భారతీయ తాత్విక చింతనకు అపశృతి మనుస్మృతి

_భారతీయ తాత్విక చింతనకు  
అపశృతి మనుస్మృతి_
                            
 
ఏ తాత్విక దృక్పథం లేని,మానవ సమాజం పురోగతికి అడ్డుగోడలైన మను ధర్మాలు సామాజిక ధర్మాలు గా నేటికీ చెలామణి అవుతున్నాయి.
 బ్రాహ్మణ ధర్మాలు గా ఉన్న హిందూ ధర్మాలుగా హిందూమతంగా  ఏర్పడే నాటికి సామాజికంగా మార్చి  మనుధర్మ శాస్త్రాన్ని రూపొందించారని కత్తి పద్మారావు తెలిపారు. ఇది ఆనాటి రాజ్యాంగంగా భావించాలని ఆయన చెప్పారు. 
           హిందూ ధర్మం సనాతనమైనదని చెపుతుంటారు గానీ,ఇది వాస్తవం కాదు.హిందూ ధర్మంగా చెలామణి అవుతున్న మను ధర్మ స్మృతి  200CE- 200BCE కి చెందిందని చాలామంది పరిశోధకులు తెలుపుతున్నారు.

భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు స్మృతులున్నాయి. వీటిల్లో మను స్మృతి పేరొందింది. దీని తర్వాతనే యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి మొదలైనవి లెక్కకు వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని అనుకుంటాం కానీ మనువు దీనిని రాయలేదని పరిశోధనల అభిప్రాయం.ఈ మనువెవ్వరో చాలా మందికి తెలియదు.

సమాజాన్ని పాలించే వారిని మనువు అంటారు.  పురాణాల ప్రకారం ఒక మనువు పరిపాలన కాలాన్ని మన్వంతరం అంటారు. వీటి ప్రకారం ఈ మనువులు 14మంది. మొదటి మనువు స్వాయంభువు.రెండవ వాడు స్వారోచిష. ఇతని పేరుతో అల్లసాని పెద్దన మనుచరిత్ర లేదా స్వారోచిష మనుసంభవమనే కావ్యం రాశాడు. మనువు కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిమ్లాలో ఒక గుడి కూడా ఉంది.మానవులకు మొదటి వాడు మనువు అని కూడా ఉంది.అమరకోశం కూడా మనువు
వలన పుట్టినవారు మానవులనీ (మనోద్ఘాతా మను-1) మనువు సంబంధమయినవారు
మానవులనీ (మ కోరేమే మానవా!) పేర్కొంటున్నది.

స్మృతి అంటే ధర్మశాస్త్రం. మనువు రాసిన ధర్మశాస్త్రాన్నే మనుస్మృతిగా పేర్కొంటున్నారు. దీనిలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారుడు నరహర్ కురుంద్కర్ (1932-1982) తెలిపారు.

దీనిని క్రీస్తు పూర్వం రెండు, మూడు దశాబ్దాలలో ప్రారంభించి ఉండొచ్చు. దీనిలో మొదటి అధ్యాయంలో   నాలుగు వర్ణాల గురించి, వారి వృత్తుల గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. రెండో అధ్యాయంలో బ్రహ్మచర్యం గొప్పతనం గురించి, యజమానికి చేయాల్సిన సేవ గురించి పేర్కొన్నారు. మూడో అధ్యాయంలో వివాహ పద్ధతుల గురించి, పూర్వీకులకు చేయాల్సిన కర్మల గురించి రాసుకొచ్చారు. నాలుగో అధ్యాయంలో ఒక గృహస్థ ధర్మం గురించి, ఏమేం తినకూడదన్న దాని గూర్చి, 21 రకాల నరకాల గురించి వివరించారు.''

''ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి, ఆరో అధ్యాయంలో సన్యాసి యొక్క విధుల గురించి, ఏడో అధ్యాయంలో రాజు బాధ్యతల గురించి, ఎనిమిదో అధ్యాయంలో నిత్య జీవితంలోని విషయాల గురించి, నేరాలు, న్యాయం మొదలైన వాటి గురించి, తొమ్మిదో అధ్యాయంలో వారసత్వ వివరాల గురించి, పదో అధ్యాయంలో వర్ణ సాంకర్యం గురించి, పదకొండో అధ్యయంలో పాపాల గురించి, పన్నెండో అధ్యాయంలో మూడు రకాల పుణ్యాలు, వేదాల ప్రాశస్త్యం గురించి వివరించారు'' అని కురుంద్కర్ తెలిపారు.
సంస్క్రతంలో ఉన్న ఈ గ్రంధాన్ని 1794 లో సర్ విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించారు.
ఆ తర్వాతే అందరికీ దానిలో ఏముందో తెలిసింది.

మనువు ఈ సంస్కృతిని భృగు
మహర్షికి బోధించాడని భృగువు మిగిలిన రుషులందరికి బోధించాడని ఈ స్మృతి చెపుతుంది. మనుస్మృతికి ముందే పరాశరస్మృతి వాడుకలో ఉంది.మనుస్మృతికి మేధాతిధి గోవింద రాజులు, కుల్లూకభట్టులనే వారు వ్యాఖ్యానాలు వ్రాశారు. ఇందులో కుల్లూ కభట్టుని వ్యాఖ్యానం ప్రఖ్యాతిలోకి వచ్చింది.

          ఆచార్య యస్.వెంకట్రామన్ ప్రకారం అది  క్రీ.పూ. 2000 లోనిది.  సర్. విలియమ్స్ జోన్స్ అభిప్రాయం లో క్రీ.పూ.1280లో నిది. “ప్లేజల్” క్రీ.పూ. 1000 సం|| అంటున్నారు. మోనియర్ విలియమ్స్  క్రీ.పూ. 5వ శతాబ్ది అని చెపుతున్నారు. చరిత్రకారుడు “కాణే” క్రీ.పూ. 3వ శతాబ్ది అనివ్యాఖ్యానిస్తే, బూలర్ క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 200 మధ్యలో రాయబడిందని  చెప్పారు. జయస్వాల్ క్రీ.పూ. 150 అని నిర్ధారించారు. అంబేద్కర్ ప్రకారం మనుస్మృతి క్రీ.పూ. 170 నుండి క్రీ.పూ. 150 మధ్య కాలంలో రూపొందింది.  అంబేద్కర్ పరిశోధనలను బట్టి సుమతి భార్గవుడు అనేవాడు మనుస్మృతి పేరుతో రాసి ఉంటాడు.మనుస్మృతి, భృగుసంహితగా కూడా పేరు పొందడాన్ని బట్టి దీన్ని భృగువు రాసి ఉంటాడని ప్రతీతి.
             బౌద్ధ సంస్కృతిని విస్తరింపజేసిన మౌర్య సామ్రాజ్యం పతనమవుతున్న క్రమంలో బ్రాహ్మణ రాజ్యాన్ని విస్తరించటానికి
పుష్యమిత్రుడు పూనుకున్నాడు.
 ఆ సందర్భంలో  బౌద్ధాన్ని నాశనం చేసి బ్రాహ్మణ వాదాన్ని  వ్యవస్థీకృతం చేయటానికి
కూర్చబడిందే మనుస్మృతి అని అంబేద్కర్ తన పరిశోధనలో వెలువరించారు.
        
     ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ  ఉండటానికి  కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలపై  మనుధర్మాన్ని బలవంతంగా రుద్దడం వల్ల అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు బైబిల్లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు   మనుస్మృతి బ్రాహ్మణాధిక్యతను  నొక్కి చెప్పింది. వర్ణాన్ని కులంగా మార్చి వేసింది. కుల వైరుధ్యాలను, సామాజిక అసమానతలను పురిగొల్పింది. స్త్రీలను శూద్రులను, అవమానించి అణిచివేసింది. సామాజిక అసమానతలను కఠినమైన శాసనాలతోచట్టబద్ధం చేసింది. ఒక శూద్రుడు బ్రాహ్మణుని నిందించినా పొరపాటున కొట్టినా మనువు విధించిన నిబంధనలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.

 “యేన కేసచిదంగేన హింస్యాచ్చే బ్భేష్టచ్చేష్ట మంత్యజః,
చైత్తన్యం తత్త్వ దేవస్య తన్మనోరను శాసనమే"
       
         శూద్రుడు తన అంగంతోగాని, ప్రత్యక్షముగ కర్ర మొదలగు వానితో గాని తనకంటె శ్రేష్ఠుని (ద్విజులను) కొట్టితే ఏ అంగంతో కొట్టాడో ఆ అంగంను ఛేదించాలని మనువు రాశాడు. 

“పాణి ముద్యమ్యదండం నాపాణిచ్ఛేదన మర్హతి
పాదేన ప్రహరన్ కోపాత్పాదచ్ఛేదన మర్హతి”

         ఆ శూద్రుడు కొట్టుటకు చేతినిగాని కర్రనుగాని పైకెత్తినేని, చేతిని కోసి వేయాలి. కోపముతో కాలితో తన్నితే  కాలిని తీసేయాలి.

“సహా సనమభి ప్రేప్పురుత్కృష్ట స్యాపకృష్ణజ:
కట్యాం కృతాంకో నిర్వాస్యః స్ఫిచంవా స్వాకోకర్తయేత్"

          బ్రాహ్మణునితో సమానంగా ఆసనంబున కూర్చున్న శూద్రునికి, నడుమున కర్రుతో కాల్చి వాతవేసి తరమాలి. ఇతనిని చంపకుండా  త్రష్ఠమును గోసివేయాలి.

మనుస్మృతి   శూద్రులకు విద్య, ధనసంపాదన నిషేదించింది. “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).

“అగ్రవర్ణలతో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులు కోసివేయాలి లేదా ఇనుపకర్రలతో కాల్చాలి” (మనుస్మృతి 8-281)

“శూద్రుడు ఆస్తి సంపాదించరాదు” (మనుస్మృతి 10-29).

“హీన జాతి పురుషుడు ఉన్నత స్త్రీని తనను వలచినదాననైనను మొహమున పొందునో వానికి ‘లింగచ్చేదము, వధయను’ దండమునకు అర్హుడు” (మనుస్మృతి 8-366).
        ఇలాంటి కఠిన దండనలు నిబంధనలు మరెన్నో రాశారు.
        బ్రాహ్మణుని తోలు మాత్రము బరచుకొన గొట్టిన సమాన జాతీయునికి నూరు రూకలు దండన విధించాలి.రక్తముగార్చిన వానికి నట్లే దండన విధింపవలయును. మాంసమును జీల్చిన వానికి ఆరునిష్కములు
దండన విధింప వలయును. ఎముకలు విరిచిన వానిని దేశము నుండి తరిమేయాలి.
(మనుస్మృతి-8వ అధ్యాయం 279 నుండి 384 వరకు)
ఒక బాలిక వివాహానికి ముందు తండ్రి సంరక్షణలో, వివాహం తర్వాత భర్త సంరక్షణలో, భర్త మరణాంతరం పిల్లల సంరక్షణలో ఉండాలి. ఆడవాళ్లను ఎప్పుడూ స్వతంత్రంగా ఉంచరాదు' అంటుంది మనుస్మృతిలో అయిదో అధ్యాయంలోని 148వ శ్లోకం.


రావిపూడి వెంకటాద్రి రాసిన 
"మనుస్మృతి మైనస్ అశుద్ధం"లో
మనుస్మృతి  స్త్రీలకిచ్చిన గౌరవ స్వాతంత్య్రాలిలా ఉన్నాయి. 

# పురుషుల్ని చెరచడం స్త్రీల స్వభావం.అందువల్ల, విద్వాంసులు స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

# పురుషుడు విద్వాంసుడైనా, అవిద్వాంసుడైనా, స్త్రీల వలలో తగులుకోవడం సహజం. అందువల్ల, కామక్రోధాదులకు వశుడైన వాణ్ణి స్త్రీలలోబరచుకొని చెడుకి దిగుతారు. 

# ఇంద్రియాలు బలమైనవై చెడుదారికి ఈడుస్తాయి కాబట్టి, తల్లి, చెల్లి, కూతుళ్లతోనైనా పురుషుడు ఒంటరిగా కూర్చోరాదు. 

 # పురుషుడు వయసులో ఉన్నాడా, లేదా? చక్కనివాడవునా, కాదా? అనే ప్రశ్నలతో స్త్రీలకు నిమిత్తంలేదు. అతను మగవాడై ఉంటే చాలు, స్త్రీలు అనుభవిస్తారు.. పురుషుణ్ణి చూచీ చూడడంతోనే అతన్ని కూడాలని స్త్రీ కోరుకుంటుంది. 


#  స్త్రీ స్వభావం ఇలాంటిది కావడం బ్రహ్మసృష్టిలోని విశేషమే. కాబట్టి, స్త్రీని అదుపులో ఉంచుకోడానికి పురుషుడు తీవ్రంగా ప్రయత్నించాలి. 

# పడక, ఆసనం, ఆభరణాలు, కామక్రోధాలు, ద్రోహం, హింస, కుత్సితవర్తన అనే అవలక్షణాలను స్త్రీలకు మనువు మొదటనే కల్పించాడు. కాబట్టి, స్త్రీలను కనిపెట్టి ఉండాలి.' 

# వ్యభిచార శీలత స్త్రీలకు స్వభావసిద్ధమని వేదాలు చెపుతున్నాయి.  'బాలిక అయినా, యువతి అయినా, ముసలిదయినా, స్త్రీ ఇంటి విషయాలు స్వతంత్రంగా చేయరాదు.

# "బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, భర్త మరణానంతరంపుత్రుడి అధీనంలో స్త్రీ ఉండాలికాని, ఆమె స్వతంత్రంగా ఉండకూడదు. " 

# స్త్రీలు అస్వతంత్రులు అహర్నిశం పురుషులు వారిని తమ అధీనంలో ఉంచుకోవాలి. స్త్రీలు తరచు విషయవాంఛలకు గురవుతారు. అలా కానీయకుండా పురుషులు స్త్రీలను తమ అధీనంలో ఉంచుకోవాలి. "

# బాల్యంలో తండ్రి రక్షణలోను, యవ్వనంలో భర్త రక్షణలోను, ముసలితనంలో పుత్రుడి రక్షణలోను స్త్రీఉండాలి. స్త్రీకి స్వాతంత్ర్యార్హతలేదు. " " చెడు సావాసాల నుంచి స్త్రీ ని కాపాడాలి."(మరిపురుషులనో)

# స్త్రీని బలవంతంగా కాపాడడం ఎవ్వరి తరమూ కాదు. కావున, డబ్బుదాచడం, వ్యయం చేయడం, శరీర పోషణ, భర్తసేవ, వంటావార్పు. ఇల్లు కనిపెట్టుకొని ఉండడంలో వారిని నియోగించాలి. " 

# మద్యపానం, చెడుసావాసం, విరహం, పొరుగిండ్లకు పోవడం, నిద్ర, స్త్రీని చెడగొడతాయి. (మరిపురుషుణ్ని బాగుపరుస్తాయా?) 

 # తన కంటే ఎక్కువ వర్ణం వాడితో కూడిన స్త్రీకి ఏశిక్ష లేదు. తనకంటే తక్కువ వర్ణం వాడితో కూడిన స్త్రీని గృహనిర్బంధంలో ఉంచాలి. 

# పిల్లల్ని కనడం, పోషించడం, అతిధులకు, భోజనాదిమర్యాదలు చేయడం స్త్రీల విధులు. 

# పిల్లల్ని కనడమేగాక, స్త్రీ ధర్మాలు పాటించడం, సేవచేయడం, భర్తకు ఉత్తమ రతిని అందించడం, తనకూ.. పితరులకూ స్వర్గాన్ని చేకూర్చడంభార్య అధీనంలో ఉంటాయి. 

# స్త్రీలకు మంత్ర పూర్వకమైన క్రతువులు లేవు, ధర్మశాస్త్రార్హతలేదు. అందువల్ల, వారికి ధర్మం తెలియదు. అందుచేత వారు పాపాత్ములు. అసత్యం ఎలా అశుభం కలిగిస్తుందో, అలానే స్త్రీలు అశుభం కలిగిస్తారు." (ధర్మంతెలియని వారు ధర్మంగా ఎలా ప్రవర్తించగలరు? ధర్మశాస్త్రార్హతలేనివారికి ధర్మమెలా తెలుస్తుంది?) 
# భర్త తన మీద ఇష్టంలేని వాడయినా, భార్య నవ్వుమొగంతో ఇంటి పనుల్లో నేర్పుగాను పనిముట్లుచక్కబరచుకొనేదిగాను, అతి వ్యయంచేయనిదిగాను ఉండాలి. 
# స్త్రీలకు వివాహ సమయంలో చెప్పే మంత్రాలు, అక్కడ చేసే హోమం కేవలం మంగళాచరణల క్రింద లెక్క అంటే స్త్రీలకు మంత్రాధికారం లేదనే అర్ధం. అంతకుముందు వాగ్దానం చేయబడినప్పుడే స్త్రీ ఆ పురుషుడికి భార్య అయింది.

# భర్త జీవించినంతకాలం భార్య అతని సేవ చేయాలి. అతని మరణానంతరం అలాగే వితంతువుగా ఉండాలి కాని, మరో వివాహం చేసుకోరాదు.  భర్త జీవించి ఉన్నా, మరణించినా, అతని అభీష్టానికి వ్యతిరేకంగా భార్య నడచుకోరాదు. అతనికి అ ప్రియమైనదేమీ చేయకూడదు.

#  భర్త చనిపోయిన తరువాత స్త్రీ కందమూలఫలాలతో దేహాన్ని శుష్కింపజేయాల్సి కాని, పురుషుడి పేరైనా తలచగూడదు. .

#  భర్త మరణానంతరం స్త్రీ బ్రహ్మచారిణిగా ఉండాలి.  

#  భర్తమరణించిన స్త్రీకి సంతానం లేకపోయినా బ్రహ్మచారిణిగా ఉంటే స్వర్గం లభిస్తుంది. 

 # భర్తవల్ల కాక, ఇతరులవల్ల సంతానం కన్న స్త్రీ ఆ సంతానం వల్ల పుణ్యలోకాలను పొందదు. ఈ లోకంలో నిందలపాలవుతుంది.

# భర్త వల్లకాక, ఇతరులవల్ల పుట్టిన సంతతి శాస్త్రీయమైనదికాదు. అది పుట్టించినవాడి సంతతి కూడా కాదు. సాధ్వులకు రెండో వివాహం లేదు. * * నికృష్ణుడయిన భర్తను వదలి ఉత్కృష్టుడైన భర్తను పొందిన స్త్రీ లోకోపవాదం పొందుతుంది. 

# వ్యభిచారం వల్ల స్త్రీ లోకనింద పొందడమేకాక, పునర్జన్మలో నక్కగా పుడుతుంది. పాప రోగాల చేత పీడించబడుతుంది. '(పురుషుడు వ్యభిచరిస్తే???) 

#  ముందు మరణించిన భార్యకు అంత్యక్రియాదులు చేసిన తరువాత పురుషుడు మరొక వివాహం చేసుకొని వైదిక కార్యాలు నెరవేర్చుకోవాలి.

 # లోభి ఒక్కడైనా సాక్ష్యానికి సరిపోతాడుకాని, స్త్రీలు శౌచ్యం పాటించే వారలయినా, ఎందరయినా సాక్ష్యానికి పనికిరారు. ఎందుకంటే స్త్రీలు చపలురు.

మనుస్మృతికి మహిళలపై ఎలాంటి అభిప్రాయం ఉందో అది స్పష్టంగా తెలియజేస్తుంది. దళితులు, మహిళల గురించి అలాంటి వాక్యాలు మనుస్మృతిలో చాలా ఉన్నాయి.

            ఇలాంటి సూత్రాలను బట్టి శూద్రులను బ్రాహ్మణులకు బానిసలుగా చేసుకోవటానికి మనుస్మృతి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. 
బ్రాహ్మణాధిక్యతను, బ్రాహ్మణ రాజ్య ధర్మానికి కంచుకోటలు నిర్మించిన మనుస్మృతి
ప్రభావం ఈనాడు భారతదేశంలో బ్రాహ్మణ రాజ్య స్థాపనకు పుష్యమిత్ర సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆర్ ఎస్ ఎస్ వర్గం మీద బలంగా ఉందని కత్తి పద్మారావు తెలిపారు.శూద్రులు కాలక్రమంలో వాటిని ఒప్పుదలతో నేటికీ పాటించడం విశేషమే.
జార్జిబుహ్లర్ పరిశోధనను బట్టి ఈ  ధర్మసూత్రాలు 
 అప్పుటి పరిస్థీతులను బట్టి వేదవిరుద్ధంగాని విధంగా   తయారుచేశారు. అందుకే నాలుగు వర్ణాల వ్యవస్థ ను తయారు చేశారు. దీన్నే ధర్మం నాలుగు పాదాలతో నడిచిందని చెప్పినారు.స్వధర్మమే మేలు అంటే ఏకులం వాడు ఆ కులవృత్తి పాటిస్తేనే మేలు అని అర్థం.పరధర్మం అంటే ఇతర కులాల పనులను చేయడం. అది భయంకరమైనదని ప్రచారం చేశారు.సమాజం స్థాణువు కాదు. అది పరిణామం చెందే తత్వం కలిగి ఉంది.కొన్ని చలన సూత్రాలకు అనుగుణంగా అది మారుతూ ఉంటుంది. కావున ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పుల చేర్పులతో తిరిగి నిర్ణయించు కోవటం తప్పనిసరైంది. మనుస్మృతిని మొదట సవాలు చేసింది మహాత్మా జోతిబా పూలే. వ్యవసాయ కూలీలు, నిరుపేద రైతులు, ఇతర పేదవారు, సమాజంలో దోపిడీకి గురవుతున్నవారిని చూశాక ఆయన బ్రాహ్మణులను, వ్యాపార వర్గాలను తీవ్రంగా విమర్శించారు.
1927, డిసెంబర్ 25న డాక్టర్ ఆ తర్వాత అంబేద్కర్ మహారాష్ట్రలోని గతంలో కొలబా (నేటి రాయగఢ్) జిల్లాలోని మహద్‌లో మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టారు.
ఎంతో ఆధునికం అయిందన్న నేటి సమాజం కూడా నేటికీ ఈ మనుస్మృతి ని ఆచరణలో అమలు చేస్తోంది. ఏవో కొన్ని పైపై మార్పు లు జరిగాయి తప్ప వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ గా రూపాంతరం చెంది  అవి మను ధర్మాలని తెలీనంతగా మను ధర్మాలు ప్రజల్లో ఇంకి పోయి వాటిని పాటిస్తున్నారు.
అయితే దీనిని ధిక్కరిస్తున్నది మాత్రం భారత రాజ్యాంగ మొక్కటే. అందుకే దీనిని మార్చి తిరిగి భారతీయ పూర్వ రాజ్యాంగమైన మనుస్మృతి ని చట్టబద్దం చేయాలని  మనువాదులు కోరుతున్నారు.
         బ్రాహ్మణాధిక్యతతో అధికారంతో శతాబ్దాలుగా మగ్గిపోయిన శూద్రులు, అస్పృశ్యులు స్త్రీలు ఈ ప్రమాదాన్ని గ్రహించి మనుస్మృతి రాజ్య నిర్మాణానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే చార్వాక చింతనే సరైన సిద్ధాంత ఆయుధమని కత్తి పద్మారావు పేర్కొన్నారు.

ఇది శూద్రులపట్ల కఠినాతి కఠినంగా, క్రూరంగా వ్యవహరిస్తుంది. స్త్రీలపట్ల ఔదార్యం చూపదు. భారతదేశం విభిన్న జాతులకూ, పలు తెగలకూ నిలయం. భారతీయ సంస్కృతి విభిన్న జాతుల సంస్కృతి .ఈ సత్యాన్ని కప్పి పుచ్చి సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఈనాడు భారత దేశాన్ని మతరాజ్యంగా మార్చాలని ప్రతీపశక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ప్రసాదించే స్వేచ్ఛ, సమానత్వాలను కాలరాచివేయడానికి కంకణం కట్టుకొన్నాయి. భారతీయ సంస్కృతి నుంచి మంచి సెబ్బరలను తెలిసికొని దేశంలో విచ్చలవిడిగా పెచ్చు పెరిగి తిరుగుతున్న దుష్ట శక్తుల కోరలు అణచివేయటానికి, అసమానత్వాలను నామరూపాలు లేకుండా జేయటానికి ప్రాచీన తాత్విక చింతన ను తప్పకుండా అధ్యయనం చేయాలని నాగళ్ళ గురు ప్రసాదరావు తెలిపారు.

మనుధర్మ శాస్త్రం పితృ స్వామ్యాన్ని సమర్థిస్తుంద న్నాడు    రాంపునియా.హిందూ ముస్లిం మతాలు రెండింటిలో సాధారణంగా పురుషులే ప్రచారకులుగా ఉంటారు. నేటికీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ లో పురుషులే ప్రచారకులుగా కొనసాగుతున్న వ్యవస్థ ఉంది. మత ప్రాతిపదికన హిందూ మత రాజ్యాన్ని స్థాపించే దాని ప్రణాళికను విస్తృతం చేసేందుకు, కేవలం మహిళల కోసం మాత్రమే ఆరెస్సెస్‌, 'రాష్ట్ర సేవికా సమితి'ని ప్రారంభించింది. దాని పేరే పితృస్వామిక విలువలను తెలియజేస్తాయి. స్వయంసేవకుడు అంటే స్వచ్ఛంద సేవకుడు. సేవిక అంటే సేవ చేసే వారని అర్థం. 'స్వయం' అంటే 'తాను' అనేది అక్కడ లేదు. మహిళలు పురుషుల చేత రక్షించబడాలనే మనుస్మృతి ఆజ్ఞకు అది సరిపోతుంది.

మనుషులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమాన న్యాయాన్ని అందించే రాజస్థాన్ హైకోర్టు  ప్రాంగణంలో మనువు ఇంకా ప్రతిమగా నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించేందుకు అటు న్యాయవ్యవస్థ వైపు నుంచి, ఇటు ప్రజల వైపు నుంచీ అనేక ప్రయత్నాలు జరిగాయి. 
 కాన్షీరామే జైపూర్‌లో ఈ విషయమై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. జైపూర్‌ హైకోర్టుకు చెందిన న్యామూర్తులంతా ఏకగ్రీవంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని ఆర్డర్‌ పాస్‌ చేశారు. అయినా ఆ విగ్రహం ఇసుమంతైనా అక్కడి నుంచి కదలలేదు. ఇందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకుడు ఆచార్య ధర్మేంద్ర న్యామూర్తుల నిర్ణయంపై పిల్‌ దాఖలు చేయడంతో విగ్రహ స్థలమార్పిడి కార్యక్రమం ఆగిపోయింది. పిల్‌ దాఖలు చేసిన ధర్మేంద్రపై విమర్శలు వెల్లువెత్తగా ఆయన ''మనువు ఫిలాసఫీలో ఎలాంటి ద్వేషం, వివక్ష లేదు'' అని శెలవిచ్చారు.  మతపరమైన గ్రంథాలు స్పష్టంగా ఉండవు. మత విశ్వాసకుడు కోరుకునే విధంగా వివరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మత గ్రంథాల నుండి ఎవరైనా తన సౌకర్యానుసారంగా ఏ భాగాన్నైనా తీసుకొని, మిగిలిన భాగాన్ని వదిలేసే స్వేచ్ఛ ఉంటుంది. పిలిప్పైన్ దేశం తమ దేశ అసెంబ్లీ హాలులో  ఆయనను ప్రపంచంలో మొదటి రాజ్యాంగ నిర్మాత గా భావిస్తూ ఈ మనువు విగ్రహాన్ని నెలకొల్పుకోవడం అందరినీ కలతపెడుతోంది.


___పిళ్లా కుమారస్వామి
9490122229

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం