం,సమర్థ రామదాసు లాంటి మరాఠా భక్తి ఉద్యమకారులు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వారు రాసిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. మహారాష్ట్ర ధర్మగా పేరొందిన మరాఠా భక్తి మార్గానికి జ్ఞానదేవుడు పునాది వేశారు. ఈయన జ్ఞానేశ్వరి, అమృతానుభవ లాంటి గ్రంథాలను రాశారు. నామదేవుడు పండరీపురం కేంద్రంగా విష్ణుభక్తిని ప్రచారం. చేశారు. ఏకనాథుడు కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ, నిమ్నకులాల వారిపై సానుభూతితో గీతాలు రాశారు. అవి కీర్తనలు, భజనలుగా పేరొందాయి. జ్ఞానదేవుడి శిష్యుడైన తుకారం తన బోధనల ద్వారా మహారాష్ట్రలో జాతీయతా భావానికి పునాది వేశారు.  

నర్సీమెహతా గుజరాత్ ప్రాంతంలో; శంకరదేవుడు అస్సాం ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. గాంధీజీకి అత్యంత ఇష్టమైన 'వైష్ణవ జనతో తేనో కహియే' అనే భజన గీతాన్ని నర్సీ మెహతానే రచించారు.

వారణాసికి చెందిన హరిజనుడైన రామదాసు,రాజస్థాన్ కు చెందిన మీరాబాయి, సూరదాస్, తులసీదాస్ లాంటి భక్తి ఉద్యమకారులు కూడా తమ రచనల ద్వారా భక్తి ఉద్యమ భావాలను ప్రచారం చేశారు.

చైతన్యుడు  బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాధాకృష్ణులకు పూజ చేసేందుకు అన్నివర్గాల వారు అర్హులేనని, రాగమార్గమే మోక్షమార్గానికి సాధన అని ప్రబోధించారు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని చెప్పారు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనే శ్రీకృష్ణుడు/ హరి అని ప్రచారం. చేశారు.

రామానందుడు  ఉత్తర భారతదేశంలో రామభక్తిని ప్రచారం చేసి. అనేక కులాల వారిని శిష్యులుగా చేర్చుకున్నారు. ఈయనకు ధర్మ(జాట్), సేనా(నాయి బ్రాహ్మణ), రవిదాస్ (చర్మకారుడు), కబీర్ (మహ్మదీయుడు)
పురుష శిష్యులు కాగా; పద్మావతి, సురస్త్రీ మహిళా శిష్యులుగా ఉన్నారు. స్త్రీలకు వైష్ణవమతంలో చేరే అవకాశాన్ని కల్పించారు. ఒకరు మరొకరి కులాన్ని అడగకూడదని, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉందని ప్రబోధించారు.
అన్నమయ్య 15వ శతాబ్దిలోనే అభ్యుదయ భావాలు గల పరమయోగి. వృత్తిపనుల్ని గౌరవించాలన్నాడు. కులభేదాలదను, అంటరాని తనాన్ని నిరసించి బ్రాహ్మణుడూ, చండాలుడూ అంతా సమానులే అని ఎలుగెత్తి చాటి “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అని బోధించిన జ్ఞాని అన్నమయ్య.
“ఎక్కువ కులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడే హరి నెరింగిన వాడు”
అనటంలో అన్నమయ్య విశాలదృక్పథమే కాదు, మానవుడే మాధవుడన్న మహనీయసూక్తి దాగి ఉంది.

త్యాగయ్య భక్తి ముందు ఏ నిధులు,మణులు విలువలేకుండా పోయాయి. ఆచరణాత్మక భక్తి
ప్రధానమని ఆయన నిరూపించాడు. బంగారు కాసులు ఆయనకు ఇచ్చినా అవి  తినడానికి పనికిరావని త్యాగరాజు వాటిని తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేసినారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా...’’ అని కీర్తన ఆలపించాడు. తన అన్న జపేశుడు   ఇంట్లో ఉన్న విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీనదిలో పారేసాడు. వాటికోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపిస్తూ ‘నిన్ను ఎందని వెదకను  హరీ...’’ అని కీర్తన చేసాడు.

తెలుగు ప్రాంతంలో వీర బ్రహ్మం చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే
చిత్తం లోనా శివుని చూడరా ఒరే ఒరే అని  తన తత్వాల ద్వారా ప్రబోధించారు.

వేమన చిత్త శుద్ది లేని శివ పూజలేలరా అంటూ సమాజంలో జనాలకు దైవం పట్ల భక్తి శ్రద్ధలు లేక పోవడాన్ని తన పద్యాల ద్వారా విమర్శించారు.

భక్తి ఉద్యమం భారతదేశంలోని మత, సామాజిక, ఆధ్యాత్మిక సాహిత్య రంగాలలో అనేక మార్పులను తీసుకొచ్చింది.



_సూఫీ తాత్విక చింతన_

సుఫీ 632లో మహమ్మద్ మరణం తర్వాత పుట్టింది, కానీ అది చేసింది 12వ శతాబ్దం వరకు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఆధ్యాత్మిక స్థాపకుల చుట్టూ వారి సెయింట్ హోదాను బట్టి వారి పేర్లతో నిర్మించిన పుణ్యక్షేత్రాలు ఏర్పడినాయి. మధ్యయుగ ఆధ్యాత్మికవేత్త జామీ ప్రకారం, అబ్ద్-అల్లా ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ అల్-హనాఫియా (మరణించిన c. 716) "సూఫీ" అని పిలవబడే మొదటి వ్యక్తి.

సూఫీ అనే పదం అరబిక్ పదం  షూఫ్ నుండి వచ్చింది. షూప్ అంటే "ఉన్ని".ఇది ప్రారంభ ఇస్లామిక్ సన్యాసుల ఉన్ని వస్త్రాన్ని సూచిస్తుంది. సూఫీలను సాధారణంగా "ఫకీర్లు" అని కూడా పిలుస్తారు. ముస్లింల ఆధ్యాత్మిక చింతనను  పెంచడం ద్వారా, ముస్లిం సమాజ నిర్మాణంలో సూఫీ మతం ముఖ్యమైన పాత్ర పోషించింది. సూఫీయిజం ఇస్లాం కు ఒక విభాగం కాదు కానీ అదొక ఆధ్యాత్మిక శాఖ. సూఫీలు ​​ ధ్యానం, ప్రార్థన మరియు స్వీయ-శుద్ధి ద్వారా అల్లాతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. 

వీరి బోధనలు ఇలా ఉంటాయి:

1.దేవుడు ఒక్కడే.
2.ప్రజలందరూ దేవుని బిడ్డలే.
3.తోటి మనుష్యులను ప్రేమించడం అంటే దేవుడిని ప్రేమించడమే.
4.భగవంతుడిని చేరుకోవడానికి వివిధ మతాలు వేర్వేరు మార్గాలు. 
5.భక్తి సంగీతం (ఖవ్వాలి) భగవంతుని దగ్గరకు శరావడానికి ఒక మార్గం.
6.భగవంతుడిని చేరుకోవడానికి ఉపవాసాలు, ఆచారాలు తప్పనిసరి కాదు.

అరేబియాలో పుట్టిన ఈ సూఫీ ఉద్యమం అరబ్బుల ద్వారా 14వ శతాబ్దంలో భారత దేశంలోకి ప్రవేశించి ఇక్కడి వారిని అధికంగా ప్రభావితం చేసింది.

సూఫీలు మొదట పంజాబ్, సింధు ప్రాంతాల్లో తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. గుజరాత్, దక్కన్ బెంగాల్ ప్రాంతాల్లో స్థిరపడిన సూఫీ సన్యాసులు  వీటిని మొత్తం భారతదేశానికి విస్తరింపజేశారు. సూఫీలు తొలుత పారశీక సంప్రదాయాన్ని అనుసరించినా, కాలక్రమేణా భారతీయ సంప్రదాయం లోకి 
మారారు. హిందూ మత విశ్వాసాలను గ్రహించారు. సూఫీ మతానికి భక్తి ఉద్యమం తోడైయింది. వీరు ప్రేమతత్వాన్ని ఆరాధించారు. శాస్త్ర గ్రంథాలను పఠించడం వల్ల మానవులు పండితులు కాలేరని, ప్రేమించడం, ప్రేమతత్వాన్ని అర్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే పండితులు అవుతారని కబీర్ బోధించారు.


'షుఫా' అంటే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసు అని పండితులు వ్యాఖ్యానించారు. మరికొందరు 'షుఫా అంటే మసీదు లోపల మహమ్మద్ శిష్యులు సమావేశం జరిపే అరుగు అని తెలిపారు. సూఫీ పదాన్ని తొలిసారి బస్రా ప్రాంతానికి చెందిన జహీజ్ అనే పండితుడు ఉపయోగించారు. భక్తి ఉద్యమం లాగానే పరిశుభ్రమైన మనసుతో భగవంతుడ్ని ప్రార్ధిస్తే మోక్షం లభిస్తుందనేది సూఫీ ఉద్యమంలో ప్రధాన అంశం. సూఫీ బోధకులు పశ్చాత్తాపం,దేవుడిపై విశ్వాసం లాంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 

భారతదేశంలోకి ముస్లిం మతం ప్రవేశించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇస్లాం రాజ్య విస్తరణలో భాగంగా ముస్లిం మతంలోనే అనేక ముఠా తగాదాలు సంభవించాయి. ముఖ్యంగా ఇస్లాం మత పెద్ద అయిన 'ఖలీఫా' విషయంలో ముస్లింలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయి. దీంతో వీరు సున్నీలు, షియాలు అనే రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయారు. 'ఖలీఫా'ను వంశపారంపర్యంగా నియమించాలని షియాలు భావిస్తే, ఎన్నుకోవాలని సున్నీలు పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానులు సున్నీలు. 

ఉలేమాలు, వారి అనుచరులు మతాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తమకు అనుగుణంగా మలచుకోవడం కూడా సూఫీతత్వం జన్మించడానికి కారణమైంది. ఈ వర్గాలవారు నియంత ప్రభుత్వాలకు మద్దతు తెలిపి. సుల్తాను సహకరించినట్లు సూఫీలు పేర్కొన్నారు. తద్వారా ప్రజాస్వామ్యయుతమైన సర్వ సమానత్వాన్ని బోధించే ఇస్లాం మత సిద్ధాంతాలు భ్రష్టుపట్టాయని విశ్వసించారు. ఉలేమాల ఆధిపత్య ధోరణిని, వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ వీరు వ్యతిరేకించారు. 
వీరు ప్రాపంచిక సుఖాలను త్యజించి సూఫీ తాత్విక  పచారం చేశారు. వీరి బోధనలు సామాన్య, బలహీన వర్గాలను బాగా ఆకర్షించాయి.  వీరు పీర్, షేక్ పేర్లతో సన్యాసుల బృందాలను ఏర్పాటు చేసి ఇస్లాం మత విశ్వాసాలు, నైతిక నియమాలను ప్రచారం చేశారు.సూఫీ ప్రవక్తలు ఏకాంత జీవితాన్ని గడుపుతూ, దైవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరి ప్రవచనాలు, బోధనలు సంప్రదాయ విరుద్ధమైనవని ఇస్లాం మత ప్రచారకులైన ఉలేమాలు విమర్శించారు. సూఫీ ఉద్యమం మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ, సన్యాస జీవితానికి ప్రాముఖ్యం ఇచ్చింది. ఇది సామాన్య ప్రజలు, బలహీన వర్గాలను బాగా ఆకర్షించింది.

భారతదేశంలో చిష్టీ సంప్రదాయానికి చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ సూఫీ ఉద్యమ ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన దర్గా ఆజ్మీర్ (రాజస్థాన్)లో ఉంది. చిష్టీలు హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్, భక్తియార్ కాకి మొదలైన చిష్ఠీ శాఖవారు సమానత్వాన్ని బోధిస్తూ, సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వీరు స్థానిక హిందువులతో సన్నిహితంగా పాటుపడ్డారు. రాజపోషణను,  దానాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాల్లో గొప్ప ఆధ్యాత్మికత ఉందని బోధించారు. వీరు ఏర్పాటు చేసిన సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకర్షించాయి.

ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన షేక్ ఫరీద్ (బాబా ఫరీద్) అనే తత్వబోధకుడు అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ సూఫీ సిద్ధాంతాలను ప్రబోధించారు. ఈయన శిష్యుడైన నిజాముద్దీన్ ఔలియా ఘజియాపూర్ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా తన బోధనల ద్వారా అనేక మంది శిష్యులను పొందారు. అక్బర్ను ఎంతగానో ప్రభావితం చేసిన షేక్ సలీంచిష్ఠీ కూడా సూఫీ ఉద్యమకారుడే.  ఈశాన్య భారతదేశంలో ముల్తాన్ కేంద్రంగా సుహ్రవర్దీ/ సుహ్రవాదీ శాఖ వర్ధిల్లింది. ఖ్వాజాపీర్ మహ్మద్, ఖ్వాజా బాకీఖిల్లా మొదలైన సూఫీ సన్యాసులు భారతదేశమంతా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు.  షత్తారీ/ ఫిరదౌసియా శాఖలో హజరత్ షేక్ షరీఫ్ ఉద్దీన్; ఖాద్రీ శాఖలో హజరత్-షేక్ అబ్దుల్ ఖాద్రి జిలానీ; నక్షబందీ శాఖలో హజ్రత్ ఖ్వాజా బాక్వీ-బిలాహ్ మొదలైన సన్యాసులు విశేష ప్రాచుర్యం పొందారు.



సూఫీ మతంలో ప్రధానంగా ఆరు రకాల చింతనా సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. అవి: చిష్టీ సుహ్రవర్ది. కాద్రీ, షత్తారీ, నక్షబందీ, రేషానియా. ఇవి సూఫీ ఉద్యమ వ్యాప్తికి విశేష కృషి చేశాయి. భారతదేశంలో చిష్తీ, సువు ప్రధానమైన శాఖలు. ఢిల్లీ సుల్తానుల కాలానికి ముందే ఈ సంప్రదాయాలు మనదేశంలోకి ప్రవేశించి, క్రీ.శ. 13వ శతాబ్దం నాటికి ప్రాచుర్యాన్ని పొందాయి. 


సూఫీ సన్యాసి షేక్ జకారియా సుహ్రావర్ది శాఖకు చెందిన వారు. ఈ శాఖవారు ఎక్కువగా ముల్తాన్ ప్రాంతంలో జీవించేవారు. వీరు చిష్ఠీలకు భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థతో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాలకు, మతానికి అవినాభావ సంబంధం ఉందని వాదించే ముస్లిం మతవాదులకూ, సుహ్రావర్ది సంప్రదాయవాదులకు భావాలు, విశ్వాసాల్లో పెద్ద తేడా లేదు. అయినప్పటికీ హిందూ, ఇస్లాం మతాల మధ్య సయోధ్య అవసరం అని ప్రచారం చేయడం వల్ల ఈ శాఖ ప్రాచుర్యం పొందింది. అనంతరకాలంలో ఖాద్రీ/ కాద్రీ సంప్రదాయం భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది ఇస్లాం మతంలోని చాందస భావాల వైపు మొగ్గు చూపుతూనే జీవితానందాన్ని అన్ని రకాలుగా అనుభవించాలని ప్రచారం చేసింది. వీరిది ఉదారవాద సంప్రదాయంగా ఉంటుంది. 

 అక్బర్
చక్రవర్తి కాలంలో నక్షబందీ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. భౌతిక ప్రపంచంలో ఒక క్రమం ఉందని, అందుకే ప్రజలంతా ఐక్యంగా ఉండాలని వీరు ప్రచారం చేశారు.

రేషానియా శాఖ వారు ఆత్మవైరాగ్యాన్ని ప్రబోధించారు. మత సారాంశం, అభివృద్ధే ముఖ్యమని, పైపై మెరుగులు కాదని వీరు ప్రచారం చేశారు.


సూఫీ తత్వ ప్రభావంతో భక్త కబీర్  హిందూ-ముస్లిం ఐక్యతను ప్రచారం చేసి, కులవ్యవస్థను ఖండించారు. విగ్రహారాధన, కర్మకాండలు, తీర్ధయాత్రలను వ్యతిరేకించారు. రాముడు, రహీం ఒక్కటే అని వారు ఒకే మట్టితో చేసిన రెండు కుండలని బోధించాడు.  కబీర్ రచనలను దోహాలు/ బీజక్ లు అని, వారి శిష్యులను కబీర్ పంథి అని పిలుస్తారు. పవిత్రమైన హృదయం లేకుండా పవిత్రనదీ స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కబీర్ పేర్కొన్నారు.
మానవ ఆవిర్భావం నుంచి మనుషులను విడదీసే తేడాలేవీ లేవని, విభేదాలన్నీ మనం సృష్టించుకున్నవే అని కబీర్ పేర్కొన్నారు.

 ముస్లిం మతపెద్దలు హిందూ మతంలో ఉన్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను; యోగా విధానాలను గ్రహించి సూఫీ తత్వం లో కలుపుకున్నారు.  సూఫీ, భక్తి ఉద్యమాల తాత్వికల ఐక్యతే  హిందూ, ఇస్లాం మతాల  సంగమానికి కారణం.

సన్యాసులు, హిందూ భక్తి ఉద్యమకారులు చెప్పే విషయాలు, ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకర్షించాయి. భక్తి, సూఫీ ఉద్యమాలకు సహజీవనం, మానవత ఉమ్మడి లక్ష్యాలుగా మారాయి. 

పరమత సహన విధానాన్ని, దైవ ప్రార్థనా ప్రాధాన్యతను, మోక్షమార్గ విశిష్టతను ప్రచారం చేస్తూ హిందూ, ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. దయ. సహనం, సమత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ బోధనలు చేశారు. ఫలితంగా  సన్యాసం, భగవత్ భక్తి లాంటివి ఉపనిషత్తుల్లో కూడా ఉండటంతో సూఫీ సన్యాసులు చేసే   విశ్వాసాలకు,  బోధనలకు తేడా తేడా లేక పోయింది.

మొదట్లో హిందూ-మహ్మదీయ మతాలు పరస్పర ద్వేషంతో ఉండేవి. భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న మహ్మదీయమతం; భారత్ నుంచి ఇస్లాం మతాన్ని పారదోలాలని హిందూమతం భావించాయి. కానీ అవి తమ లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి కలిసిమెలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు మతాల వారు అవతలి మతంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను స్వీకరించి; భక్తి, సూఫీ ఉద్యమాలను ప్రారంభించారు. వీటి ఫలితంగానే ఇండో ఇస్లామిక్ సాంప్రదాయం ఏర్పడింది. పరమత సహన విధానాన్ని పాటించారు. కులమత భేదాలను ఖండించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు.
హిందూమతానికి చెందిన పండుగలు, ఉత్సవాల్లో ముస్లింలు; ముస్లింల పండుగల్లో హిందువులు పాల్గొని హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. హిందువుల్లో ఉన్న సతీసహగమన విధానాన్ని, స్వస్తిక్ గుర్తును వాడటం లాంటి ముస్లింలు అనుసరించారు. 
ముస్లిం పండగలైన మొహర్రం, రంజాన్ లాంటి పండుగల్లో హిందువులు పాల్గొని మత సామరస్యానికి దోహదపడ్డారు. అది నేటికీ కొనసాగుతోంది.


___ పిళ్లా కుమారస్వామి
9490122229

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం