రంగనాయకమ్మ
రంగనాయకమ్మ!
——————-
రంగనాయకమ్మ. రచయిత. మహిళా రచయిత. మంచి రచయిత. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాదు. ఇప్పుడామె ఒక 'విప్లవ రచయిత.' మానవ సమాజానికి కావాల్సిన అనేక సంగతుల మీద అసంఖ్యాకంగా రాస్తున్న ఒక 'బహుముఖ ప్రజ్ఞాశాలి.'
ఈ మాట కొందరికి రుచించక పోవొచ్చు. కానీ అదే నిజం. సమకాలికుల్లో పాండిత్య పోటీ ఉంటుంది. 'ఎవరు గొప్పా' అనే సాహిత్య ఆధిక్యత ఉంటుంది. ఈమె మహిళ కాబట్టి ఇంకొంచం పురుషాధిక్యత ఉంటుంది. చేకూరి రామారావు వంటి వాళ్లకు ఇంకొంచం అకడమిక్ ఆధిక్యత కూడా ఉంటుంది.
వాటిని పక్కన బెట్టి, పాఠకుల వేపు నించీ చూస్తే, ఇన్నేళ్ల ఆమె కృషి ఫలించి నట్లే. కొన్ని వేల మంది పాఠకులు ఆమె సాహిత్యానికి చేరుకున్నట్లే.
రచనల కోసం రచనలు చేసే వ్యక్తి కాదు ఆమె. ప్రజల కోసం; ఇంకా చెప్పాలంటే- శ్రామికుల కోసం (మేధావుల కోసం మాత్రం కాదు) సరళంగా రచనలు చేస్తున్న వ్యక్తి.
ఆర్ధిక శాస్త్రం మీద రాశారు. తత్వ శాస్త్రం మీద రాశారు. భాషను సరళంగా నేర్పేందుకు ఇంగిలీష్, తెలుగు భాషల మీద రాశారు. రామాయణం మీద రాశారు. భారతం మీదా, వేదాల మీదా రాశారు.
నాస్తిక, హేతువాద, మానవ వాదాలు ఆర్ధిక పునాదిని పట్టించు కోకుండా చేసే వాటిని 'నీడతో యుద్ధం' గా జమకట్టారు.
అప్పటి అలెగ్జాన్త్ర కొల్లంతాయ్ నించీ ఇప్పటి ఫెమినిస్టుల వరకూ రాసే వన్నీ 'అసమానత్వం లో నించీ అసమానత్వం లోకే' అన్నారు.
అస్తిత్వ వాదాలు గా ముందు కొచ్చిన దళిత, స్త్రీ వాదాల మీద, అంబెడ్కర్ మీదా , బుద్ధుడి మీదా, వివేకానందుని మీదా, సర్వేపల్లి రాధా కృష్ణన్ మీదా రాశారు.
చైనా రష్యాలు ఒకప్పుడు విప్లవించాయి. సోషలిజాన్ని వెలిగించాయి. ఇప్పుడు అక్కడ విప్లవం ఓడిపోయింది. సోషలిజం ఆరి పోయింది. మార్క్సిస్టు ప్రయోగం ఆగి పోయింది.
'మానవ సమాజానికి మార్క్సిజం పనికి రాదు' అన్నారు.
‘ఎర్ర భీభత్సమ్’ (గాంధీ) అన్నారు.
‘ఐరన్ కర్టన్’ (చర్చిల్) అన్నారు.
‘పందుల సిద్ధాంతం’ (అంబెడ్కర్) అన్నారు. ‘మనిషిని పట్టించు కోని సిద్ధాంతం’ (రాయ్) అన్నారు. ఇంకా చాలా చాలా అన్నారు.
‘ఆ వైఫల్యం మార్క్సిజానిది కాదు; మార్క్సిస్టులది' అని మొట్ట మొదట ప్రకటించిన వ్యక్తి చార్లెస్ బేతల్ హామ్. ఇతను ఫ్రెంచ్ మార్క్సిస్టు ఎకానమిస్ట్. ఈయన్ని తెలుగు వారికి పరిచయం చేసి, ఆ కోణం లో రష్యా, చైనాల మీదా, మావో, స్టాలిన్ ల మీదా రంగనాయకమ్మ చాలానే రాశారు.
మార్క్స్ చెప్పిన ‘కార్మిక వర్గ నియంతృత్వాన్ని’ ‘పార్టీ నియంతృత్వంగా’ మార్చి, ఒక్కో నాయకుడు ముప్పై ఏళ్ళు కుర్చీలు దిగకుండా, వ్యక్తి పూజలు చేయించుకొని, సోషలిజాన్ని రాజరికంగా దిగజార్చడం వల్లనే, ‘అక్కడి విప్లవాలు వైఫల్యం’ చెందాయని రాశారు.
దీని మీద తెలుగునాట చాలా చర్చ జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు కోప్పడ్డాయి. మార్క్సిస్టు మేధావులు రాద్ధాంతం చేశారు. ఆయినా ఆమె అలానే వున్నారు. అలానే రాస్తున్నారు.
ఆమెదో స్కూలు. ఆమెదో స్కెలు.
ఆగిపోయిన మాస్కో ప్రచురణల్ని ఇప్పుడు 'ప్రగతి ప్రచురణల' పేరిట సొంతంగా తెస్తున్నారు.
ఆ పుస్తకాల్లో అసలు రచయితలు (వాళ్ళు మార్క్స్, ఎంగెల్సు లు కావొచ్చు. లెనిన్, టాల్స్టాయ్ లు కావొచ్చు. అనీకిన్, యుంగ్చావ్ లు కావొచ్చు) 'ఏం చెప్పారు?' అనే దాని కన్నా; ఆయా పుస్తకాల ముందు మాటా, చివరి మాటా, ఫుట్ నోట్ల లో 'రంగనాయకమ్మ ఏం చెప్పారు?' అనేదే ముఖ్యమై పోయిందంటే పాఠకుల పైన ఆమె ఎంతటి 'తార్కిక ముద్రను' వేశారో అర్థం చేసు కోవొచ్చు.
ఎవ్వరినైనా, ఏ విషయాన్నైనా నిర్విమర్శగా తీసుకునే వైఖరికి బద్ధ వ్యతిరేకి ఆమె.
‘మార్క్సే నా టీచర్' అని, రాసినప్పటికీ;
ఆ టీచర్ ఐన మార్క్స్ హెగెల్ ని గురువుగా భావించి, ‘గతి తర్కాని' కి అంత విలువ ఇవ్వడం తనకి నచ్చనప్పుడు; ఆ నచ్చక పోవడాన్ని నిర్మొహమాటంగా చెప్పడానికి, ఏమీ వెనకాడని వ్యక్తి రంగనాయకమ్మగారు!
కాపిటల్ అంటే తనకి ప్రాణం. అది ఆమెకు ఒక జపం. ఒక మంత్రం. ఆ పుస్తకాన్ని గురించీ ఆల్తూజర్, డేవిడ్ హార్వే, కార్న్ ఫోర్తులు చెప్పినప్పటికీ ప్రపంచం లో ఇంత విస్తృత ప్రచారాన్ని చేసిన వారు ఇంకొకరు లేరంటే అది అతిశయోక్తి కాక పోవొచ్చు.
కాపిటల్ విషయం లో ఆమె మార్క్సుకి భక్తురాలు. కానీ అంత భక్తి లోనూ ఆమెకు విమర్శ ఉంటుంది. విమర్శ వున్న చోట 'మౌనంగా ఉండడం' అనేది ఆమెకు చేత గాని పని.
మార్క్స్ దృష్టిలో సమాన విలువల మధ్యనే మారకం జరుగుతుంది.
కార్మికుడి లో వుండే ‘శ్రమ శక్తి’ అనేది కూడా ఒక సరుకే. అన్ని సరుకులకీ ఎలాగైతే డబ్బు చెల్లించి మార్కెట్ లో కోనుగోలు చేస్తాడో ఈ శ్రమ శక్తి అనే సరుకుకి కూడా ‘జీతం’ అనే పేరుతో డబ్బును చెల్లించి దాన్ని కోనుగోలు చేస్తాడు. ఆ కొనడం లో అప్పటికి సమాన విలువుల మధ్యన మారకం పూర్తవుతుంది.
వాటితో వస్తువుని తయారు చేయించి దాన్ని మార్కెట్లో అమ్ముతాడు. అలా అమ్మిన వస్తువు తనకి లాభాన్ని తెచ్చి పెడుతుంది. ఆ లాభమే 'అదనపు విలువ'.
తయారైన వస్తువులో కార్మికుని శ్రమ తప్ప, మిగతా వాటిలో వున్న దంతా
నిర్జీవ శ్రమ. ఒక్క కార్మికుని లో వున్నది మాత్రమే సజీవ శ్రమ.
నిర్జీవ శ్రమలు తమకన్నా ఎక్కువ విలువను ఇవ్వ లేవు. సజీవ శ్రమ మాత్రమే తన కన్నా ఎక్కువ విలువను ఇవ్వ గలదు.అలా ఎక్కువ విలువను ఇవ్వ గలిగే ‘శ్రమ శక్తి’
మార్కెట్లో దొరకడం ఆ పెట్టుబడి దారుని అదృష్టం. స్థూలంగా మార్క్స్ చెప్పేది ఇదే.
ఇక్కడ మార్క్స్ తో ఆమెకు విభేద ముంది. కార్మికునికీ, పెట్టుబడి దారునికీ మధ్యన వున్నది ‘దోపిడీ సంబంధమే’ తప్ప; ఎలాంటి ‘మారక సంబంధం’ లేదని, శ్రమ శక్తిని సరుకుగా మార్క్స్ చెప్పి ఉండ కూడదనీ, పైగా అలాంటి సరుకు మార్కెట్లో దొరకడం పెట్టుబడిదారుని ‘అదృష్టం’ లాంటి మాట మార్క్స్ అస్సలు అని ఉండ కూడదని రంగనాయకమ్మ గారు అంటారు.
'రంగనాయకమ్మ మార్క్స్ చెప్పిన దాన్ని సాంకేతికంగా తీసుకోకుండా, నైతికంగా అర్థం చేసుకుంది' అనే వారు లేక పోలేదు. ఇదంతా ఇక్కడ చూపినంత తక్కువలో కాదు; ఇంకా చాలా వుంది. దాన్నంతా ఇక్కడ చూడలేం.
మార్క్సిజం బాగా ఎరిగిన వాళ్లూ, విప్లవ రచయితలూ, విప్లవ కారులూ సాంస్కృతిక విషయాల్లో వెనకబడి ఉండడాన్ని ఆమె ఒప్పుకోరు.
'పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట పుంజుకునేదెప్పుడు సరదా పడి మాచకమ్మ సమర్తాడి నప్పుడు' అని,
‘పళ్లూడిన ముసల్ది చీర కుచ్చిళ్ళు సవరించుకున్నట్లు' అని శ్రీశ్రీ రాసారు.
అలాగే ‘రివిజనిజం ఇవ్వాళ రంకు నేర్చుకున్నది' అని వరవరరావు రాశారు.
గద్దర్ కూడా ఇంచుమించు ఇలాగే రాసారు.
వీరందరి మీదా ఆమెకు విమర్శ వుంది. వీరి మీదే కాదు; ఏకంగా కారల్ మార్క్సు మీద కూడా వుంది.
‘స్త్రీలలో మీకు నచ్చేది ఏమిటి? అని, ఒక ఇంటర్వ్యూలో అడిగితే; 'బలహీనత' అని మార్క్స్ చెబుతాడు. దీని మీద 'మీ అభిప్రాయం ఏమిటి?' అని, ఈమెను ఇంటర్వ్యూ చేస్తే;
‘ఏమంటాం బుద్ధిలేనోడు అంటాం. కల్చరల్ గా చాలా బ్యాక్వాడ్ గా వున్నాడు అంటాం. లెనినూ, ఎంగెల్సు ఇట్లా వుండరు.' అని జవాబిస్తారు.
అట్లా అని లెనిన్ మీద విమర్శ లేదనికాదు. లెనిన్ కి వేటాడే హాబిట్ వుంది. 'విప్లవకారులు జంతువుల పట్ల దయతో ఉండాలి గానీ ఈ వేట ఏమిటి?' అనే విమర్శ లెనిన్ మీద ఒకటి వుంది. అంటే మినహాయింపులు లేని భౌతిక వాది ఆమె.
ప్రజా పోరాటాలు చేసే వారు తమ సాహిత్యాన్ని ప్రజల భాషలో రాయాలి. అలా రాస్తేనే ప్రజలు ఆ సాహిత్యానికి చేరుకోగలరు. వాడుక భాషలో రాయని వారి మీద 'కుట్ర' అనే కథను రాశారు. ఈ వాడుక భాష మీదా, వాడుకలో లేని 'బడు ప్రయోగం' మీద భాషా శాస్త్ర వేత్తలకీ ఈమెకూ మధ్యన అప్పట్లో భారీ స్థాయిలో ‘భాషా ఘర్షణ’ జరిగింది.
స్త్రీ, పురుషుల మధ్య సమానత్వానికి ఇంటి పనిని, బైట పనిని ఇద్దరూ సమానంగా పంచు కోవాలని,
అలాగే కులాలు పోవాలంటే శారీరక, మేధా శ్రమల మధ్యన ఇప్పుడు వున్న బూర్జువా శ్రమ విభజన పోయి, సోషలిస్టు శ్రమ విభజన రావాలని ఇంతటి వివరణని ఎవ్వరూ ఇవ్వ లేదేమో?
ఈ తరం అమ్మాయిలు ఆమె రచనల్ని గాని చదివితే; వాళ్ళ జీవితాల్లో; ఏ పొరపాట్లూ జరగకుండా పరమ ‘ఆత్మ గౌరవం’ తో బతికెయ్యొచ్చు.
"నువ్వు బాగా అందంగా వున్నావు.' అని, ఎవరైనా (ఏ అబ్బాయైనా) ఒక అమ్మాయిని గాని అంటే;
ఆ అమ్మాయి ముందు వాడి పళ్ళు రాల గొట్టాలి"
లాంటి మాటలు ఇంక వేరే వాళ్ళ రచనల్లో ఎక్కడైనా చూడ గలమా?
“నీకు డిగ్రీలు ఎందుకూ...ముందు ఆ చదువు ఆపెయ్" అని, ఏ భర్త అయినా ఒక భార్యకు షరతు పెడితే;
‘వాడి మొఖాన వున్న ఫలాన విడాకులు పడెయ్యాలి’
అని, ఎవరైనా రాయ గలిగారా?
అమ్మాయిలే కాదు; 'అమ్మకు ఆది వారం లేదా?' చదివితే అబ్బాయిలు బాగు పడరా?
జానకి విముక్తి చదివితే అత్తా కోడళ్లు, మొగుడు పెళ్ళాలు ఎంత హాయిగా ఒద్దికగా కాపురాలు చేసుకోవొచ్చు.
చుట్టాలు చదివిన మనుషులు వాళ్ళ జీవితాల్లో ఇంక ‘చుట్టాలు' గా ఉండ గలరా ?
ఇలాంటివి ఇంకా ఎన్నో వున్నాయి. ఒక్క వ్యాసం లో రంగనాయకమ్మ గారి మొత్తం సాహిత్యాన్నీ, ఆమె సృజనా శక్తినీ, ప్రజ్ఞా పాటవాన్నీ చెప్పు కోలేం.
Comments
Post a Comment