ఆర్యసమాజ్ సామాజిక చింతన
ఆర్యసమాజ్ ను సొసైటీ ఆఫ్ నోబుల్స్ అని ఇంగ్లీషులో అంటారు. ఇది క్రైస్తవ మిషనరీలు, సూఫీయుల ప్రభావంతో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమైంది. 1875 ఏప్రిల్ 10న ముంబయిలో స్వామి దయానంద సరస్వతి ఈ సమాజాన్ని స్థాపించారు.
దయానంద చిన్నప్పటి పేరు మూలశంకర్. దయానంద సరస్వతి గుజరాత్ లోని టంకారాలో ధనిక శైవ కుటుంబం లో జన్మించినప్పటికీ తన ఉద్యమాన్ని తరువాతి కాలంలో అదే సంవత్సరం పంజాబ్‌లోని లాహోర్‌కు మార్చాడు. 24ఏళ్ల వయస్సు లో సన్యాసం స్వీకరించాడు.దయానంద హిందూ మత ధర్మాల విషయంలో రాడికల్ భావాలు కలిగి ఉన్నాడు. అందువల్ల హిందూ మతం అనుసరిస్తున్న ధర్మాలకు భిన్నంగా సరికొత్త తాత్విక భావాలతో ఈ సంస్థ ను ఏర్పరిచారు. ఈ సంస్థకున్న కొన్ని భావాలు దీని తరువాత యాభయ్ ఏళ్లకు పుట్టిన ఆర్ ఎస్ ఎస్ భావాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించినా ఇవి కలవని రేఖలు గానే ఉన్నాయి. కానీ 2014 లో ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడా హర్యానా మొదలైన ప్రాంతాల్లో పరస్పరం కలుస్తున్నారని కారవాన్ పత్రిక వ్యాఖ్యానించింది.
హిందూ ధర్మాన్ని మూఢ నమ్మకాలకు దూరంగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్లడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. సమసమాజ స్థాపన దీని సిద్దాంతం.
వేదాల్లో విగ్రహారాధన ఎక్కడా చెప్పలేదు. అందువల్ల విగ్రహారాధన, పూజా పద్ధతి సరైంది కాదని చెప్పింది. పురాణాలను ఖండించింది.అవి దేవతల గురించి కట్టు కథలని చెప్పింది.అవి వేద సాహిత్యానికివిష బిందువులవంటివని భావించింది. బ్రాహ్మణ పూజారుల పెత్తనం సమర్ధించలేదు.స్త్రీలకు, హరిజనులకు స్వాతంత్రాన్ని, విద్యను సమర్థించింది. అంతేగాక దేశం నలుమూలలా పాఠశాలలు స్థాపించింది. స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది. విగ్రహాల పూజ, నరబలి, సతీసహగమనాన్ని వ్యతిరేకించింది. వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించింది.వర్ణం పుట్టుకతో రాదని ఆ వ్యక్తి జ్ఞానాన్ని బట్టి వస్తుందని చెప్పింది.బాల్య వివాహాలను వ్యతిరేకించింది.జంతు బలులు వద్దనింది.వితంతువుల కోసం మిషన్లు, అనాథాశ్రమాలు మరియు గృహాలను నిర్మించింది. పాఠశాలలు మరియు కళాశాలల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.కరవు నివారణ , ప్రజా వైద్యం చేపట్టింది. శాఖాహారం తప్పనిసరి చేసింది.బాల కార్మికులు ఉండరాదని చెప్పింది.
ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైనదన్నాడు దయానంద్. పరిపాలనకు సంబంధించి “స్వరాజ్య” అనే పదాన్ని మొట్ట మొదటిసారిగా దయానంద సరస్వతి ఉపయోగించాడు.ఇదే తరువాత లాల లజపతిరాయ్, తిలక్ వంటి జాతీయోద్యమ నాయకులకు ప్రేరణ అయ్యింది. హిందీ ని జాతీయ భాషగా ప్రకటించాలన్నాడు.జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుందీ సంస్థ.
బ్రహ్మ యజ్ఞం (సంధ్యావందనం), దేవ యజ్ఞం (అగ్నిహోత్రం), పిత్ర యజ్ఞం (పెద్దలకు సేవ చేయడం), మనుష్య యజ్ఞం (ఇతర మానవులకు సేవ చేయడం), భూత యజ్ఞం (ఇతర జీవులకు సేవ చేయడం) ఐదు చెల్లుబాటు అయ్యే పూజా విధానాలని చెప్పింది. గోరక్షణ చేయాలనింది.
సుప్రీం రియాలిటీ (ఈశ్వరుడు/బ్రాహ్మణం) ఒకటే.శాస్త్రాలు అతన్ని ఇంద్ర, వరుణ, మిత్ర, సూర్య, అగ్ని మొదలైన అనేక పేర్లతో పిలుస్తాయి. అయితే ఈ సర్వోన్నత వాస్తవికత కు ప్రాథమిక పేరు ఓం (ॐ) అని చెప్పింది.
బ్రహ్మం, ప్రకృతి మరియు జీవాత్మ శాశ్వతంగా ఉన్నాయి. అన్నీ వాస్తవమైనవి. కానీ ఇది అద్వైత తత్వానికి వ్యతిరేకంగా ఉంది. పునర్జన్మను సమర్థించింది
హిందూ మతం గురించి తెలుసుకోవాలంటే వేదాలను మాత్రమే అధ్యయనం చేయాలన్నాడు దయానంద. 'గో బ్యాక్ టు వేదాస్' అనే నినాదాన్ని ఇచ్చాడు. అన్ని తరగతుల వ్యక్తులకు వేదాలు నేర్చుకునే హక్కుందన్నాడు.రుగ్వేద భాష్య భూమిక అనే గ్రంథాన్ని కూడా రాశారు.దయానంద సంస్కృత భాషలో రాసిన 'సత్యార్థ ప్రకాశిక' గ్రంథం ఆర్యసమాజం వారి మూల గ్రంథం. ఈ గ్రంథం 1921లో తెలుగులోకి అనువదించబడింది. సత్యార్థ ప్రకాశిక చాలా బాగాన్నీ ఆదిపూడి సోమనాథ రావు అనువదించగా మిగిలిన దానిని రాజా రత్నమాచారి పూర్తి చేశారు. వివేకానందుడు ఉపనిషత్తులకు ప్రాధాన్యత ఇస్తే, దయానంద సరస్వతి వేదాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
దేశంలో 3,500 ఆర్యసమాజ్ శాఖలున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, బ్రిటన్, నెదర్లాండ్స్, కెన్యా, టాంజానియా, దక్షిణాఫ్రికా, మారి షస్, పాకిస్థాన్, మయన్మార్, సింగ పూర్, హాంకాంగ్ తదితర దేశాలకూ ఈ సమాజం విస్తరించింది.
మదన్ మోహన్ మాలవ్య ఉత్తరప్రదేశ్ లో, లాలాలజపతిరాయ్ పంజాబ్, లాహోర్‌లో ఆర్యసమాజ్‌ను వ్యాప్తి చేశారు.దయానంద సరస్వతి మరణానంతరం విద్యాభివృద్ధి కొరకై లాలాహన్స్ రాజ్, స్వామి శ్రద్ధానంద, లాల లజపతి రాయ్, పండిత్ గురుదత్ కలిసి ఆర్యసమాజ్ డీఏవీ (దయానంద ఆంగ్లోవేదిక్) అనే పాఠశాలను స్థాపించారు.
1892లో ఆర్య సమాజ్ యొక్క శాఖ హైదరాబాద్‌లో ఏర్పడింది.అప్పట్లో హైదరాబాద్ శాఖ అధ్యక్షునిగా కమతా ప్రసాద్‌జీ మిశ్రా ఉన్నాడు.
ఆర్య సమాజ్ మత మార్పిడిలను ఖండించింది. ఆర్య సమాజ్ శుద్ధి అనే ఉద్యమాన్ని చేపట్టి ఇతర మతాల్లో చేరిన హిందువులను గుర్తించి వారిని శుద్ధి చేసి మరలా హిందూ మతంలోకి మార్చించడం ప్రారంభించింది. హిందూ మతంలోకి మారిన(ఘర్ వాపసీ)వారిని ఏ కులంలో చేరుస్తారో తెలియడంలేదు. హిందూమతంలో ఎక్జిట్ ఉంది గానీ, ఎంట్రీ లేదు. వచ్చినా కుల వ్యవస్థ లో ఇమిడి పోవాల్సిందే.
ఆర్య సమాజ్ ను తీర్చి దిద్దిన వారిలో స్వామిరామానందతీర్థ, శ్రద్ధానంద సరస్వతి ప్రముఖులు. దీంట్లో సభ్యులుగా కేశవరావు, కొరాట్కర్, గణపతి హార్టికార్, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, దామోదర్ సత్యలేకర్, ఎం.ఆర్. శ్యాంరావు మొదలైన ప్రముఖులు ఉండేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజన్ను నడిపింది స్వామి రామానందతీర్థ . హయగ్రీవాచారి, కాళోజి నారాయణరావు గారు వరంగల్ ప్రాంతంలో ఆర్యసమాజం శాఖలు ఏర్పరిచారు. సీతయ్య గుప్త 'సత్యార్థ ప్రకాశిక' గ్రంథాలను అచ్చు వేయించి ఉచితంగా పంచాడు.
సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లను ఆర్య సమాజ్(Arya samaj)నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు కాదన్నా, కుల, మతాలను ఎదిరించిన జంటలను ఒక్కటి చేసిందీసంస్థ. ఈ వేదిక జారీ చేసే వివాహ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై సమాజంలో విశ్వసనీయత ఉంది. అయితే ఇటీవల వివాహాలు చెయ్యడం, మ్యారేజీ సర్టిఫికెట్ జారీ చేయడం ఆర్యసమాజ్ పనికాదని, అందుకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఒక కేసులో వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఆర్య సమాజ ధర్మాలు
1. భగవంతుడే నిజమైన జ్ఞానం. అదే అన్నింటికీ ప్రాథమిక మూలం.
2. దేవుడు ఉనికిలో ఉన్నాడు, తెలివైనవాడు. ఆనందకరమైనవాడు. నిరాకారుడు, సర్వజ్ఞుడు, న్యాయవంతుడు, దయాళువు, పుట్టనివాడు, అంతులేనివాడు, మార్పులేనివాడు, ప్రారంభం లేనివాడు, అందరికి ఆసరా, అన్నింటికి యజమాని, సర్వవ్యాపి, అస్థిత్వం, వృద్ధాప్యం, అమరత్వం, నిర్భయ, శాశ్వతమైన మరియు పవిత్రమైన సృష్టికర్త. అతడే పూజింపబడుటకు అర్హుడు.
3. వేదాలు నిజమైన జ్ఞానం యొక్క గ్రంథాలు. వాటిని చదవడం, బోధించడం, చెప్పడం, చదవడం, వినడం ఆర్యుల ప్రథమ కర్తవ్యం.
4. సత్యాన్ని అంగీకరించడానికి, అసత్యాన్ని వదులుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
5. తప్పొప్పులను పరిశీలించిన తర్వాత కర్మ యొక్క ఆదేశాల ప్రకారం ప్రతిదీ చేయాలి.
6.ఈ ప్రపంచానికి మంచి చేయడం ఈ సమాజం యొక్క ప్రాథమిక లక్ష్యం. అందుకు కృషి చేయాలి.సమాజంలో అందరి భౌతిక, ఆధ్యాత్మిక,సామాజిక పరిస్థితులను మెరుగుపరచాలి.
7. ప్రజలందరినీ శ్రద్ధగా, న్యాయంగా, ధర్మంగా , వారి యోగ్యతలను గౌరవించాలి.
8. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి.
9. ఒక్కడు తన యోగక్షేమాలు మాత్రమే చూసుకోకుండా , ఇతరుల శ్రేయస్సును కూడా చూడాలి.
10. సమాజ శ్రేయస్సు కు లోబడే వ్యక్తి ప్రయోజనాలు ఉండాలి; అతనికి సంబందించిన విషయాలలో, అతను స్వేచ్ఛ అనుభవించాలి.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment