అశోకుని తాత్విక చింతన


అశోకుని తాత్విక చింతన

       డిల్లి సుల్తాను ఫిరోజ్ -షా-తగ్లక్(1351-1388AD)  టోపరా ప్రాంతంలో ఉన్న అశోక స్థంబాన్ని 8,400 సైనికుల సాహయంతో ఢిల్లీ కి తెప్పించాడు. ఈ స్థంభం మీద ఏం రాసి ఉన్నదో తెలుసుకోవాలని దేశంలో ఉన్న అనేక  పండితులను చదివి రాయమన్నాడు. ఆ స్థంభం మీద ఉన్న లిపిని ఏ ఒక్క  పండితుడు చదవలేకపోయాడు.
     తర్వాత కాలం లో అక్బర్,బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన సుప్రీం కోర్టు జడ్జి సర్ విలియం జోన్స్ ( 1746-1794 ), బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ప్రయత్నించారు.   జేమ్స్ ప్రిన్సెప్ 1836లో శ్రీలంకలో బౌద్ద బిక్షువుల సహాయంతో ఈ లిపి ధమ్మలిపి అని తెలుసుకొని ఆ లిపిని వారి వద్ద నేర్చుకుని వచ్చి ఆ స్థంభం మీద ఉన్న రాతను మొట్టమొదటిసారి చదివాడు. ఇది 2250 సంవత్సరాల ప్రాచీన సామ్రాట్ అశోక స్థంభం అని తెలుసుకున్నాడు.
        ఈ ప్రపంచానికి గొప్ప పరిపాలన అందించిన, నలంద లాంటి వేల విద్యాలయాలను స్థాపించి ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టిన అశోకుని గురించి 1836 లో జేమ్స్ ప్రిన్సేప్ చెప్పే వరకు ఈ దేశానికి తెలియదని మార్షల్ కాంబ్లే డిగంబర్ నాగా పేర్కొన్నారు.
        భారతదేశంలో మౌర్య సామ్రాజ్యన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్య. ఆయనే ఆ వంశంలో మొదటి రాజు. అలాగే చివరి రాజు బృహదత్తు మౌర్య.సాధారణ శకం కు ముందు 185 లో శృంగవంశానికి చెందిన పుశ్యమిత్ర శృంగుని కుట్రపూరిత  దాడిలో ఈ మౌర్యవంశ చివరిరాజు బృహదత్ హతమయ్యాడు. 304 - 232 BCEలో అధికారం లోకి వచ్చిన అశోక మౌర్య చంద్రగుప్తునికి మనుమడు. ఇతను సాధారణ శకానికి ముందు 304 ప్రాంతంలో జన్మించాడు.
మగధ చక్రవర్తిగా తన స్థానాన్ని దక్కించుకున్న తరువాత, సామ్రాట్ అశోక్ కళింగ (ఆధునిక ఒడిశా రాష్ట్రం) రాజు రాజా అనంత పద్మనాభ పై అతి భీభత్సంగా  యుద్ధం చేసి క్రీ.పూ 260 లో విజయం సాధించాడు.ఆ యుద్ధంలో చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా లక్ష మంది మరణించారు. లక్షకు పైగా  నిరాశ్రయులయ్యారు.
        మహాభారతం కురుక్షేత్ర యుద్దం లో కూడా ఎన్నో లక్షలమంది మరణించినట్లు ప్రస్తావన ఉంది. కానీ ఇది బహుశా రచయిత అతిశయోక్తుల తో ఊహా సామర్ధ్యముతో రాసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. పురావస్తు పరిశోధకుల ప్రకారం మహాభారత కాలమైన 1000BCE నాటికి అంత జనవాహిని లేదని గమనించాలి. కలింగ యుద్దం తరువాత చూస్తే అశోకుడు దాదాపు భారత ఉపఖండం(నేటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ నేపాల్ శ్రీలంక ఇండియా) మొత్తాన్ని సుమారుగా పరిపాలించిన భారతీయ మొట్టమొదటి చక్రవర్తి. 269 ​​BCE నుండి 232 BCE వరకు 37 ఏళ్లు మనోరంజక పాలన సాగించాడు.
           అతని సామ్రాజ్యం పశ్చిమాన తూర్పు ఇరాన్ నుండి, తూర్పున అస్సాం వైపు హిందూ కుష్ పర్వతాల గుండా విస్తరించింది.  ప్రస్తుత తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాల మినహా మొత్తం భారత ఉపఖండాన్ని కవర్ చేసింది.అశోకుని సామ్రాజ్యానికి తక్షశిలా, ఉజ్జయిని , పాటలీపుత్ర రాజధానిగా ఉన్నాయి. అశోకుడిని సామ్రాట్ అశోకగా సూచిస్తారు. అశోకుని 'అశోక ది గ్రేట్' అని కూడా పిలుస్తారు.

          కలింగ యుద్ధం అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అంతర్మధనానికి లోనయ్యాడు. యుద్ధంతో మానవాళికి జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్నాడు. ఆత్మవిమర్శ చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో దుఃఖించాడు. మానసికంగా అతనిలో పరివర్తన వచ్చింది. ఆయుధాలు త్యజించి అహింసను ఆహ్వానించాడు. బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యాడు. కళింగ యుద్ధం ముగిసిన పదిరోజుల తర్వాత సరిగ్గా దశమి రోజున తను చేసిన రక్తపాతానికి పరితపిస్తూ బౌద్ధ ధమ్మ దీక్షను క్రీ.పూ 263 లో   స్వీకరించాడు. చండాశోకుడు ధమ్మాశోకుడుగా మారాడు. యావత్ దేశం అతనిని అనుసరించింది.  బౌద్ధమే జాతీయ మతమైంది. (National Religion). యుద్ధాలు లేవు, దౌర్జన్యాలు లేవు. దానినే స్వర్ణయుగమన్నాడు ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు హెచ్.జి. వెల్స్. ది అవుట్లైన్ ఆఫ్ హిస్టరీలో, హెచ్.జి. వెల్స్ ఇలా రాశాడు. "చరిత్ర స్తంభాలను, ఘనత, దయ, ప్రశాంతత, రాజోన్నత కలిగి ఉన్న పదివేల మంది రాజుల పేర్ల మధ్య, అశోకుడి పేరు ఏకైక నక్షత్రంగా ప్రకాశిస్తుంది." 
       అశోకుడు విజయం సాధించిన ఆ దశమి రోజు విజయ దశమి అయ్యింది. ఆ రోజు తన రాజ్యమంతా విజయోత్సవాలు, వేడుకలు చేసుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా అదే దశమి రోజున బుద్ధ విగ్రహం పాదాల దగ్గర తన ఆయుధాలు పెట్టి అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని స్వీకరించాడు. బౌద్ధ గురువు మొగలి పుత్త తిస్స ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధం వ్యాపించడానికి అశోకుడు చేసిన విశేషమైన కృషి చేశారు. పురావస్తు పరిశోధకుడైన అబూ రేహాన్  అల్-బిరూనీ (973-1048 C.E.) రాసిన ‘‘అల్ – బిరూనీ క భారత్ ’’-  గ్రంథం ప్రకారం అశోకుడు బౌద్ధం స్వీకరించిన  రోజున ప్రజలు దీపదానోత్సవం నిర్వహించారు. అదే తర్వాత కాలంలో దమ్మ దీపావళి గా మారింది. బుద్ధుడు అప్పొ దీపో భవ అన్నాడు అంటే నీకు నీవే ఒక దీపమై వెలుగు అని అర్థం. అందుకనే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజును ప్రజలు తమ ఇళ్లలో దీపాలను వెలిగించుకున్నారు.
      బుద్ధుడు బోధించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమన్యాయాలను, ఇతర ధర్మాలను ఆలంబనగా చేసుకున్నాడు.దీనికి ప్రతీకగా అశోక్  ఒక ధర్మచక్రం తయారు  చేయించాడు.ఇందులో 24 ఆకులు (స్పోక్స్) ఉన్నాయి. దీన్ని తన రాజధాని సారనాథ్ లో అశోక స్తంభంలో ఉపయోగించాడు.సారనాథ్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి ఈశాన్యదిశలో 13 కి.మీ. దూరాన  ఉంది.సారనాథ్‌లో  అశోకుడు 250 BCEలో  స్థాపించిన స్తంభానికి అశోక సింహ రాజధాని   అంటారు. ఇది నాలుగు తలల సింహం.ఇదో జింకల వనం.దీంట్లో గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మోపదేశాన్నిచ్చాడు.అశోకుడు బౌద్ధమతంలోకి మారిన తర్వాత ఇక్కడ నిర్మించాడు.
         సంస్కృతం లో "అశోకా" అంటే "నొప్పిలేకుండా, దుఃఖం లేకుండా" ( అ అంటే లేని, శోక" బాధ")అని అర్థం. అతని శాసనాలలో మాత్రం ఆయనను దేవనాంప్రియా (పాలి దేవనాస్పియా లేదా "దేవతల ప్రియమైనవారు"), ప్రియదర్శన్ (పాలి ప్రియాదాస లేదా "ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా గౌరవించేవాడు") అని పిలుస్తారు. సారకా అసోకా చెట్టు, లేదా "అశోక చెట్టు"కు అతని పేరుకు సంబంధం ఉంది.  ఆయనకు వాటిపట్ల ఉన్న అభిమానాన్నిబట్టి వాటికా పేరు వచ్చిందని 'అశోకవదన'లో ప్రస్తావించారు.


       తన పాలన, శాంతి నియమావళి  ప్రజలకు అనుకూలమైన నియమావళిని అందించగలదని భావించాడు.   తన పాలన మొదలైన  పదకొండవ సంవత్సరంలో అతను ప్రభుత్వ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన శాసనాలను జారీ చేయడం ప్రారంభించాడు. భారతదేశంలో ఇవే మొట్టమొదటి శాసనాలు గా చెప్పవచ్చు.రాముని కథ కావ్యంగా ఉందేగాని ఎక్కడా శాసనాల్లో లభించలేదు.  అశోకుని గొప్ప తనంమంతా శాసనాల ను రాళ్ళు, స్తంభాలపై సాధారణ పదాలతో  స్థానిక మాండలికాలలో చెక్కాలని ఆదేశించాడు.  అక్షరాస్యులైన సాధారణ ప్రజలు ఎవరైనా వాటిని అర్థం చేసుకోగలరని భావించాడు. 
        భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ రాతి శాసనాలు ఉన్నాయి.వాటిల్లో ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం, పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలన్నాడు. అహింస ను పాటించాలన్నాడు .మంచి పనులు చేసే మనిషికి వచ్చే జన్మలో సంతోషాన్ని ఇస్తామన్నార .అతను అన్ని సంప్రదాయాలను గౌరవించాలని ప్రజలకు బోధించాడు.ఈ  ధర్మ సూత్రాలను శాసనాలుగా రాళ్లపై చెక్కించాడు.
        ఈ శాసనాలలో, చక్రవర్తి బౌద్ధ విశ్వాసాన్ని పూర్తిగా అంగీకరించినట్లు, మానవ వ్యవహారాలలో  చివరిదాకా బౌద్ధ ధర్మాన్ని దృఢం గా అన్వయిస్తున్నట్లు అందులో రాయించారు.కానీ అందులో మత పరంగా ఉన్నట్లు ఎక్కడా కనిపించదు.వారికి దేవుడిపైగల వ్యక్తిగత విశ్వాసం వ్యక్తం చేయడం గానీ, ప్రస్తావన గానీ చేయలేదు.బుద్దుని గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు.బౌద్ద ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు మాత్రమే ప్రస్తావించారు. ఇతరుల విశ్వాసాల పట్ల సహనం కలిగి ఉండాలన్నారు అశోకుడు తన శాసనాల్లో. బ్రాహ్మణులకు,బౌద్ద భిక్షువులకు బిక్ష వేయాలన్నాడు.
       సారనాథ్ శాసనంలో ప్రజలు సామరస్యంగా ఉండాలని, లేకపోతే జరిమానా విధింపబడుతుందని రాయించాడు.ప్రజలందరూ తన ప్రియమైన పిల్లలని మరియు వారి విభిన్న విశ్వాసాల కారణంగా వారిలో ఎవరితోనూ వివక్ష చూపనని ప్రకటించాడు శాసనాల్లో. ఇవన్నీ ఆధునిక రాజనీతి విలువలకు సంబంధించినవి. వాటిని ఆనాడే ఆయన పాటించడం విశేషం.అన్ని వర్గాల పురుషులను, సన్యాసులు లేదా గృహస్థులను   వివిధ రకాల బహుమతులు,
పూజల ద్వారా గౌరవిస్తారు.అంతేగానీ వారి వ్యక్తిగత పవిత్రత,మహిమలను బట్టి కాదు.ఒక వ్యక్తి తన స్వంత వర్గాన్ని  బాగా చూసుకోవడం. మరొకరిని కించపరచడం చేయకూడదు.
         అశోకుడు తన అధికారులను ప్రతిచోటా ప్రజలను తన పిల్లలుగా భావించాలని, అసహనంతో గానీ  కఠినంగా గానీ వ్యవహరించరాదని ఆదేశించాడు. వారిని సరైన కారణం లేకుండా  హింసించరాదు. జైలులో పెట్టరాదు. అంతేగాక ఈ సూచనలను  ఎప్పటికప్పుడు చదవమని అతను అధికారులను ఆదేశించాడు.అశోకుడు వాటిని మౌఖిక ప్రకటనల ద్వారా , అనువైన ప్రదేశాలలో రాళ్ళు , స్తంభాలపై చెక్కడం ద్వారా తన ధర్మాలను పనులను ప్రచారం చేయించాడు.

         ఈ శాసనాలు-థెరోక్ శాసనాల్లో, స్థూప శాసనాల్లో ఉన్నాయి. (ఉదా., సారనాథ్ వద్ద కనుగొనబడిన స్తంభం పైన నాలుగు సింహాల గుర్తు .ఇది భారతదేశ జాతీయ చిహ్నంగా మారింది). వీటిల్లో ఎక్కువగా అతని పాలన , వివిధ సందర్భాలలో అతని ఆలోచనలు, చర్యలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయి. అతని మాటలలోని నిష్కపటత్వానికి, నిజాయితీకి గుర్తుగా ఇవి నిలుస్తున్నాయి.

             నిజాయితీ, సత్యం, కరుణ, దయాగుణం, పరోపకారం, అహింస, అందరి పట్ల శ్రద్ధగా ప్రవర్తించడం, "చిన్న పాపం కూడా చేయకపోవడం , అనేక మంచి పనులు", విపరీతమైన, అన్యాయానికి గురికాకపోవటం వంటి సామాజిక ధర్మాల శక్తివంతమైన అభ్యాసమే ధర్మమని అశోకుడు పదే పదే ప్రకటించాడు.  అతను మతపరమైన ఆరాధనా  పద్ధతి గురించి లేదా ఏదైనా తాత్విక సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. అతను బౌద్ధం గురించి  బౌద్ధులతో మాత్రమే మాట్లాడాడు తప్ప ఇతరులతో కాదు.

          అన్ని మత వర్గాల పట్ల అతను గౌరవభావంతో వ్యవహరించాడు.  వారి స్వంత విశ్వాసాల ప్రకారం జీవించడానికి వారికి పూర్తి స్వేచ్ఛను హామీ ఇచ్చాడు. సామంత రాజులను బౌద్ధ స్వీకరించమని బలవంతం చేయలేదు. కానీ మానసిక ఉన్నతి కోసం  తమంత తాము కృషి చేయాలని  ఆయన వారిని కోరారు. అంతేకాకుండా, ఇతరుల విశ్వాసాలను గౌరవించాలని, ఇతరుల మంచి విషయాలను మెచ్చుకోవాలని మరియు ఇతరుల దృక్కోణాలపై తీవ్రమైన ప్రతికూల విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన వారికి ఉద్బోధించాడు.

              ధమ్మ విధానంలో చెట్లను నాటడం, బావులు త్రవ్వడం వంటి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అశోకుడు సంప్రదాయ ఆడంబర వేడుకలు, బలులు అర్థరహితమన్నాడు. 
అశోకుడు గ్రామీణ ప్రాంతాలో పర్యటిస్తూ ప్రజలకు ధర్మాన్ని ప్రబోధిస్తూ, వారి బాధలను నివృత్తి చేసేవాడు. అతను తన ఉన్నత అధికారులను వారి సాధారణ విధులకు హాజరుకావడంతో పాటు అదే విధంగా చేయమని ఆదేశించాడు; సాధారణ ప్రజల సంతోషాలు, దుఃఖాల గురించి నిరంతరం తెలుసుకోవాలని , సత్వర న్యాయాన్ని అందించాలని,  నిష్పక్షపాతంగా ఉండాలని అతను పరిపాలనా అధికారులను ప్రోత్సహించాడు. ధర్మంలోని వివిధ అంశాలను అమలు చేయడానికి, ప్రచారం చేయడానికి ధమ్మ మహామత్తలు (ధర్మ మంత్రులు)గాఅని పిలువబడే 
  ఒక ప్రత్యేక తరగతి ఉన్నత అధికారులను నియమించాడు. వీరు ప్రజలను ధర్మ కార్యాన్ని చేయడానికి ప్రోత్సహించాలి. ప్రజలు ఎక్కడైనా బాధలు పడుతుంటే వాటిని పరిష్కరించాలి .  మహిళలు, బయటి ప్రాంతాలలో నివసించే ప్రజలు, పొరుగు ప్రజలు , వివిధ వ్యక్తుల ప్రత్యేక అవసరాలను పరిశీలించాలి. మత సంఘాలకు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు. అతనికి లభించిన కీర్తి అంతా తన ప్రజలను ధర్మ మార్గంలో నడిపించండి వల్లనే వచ్చింది. 
        ఎన్నో పుక్కిటి పురాణాలు రాసిన పండితులు అశోకుని గురించి,బుద్దుని గురించి నామమాత్రంగా కూడా రాయకపోవడం వెనుక ఏదో ఉందన్న సందేహం రాక మానదు.

Source: 
Britannica.com,
Wikipedia, 
డాక్టర్ VK మహేశ్వరి గారి అశోకుడు- తత్వవేత్త వ్యాసం
డాక్టర్ దేవరాజు మహారాజు గారి నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి! వ్యాసం



___ పిళ్లా కుమారస్వామి
9490122229

Comments

  1. Valid information about Ashoka the greàt and Budda Dharma. Thanks sir for sharing with me.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం