వినాయక్ దామోదర్ సావర్కర్ మతరాజకీయ తాత్విక ధోరణులు
వినాయక్ దామోదర్ సావర్కర్ మతరాజకీయ తాత్విక ధోరణులు
భారతదేశ తాత్వికతను, చారిత్రకతను తప్పుగా అర్థం చేసుకొని హిందూత్వ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వినాయక్ దామోదర్ సావర్కర్ నాస్తికవాది. హిందూ జాతీయవాద పితామహుడిగా పేరుగాంచారు. విప్లవకారునిగా జీవితాన్ని ప్రారంభించి తరువాత కాలంలో భీరువుగా మారిన స్వాతంత్ర్య పిపాసి.కానీ ఇతనికి వీర్ అనే బిరుదు ఇచ్చి వీర సావర్కర్ అని పిలుస్తుంటారు.ఆయన సాహిత్య కారునిగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సామాజిక సేవలు అందించారు.
వినాయక్ దామోదర్ సావర్కర్ 1883 మే 28 న దామోదర్‌పంత్ సావర్కర్, తల్లి రాధాబాయి దంపతులకు నాసిక్ లోని భగపూర్ గ్రామంలో జన్మించాడు.చిన్నతనంలోనే లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ రాజకీయనాయకుల నుండి ప్రేరణ పొందారు.అతను 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే అతను హిందూ-ముస్లిం అల్లర్ల తరువాత తన గ్రామంలోని మసీదుపై దాడికి తోటి విద్యార్థులను నడిపించాడు. "మేము హృదయపూర్వకంగా మసీదును ధ్వంసం చేశాం."అని చెప్పుకున్నాడు. అతను చిన్నతనంలో, 'మిత్ర మేళ' అనే యువ బృందాన్ని ఏర్పాటు చేశాడు.
అతను పూణేలోని 'ఫెర్గూసన్ కాలేజీ'లోతన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. సావర్కర్ ఇంగ్లాండ్ లో న్యాయవిద్యను ప్రభుత్వ ఉపకారవేతనంతో పూర్తి చేశాడు. అక్కడ సావర్కర్ తన తోటి భారతీయ విద్యార్థులతో కలిసి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి 'ఫ్రీ ఇండియా సొసైటీ' అనే సంస్థను స్థాపించారు.
దామోదర్ సావర్కర్ భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం చేయాలన్నారు. అతను "భారత స్వాతంత్య్రం యుద్ధం చరిత్ర" పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి చాలా మంది భారతీయులను ప్రేరేపించింది. దీన్ని బ్రిటిష్ వారు నిషేధించారు. నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన విప్లవకారులకు ఆయుధాలు సరఫరా చేశాడని సావర్కర్ పై అరెస్టు వారెంట్ ఇచ్చింది ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ అరెస్టు నుండి తప్పించు కోవడానికి,సావర్కర్ పారిస్ పారిపోయాడు. 1910 లో అతన్ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ బ్రిటిష్ అధికారులు తగిన చట్టపరమైన చర్యలను పాటించలేదని ఫ్రెంచ్ ప్రభుత్వం అడ్డు చెప్పింది.1911 లో బ్రిటిష్ అధికారులు, ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం ప్రకారం న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. అతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష పడింది.దాంతో 1911 లో అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ జైల్ కు పంపింది.కాలాపానీగా ప్రసిద్ధి చెందిన సెల్యులార్ జైలులో నిర్బందించారు.అప్పుడు సావర్కర్ వయసు 28 సంవత్సరాలు.
అండమాన్ జైలులో ఏకాంత గదిలో రాజకీయ ఖైదీగా సావర్కర్ 9సంవత్సరాల 10 నెలలు గడిపాడు.జైలు శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.అండమాన్ ఖైదీలందరికీ టాయిలెట్ వెళ్లడానికి ఒక నియమిత సమయం ఉండేది. లోపల ఉండడానికి కూడా వాళ్లకు కొంత సమయమే ఇచ్చేవారు. అప్పుడప్పుడు ఖైదీలు జైల్లో తమ గదుల్లోనే ఒక మూల మలమూత్రాలు విసర్జించేవాళ్లు.జైలు గది గోడలంతా మల, మూత్రాల దుర్గంధం వచ్చేది. అప్పుడప్పుడు ఖైదీల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి నిలబడి ఉండే శిక్ష అమలు చేసేవారు.అప్పుడు వాళ్లు నిలబడే మలమూత్రాలకు వెళ్లాల్సివచ్చేది. వాంతి చేసుకునేటప్పుడు కూడా వారికి కూచోడానికి అనుమతి ఉండేది కాదు.
బహుశా అక్కడ బ్రిటీష్ వారు పెట్టిన బాధలకు తట్టుకోలేక 1911 జులై 11న సావర్కర్ జైలుకు వెళ్లిన నెలన్నరలోపే ఆయన తన మొదటి క్షమాపణ లేఖ రాశారు. తర్వాత 9 ఏళ్లలో సావర్కర్ ఆరు సార్లు ప్రభుత్వాన్ని క్షమాబిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన జీవితం పై పరిశోధన చేసిన నీలాంజన్ ముఖోపాద్యాయ్ తన 'ది ఆరెస్సెస్-ఐకాన్స్ ఆఫ్ ద ఇండియన్ రైట్'(బి.బి.సి.కామ్,14.5.2019)
గ్రంథంలో వివరించారు. ఆయన 1913, 1914, 1918, 1920 సంవత్సరాలలో క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారు. అందులో “నేను దారితప్పి విప్లవవాదులకి సహాయం చేశాను, నన్ను మన్నిస్తే ఇంగ్లీష్ ప్రభుత్వానికి విధేయునిగా ఉండి మీకు మద్దతు ప్రకటిస్తాను” అని ఒకసారి. మరోసారి “నన్ను విడిపిస్తే దేశంలో మరియు విదేశాల్లో ఉన్న దారితప్పిన యువతను సరైన దారిలో నడిపించి మీ ప్రభుత్వానికి అండగా నిలుపుతాను, నా మీద దయ చూపండి”.అని ఇంకోసారి.“భారతదేశంలో మేధావులందరూ బ్రిటీషు వారికి సంపూర్ణ మద్దతు తెలిపితే అది దేశ సౌభాగ్యానికి ఉపయోగ పడుతుంది”.అని మరో లేఖలో రాశారు.”బ్రిటిషు వారి empire నా మనసుని దోచుకుంది” అని ఇంకో లేఖలో. అలాంటి క్షమాపణ ఉత్తరాలు రాసి ఉండవచ్చు. కానీ ఇతర పోరాట యోధులు ఎవ్వరూ ఇలా చేయకపోవడం గమనార్హం. "సావర్కర్ లాంటి వ్యక్తులు క్షమాపణలు రాయడం ద్వారా వారు నైతిక బలాన్ని కూడా కోల్పోయారు"అని గాంధీ 'యంగ్ ఇండియా'లో సావర్కర్ క్షమాపణలపై ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
సావర్కర్ జైలులో తన తోటి ఖైదీలకు చదవడం, రాయడం నేర్పడం చేసేవారు. జైలులో గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నారు.
దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్ నుంచి మహారాష్ట్ర లోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.
సెల్యులార్ జైలు గదిలో ఆయన గడిపిన 9 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం ఆంగ్లేయులంటే సావర్కర్‌కు వ్యతిరేకత పెరగడానికి బదులు అంతం అయ్యేలా చేసింది.
ఆయనకు భారతదేశం గతం పట్ల కొన్ని విపరీతమైన భావాలుండేవి. అవి ఆయన రచనల్లో కనిపిస్తాయి. ఆయన తన విద్వేష రాజకీయాలకోసం చరిత్రను ఉపయోగించు కున్నారు. ఆయనలో కక్ష పూరిత మనస్తత్వం, హింస పట్ల ఆదరణ, ఆందోళన కలిగిస్తాయి. కఠిన కారాగార వాసం భరించలేక క్షమాభిక్ష కోరాడని అర్థం చేసుకోవచ్చు గానీ, విడుదల తరువాత అతను హిందూత్వ పేరుతో విద్వేష, విభజన రాజకీయాలకు పాల్పడ్డటాన్ని ఏ మాత్రం సమర్థనీయంగా ఉండదు. అతివాద హిందూత్వను ప్రబోధించడం ద్వారా నాథూరాం గాడ్సే వంటి వారిని ప్రభావితం చేశాడు సావర్కర్.
సావర్కర్ 1923లో రాసిన హిందూత్వ; హిందువు ఎవరు? అనే వ్యాసంలో 'హిందూత్వ' పదానికి రూపకల్పన చేశారు. హిందూయిజంను, హిందూత్వ పదాన్ని గందరగోళపరచ రాదని, వాటి అర్థాలు వేరు వేరు అని, ఆయన పదే పదే స్పష్టం చేశారు. ద్విజాతి సిద్ధాంత ప్రచారానికి, తన విద్వేష రాజకీయాల ప్రచారానికి ఉద్దేశించినదీ వ్యాసం. హిందూ ధర్మం మహోన్నతమైనది. చాలా ప్రాచీనమైనది. అది మానవునికి స్వయం సాధన మార్గం చూపుతుంది. అది బౌద్ధ,జైన ధర్మాలను,వివిధ ఆదిమ తెగల సంస్కృతులను కలుపు కుంటూ ఏర్పడింది. కానీ హిందూత్వ అనే పదం మాత్రం ఆధునిక పదం. అది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పరిచిన పదం.అది మనిషిలో ఉండే భయం, ద్వేషం అనే హీనమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మానవత్వాన్ని మసకబారుస్తుంది.
సావర్కర్ 1909లో రచించిన "1857 మొదటి భారతీయ స్వాతంత్ర సమరం" అనే పుస్తకంలో హిందూత్వ అనే పదం లేదు.
అతను హిందూత్వ , హిందూమతం కంటే విస్తృతమైనదన్నాడు.భారతదేశం హిందువులు భౌగోళికంగా, చారిత్రకంగా ఒకే సంస్కృతికి కట్టుబడి ఉన్నారన్నారు. భారతీయ ముస్లింలు, క్రైస్తవులు హిందూ మతం మారిన సంతానమన్నాడు. వారు హిందూ సంస్కృతిని అంగీకరించాలన్నాడు. వారు భారతదేశాన్ని తమ మాతృభూమిగా మాత్రమే కాకుండా, తమ పవిత్ర భూమిగా కూడా చూడాలన్నారు.
అతను రాజకీయంగా మతాన్ని ఉపయోగించడంలో ఒక వ్యూహం ఉంది. సావర్కర్ తన హిందూత్వ నిర్వచనంతో భారతదేశాన్ని లౌకిక దేశంగా ఉండాలన్న ఆలోచనను ఎప్పటికీ చేయలేకపోయాడని బిఆర్ అంబేద్కర్ తన "థాట్స్ ఆన్ పాకిస్థాన్" పుస్తకంలో విమర్శించారు.
హిందువులకు , ఇతర మతస్తులకు మధ్య ఉన్న విభేదాలను నొక్కి చెప్పడం ద్వారా వారిపై ఆధిపత్యం సాధించడం,హిందువులను రెచ్చగొట్టి అధికారాన్ని సాధించడం, భారత దేశాన్ని హిందూమత రాజ్యంగా చేయడం హిందూత్వ సిద్దాంతం ఉద్దేశం.
ఆయన రాసిన “The Six Glorious Epochs Of Indian Culture” సంఘ్ పరివార్ కి గైడ్ లాగా ఉంది. ఇందులో ముస్లిం మహిళలు కలహాల్లో గాని, యుద్ధంలో గాని దొరికితే వారి గౌరవాన్ని కాలరాస్తూ వారిని మానభంగం కూడా చెయ్యొచ్చన్నాడు. దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలన్నాడు. ముస్లిం పాలకులు భారతదేశం పై దాడి చేసినప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి, హిందువులు కూడా ఇప్పుడలా చేయాలన్నారు. అదే సమయంలో అఖండ హిందుస్థాన్ లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. హిందువులకు మిలటరీ తరహా శిక్షణ ఉండాలి, ఆ శిక్షణ బహిరంగంగా ప్రదర్శించి ముస్లిం లను అభద్రతకు గురి చేయాలన్నది సావర్కర్ సిద్ధాంతం. ఇదే హిందూ మహా సభ ప్రధాన నినాదంగా అయింది. సావర్కర్ భావజాలం 1925 లో ఏర్పడిన RSS ను తీవ్రంగా ప్రభావితం చేసింది.
1926లో, అతను మారుపేరు తో రాసుకున్న 'నోబుల్ క్యారెక్టర్' (ఆత్మకథ కాదు!), ది లైఫ్ ఆఫ్ వీర్ సావర్కర్ లో తనను తాను వీర్ గా కీర్తించుకున్నాడు.
హిందూత్వ సిద్ధాంతకర్తయిన సావర్కర్ హిందూ మతాచారాలను ఖండించాడు. సావర్కర్ వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను నమ్మలేదు.భార్య చనిపోయి నప్పుడు జరిగే తంతును వ్యతిరేకించాడు. హిందువులు మాంసం తినడంలో తప్పు లేదన్నాడు.అదే విధంగా యూదులు, ముస్లింలు పంది మాంసం తినకపోవడాన్ని హేళన చేశాడు. తాను రాసిన''విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్''లో '' ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవ జాతి స్థాయి నుండి కిందికి దిగజారిన వారవుతారు. గోవు ఒక జంతువు. దానికి లేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటే అది మూర్ఖత్వమవుతుంది' అని స్పష్టం చేశాడు.
ఇవన్నీ చూసి ఆయనను హేతువాదిగా చెపుతుంటారు. కానీ ఆయన ఎక్కువ భాగం అహేతుక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఆయన భావాలను చూస్తే హిందూ మత ఛాందసుడిగా కనిపిస్తారు. అందువల్లనే ఆయన ఆవు రాజకీయాలు మొదలు పెట్టాడు.
సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తూ, ప్రాచీన భారతీయ వాంగ్మయమైన మనుస్మృతి లోని విషయాలను పొందుపరచలేదని విమర్శించాడు. మనుస్మృతి హిందూ ప్రజలకు దిక్సూచి అన్నాడు. ఇదంతా ఆయన లోని హేతువాద రాహిత్యానికి అద్దం పడుతుంది. హిందూ మహాసభ అధ్యక్షుడుగా ఏనాడూ అంటరానితనం నేరమని, వారికి ఆలయప్రవేశం కల్పించాలని చట్టం చేయాలని డిమాండ్ చేయలేకపోయారు.
1938లో నాజీలు యూదుల కు వ్యతిరేకంగా చేసిన చట్టం లాంటిదే ముస్లిముల పట్ల హిందూ రాజ్యం అయిన భారతదేశం చేయాలన్నది సావర్కర్ అభిప్రాయం.అతను భారతీయ ముస్లింలను విలన్‌లుగా చిత్రించాడు.నిజానికి, భారతీయ ముస్లింలు స్వాతంత్ర్య ఉద్యమానికి సావర్కర్ కంటే చాలా ఎక్కువ సహకారం అందించారు. అండమాన్ జైలులో మరణించిన ఖైదీల పేర్లను చూస్తే కూడా ఇది తెలిసి పోతుంది. మైనారిటీలు హిందూ సంస్కృతిని స్వీకరించాలి లేదా దేశం వదిలిపోవాలి అన్న వాదన కూడా చేశాడు. ఈ వాదనలో హేతుబద్ధత ఎంత ఉందో ఆలోచించాలి. యూదులను జర్మన్లు తరిమినట్లు, ముస్లింలను భారతదేశం నుండి తరమాలన్నది ఆయన వాదన. భారతదేశం ఆర్య దేశంగా భావించాడు. భారతదేశం, జర్మన్లలాగే ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేయాలన్నాడు.ఇది హిట్లర్ అమలు చేసిన ఫాసిజం తప్ప మరేమీ కాదు. దీని వల్ల ప్రపంచం ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు.
సావర్కర్ లో మరో కోణం ఉంది.అదేమంటే అతను మానవజాతి పురోగతి కోసం సైన్స్ ను, టెక్నాలజీ ని ఉపయోగించు కోవాలని చెప్పడం. సావర్కర్ గాంధీ చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.కానీ వ్యక్తిగతంగా ఏనాడూ హింసాత్మక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
1963లో ఆయన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ రాసినాడు. అండమాన్ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై స్వీయ ఆత్మకథ రాసుకున్నారు.సావర్కర్ ను చాలా మంది దేశభక్తుడిగా వర్ణిస్తుంటారు. జైలుకు పోవడం వరకు అది సరైనదే. కానీ తరువాత జీవితం కేవలం తన రాజకీయ లబ్ధి కోసం నడిచింది.
1948లో హిందూ ముస్లిం ల ఐక్యత ద్వారా మాత్రమే భారతదేశ విభజనను నిరోధించ వచ్చని గాంధీ ప్రయత్నించారు. ఆ సందర్భంలో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేశాడు. ఆ హత్య కు కుట్ర పన్నారని గాడ్సే తో పాటు వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ముంబయిలో అరెస్ట్ చేశారు. గాంధీజీ హత్యకు జరిగిన కుట్రకు సావర్కర్ నాయకత్వం వహించారని వల్లభాయ్ పటేల్ కూడా భావించారు. ఈ హత్య పై విచారించిన కమిషన్ కు నాయకత్వం వహించిన సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ జీవన్ లాల్ కపూర్ కూడా అలాగే భావించారు. అయితే 1949 ఫిబ్రవరిలో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్క ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.
జీవితం చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించిన సావర్కర్ 1966 ఫిబ్రవరి 26న కన్నుమూశారు. అండమాన్, నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు.
పాత కాలపు రికార్డులు ఒక్కొక్కటి బయట పడే కొద్దీ, సావర్కర్ చరిత్ర హీనుడుగా బయట పడుతున్నాడు. ఇంత జరిగినా వినాయక దామోదర్ సావర్కర్ ను తమ వీరుడు, ఆరాధ్య పురుషుడుగా బహిరంగంగా స్పష్టంగా బిజెపి
ప్రకటించడం శోచనీయం.సావర్కర్ ను భగత్ సింగ్,గాంధీజీ ల సరసన జాతీయ నాయకునిగా ప్రతిష్టించే ప్రయత్నం చేయడమంటే ఎందరో భారత దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని విస్మరించడమే అవుతుంది.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
జావేద్ నఖ్వీ dawn వెబ్ పత్రిక లో రాసిన వ్యాసం
గాంధీజీ స్థానంలో సావర్కరా? డా.దేవరాజు మహారాజు రాసిన వ్యాసం (నవతెలంగాణ
9. 12.2022)
బెందాళం కృష్ణారావు రాసిన ఫేస్బుక్ వ్యాసం
15 అక్టోబర్ 2021 BBC factcheck
క్రాంతి దేవ్ మిత్ర రాసిన అగ్నికణం వీర సావర్కర్ వ్యాసం
'సావర్కర్ అన్ మాస్క్‌డ్' పుస్తక రచయిత,శంసుల్ ఇస్లాం,డిల్లీ యూనివర్సిటీ )
స్క్రోల్.ఇన్
నేషనల్ హెరాల్డ్ ,28 మే 2020
Comments
Post a Comment