సత్యశోధక్ సమాజ్ తాత్వికత





jotiba phule

         బ్రిటిష్ వారి రాకతో అప్పటి భూస్వామిక వ్యవస్థ కదలడం ప్రారంబించింది.  1819 నాటికే మహారాష్ట్ర లో పీష్వా ల పాలన అంతమై బ్రిటీష్ వారి చేతుల్లోకి పోయింది.వారు ప్రవేశ పెట్టిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భారతీయ సమాజం,సంస్కృతి పెనుమార్పులకు లోనయ్యింది. శూద్రులకు చదువు అందుబాటులోకి వచ్చింది.

      వివిధ దేశాల్లో ‘ప్రాపంచిక జ్ఞానం’,   ‘తాత్విక చింతన’  సాహిత్యం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. కానీ మనదేశంలో మాత్రం తాత్విక చింతన విశ్రాంత వర్గం దగ్గరే ఉండి పోయింది. ఆంగ్లేయులు రాకతో  విద్య సామాజిక పరమైనది. అప్పుడు బహుజనుల్లో విప్లవాత్మక భావాలు, సామాజిక తిరుగుబాట్లు మొదలయ్యాయి.

       తోటమాలి  కులానికి చెందిన శూద్రుడు, (ఇప్పుడు ఓబిసి ) మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన  జ్యోతిరావు పూలే (11-04-1827 to 28-11-1890) సత్యశోధక్ సమాజ్ ను 1873 లో పూనాలో స్థాపించాడు.ఆర్య సమాజ్ దీని తరువాత రెండేళ్లకు ఏర్పడింది.సత్యాన్ని కనుగొనే సామాజిక సంస్థ సత్యశోధక్ సమాజ్.

       అణగారిన వర్గాలైన శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజ ముఖ్య ఉద్దేశం. జ్యోతీబా సతీమణి సావిత్రి బాయి మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారు. సావిత్రిబాయి పూలే దంపతులతో కలసి సామాజిక సేవ చేసింది ఫాతిమా షేక్. ఫూలే దంపతులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంది. తాను కూడా లౌకిక విద్యను నేర్చుకుని  సావిత్రిబాయి తో కలసి విద్యబోధన చేసిన తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు.

     బ్రాహ్మణీయ సామాజిక-సాంస్కృతిక-ఆర్థిక-రాజకీయ అసమానత వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన ప్రధాన వ్యక్తిలలో ఫూలే ఒకరు.అసమానతలపై ధిక్కార స్వరం, సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే.

       సత్యశోధక్ సమాజ్  ఉపనిషత్తులను, వేద సంసంస్కృతిని తిరస్కరించింది. ఆర్యన్ సమాజాన్ని కూడా వీరు తిరస్కరించింది. విగ్రహారాధన ఖండించింది.కుల వ్యవస్థను  నిరాకరించింది. దశావతారాలను తిరస్కరించింది.బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది.  మూఢవిశ్వాసాలను ఖండించింది. దేవతలను ప్రార్థించడానికి మధ్యవర్తిగా పూజారి అవసరం లేదని చెప్పింది.మహిళలు, నిమ్న కులాలలో విద్యను ప్రోత్సహించింది.బ్రాహ్మణుల అశాస్త్రీయ, సనాతన పద్ధతులకు వ్యతిరేకించింది. మద్యం సేవించడం మంచిది కాదని చెప్పింది.

     మహాత్మా జ్యోతిరావు పూలే పై బుద్ధుని బోధనలు అపారమైన ప్రభావాన్ని చూపాయి. బుద్ధుని బోధనలు వారి జీవిత గమ్యాలనే నిర్దేశించాయి. ఫలితంగా ఇతని కార్యాచరణ    భారత ప్రజల జీవితంలో వెలుగులు నింపింది. రాజకీయ తత్వవేత్త థామస్ పైన్ రాసిన “రైట్స్ ఆఫ్ మ్యాన్” ను, ఇతర మత గ్రంథాలను చదివి ప్రభావిత మయ్యాడు జోతిరావు ఫూలే.  ఆయన రాసిన  సర్వజనిక్ సత్యధర్మ , గులాంగిరి గ్రంథాలు సాధారణ ప్రజలకు స్ఫూర్తి నిచ్చాయి. బ్రాహ్మణులు రాముని కీర్తిస్తే, అందుకు భిన్నంగా జ్యోతిబా ఫూలే  బలి చక్రవర్తి ని కీర్తించమని  పిలుపునిచ్చాడు. జ్యోతిరావు ఫూలే "దీన బంధు" అనే వార్తాపత్రికను ప్రారంభించి తన సంస్థ భావాలను ప్రచారం చేశాడు.

      సత్య శోధక్ సమాజ్ ఆధ్వర్యంలో, సతి, బలవంతపు వితంతువు, బాల్యవివాహాలు, శిశు హత్యలకు (గర్భస్రావం/శిశుహత్యలు) వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఫూలే. అన్ని రకాల అణచివేతలను అంతం చేయడానికి, ఫూలే, మహిళలకు తప్పనిసరి విద్యను సూచించాడు; అలాగే మహిళల పట్ల పరిమితులను శాశ్వతం చేసిన బ్రాహ్మణీయ గ్రంథాలను తిరస్కరించాలాని ఆదేశించాడు. శూద్ర-అతిశూద్ర కులాలలో ఉన్న పితృస్వామ్యాన్నీ కూడా వ్యతిరేకించాడు ఫూలే. మహిళల అణచివేతకు ముగింపు, బ్రాహ్మణీయ శాస్త్రాలు/వేదాలను పూర్తిగా తిరస్కరించడంలోనే ఉందన్నారు. ఆ శాస్త్రాలు అన్ని కులాల మహిళల గురించి హానికరమైన నిబంధనలకు పునాది    వేశాయని ఫూలే తన రచనలలో వివరించాడు. శూద్ర-అతిశూద్ర మహిళగా, తాను కుల అవమానాన్ని/అంటరానితనాన్ని ఎదుర్కొంటుంది, ఒక మహిళగా, నిరంతరం ఇంటిచాకిరికే పరిమితమవుతుందని ఫూలే భావించాడు. మహాత్మా ఫూలే 1855 లో శ్రామిక వర్గాల కోసం రాత్రి పాఠశాలలను కూడా ప్రారంభించాడు. జ్యోతిబా ఫూలే మాతృభాషలో బోధన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పారు.

           తన సహచరి సావిత్రిబాయితో కలిసి, బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక రాడికల్ ఉద్యమానికి పునాదులు వేసాడు ఫూలే.సావిత్రిబాయి మరియు ఫాతిమా షేక్ లకు విద్యను అందించిన జోతిరావు ఫూలే, ఇంకో అడుగు ముందుకెళ్లి 1848 లో భారతదేశంలో అంటరాని బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. 
    ఆయన తన   ‘సేద్యగాని చర్నాకోల’ గ్రంధంలో,  రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ, ఏవో పండగల పేరిట రైతులకు వచ్చిన కొద్దిపాటి ఆదాయాన్ని కోల్పోయే విధంగా చేస్తున్న బ్రాహ్మణ పూజారుల కుట్రలను బహిర్గతం చేశాడు. ఫూలే, ఉత్పత్తి పరిస్థితులు-సంబంధాలు, సమాజంలో ఉన్న సామాజిక-సాంస్కృతిక-ఆర్థిక ‘వైరుధ్యం’ (షెట్జీ-భట్జీ వర్సెస్ శూద్ర-అతిశూద్రులు) వల్ల ప్రభావితమవుతాయని నిరూపించాడు. డాక్టర్ అంబేద్కర్, ఫూలే ని “గ్రేటెస్ట్ శూద్ర” గా అభివర్ణిస్తూ తన “శూద్రులు ఎవరు?” పుస్తకాన్ని ఫూలే కి అంకితం చేసాడు.

       జాతీయవాదం, దేశభక్తి నినాదాలు  ఎలాంటి విలువలను ప్రచారం చేయవు. సత్యాన్వేషణ, శాస్త్రీయ విజ్ఞాన, హేతుబద్ధత, విద్య,  ప్రజాస్యామ్యం, మహిళా విముక్తి,  సమానత్వం లాంటి విలువలు ఈ అసమానతల దేశంలో సమూల పరివర్తనకు ప్రాథమిక అవసరాలు. అట్టడుగు శ్రామిక వర్గాల దృక్పథం అలవరుచు కోవడం నేడు చాలా అవసరం ఉంది.
ఈ విలువలను దేశానికి పరిచయం చేసినవాడు ‘మహాత్మా’ జోతిరావు ఫూలే. 
        వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు, శూద్రబాలికలు  అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చి, పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్‌ను చేశారు.1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.
       ఫూలే మరణానంతరం ం  ఆయన సహచరి సావిత్రిబాయి సంస్థకు అధ్యక్షురాలైంది. ఆమె సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది. ఆమె కూడా పాఠశాల లను నడిపింది. ఆమె బోధకురాలుగా పని చేసింది. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా ప్రసిద్ధి చెందింది.ఆమె మంచి వక్త.కులం, పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి.విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు.నేటి కస్తూరిభా గాంధీ బాలికోన్నత పాఠశాలల స్థాపనకు సావిత్రి బాయి కృషే ప్రేరణగా నిలిచింది.1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. 1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారుసావిత్రిబాయి. పురోహితుడు లేకుండా ఒక వివాహం జరపడం చరిత్రలోనే మొదటిసారి.
       సావిత్రిబాయి పూలే  1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో భావన్‌కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, వేడుకలు వంటి ఆర్భాటాలకోసం శక్తికి మించిన ఖర్చులుచేసి అప్పులపాలయ్యే వాళ్ళను విమర్శిస్తూ ''కర్జ్‌'' అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి హేతుబద్దత కవితల్లో ప్రతిబించించేవారు.

        సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది.1897వ సంవత్స రం, మార్చి 10న ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది.

       ఆమె తదనంతరం భరావు పాటిల్,  కేశవరావు జెధే, నానా పాటిల్, ఖండేరావ్ బాగల్, మాధవరావు బాగల్  ఈ ఉద్యమాన్ని విస్తరించారు.1930 లో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన జాతీయోద్యమంలో  సమాజ్ నాయకులు  చేరడంతో  ఆ సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి.

___  కుమారస్వామి,9490122229



  

 




 






 

 

 



 






 




 








      

        


 



 

       

     

    

     

    

    

 


     

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం