గోపరాజు రామచంద్రరావు తాత్విక దృక్పథం







గోపరాజు రామచంద్రరావు 
నాస్తిక ప్రయోగాలకు తావు 
మూఢాచార మురికి గుడ్డల్ని 
ఉడకేసి ఉతికేసిన చాకిరేవు


        “మానవుని విజ్ఞానంలో నిర్ధారణకు నిలుచు విషయములు సత్యములు, నిర్ధారణకు నిలువని విషయములు అబద్ధములు.నిర్ధారణకు వీలులేని విషయములు ఊహలు. దైవమనునది మానవుని ఊహలలో ఒకటి. దైవమునకు ఏ అర్థము చెప్పిననూ అది నిర్ధారణకు నిలచుటయైననూ లేదు లేకపోతే నిర్ధారణ చేయుటకైననూ వీలులేకున్నది. అందుచేత దైవము అబద్ధము కావలెను. లేకపోతే దైవము ఊహామాత్రము అయినా కావలెను. అంతేకాని సత్యము మాత్రము కాదు" అంటూ దైవభావాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన వారు గోరా 1902 నవంబరు 15న విశాఖజిల్లాలో, నేడు ఒరిస్సా గంజాంజిల్లా ఛత్రపూరులో జన్మించారు. 
. ఆయనే  గోపరాజు రామచంద్రరావు.  నాస్తిక భేరి మ్రోగించిన ఆధునిక చార్వాకుడు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, నాస్తిక కేంద్ర స్థాపకుడు. 
     ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్య, పర్లాకిమిడి, కాకినాడలలో వృక్ష, జంతుశాస్త్రాలు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాడు. దక్షిణ భారతంలోనూ, శ్రీలంకలోనూ వివిధ కళాశాలల్లో వృక్షశాస్త్ర విభాగంలో ఉపన్యాసకులుగా  పనిచేశారు.
          కొంతమంది యువకులు ముందు తరం దూతలు అని శ్రీశ్రీ చెప్పినట్లు విద్యార్థిదశలోనే సమాజం లో ఉన్న అనేక సంప్రదాయాలను హేతువాదదృష్టితో చూడటం మొదలుపెట్టారు. అన్ని మత గ్రంథాలను  అధ్య యనం చేశారు. ఏమౌతుంది నైనా ఉన్నది   మౌఢ్యమేగాని సత్యం లేదని గుర్తించాడు.  1928లో తాను నాస్తికుణ్ణని ప్రకటించుకున్నారు. అందుకు ఇంటినుండి. గెంటివేయబడినా, ఛాందససమాజం వెలివేసినా, కాకినాడ, బందరు కళాశాలలు నాస్తికుడూ, నాస్తిక ప్రచారకుడూ అనే నెపంతో వృత్తి నుండి తొలగించినా చలించకుండా ఉద్యోగాన్ని వదిలేసి మరింత పెద్ద ఎత్తున నాస్తిక ప్రచారం గావించిన నాస్తికోద్యమ యోధుడు. "మానవునిలో స్వశక్తి విశ్వాసం పెంచడానికి, అహింసాయుతంగా సాంఘిక, ఆర్థిక సమానత్వాలు సాధించడానికి నాస్తికత్వం కావాలని నేనంటున్నాను. నేను ఎలా తప్పోచెప్పండి బాపూ! అంటూ నాస్తికత్వం గురించి మహాత్మాగాంధీతో సంభాషించి, ప్రశ్నించిన గోరా, దైవభావన, కర్మసిద్ధాంతాలకు వ్యతిరేకంగా జీవితాంతం ప్రచారం చేశారు. కులమత రహితమైన సాంఘిక -వ్యవస్థ, పార్టీరహిత ప్రజాస్వామ్యం, హరిజనోద్ధరణలకు తన జీవితాన్ని అంకితంచేశారు. కులాం తర వివాహాలకు, నాస్తిక జీవితానికి సంబంధించిన ప్రబోధాలకే పరిమితంకాకుండా తన కుటుంబంలో వాటిని ఆచరించి చూపించారు. దళితుడైన జాషువా కవితో వియ్యమంచారు. తను నమ్మిన ఆదర్శసాధనకు కృష్ణాజిల్లాను తన మొదటి కార్యరంగంగా చేసుకున్నారు.. 1940 నుండి 47 వరకు కృష్ణాజిల్లా ముదునూరులో ఉంటూ అక్కడ నాస్తిక కేంద్రాన్ని నిర్వ హించారు. 1942లో ప్రథమ నాస్తిక మహాసభలను కనుమూరు గ్రామంలో జరిపారు. 1947లో ముదునూరు నుండి విజయవాడకు నాస్తిక కేంద్రాన్ని తరలించారు.

నాస్తిక ప్రచారానికి తన చేతలనే కాకుండా తన రాతలను కూడా ఉప యోగించుకున్నారు. నాస్తికత్వంపై ఎన్నో పుస్తకాలను తెలుగు, ఆంగ్లభాషలలో రాశారు. 1947లో 'సంఘం' తెలుగు, 1969లో 'దిఎథీస్ట్' ఆంగ్లపత్రికలను స్థాపించారు. 1972లో విజయవాడలో తొలి ప్రపంచ నాస్తిక సభలను నిర్వహించారు. ప్రపంచ నాస్తికోద్యమాన్ని నిర్మించడంలో ఈ సభలు ప్రత్యేకస్థానం పొందాయి. నాస్తికకేంద్రానికి అంతర్జాతీయ హ్యూమనిస్టు అవార్డు లభించింది.

1970లోనూ, 1974లోనూ అంతర్జాతీయ హ్యూమనిస్టు మహాసభలకు హాజరై యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలు పర్యటించారు. 1974 లోనే సోవియట్ యూనియన్ కూడా పర్యటించారు. సాంఘిక సమానత్వం ప్రబోధించే సహపంక్తి భోజనాలు, 1972లో భారత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంలో పంది మాంసం గోమాంసంల విందు కార్య క్రమాలు, పీర్ల పండుగల్లో అగ్నిగుండాలపై నడవడంలాంటి ప్రయోగాలతో నిజనిర్ధారణ చేసి సర్వమతమౌఢ్యాలపై నిశిత నాస్తిక కరవాలాన్ని ఝళిపించారు.

ఆభరణాలుగా బంగారానికి బదులు కూరగాయలు ధరించడం, పూలమొక్కలను పీకించి కూరగాయల మొక్కలను నాటడం లాంటి విపరీతాలు నిరసించదగినా, త్రిపురనేని, చలంతో పాటు, గోరా భావవిప్లవోద్యమ కృషిలోని హేతువాదసారం తెలుగునాట ఫ్యూడల్ వ్యతిరేక చైతన్యం విస్తరించడానికి దోహదమైందిగా ప్రశంసలు పొందింది.

'గోపరాజు రామచంద్రరావుగారు నాస్తిక వాదాన్ని చేపట్టి దేవుడున్నాడని చెబుతూ మోసపు బ్రతుకు బతకడంకంటే, దేవుడులేడని ఒప్పుకుంటూ నిజాయితీగా బతకడమే మంచిదని చాటి చెప్పారు' అని శ్రీశ్రీ ప్రశంసించిన గోరా, తన సమస్త కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్న విజయవాడలో 1975 జూలై 26 సాయంత్రం ఒక సభలో ప్రసంగిస్తూ కన్నుమూశారు.


సింగంపల్లి అశోక్ కుమార్
9246277375
(జనవరి - మార్చి 2022,చార్వాక)

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం