నిత్య చైతన్య ఝరీ ప్రవాహం భగత్ సింగ్ తాత్విక ఆలోచనలు
నిత్య చైతన్య ఝరీ ప్రవాహం భగత్ సింగ్ తాత్విక ఆలోచనలు
"జీవితాన్ని ప్రేమిస్తాం,మరణాన్నీ ప్రేమిస్తాం.
మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం.
నిప్పురవ్వల మీద నిదురిస్తాం.”అన్న భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్థాన్‌లో గల ల్యాల్‌పూర్ జిల్లా లోని బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు. 1931, మార్చి 23వ తేదీన లాహౌర్ జైలులో బ్రిటిష్ వారి ఉరికొయ్యలపై ఈ విప్లవకిశోర కంఠారావం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ మూగబోయింది. అదిప్పుడు భారతదేశ యువతరాన్ని తట్టి లేపుతోంది. అప్పటికి భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు మాత్రమే.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల వయస్సు లోనే సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా పరిణమించేలా చేసింది. భగత్‌సింగ్ కు గాంధీ నాయకత్వంలో సాగుతున్న జాతీయోద్యమం పట్ల భ్రమలు తొలిగిపోయాయి. 1924వ సంవత్సరంలో ఆయన సచీంద్రనాద్ సన్యాల్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి విప్లవకారులతో స్థాపించబడిన హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్లో చేరాడు. రష్యాలో బోల్షివిక్ విప్లవం ప్రభావం తో అనేకమంది భారతీయ విప్లవకారులు, మార్క్సిస్టులుగా మారారు.భగత్ సింగ్ కూడా మార్క్సిస్టు అయ్యారు.విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థకు, సామాజిక దోపిడీకి,పీడనకు చావు గంటను మోగిస్తుందని తెలుసుకున్నాడు. అది కష్టజీవులకు, కర్మవీరులకు నూతన ఉషోదయం తెస్తుందని,, నూతన ప్రజాస్వామ్యానికి ఊపిరిపోస్తుందని విశ్వసించాడు.
1928వ సంవత్సరంలో లాహౌర్‌లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన నిరసన కార్యక్రమంలో లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి మరణించాడు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ ప్రభావంభగత్ సింగ్ పై అధికంగా ఉండేది. లాలా లజపతి రాయ్ చనిపోవడంతో
అందుకు కారణమైన జేమ్స్ స్కాట్‌పై భగత్‌సింగ్ బృందం దాడి చేసింది. ఆ దాడిలో పొరపాటున అతని అసిస్టెంట్ సాండర్స్ హత్యకు గురయ్యాడు. 1929లో భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్ సెంట్రల్ లేజిల్లేటివ్ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగబాంబులు వేసి ''విప్లవం వర్థిల్లాలి'' అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విచారణ తరవాత భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లకు జీవిత ఖైదును, ఆ తరువాత సాండర్స్‌తోపాటు మరో హత్యకు కారణమైన భగత్‌సింగ్‌కు, ఆయన సహచరులైన సుఖ్‌దేవ్, రాజగురులకు మరణ శిక్షను విధించారు. ఆ మరణశిక్షను 1931, మార్చి 23న లాహోర్ జైలులో అమలు చేశారు. అలా ఒక విప్లవకారుడి గొంతు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ మూగబోయింది.
పంజాబ్ లో షహీదీ మేళా (బలిదానం ఫెయిర్) ను ప్రతి సంవత్సరం మార్చి 23న జాతీయ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తారు.ఆయన
సోక్రటీస్ లాంటి స్థితప్రజ్ఞత కలిగిన తాత్వికుడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జోన్ ఆఫ్ ఆర్క్, చేగువేరా లాంటి విప్లవకారుల కోవకు చెందినవారు.
భగత్ సింగ్ తాను హేతువాది, నాస్తికవాది, మార్క్సిస్టు వాదినని అని స్పష్టంగా ప్రకటించారు. పునర్జన్మ ను, మూఢనమ్మకాలను, అంటరానితనాన్ని వ్యతిరేకించారు. తిరగబడకుండా అడ్డుకోవడం కోసమే పునర్జన్మ సిద్ధాంతం ఉందన్నాడు.మలాన్ని శుభ్రం చేసినంత మాత్రాన మనుషులు అంటరానివాళ్లెట్లా అవుతారని భగత్‌సింగ్ ప్రశ్నించారు.అంటరానివారికి తమ సొంత ప్రజాప్రతినిధులు ఉండటం అవసరమన్నారు భగత్‌సింగ్. అసలైన కార్మికవర్గం వీరే నాని ఆయన భావించారు.మతాన్ని శాస్త్రీయ దృష్టితో పరిశీలించారు. " నిరాశ, నిస్పృహల్లో ఉన్న వారికి, నిస్సహాయులకు, దేవుడు ఒక తండ్రిగా, తల్లిగా, ఆప్తునిగా సహాయ కారిగా ఉంటాడు. దైవం పై నమ్మకం కష్టాలను కొంతవరకు మరిచిపోయేలా చేయగలదు. ఆ నమ్మకమే మానవునికి ఎంతో ఓదార్పును, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుందని" భగత్సింగ్ అన్నారు.అయితే మత పరమైన మూఢ నమ్మకాలను ఖండించాడు. మతం పేరుతో, భగవంతుని పేరుతో దోపిడీ వర్గాలు నూతన సమాజాన్ని నిర్మించడానికి అడ్డుకొంటున్నాయన్నాడు.
సమాజంలో పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం దైవ లిఖితం కాదని, అవి పూర్వజన్మ పుణ్యపాప ఫలితాలు కావన్నాడు. సమాజంలో దోపిడీ విధానాన్ని రద్దుచేస్తే మానవ జీవిత సమస్యలను పరిష్కరించవచ్చన్నాడు భగత్ సింగ్.
గాంధియన్ సంస్కరణవాదాన్ని తిరస్కరించాడు. ఉగ్రవాదాన్ని విప్లవపంథా కాదన్నాడు.
తొలి విప్లవకారులు మతాల నుండి ఉత్తేజం పొందారని,అయితే వారు మతోన్మాదులు, మూఢ భక్తిపరులు కాదని,వారివి మత్మోనాద రాజకీయాలు కావని భగత్ సింగ్ అన్నారు.
మతవాదులు చేసే వాదాలను ఎదుర్కోవాలంటే సమాజాన్ని అధ్యయనం చేయాలన్నాడు. అధ్యయనం ద్వారా వాటిని ఎదొర్కోవాలన్నాడు.
ఉరిశిక్ష ప్రకటించిన తరువాత కూడా దేవుడిని ప్రార్థించే విషయాన్ని పక్కన పెట్టాడు. ప్రార్దించడం ద్వారా దేవుడి నుండి ప్రయోజనం పొందాలనుకోవడం మానవుని నైతిక పతనానికి నిదర్శనమన్నారు.ఆశయాల కోసం మనోనిబ్బరంతో నిలబడినాడు.
జైల్లో ఉన్నప్పుడు ఆయన "నేనెందుకు నాస్తికుడ్ని"(why I am an Atheist?) అనే గ్రంథాన్ని రాశారు. మనిషి జీవితానికి హేతువాదమే సరైన మార్గదర్శకం కాగలదన్నాడు.
గతితార్కిక భౌతికవాదాన్ని అధ్యయనం చేసిన భగత్ సింగ్ మార్మికవాదాన్ని తిరస్కరించాడు.
ప్రతి విప్లవకారుడికి ''ఆత్మ విమర్శ'', ''స్వతంత్ర ఆలోచన'' అనివార్యంగా ఉండాలన్నారు. లెనిన్ రచనలను అధ్యయనం చేశాక అరాచకవాదాన్ని, ఉగ్రవాదాన్ని, మతతత్వాన్ని తిరస్కరించాడు.
చరిత్రకారుడు కె.ఎన్. ఫణిక్కర్ భారతదేశంలోని ప్రారంభ మార్క్సిస్టులలో ఒకరిగా భగత్ ను అభివర్ణించారు.
మతమౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని ఎదిరించటానికి చరిత్రలో జరిగిన పోరాట అనుభవాలను విప్లవకారులు ఉపయోగించుకోవాలన్నాడు.మతం
మనిషి వ్యక్తిగత విషయమన్నారు. రాజకీయాల్లోకి
మతం దూరరాదన్నాడు.
వర్తమాన సిద్ధాంతాలను, తాత్విక చింతనను, విశ్వాసాలను హేతుబద్దంగా తర్కించి వాటిని నిగ్గుతేల్చాలన్నాడు. పీడిత ప్రజల ఆశల్ని, ఆకాంక్షలనూ తీర్చగలిగేది శాస్త్రీయ సోషలిజం మాత్రమేనన్నారు.
సామ్రాజ్య వాదం సర్వ శక్తులు ఒడ్డి,ఎన్ని రకాలుగా పెనుగులాడినా కూడా విప్లవాన్ని అడ్డుకోలేని స్థితి వస్తుందన్నారు. మతకలహాలు లేని సమాజం రావాలన్నారు.దోపిడీ శక్తులు ఏ రూపంలో పెత్తనం చేస్తున్నా ఆ స్వాతంత్రం సంపూర్ణం కాదన్నాడు.
విశ్వాసాలను, మౌఢ్యాలను, పెట్టుబడి కుతంత్రాల సుడిగుండాలను అధిగమిస్తూ ఆచరణాత్మకంగా ఉన్నవాడే నిజమైన విప్లవకారుడన్నాడు.విప్లవం అంటే బాంబుల పట్ల, తుపాకుల పట్ల వెర్రి కాదు. అధర్మంపై ఆధారపడిన వ్యవస్థను మార్చేదే విప్లవమని అన్నారు.
సమాజాన్ని సామ్యవాద ప్రాతిపదికన పునర్నిర్మించాలని భావించేవారు నాగరికతా భవంతిని కాపాడుకోవాలన్నాడు. లేదంటే అది కుప్పకూలిపోతుందన్నాడు.మనిషిని మరో మనిషి, ఒక దేశాన్ని మరో దేశం దోచుకునే పద్ధతికి భరతవాక్యం పలకాలన్నాడు.
విప్లవ పార్టీ ఆశయాలు, మహోన్నత బలిదానాలు తనను అత్యున్నత స్థానంలో నిలిపాయని భావించాడు."దేశం కోసం, మానవాళి కోసం నేననుకున్న దాంట్లో సగం కూడా నేరవేర్చలేక పొయాను. ఒక వేళ బతికి ఉంటే ఇవన్నీ పూర్తి చేయటానికి అవకాశం లభించేదేమో? అప్పుడు నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగే వాడినేమో? ఈ ఒక్క విషయం తప్ప నా హృదయంలో ఉరిశిక్షను తప్పించుకొవాలని ఏ కోశానా లేదు." అని తన వీలునామా లో భగత్సింగ్ రాసుకున్నారు. అందువల్లనే " భారతదేశం తాను విప్లవీకరింప బడటానికి భగత్‌సింగ్ రూపంలో మరో లెనిన్‌కు జన్మనిచ్చిందని" బిపిన్ చంద్ర అన్నారు.
జైలులో ఉన్నప్పుడు,భగత్ సింగ్ , మరో ఇద్దరు లార్డ్ ఇర్విన్‌కి ఒక లేఖ రాశారు.అందులో వారు తమను యుద్ధ ఖైదీలుగా పరిగణించాలని కోరారు. ఉరి కాకుండా ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఉరితీయాలని కోరారు.ప్రణత్ మెహతా,భగత్ సింగ్ స్నేహితుడు, అతనిని ఉరితీయడానికి మూడు రోజుల ముందు, క్షమాపణ లేఖతో మార్చి 20న అతనిని జైలులో సందర్శించాడు. కానీ అతను దానిపై సంతకం చేయడానికి నిరాకరించాడు. "పోరాటమే జీవితమైనప్పుడు మృత్యువును కౌగిలించుకునైనా మాట నిలబెట్టాలి' అన్నాడు త్రిపురనేని శ్రీనివాస్.అదే చేశాడు భగత్ సింగ్. అతను ఉరికొయ్యపై ఊగే ముందు చదివిన పుస్తకం లెనిన్ జీవితం. తనని పిలిచేందుకు వచ్చిన గార్డ్స్ తో చెప్పిన మాటలు "ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడ్ని చదువుతున్నాడు. కాసేపు ఆగు" అని.
చివరికోరిక గురించి అడిగి నప్పుడు
"నా చివరి కోరికను అడగకు.
ఇది నా అంతం కాదు, ఇది నా మరణం కాదు
విజయం మరణం పైన ఉంది.
మరణం నన్ను ఎన్నుకోలేదు, నేను దానిని ఎన్నుకున్నాను.
తద్వారా నేను శాశ్వతంగా జీవించగలను
సందేహం లేదు! నేను జీవించాలనుకుంటున్నాను,
కానీ ఈ భూమి పై రోజూ చనిపోతున్నట్లు కాదు,
నా జీవితం నాది అని చెప్పగలను.
నా స్వేచ్ఛా దేశంలోని బానిస ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలనేది నాకున్న ఒకే ఒక కోరిక.
మరణం నా మెడపై ఉంది,
మరికొద్ది సేపట్లో నేను శరీరాన్ని విడిచిపెడతాను
నెరవేరని కోరికల గురించి సంచరించదు నా మనసు.
అసంపూర్ణ కర్తవ్యాల కోసం
నేను మళ్ళీ వస్తాను." అన్నాడు భగత్ సింగ్.
భగత్సింగ్ ఆఖరు పరీక్ష ఎదురైనప్పుడు ఎంతో ధైర్యంగా మృత్యువును ముద్దాడి 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ భారతదేశ యువతరానికి ఒక పోరాట తాత్వికతను వారసత్వంగా అందించి సెలవుతీసుకున్నాడు.నా శరీరాన్ని చంపగలరేమో,కానీ ఆశయాన్ని కాదన్నారు.
"లోపల సరస్సులున్న మనిషి
బయట సముద్రాలు సృష్టిస్తాడు'' అని త్రిపురనేని చెప్పింది భగత్సింగ్ కు అక్షరాలా వర్తిస్తుంది.
____ పిళ్లా కుమారస్వామి,9490122229
ఆధారాలు
1.జనసాహితి ప్రచురణ 'నా నెత్తురు వృధాకాదు'
2.విప్లవోద్యమంలో అస్తమించని భాస్కరుడు
___నెల్లూరు నరసింహారావు (నవ తెలంగాణ27.9. 2022)
3.షహీద్' భగత్‌సింగ్ రాసిన 'అఛూత్ కా సవాల్' (అంటరానితనం సమస్య) అనే వ్యాసం.(కిర్తీ' పత్రిక)
4.నిరంతర పోరాట స్ఫూర్తి భగత్సింగ్ __అశోక్ థావలె
Comments
Post a Comment