అరవింద ఘోష్ తాత్విక చింతన
అరవింద ఘోష్ తాత్విక చింతన
అరవింద ఘోష్ తండ్రి కృష్ణధన్ ఘోష్ బ్రిటన్‌లో ఒక వైద్యుడు. తల్లి స్వర్ణలత.వారిది సంపన్న కుటుంబం. వారికి అరవింద 1872,ఆగస్టు 15న కోల్‌కతాలో జన్మించాడు . అతని తండ్రి అతన్ని మొదట డార్జిలింగ్‌లోని ఆంగ్ల పాఠశాలకు , తరువాత ఇంగ్లాండ్‌లోని సెయింట్ పాల్స్ పాఠశాలకు పంపినారు. అరవింద కేంబ్రిడ్జ్ నుండి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక కింగ్స్ కాలేజీలో చదువుకున్నాడు. 1890లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, కానీ ప్రొబేషన్ సమయంలో అతను రైడింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో సివిల్ సర్వీస్‌కు దూరమయ్యాడు. 1893లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బరోడాలో, అరవిందునికి ఒక రహస్య విప్లవ సంస్థతో పరిచయం ఏర్పడింది.
అరవిందుని జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి విప్లవకారునిగా,రెండు ఆధ్యాత్మిక వాదిగా.
రాడికల్ భావాలతో సాయుధ విప్లవం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూలదోసి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించాలని తపన పడిన విప్లవకారుడు అరవింద ఘోష్. తరువాతి కాలంలో వీరి వర్గం నుంచి వచ్చిన వాడే సుభాష్ చంద్రబోస్. 1902లో ప్రమోద్ నాథ్ మిత్ర ఆధ్వర్యంలో ఏర్పడిన అణుశీలన్ సమితి లో అరవింద ఘోష్, బరిన్ ఘోష్, బాగా జతిన్ లు చేరారు.
అతని రాజకీయ కార్యాచరణ లో మూడు అంశాలు ఉన్నాయి:
1. విప్లవ ప్రచారాన్ని రహస్యంగా నిర్వహించడం, సాయుధ విప్లవానికి సిద్ధం కావడానికి తగిన సంస్థలను అభివృద్ధి చేయడం;
2.స్వాతంత్ర్యం కోసం మొత్తం దేశాన్ని సిద్ధం చేయడానికి ప్రచారాన్ని కొనసాగించడం;
3. విదేశీ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ , ప్రతిఘటన కోసం ప్రజలను సంఘటితం చేయడం.
తన రాజకీయ సిద్దాంతాలతో అరవింద 1903లో అపాస్ నే (రాజీ లేదు) అనే పుస్తకాన్ని రాసి పార్టీ సభ్యులతో చదివించాడు. 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా అతను తన బరోడా ఉద్యోగాన్ని విడిచిపెట్టి, జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి 1906లో అతను కలకత్తా నేషనల్ కాలేజ్ (ప్రస్తుతం జాదవ్‌పూర్ యూనివర్శిటీ)కి మొదటి ప్రిన్సిపాల్ అయ్యాడు. బిపిన్ చంద్ర పాల్ నడిపే ఆంగ్ల వార్తాపత్రిక వందేమాతరం సంపాదకునిగా బాధ్యత తీసుకున్నారు
ఖుదీ రామ్ బోస్, ప్రపుల్లచక్రి ఆధ్వర్యంలో 30 ఏప్రిల్ 1908న బ్రిటీష్ మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్‌ను చంపడానికి రైల్వే కంపార్ట్ మెంట్‌లో బాంబు విసిరారు. అయితే, ఆ బాంబు దాడిలో ఇద్దరు యూరోపియన్ లేడీలు మరణించారు. ఈ హత్యాప్రయత్నం నేపథ్యంలో అరవింద ఘోష్ ను,బిపిన్ చంద్ర పాల్ ను అరెస్టు చేశారు.ఇది అలిపూర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందింది.ఇందులో అరవింద కు సంవత్సర కాలం శిక్ష పడింది. బిపిన్ కు ఆరు నెలల శిక్ష పడింది. కానీ అరవింద నిర్దోషి అని నిరూపించబడింది. దాంతో ఆతనిని 6 మే 1909న విడుదల చేశారు.
జైలులో ఉన్నప్పుడు, అరవింద జీవితంలో ఒక పరివర్తన కలిగింది. అతను ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. 1910లో 38ఏళ్ల వయసులో రాజకీయాలను విడిచిపెట్టి, ఫ్రెంచ్ స్థావరమైన పాండిచ్చేరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి తన తాత్విక ప్రచారానికి అంకితమయ్యాడు.
ప్రజానీకాన్ని పోరాటంలోకి లాగేందుకు మతాన్ని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని అరవింద భావించాడు. తిలక్ కూడా తరువాత కాలంలో ఇలాగే భావించాడు. ప్రజలు వివిధ మతాలుగా విభజించబడ్డారు. అందువల్ల వారందరినీ ఐక్యం చేయాలని కోరుకున్నాడు . దానికోసం అతను సమగ్ర మానవతావాదం ను ప్రతిపాదించాడు.
అతను "ఇంటెగ్రల్ హ్యూమనిజం" సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంచుమించు ఇదే సిద్ధాంతాన్ని నేటి బిజెపి తమ పార్టీకి ఆదర్శంగా చెప్పుకునే దీన్ దయాల్ కూడా ప్రతిపాదించాడు. అయితే ఇది విద్వేషం మీద ఆధారపడి ఉంటుంది. అరవింద ఘోష్ ది అలా కాదు. ఇదొక ఆదర్శవాదం. పొంతనలేని భావనలను కలిగి ఉంటుంది. అద్వైతం, విశిష్టాద్వైతం, లేదా ఆదర్శవాదం, భౌతికవాదం, హేతుబద్ధత, విశ్వాసం (ప్రశ్నించకుండా), ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధన వంటి వన్ని అసంపూర్ణ లేదా పాక్షిక అవగాహన కారణంగా ఏర్పడినాయన్నాడు. తన సమగ్ర మానవతావాదం ఎలాంటి పక్షపాత ధోరణులు లేకుండా ఉందని అతను పేర్కొన్నాడు.అది బ్రహ్మను సమగ్రంగా వివరిస్తుందన్నాడు. పదార్థం, చైతన్యం ఈ బ్రహ్మానికి రెండు వైపులని అతను పేర్కొన్నాడు.
అతను 20వ శతాబ్దాన్ని నేషన్ స్టేట్స్ శతాబ్దంగా పేర్కొన్నాడు. అవి జాతీయ విముక్తి ఉద్యమాల ద్వారా ఏర్పడతాయన్నాడు. భారతదేశంలో మానవుల వివిధ సమూహాల కలయిక అసంపూర్ణంగా ఉందన్నాడు. దీని ఫలితంగా దేశంలో పేదరికం, నిరక్షరాస్యత , అన్ని రకాల వివక్షలు ఒక వైపు, లాభాలు కావాలన్న దురాశ మరొక వైపు ఉందన్నాడు. ఇది నిర్దిష్ట చారిత్రక కాలాల్లో వివిధ సామాజిక వర్గాల పాత్రను సరిగా చూడలేని వైఫల్యం తప్ప మరొకటి కాదని యం.వి.ఎస్. శర్మ అభిప్రాయపడినాడు.
వ్యక్తిగత ఆస్తి ద్వారా ఏర్పడిన సమాజం హేతువాద, భౌతికవాద అవగాహన ఫలితమే తప్ప మరొకటి కాదని ఆయన ప్రకటించారు. ఆధ్యాత్మికత ద్వారానే మనం ఈ సమాజాన్ని మార్చగలమన్నాడు. అందుకు అవసరమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలన్నారు. అదేమంటే సోషలిజమే నన్నాడు.
అతని సమగ్ర మానవతాదం అంతిమంగా అతన్ని భావవాదం వైపుకు లాగింది. దీని కోసం అతడు పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. తరువాత కాలంలో ఆ వాదం జాతీయ ఉద్యమంతో విడిపోయింది.
సామాజిక మార్పు వైపు సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునివ్వడానికి బయలు దేరిన అరవిందుడు బ్రహ్మ గురించి ఆలోచనలో పడ్డారు. ఆయన సమగ్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి 'లోపలికి చూడాలని' పిలుపునిచ్చారు. అటువంటి 'లోపలికి చూడడానికి' అతను యోగాను చురుకుగా ప్రచారం చేశాడు.అన్ని విషయాలు బ్రహ్మ నుండి ఉద్భవించాయన్నాడు. అతని వద్దకు తిరిగి రావడానికి ఒక శాశ్వతమైన వృత్తం ఉందన్నాడు.పునర్జన్మ ఉందన్నాడు.విశ్వానికి కొన్ని శాశ్వతమైన సూత్రాలు ఉన్నాయన్నారు.మనిషి జీవిత లక్ష్యం బ్రహ్మలో ఐక్యం పొందడమే నన్నారు. ఇలా భావ వాదంలో కూరుకుపోయాడు.అంతిమంగా జాతీయోద్యమానికి కూడా దూరమయ్యాడు. అతను సైన్స్ ను దాని అభివృద్ధిని ఉత్సాహంగా స్వాగతించాడు. కానీ ప్రతి శాస్త్రీయ పురోగతిని భావవాద దృక్కోణం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం , ఫ్యూడలిజం, కుల వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించాడని ఎం.వి.ఎస్. శర్మ పేర్కొన్నారు.
అరవిందుడు తన తాత్వికత ను ప్రచారం చేయడానికి అతని ఆశ్రమం ఆధ్వర్యంలో దాదాపు 16 పాఠశాలలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి.పుదుచ్చేరిలోని పాఠశాల ఆరోవిల్లిగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మచర్య, యోగ, ఆధ్యాత్మికత ద్వారా సమగ్ర విద్య లభిస్తుందని భావించాడు. తన సమగ్ర విద్య ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సమర్థ వంతంగా ఎదుర్కొంటారు.దాంతో సంక్లిష్ట మానవ సమాజాన్ని అర్థం చేసుకుంటాడని భావించిన అరవింద 5 డిసెంబర్ 1950న మరణించారు.
(వికిపీడియా, మార్క్సిస్టు పత్రిక లో యం.వి.ఎస్ శర్మ రాసిన వ్యాసం,Dr. Hazarat Ali Seikh
Assistant Professor,Lalgola College, పశ్చిమ బెంగాల్ రాసిన వ్యాసం ఆధారంగా)
___ పిళ్లా కుమారస్వామి,
9490122229
Comments
Post a Comment