జిడ్డు కృష్ణమూర్తి తాత్వికత
మొట్టమొదట 1929 లో కాలిఫోర్నియాలో తాను విశ్వగురువును కాదని బహిరంగంగా చెప్పుకున్నాడు. సంస్థలు, పీఠాలు వద్దన్నాడు. తాను అధ్యక్షుడిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ సంఘాన్ని రద్దు చేశారు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దివ్యజ్ఞాన సభ్యులు పోగు చేసిన 15000 కోట్ల డాలర్ల సొమ్మును ఎవరిది వారికి పంచేశాడు. ఆయన మీద అభిమానంతో హాలెండ్ నుంచి వచ్చిన వ్యక్తి బ్రహ్మాండమైన సౌధాన్ని, ఐదు వేల ఎకరాల భూమిని సమర్పిస్తానంటే అందుకు కృష్ణమూర్తి నిరాకరించారు.తానొక సాధారణ మానవుణ్ణని, సత్యమార్గంలో నిత్యాన్వేషినని ప్రకటించాడు. ఎప్పటిలాగే తన సామాన్య జీవితాన్నే గడపసాగారు.
ద్వేషాలూ, అసూయలూ, సంఘర్షణలూ, జాతి మత విభజనలూ లేని ఒక నూతన ప్రపంచం కోసం విద్యావిధానంలోనే మార్పురావాలనే దృక్పథంతో ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, కెనడాలలో విద్యాసంస్థలను స్థాపించారు.తనకంటూ ఏ వస్తువును అతను ఏర్పరచుకోలేదు.
విద్య కు సంబంధించి ప్రతి విద్యార్థి తనంతట తానుగా ఎదగాలని, సమాజానికి కట్టుబానిసలా తయారు కాకూడదన్నాడు. తనకై తానుగా ఉండటానికి పేదరికంలో ఉండవలసి వచ్చినా పర్వాలేదని ఆయన భావన. టీచర్ కూడా విద్యార్థిగా మారాలి. గురుశిష్యులిద్దరూ కలిసి తమను తాము అన్వేషించుకుంటూ ఆ ప్రయత్నంలో ఒకరి ద్వారా ఒకరు జీవితాన్ని అధ్యయనం చెయ్యటమే విద్య అన్నాడు. విద్య విద్యార్థి స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదని, అతణ్ని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దేదిగా ఉండాలన్నది కృష్ణమూర్తి భావన.
"ఓ ఎండుటాకు చెట్టు నుండి వీడి నేల రాలుతోంది. ఆ రాలటంలో ఓ గౌరవం. ఓ సహజత్వం, ఓ లావణ్యం. మనుషులు అలా ఓ పండుటాకులా అలవోకగా ఎందుకు మరణించలేకపోతున్నాం?"అని మరణాన్ని గురించి ప్రశ్నించాడు.
సమస్త జీవరాసుల పట్ల అతను కారుణ్యాన్ని కలిగి ఉండాలన్నారు.
నువ్వే అన్నీ స్వయంగా సత్యాన్ని తెలుసుకోమని బుద్దుడు చెప్పినట్లు జిడ్డు కృష్ణమూర్తి కూడా గురువు అన్న వాడు ఎవడూ ఉండడని స్వయంగా మనమే తెలుసుకోవాలన్నాడు.
జీవితంలో గెలుస్తామా, ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైంది, సక్రమమైంది అనుకున్న పంథాలో నడవండి." ఫలితాల కోసం ఎత్తు గడలు లేకుండానే కార్యకలాపాలు సాగించటానికి వీలులేదా?’’ అని ప్రశ్నించారు జిడ్డు కృష్ణమూర్తి.
భయం అన్నది ఎలా వస్తుంది?భయం అన్నది స్వతః సిద్ధంగా, తనంతట తానుగా ఉంటుందా, లేక ఏదైనా ఒక వస్తువును, భావాన్ని ఆశ్రయించి ఉంటుందా? - అని ప్రశ్నించాడు.
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయంటాడు. రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతపరమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుందని ఆయన అభిప్రాయం.ఈ పరివర్తన సిద్దాంతాన్ని తరువాత కాలంలో అంబేద్కర్ కూడా చెప్పారు. పరివర్తన తోనే సమాజం మారుతుందని అంబేద్కర్ భావించాడు.
సమస్యకి కారణం తెలుసుకోవటం, సమస్యని అర్థం చేసుకోవటం - రెండూ పూర్తిగా వేరువేరు విషయాలని ఆయన అభిప్రాయం. ఏ సమస్య అయినా ఎప్పుడూ పాతది కాదు. కాని దాన్ని మనం పాత సూత్రాలతో పరిష్కారం వెదకుతాం. అదే సమస్య మనకు అవగాహన కాకుండా ప్రతిబంధకమవుతుంది. ఈ ప్రతిక్రియలను అనాసక్తంగా అవలోకించండి. అనాసక్తంగా వాటిని తెలుసుకుని ఉండండి. అవి సమస్యని పరిష్కరించలేవని గ్రహించండి. సమస్య నిజమైనది. అది వాస్తవమైనది. కాని, దాన్ని సమీపించే పద్ధతి తగినట్లు ఉండదు. ఉన్నదానికి తగిన ప్రతిక్రియ లేకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది. సంఘర్షణే సమస్య. ఇలా హేతువుకందని విధంగా సమస్యను చూడటం పలాయన వాదమవుతుంది.
ఆలోచన అనేదే గతం నుంచీ, అనుభవం నుంచీ తయారైనది. అనుభవం ఎప్పుడూ గతానికి చెందినదే. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటానికి ఆలోచన ఒక గతించిన ప్రక్రియ అని తెలుసుకోవాలి. ఆలోచన ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు. దేన్నైనా కనుక్కోవటానికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన నుంచి విముక్తి కలగాలి.
ఏదో ఒక సూత్రంలో ఇమిడినంత మాత్రాన అది స్థిరత్వం అని సూచనకాదు. అసలా సూత్రమే అస్థిరమైన సంస్కృతి వల్ల పుట్టినది కావచ్చు. సత్యం ఒక భావం కాదు, ఒక నిశ్చితాభిప్రాయం కాదు.సత్యం మారుతుందన్న భావన దీని నుంచి గ్రహించి వచ్చా?
దైవం' అన్వేషిస్తే దొరికేదా?' తెలుసుకోవటం సాధ్యం కాని దాన్ని ఎలా వెతుకుతారు? వెతకటానికి ముందు ఏం వెతకాలో తెలిసి ఉండాలి కదా. కనిపించాలని వెతికితే, మీకు కనిపించేది మీ స్వీయ ప్రతిరూపమే. మీరు కోరేదే మీకు కనిపిస్తుంది. ఆలోచన అనేదే పరిమిత ప్రతిక్రియ కాబట్టి, నిర్ణీత సూత్రాలకీ, న్యాయసూత్రాలకీ కట్టు బడినది కాబట్టి అది సత్యం కాదు.
నిజానికి ఎవరిని వారు అర్థం చేసుకొనకుండా సత్యాన్ని శోధించాలను కోవటం మన నుంచి మనం పారిపోవటమే. ఆత్మజ్ఞానం లేకుండా మీరు శోధించే దైవం కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది. భ్రమ సంఘర్షణకీ, దుఃఖానికీ దారి తీయక తప్పదు. ఆత్మజ్ఞానం లేకుండా సరిగ్గా ఆలోచించటం కూడా సాధ్యం కాదు. అప్పుడు ఉన్న విజ్ఞానమంతా అజ్ఞానమే అయి, గందరగోళానికీ, వినాశానికీ దారి తీస్తుంది. ఆత్మజ్ఞానం అంతిమ లక్ష్యం కాదు. అనంతమైన దాన్ని తెరిచి చూపే ద్వారం మాత్రమే. అసలు స్వీయజ్ఞానం సంపాదించటం కష్టం అనే భావమే ఆత్మజ్ఞానానికి అవరోధం. నా సలహా ఏమిటంటే, అసలది కష్టమనీ, చాలా కాలం పడుతుందనీ అనుకోకండి. అదేమిటో, ఏంకాదో, ముందుగానే నిశ్చయానికి రాకండి. ఆరంభించండి. ఆత్మజ్ఞానం మీ సంబంధ, బాంధవ్యాల్లోనే ఆవిష్కరింపబడుతుంది. కావాలని ఒంటరిగా ఉండటంతోనూ, ఎవ్వరితోనూ కలవకుండా వేరుగా ఉండటంతోనూ ఆత్మజ్ఞానం కలగదు. సంబంధ బాంధవ్యాలను వదులు కోవటం అంటే మరణించటమే. మరణం అంతిమ ప్రతిఘటన. ప్రతిఘటించడం, అణచివేయటం, దాని స్థానంలో మరొకటి ప్రతిష్ఠించటం, ఆరాధించటం, ఏరూపంలోనైనా ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకాలే. ప్రతిఘటన కనిపించనిదైనా, కనిపించేదైనా, పోల్చటాలూ, సమర్ధింపులూ, ఖండించటాలూ, ఐక్యత వ్యక్తపరచటాలూ - ఇదంతా ఉన్నదాన్ని కాదనటమే. అర్ధమంతా ఉన్నదాంట్లోనే ఉంటుంది. అందులో ఉన్న అర్థాన్ని ఏ పక్షమూ వహించకుండా గ్రహించటమే దాని ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణే వివేకానికి నాంది. అపరిచితమైనదీ, అనంతమైనదీ సిద్ధించటానికి వివేకం అవసరం.
ఇలాంటి గందరగోళ అభిప్రాయాలు సరైన తాత్విక చింతన కిందకు రావు.
కృష్ణమూర్తి స్థానిక సమస్యలపట్ల గాక, సార్వజనీనంగా మానవజాతి అంతటిలో మార్పు తీసుకరావడానికి ప్రయత్నించారు. దీనికి ఒక మతాన్నో, సిద్ధాంతాన్నో, వాదాన్నో అనుసరించడం సరికాదని భావించారు. ఆయన తరచూ ‘నీవే ప్రపంచం, ప్రపంచమే నీవు’ అనేవారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితికి ప్రతి ఒక్కరూ బాధ్యులు అనేవారు. కాబట్టి, వ్యక్తులలో పరివర్తన ద్వారానే ప్రపంచంలో పరివర్తనను తీసుకురాగలం అనేవారు. మనిషికీ, సమాజానికీ మధ్యగల ఈ విశేషమైన సంబంధం గురించి ఆయన చాలా కూలంకషంగా చర్చించారు. మనుషులు దూకుడుగా, హింసాత్మకంగా, స్వార్థపూరితంగా, ద్వేషపూరితంగా ఉన్నంతవరకూ ఏ సాంఘిక విప్లవం కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ వ్యవస్థకానీ శాంతియుతమైన, అహింసాయుతమైన, సామరస్యపూరితమైన సమాజాన్ని నిర్మించలేమని గట్టిగా వక్కాణించేవారు. వ్యక్తుల సమూహమే సంఘం కాబట్టి, వ్యక్తులు స్వార్థభూయిష్టంగా, హింసాత్మకంగా, అత్యాశాపరులుగా ఉన్నందువల్ల ఎన్ని ఆదర్శవిధానాలు అవలంబించినా, ఎన్ని సిద్ధాంతాలు మార్చినా వ్యక్తుల్లోని దోషాలు ఏదో ఒక రూపంలో సమాజంలో ప్రతిబింబించక మానవు అనేవారు. ఏ సామాజిక విప్లవమైనా ప్రత్యేక సిద్ధాంతాలతోనో, విభజనలతోనో కూడుకొన్నది కాబట్టి అది పరిమితమైన మార్పులనే తీసుకురాగలదని ఆయన అభిప్రాయం.
దేవాలయాలకు వెళ్ళడం, యజ్ఞయాగాదులు చేయడం, దానధర్మాలు చేయడం, తీర్థాల్లో మునగడం – ఇది కాదు ధార్మికత అంటే. ఇది ఎవరైనా చేయగలరు. ఆంతరంగికంగా ప్రేమనూ కరుణనూ కలిగి ఉండకపోతే, స్వీయజ్ఞానం లేకపోతే ఈ ఆచారాల పాటింపువల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నాడు. మతాన్ని అనుసరించడం కాదు, మతపరమైన మనస్సును కలిగి ఉండటం ముఖ్యమన్నారు. మతమంటే ఏ గ్రంథంలోనో ఉందనో, ఎవరో చెప్పారనో దాన్ని నమ్మడం, దాని ప్రకారం వేషధారణ చేయడం, ఆచారాలు పాటించడం, అవే మాటలు వల్లించడం. ఇక్కడ సొంత జ్ఞానం అంటూ ఏమీ ఉండదన్నారు.
మతపరమైన మనస్సు అంటే సత్యాన్ని శోధించాలన్న, తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగి ఉండటం. మతపరమైన మనస్సు కలిగినవారు, మతం పేరిట జరిగే మారణహోమాన్ని ఏ మాత్రం సహించలేరు. సత్యాన్ని శోధించడానికి మతాలు, ఆచారాలు అవసరం లేదు. అది వ్యక్తి స్థాయిలో జరిగే స్వతంత్ర ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని సంస్థాగతంగా మార్చలేం. అందుకే ‘సత్యమనేది దారిలేని ప్రదేశం’ అని కృష్ణమూర్తి నిర్ద్వందంగా ప్రకటించారు.
ఒకసారి ఒకతను కృష్ణమూర్తిని కలసి “నేను సంఘసేవ చేయాలనుకొంటున్నాను. ఎలా మొదలెట్టమంటారు?” అని అడిగారు. దానికి కృష్ణమూర్తి బదులిస్తూ “సంఘసేవ ఎలా మొదలెట్టాలనే దానికన్నా, ఎందుకు మొదలెట్టాలనుకొంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. మన చుట్టూ ఉన్న పేదరికం, అనారోగ్యం, అసమానతలూ తొలంగించాలనా, ఎవరినో ఆదర్శంగా తీసుకోవాలనా, పేరు ప్రఖ్యాతులు గడించవచ్చుననా, సమాజాన్ని మార్చాలనా, నీ లోపలి వెలితి నుండి దూరంగా పారిపోవాలనా... ఎందుకు? లేదా నీ హృదయంలో ప్రేమా కరుణా ఉప్పొంగి ప్రజలపట్ల సహానుభూతితో ఆ పని చేయాలనుకొంటున్నావా? ఈ సంగతి నీవు ముందు తేల్చుకోవాలి. నీలో నీకు స్పష్టత లేకుంటే నువ్వు చేసే పని మరింత గందరగోళానికి దారితీస్తుంది” అని అన్నారు. ఆదర్శం కోసమో, మన్నన కోసమో చేసే పనిలో స్వార్థచింతన ఉంటుంది. అప్పుడు ఆ సేవ వ్యాపార మవుతుంది. అదే సేవ ప్రేమపూర్వకంగా చేస్తే ఎదుటి వారికి సంతోషాన్నీ, ప్రేమనూ పంచగలరు. ఇదీ కృష్ణమూర్తి అభిప్రాయం. అందుకని ముందుగా వ్యక్తిలో మౌలికమైన మార్పు తీసుకు రావడానికి ఆయన ప్రయత్నిస్తూ వచ్చారు. సుగుణమనేది స్వయంగా సాధించుకోవాల్సిన విషయం. స్వీయజ్ఞానంతోనే ఏది మంచో, ఏది చెడో తెలుస్తుంది. అవగాహన లేకుండా చేసి పనిని ఆయన నిరసించారే కానీ, నిష్క్రియత్వాన్ని ప్రోత్సహించలేదు.
ఒకరి వ్యక్తిత్వాన్ని, ఆదర్శాన్ని చూసి ఇష్టపడటం మెచ్చుకోవడం వేరు, అనుసరించడం, ఆచరించడం వేరు. వారి అవగాహనా స్థాయి మనలో లేనప్పుడు, ఆంతరంగికంగా చేతనా స్థితి లేనప్పుడు వారిని అనుసరించడం ఎలా కుదురుతుంది? ఒకవేళ అనుసరించాలనుకొన్నా కేవలం నకిలీగా తయారవుతారు. దానివల్ల ప్రయోజనం కంటే ఎక్కువగా నష్టమే వాటిల్లుతుంది. అందువల్లనే అనుసరించడాన్ని కృష్ణమూర్తి తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ కారణంతో ఎవరినీ శిష్యులుగా అంగీకరించలేదు. సత్యాన్ని ఎవరూ ఎవరికీ పంచి ఇవ్వలేమని, ఎవరికి వారు తమని తాము పరిశీలించడం ద్వారా ఆవగాహన చేసుకోవడం ద్వారా మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలరని కృష్ణమూర్తి పదే పదే చెప్పేవారు. అలా సత్యాన్ని తెలుసుకొన్నప్పుడే మనుషులు సృజనాత్మకంగా, వాస్తవంగా జీవించ వీలవుతుందన్నారు.
నీ జీవితానికి నువ్వే బాధ్యునివి. నువ్వేం చేస్తావో వాటన్నింటికీ నీదే బాధ్యత ఈ సొసైటీ బాగాలేదని ఆ సొసైటీ వల్లనే నేను ఇలా ఉన్నానని చెప్పుకోవడం ఉపయోగం లేదు . నా తల్లిదండ్రులు ఇలా పెంచారు అందువల్ల నేను ఇలా ఉన్నాను అనడంలో అర్థం లేదు. నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేయి. మీరు మారండి. మీరు మారాలనుకోవడం లేదు కాబట్టే మారడం లేదు.
1981లో బీబీసీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మనిషి ఆలోచనలు పరిమితమైనవని దానిని తెలివి నియంత్రిస్తోందని అన్నారు . వాస్తవానికి మనిషి ఉన్నది ఉన్నట్లు చూడటం అలవర్చుకోవాలని, వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించాలని ఆయన చెప్పారు. ఎవరి కథనైనా ఎలా చదవాలో తెలియాలన్నాడు. ఆలోచనకున్న సరైన స్థానం గుర్తించగలిగితే మనసులో ఎలాంటి అడ్డంకులు ఉండవు అన్నాడు. నిశిత పరిశీలన అవసరం . జ్ఞాన జ్యోతిని ఎవరూ వెలిగించలేరు. తనంత తానుగా వెలిగించుకోవాలి . ఉత్కృష్టమైనదేదో తెలుసుకోవాలి అని అన్నాడు.
సమాజాన్ని మార్చవచ్చు ఈ సమాజాన్ని మార్చడానికి కమ్యూనిస్టులు సోషలిస్టులు ప్రయత్నిస్తున్నారు. చాలా సంస్థలు ప్రయత్నించాయి కూడా. సమాజం అంటే ఏమిటి? అది వ్యక్తిగత సంబంధాల సమాహారం. మన వ్యక్తిగత సంబంధాలు మారితే సమాజం మారిపోతుంది. కానీ మనం మారడానికి ఇష్టపడడం లేదు. యుద్ధాల మధ్య, భయంకర పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం.సమాజం మార్చడం కోసం మనం తిరుగుబాటు చేయాలి. ఈ తిరుగుబాటు కమ్యూనిస్టులు చేసే తిరుగుబాటు కాదు. ఇది మానసికంగా పోరాట .మనతో మనం పోరాడాలి అంటారాయన
(Source: సోషల్ మీడియా)
___ పిళ్లా కుమారస్వామి 9490122229
Comments
Post a Comment