గురునానక్ తాత్విక చింతన

        pc: pinterest 
_గురునానక్ తాత్విక చింతన_

గురునానక్ దేవ్ 15.4.1469లో రాయ్ -భోయ్-డి తల్వాండి గ్రామంలోని కార్తీక పౌర్ణమిలో జన్మించారు. ఇది అప్పటి ఢిల్లీ సుల్తానేట్ ప్రావిన్స్. ప్రస్తుతం ఇది  పాకిస్థాన్ లో లాహోర్ సమీపంలో ఉంది. దీన్నిప్పుడు నంకన్ సాహిబ్ అని పిలుస్తున్నారు.  గురునానక్ తల్లిదండ్రులు  కళ్యాణ్ దాస్ మెహతా మరియు మాతా త్రిప్తి.1539లో కన్నుమూశారు.

గురునానక్ హిందూ ,ఇస్లాం మతస్వరూపాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసి,   ఆ రెండు మతాల భావాల సారాన్ని రెండింటిని మేళవించాడు. ఆయన తన స్వంత భావాలను కొన్నింటిని కలిపి తన తత్వాన్ని బోధించాడు.  అతని బోధనల ప్రకారం ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వగలరు. అలాగే ఎవరైనా ఏ పేరుతోనైనా దేవుడిని ఆరాధించవచ్చు. విగ్రహారాధన అవసరం లేదన్నాడు.గురు నానక్ శిష్యులను సిక్కులు అని పిలిచేవారు. సిక్కు అనే పదం పంజాబీ పదం. సిఖానా నుంచి సిక్కు వచ్చింది. సిఖానా అంటే నేర్పించడం. సిక్కు అంటే రోజూ అభ్యసించేవాడు అని అర్థం
అలా ఆయన 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ యొక్క బోధనలు   గురుగ్రంథ్ సాహిబ్ లో పొందుపరిచారు. అది
సిక్కు ప్రజల పవిత్రగ్రంథమైంది.


*గురునానక్  తాత్విక భావనలు*

        మంచితనం, స్వచ్ఛత , నిస్వార్థ సేవ లనే ధర్మం ఆధారంగా  వ్యక్తి నడుచు కోవాలన్నాడు.  నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరికీ సామాజిక న్యాయం తీసుకు రావడానికి ప్రయత్నించాడు.  నానక్   తను చెప్పే బోధనలు సర్వశక్తిమంతుడి నుండి అందుకున్నట్లు గా భావించాడు. ఇతని పై సూఫీ తాత్విక చింతన ప్రభావం ఉందని చెప్పొచ్చు. సత్యం, అహింసలతో కూడిన మార్గంలో నడవాలని గురునానక్ చాటిచెప్పారు.
       గురునానక్ తన బోధనలను వ్యాప్తి చేయడానికి  27ఏళ్ల వయసులో 1496వ సంవత్సరంలో తన కుటుంబాన్ని వదిలి మరో సిద్దార్థునిలా
30 సంవత్సరాల పాటు తన జీవితాన్ని ప్రజలకు బోధించడానికి ఉపయోగించాడు.


మరి కొన్ని తాత్విక భావాలు

1. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు  సర్వత్రా ఉన్నాడు. మనందరికీ ఆయనే తండ్రి. అందుకే అందరితో ప్రేమ పూర్వకంగా మెలగాలి.

2.మనలోని లోభ గుణాన్ని తరిమికొట్టి, కష్టించి పనిచేయాలి. న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని ఆర్జించాలి.
ఎప్పుడైనా, ఎవరి హక్కునైనా హరించడం తగదు. నీతిగా, నిజాయితీతో సంపాదన సాగిస్తూ, అర్హులను ఆదుకుంటుండాలి.
డబ్బు అనేది జేబు వరకు మాత్రమే ఉండాలి. అది మన హృదయాన్ని తాకుండా చూసుకోవాలి. అలా జరిగితే సమస్యలు చుట్టుముడతాయి.

3.మహిళలను గౌరవించాలి. స్త్రీ, పురుషులిద్దరూ సమానులే.

4.మానసిక వ్యాకులతను విడిచిపెట్టి, నిరంతరం కర్మను చేస్తుండాలి. నిత్యం ప్రసన్నంగా ఉండాలి.

5.బాహ్య ప్రపంచంలో గెలిచేముందు మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యం.

6.అహంకారమే మనుషులకు అతిపెద్ద శత్రువు. అందుకే ఎప్పుడూ అహంకారానికి లోనుకాకూడదు. వినయం, సేవాభావాలతో జీవితాన్ని గడపాలి.

7.ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలి.

8.ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.


సమాజంలోని అన్ని అనారోగ్యాలకు మూలకారణం ప్రజల నైతిక పతనమని గురు నానక్ భావించాడు. అజ్ఞానం , అవినీతి  సమాజానికి రాచపుండులని భావించాడు .   విగ్రహారాధనను ఖండించాడు.,కుల తత్వానికి వ్యతిరేకంగా ఆయన గళమెత్తారు.అతను తక్కువ కులాల వారని సమాజంలో ముద్ర పడిన వారితో ,కింది తరగతుల వ్యక్తులతో కలిసి భోజనం చేసేవాడు. అతను చాలా మంది దేవతలను , దేవుళ్లను ఆరాధించే పద్దతి సరైనది కాదన్నాడు.  దేవుడు ఒక్కడనే భావన ప్రచారం చేశాడు.

గురు నానక్ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని రేకెత్తించారు. విదేశీ  ఆక్రమణలను వ్యతిరేకించారు.
 రాజుల దురాగతాలను  ఆయన తీవ్రంగా నిరసించారు. తన దేశవాసుల బాధలను చూసి అతని హృదయం చలించిపోయింది. నిరంకుశుల నుండి , స్వేచ్ఛ కోసం పోరాడమని పిలుపునిచ్చారు.  నిరంకుశ పాలనను, అణచివేతను ధైర్యంగా సవాలు చేసినందుకు అతన్ని సికందర్ లోడి అనుచరులు అరెస్టు చేశారు. కానీ   ఆయన భయపడకుండా తాను నమ్మిన  మార్గం నుండి దూరం కాలేదు.

 పంజాబ్ ప్రజల  ప్రజాదరణ పొందిన నాయకుడు గురు నానక్.మొదట్లో అతని  శిష్యుల సంఖ్య చాలా తక్కువైనప్పటికీ, “హిందూ లేడు, ముసల్మాన్ లేడు” అనే ఆదర్శానికి వారు కట్టుబడ్డారు. ఈ ఆదర్శమే పంజాబీ స్పృహకు, పంజాబీ జాతీయవాదానికి జన్మనిచ్చింది.

మహిళల విముక్తి కోసం గురునానక్ నిలబడ్డాడు. స్త్రీలు పురుషుల కంటే హీనమైనవారుకారని, వారి మధ్య సమాన బాధ్యతలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. అతను బాధపడుతున్న స్త్రీల పట్ల సానుభూతి చూపించాడు.  మతసంబంధ విషయాలలో  వారికి సంపూర్ణ  అవకాశం కల్పించారు. వారు లౌకిక మరియు మతపరమైన ఆచారాలలో స్వేచ్ఛగా పాల్గొనొచ్చు.  వారికి ఎలాంటి సామాజిక నియమాలు లేవు.
ప్రజల నైతిక మరియు ఆధ్యాత్మిక స్వరాన్ని మెరుగుపరచడంలో గురు నానక్ చేసిన కృషి  ప్రశంసనీయం. సామాజిక, మత సంస్కరణల రంగంలో ఆయన చేసిన కృషి కూడా అంతే గొప్పది. గోకల్ చంద్ నారంగ్  మాటల్లో చెప్పాలంటే  “గురు నానక్ పంజాబ్  ప్రజలను  తన బోధనల ద్వారా కులం నుండి విముక్తి చేశారు. వారి ఆధ్యాత్మికత పాత బంధనాలనుంచి విముక్తి  పొందడానికి ఉపయోగపడింది. ఇది గురు నానక్  గొప్పతనం తెలియజేస్తుంది. "
పంజాబ్లో అతనికి ముందు,అతని తరువాత ఎవరూ ప్రజల పట్ల ఇంత  ప్రేమను చూపించిన వారులేరు.నానక్ ప్రజల దృష్టిలో  ' ప్రేమకు దేవుడు, ' మానవత్వానికి హీరో'. పంజాబ్  లో హిందువులు, సిక్కులు, ముస్లింలు  తమ పనిని ఉదయం ఆయన బోధించిన చరణాలను (జుప్జీ మరియు ఆసా డి వార్) చదివాకే  ప్రారంభిస్తారు.


గురునానక్ దేవ్  సిక్కు మతానికి సంబంధించి మూడు మార్గదర్శక సూత్రాలు ఏర్పరచాడు.. 
1.‘‘నామ్ జపన (దేవున్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం), 
2.కిరాత్ కర్ణ (నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం),
3. వంద్ చకనా (మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం).


సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురు పార్బ్ ఉంది. సిక్కు ప్రజల మొదటి గురువు గురునానక్.ఆయన  జన్మదినం సందర్భంగా  గురునానక్ జయంతిని జరుపుతారు.ఆ రోజును గురు పార్బ్ అంటారు.

గురు పార్బ్ కు 15 రోజుల ముందు ప్రతిరోజూ ఉదయాన్నే ప్రభాత్ ఫెర్రీ (మార్నింగ్ మార్చ్) చేస్తారు. వేడుకకు రెండు రోజుల ముందు అఖండ్ పాత్ (గురు గ్రంథ్ సాహిబ్ ను 48 గంటల పాటు చదవడం) చేస్తారు. అలాగే, గురు పర్బ్ వేడుకలకు ఒక రోజు ముందు నాగర్ కిర్తాన్ నిర్వహిస్తారు.  గురునానక్  బోధనలు అనుసరిస్తామని ప్రమాణం చేస్తారు. ఇందులో కామం, కోపం, దురాశ, అనుబంధం , అహంకారం అనే ఐదు చెడు ప్రభావం కలిగిన వాటిని అధిగమిస్తామని వారు ప్రతినబూనాలి.


___పిళ్లా కుమారస్వామి, 9490122229

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం