సృజనాత్మక, ఆచరణాత్మక తాత్విక వెలుగులు చిమ్మిన ఈఎమ్మెస్ నంబూద్రిపాద్


సృజనాత్మక, ఆచరణాత్మక తాత్విక వెలుగులు చిమ్మిన ఈఎమ్మెస్ నంబూద్రిపాద్
        ____పిళ్లా కుమారస్వామి,949012229
                                            

       ప్రపంచంలో నే మొట్టమొదటి సారిగా పార్లమెంటరీ పద్దతుల్లో భారతదేశంలోని కేరళలో కమ్యూనిస్టు పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చిన EMS నంబూద్రిపాద్ పూర్తి పేరు ఎలంకులం మనకల్ శంకరన్ నంబూద్రిపాద్. ఆయన జూన్ 13, 1909, కేరళ లోని పెరింతల్మన్న సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన మార్చి 19, 1998 న 89 సంవత్సరాల వయస్సులో తిరువనంతపురంలో మరణించారు. వీరి భార్య పేరు ఆర్యా అంతర్జనం. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి సభ్యునిగా, సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యునిగా పనిచేశారు. చీలిక తరువాత సిపిఎం పార్టీ సిద్ధాంతకర్తగా, ఆ పార్టీ పునాది నిర్మాణ కర్తగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇరవై మూడేళ్ళ వయసులో 1932లో మహాత్మాగాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష అనుభవించారు .

సోషలిస్ట్ ఆలోచనలతో ప్రభావితమైన కాంగ్రెస్ సభ్యులు జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్ , EMS 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఇఎంఎస్ కేరళ విభాగానికి నేతృత్వం వహించారు. భారతదేశంలో కమ్యూనిస్టు కేంద్రం లేనప్పుడు, చాలా చోట్ల కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లో చురుకుగా ఉన్నారు. EMS కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు. అప్పటి మద్రాసు రాష్ట్రం లో ప్రస్తుత తమిళనాడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భాగాలు మరియు కేరళలోని మలబార్ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్య మద్రాసు లో కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీ యూనిట్లు ఏర్పాటు కు కృషి చేశారు. ఆ సందర్భంలో కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తున్న EMS కూడా కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ లో ఒకరిగా మారారు. 1937లో పి. కృష్ణ పిళ్లై, ఎన్‌సి శేఖర్, కె. దామోదరన్, ఇఎంఎస్._వీరంతా కమ్యూనిస్టులుగా మారారు.

     ఇది EMS జీవితంలో ఒక పెద్ద మలుపు. మార్క్సిజాన్ని, కేరళ సమాజ చరిత్ర ను అధ్యయనం చేశాడు.ఈ అధ్యయనం ద్వారా భారతదేశంలో సోషలిస్టు విప్లవం ఆవశ్యకత తెలిసి వచ్చింది.లక్ష్యాన్ని నిర్ణయించుకున్న నంబూద్రి జీవితంలో వెనుతిరిగి చూడ లేదు.అప్పటినుండి అతని జీవితం ప్రజాజీవితంతో ముడిపడిపోయింది. EMS సిపిఐ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు.  
      EMS నేతృత్వంలోని పార్టీ వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేసేందుకు కార్మికకర్షక ఐక్యతను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. 
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట సమయంలో, కేరళ కమ్యూనిస్టులు రైతు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశంలో వ్యవసాయ కార్మికుల ఉద్యమం నిర్వహించడంపై దృష్టి పెట్టారు. 
భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ కోసం పోరాటాన్ని ప్రారంభించిన వారిలో కామ్రేడ్ EMS ఒకరు. ఆయన నేతృత్వంలోని ఐక్య కేరళ ఉద్యమం ట్రావెన్‌కోర్-కొచ్చిన్ సంస్థానాలను ఏకం చేయడంలో విజయవంతమైంది.   
    భాషను ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలుగు ప్రాంతంలో వచ్చిన ఉద్యమం మాదిరిగా కేరళలో వామపక్షాలు శక్తివంతమైన ఉద్యమాన్ని నడిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే, 1957లో కేరళ రాష్ట్రం ఏర్పాటైంది. కేరళలోని శ్రామిక-రైతు వర్గాలలో నంబూద్రిపాద్ నాయకత్వం లోని సీపీఐ(ఎం)కి బలమైన మద్దతు ఉంది. దాంతో కేరళ శాసనసభకు జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఇ.ఎం.ఎస్ నాయకత్వంలో పార్టీ విజయం సాధించింది. 
దాంతో ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలంలో భూసంస్కరణలు అమలు చేశారు.ఇది గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అసమానతల ను తగ్గించ గలిగింది. కౌలు రైతు చట్టాన్ని రద్దు చేశాడు.వ్యవసాయ కార్మికులకు వేతనాన్ని పెంచాడు.భూమి లేని వారందరికీ భూమిని పంపిణీ చేశారు. ఇది వ్యవసాయ రంగంలో, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది.చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా విభిన్న పారిశ్రామిక పునాదిని నిర్మించేందుకు ప్రయత్నించింది. కర్మాగారాల సంఖ్య 3 సంవత్సరాలలో 30% పెరిగింది - 1957లో 1,613 నుండి 1959లో 2,275 యూనిట్లకు చేరుకుంది. 
ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెంచారు. రాష్ట్రానికి ప్రైవేట్ పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలను ఏర్పాటు చేయించారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ జాబితా నుండి ఉపాధ్యాయులను నియమించాలన్న అతని ప్రయత్నాలను మత పెద్దలు , ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. వారు పాఠశాలలు కమ్యూనిజం ప్రచారానికి ఉపయోగించబడతాయని భయపడ్డారు. 1959లో కేంద్రంలో ఎంతో ప్రజాస్వామ్యిక వాదిగా పేరుగాంచిన నెహ్రూ కేరళ నుంచి దేశ వ్యాప్తంగా కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందనే భయంతో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధింపజేశాడు.
         మొదటినుంచీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందువల్ల 1959లో, కేరళలోని E.M.S. నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356ను అమలు చేయడం ద్వారా రద్దు చేయడానికి RSS , జనసంఘ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాయి. దీనికి తోడుఅమెరికన్ CIA నిధులు కూడా సమకూర్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుని సలహాదారుగా పనిచేసిన పాట్రిక్ మోయినిహాన్ తన పుస్తకంలో స్పష్టంగా నమోదు చేశాడు. అటల్ బిహారీ వాజ్‌పేయి కొట్టాయం వచ్చి 'మలయాళ మనోరమ' దినపత్రిక యజమాని - మమ్మన్ మాప్పిలై - తో కలిసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయడం సరైందని తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను చాటుకున్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆగస్టు 1, 1959న, RSS, జనసంఘ్ కార్యకర్తలు "విజయోత్సవ దినం " జరుపుకున్నారు.
      కేంద్రం చేసిన ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ EMS దేశమంతటా పర్యటించారు.ప్రజాస్వామ్య భావాలు కలిగిన వారంతా ఆయనతో మమేకమయ్యారు.  
       1964లో సిద్ధాంతపరంగా CPI రెండుగా చీలిపోయింది.ఆ సందర్భంలో నంబూద్రిపాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) వైపు నిలిచాడు.కేరళలో ఎన్నికలలో పోటీ చేసేందుకు CPI(M),ఇతర వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) , సోషలిస్టు పార్టీలతో కలిసి ఏడు పార్టీ ల కూటమిని ఏర్పాటు చేసింది. అతను 1967లో ఆ కూటమికి నాయకత్వం వహించాడు. ఆ సందర్భంలో భూసంస్కరణల చట్టాన్ని అమలు చేయాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ పోరాటాన్ని నిర్వహించారు నంబూద్రిపాద్ సిపిఎం పార్టీ నాయకునిగా.
       నంబూద్రిపాద్ మంచి వక్త. ఆయన పార్టీ లక్ష్యాలను, తన భావాలను ప్రజలకు సమర్థవంతంగా బట్వాడా జేశాడు. అది ఆయన్ను ప్రజలకు చేరువ చేసింది. ఆయన రెండవసారి కేరళ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 1969లో ఆ సంకీర్ణ ప్రభుత్వం చీలిపోయింది. దాంతో కేరళ శాసనసభలో మరోసారి ప్రతిపక్ష నేత కావడానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. 
            అతను కేరళ చరిత్ర, భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, 1981లో భారత రాజకీయాలు గందరగోళాలు, నేను కమ్యూనిస్టు ఎలా అయ్యాను? కమ్యూనిస్టు పార్టీ _కేరళ, నెహ్రూ: సిద్ధాంతం, ఆచరణ, కేరళ: నిన్న నేడు రేపు ,మహాత్ముడు_ అతని సిద్దాంతం మొదలైన రచనలు చేశాడు.తన జీవితాంతం వివిధ విషయాలపై లెక్కలేనన్ని వ్యాసాలు, పుస్తకాలు రాశారు.1991లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ రాజకీయాల గురించి రాస్తూనే ఉండేవారు.

                  యువకుడిగా ఉన్నప్పుడే ఆయన కులవివక్ష కు సంబంధించిన సామాజిక సంస్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం కోసం పెరియార్ సాయం తీసుకుని ఉద్యమం నడిపాడు. నంబూద్రిపాద్ కేరళలో ఒక శక్తివంతమైన కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేశారు. ఇందుకు ఆయన ఎంచుకున్న పోరాట మార్గాలు రెండు. ఒకటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం.రెండోది భూస్వామ్య వ్యతిరేక పోరాటం. ఈ రెండు పోరాటాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కేరళను భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి దారితీసిన ఉద్యమం లో ఐక్య కేరళ కావాలని ప్రతిపాదించిన వారిలో ఆయన ముఖ్యులు. కమ్యూనిస్టు పార్టీని మరింత విస్తృత పరచడానికి ఆయన తన వాటగా వచ్చిన ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చాడు. 
           
             E.M.S. భారతీయ సమాజాన్ని ఆకళింపు చేసుకున్నాడు. కులం పునాదిగా చేసుకుని భూమి లేని నిరుపేదలను భూస్వామ్య వర్గం దోపిడీ చేస్తోందని గుర్తించారు.నిరుపేదలకు భూమి పంచాలని డిమాండ్ చేశారు.భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని-లెనినిజాన్ని ఎలా అన్వయించాలో ఆయన గుర్తించారు.
భారతదేశంలో విప్లవం తీసుకురావడానికి తగిన వ్యూహానికి అనుగుణంగా సాగించాల్సిన కృషిని ఆయన గుర్తించారు. భూమి సంబంధాలు, కేరళ సమాజం , రాజకీయాలు , మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్యం , చరిత్రలపై ఆయన వ్రాసిన రచనలతో ఆయన్ను దేశంలొనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కమ్యూనిస్టు ఆలోచనాపరులలో ఒకరిగా గుర్తించబడ్డాడు. 
                
     వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నింటినీ కూడగట్టడంలో ఆయన నాయకత్వం అమూల్యమైనది. భారతీయ సమాజానికి మార్క్సిజాన్ని, లెనినిజాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించే విధానాన్ని కనుగొన్నారు. భారత దేశంలో విప్లవానికి తగిన వ్యూహాలను రూపొందించడంలో అతను అద్భుతమైన కృషి చేశాడు. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం, సాహిత్యం , చరిత్రపై రాసిన ఆయన రచనలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పై అపార ప్రభావం కలిగించాయి.
              EMS నంబూద్రిపాద్ ఒక సంప్రదాయ భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినా కమ్యూనిస్ట్ నాయకునికి ఎదిగాడు. ఈ కాలంలో తన కుల చిహ్నాన్ని వదులుకోవడానికే మనసొప్పని జనాలున్నారు. కానీ నంబూద్రి మాత్రం తన వర్గ లక్షణాలను పూర్తిగా వదులుకున్నాడు. విశ్వనరుడ నేను అంటూ శ్రామికవర్గ విప్లవోద్యమానికి నాయకత్వం వహించారు. మూడేళ్లు జైలులో, ఆరేళ్లు రహస్యం జీవితాన్ని గడిపాడు. అతని త్యాగమయ జీవితాన్ని ప్రజలు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులకు ఆయన జీవితం ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. కేరళలో ఆయన ఒక లెజెండ్. అతన్ని అన్ని వర్గాల ప్రజలు ఆరాధించారు. గౌరవించారు. తన జీవితంలో చివరి రోజు వరకు, ఆరోగ్యం క్షీణించినప్పటికీ, EMS తన దినచర్యలో వ్యాసాలు రాయడం మరియు పార్టీకి మార్గనిర్దేశం చేయడం కొనసాగించారు.

                 EMS బుద్దుని మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాడు. పార్లమెంటరీ సంస్థలను లోపల నుండి మార్చడానికి బదులుగా, అతను సామాజిక , ఆర్థిక, రాజకీయ పరివర్తనను తీసుకురాగల విధానాలను రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా పార్లమెంటరీ సంస్థలను మార్చడానికి ప్రయత్నించాడు. చాలా మంది రాజకీయ పరిశీలకుల ప్రకారం విభిన్న సామాజిక సమూహాల మధ్య కమ్యూనిస్టు పార్టీ ఎలా పనిచేయాలో తెలుసుకోవడానికి EMS ఒక ఒరవడి సృష్టంచారు. ప్రజా సమస్యల మూలాన్ని కనుక్కొని ప్రభుత్వ సంస్థల ద్వారా వాటిని పరిష్కరించే మార్గాలను ఆయన రూపొందించారు. ప్రతిపక్షం ఎక్కడ ఖాళీ అయిందో అక్కడ పార్టీ ప్రవేశించడానికి వీలు కలిగించారు. కేరళలో ఎన్నికల ద్వారా వచ్చిన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆయన సమర్థవంతంగా ప్రజారాజ్యం గా మార్చడానికి పార్లమెంటరీ విధానాలను ఎలా ఉపయోగించవచ్చో EMS నిరూపించారు. తద్వారా పార్టీ ప్రజా పునాదిని బలోపేతం చేశారు.
     నంబూద్రిపాద్ భారతదేశంలోని శ్రామికవర్గ దోపిడీని, అణచివేతను అధిగమించడానికి ఏకైక మార్గం సోషలిస్టు సమాజ స్థాపనే ఏకైక మార్గమని ఆయన బలంగా విశ్వసించారు. ఇక్కడ ఉత్పత్తి సాధనాలు , పంపిణీ రెండూ యాజమాన్యాల నియంత్రణలో ఉన్నాయని ఆయన వాదించారు.నంబూద్రిపాద్ సోషలిస్టు లక్ష్యాన్ని సాధించడంలో వర్గ పోరాటం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. పెట్టుబడిదారీ వర్గం కున్న శక్తిని సవాలు చేయాలన్నా, చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయాలన్నా కార్మికవర్గం విప్లవాత్మక శక్తిగా సంఘటితం కావాలని ఆయన విశ్వసించారు.
        కేరళలో వ్యవసాయ సంస్కరణలకు, భూసంస్కరణలకు సంబంధించిన అంశాలపై నంబూద్రిపాద్ పార్టీ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక వివక్ష ను రూపుమాపుతామని, రాజకీయం గా అందరికీ ప్రోత్సాహం ఇస్తామని, ప్రజాధనం వృథాను అరికడతామని, పేదల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తామని అందుకనుగుణంగా అనేక సామాజికార్థిక చట్టాలు తీసుకొస్తామన్న హామీతో , విధానాలను రూపొందించుకొని కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. 
        అధికారం లోకి రాగానే EMS వ్యవసాయరంగంలో, విద్యారంగం లో , పరిపాలనలో సమూల మార్పులు, సంస్కరణలు చేపట్టారు. కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు వారి సమ్మె ను భగ్నం చేయడానికి యజమానులకు అనుకూలంగా పోలీసులు పనిచేయడం గుర్తించారు. వారి సమ్మె లో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే పోలీసులు జోక్యం చేసుకునేలా చట్టాన్ని మార్చాడు. ఆస్తి తగాదాల లో పోలీసుల పాత్రను తగ్గించాడు. రాజకీయ వివాదాలలో పోలీసుల జోక్యాన్ని నివారించాడు. నిర్మాణాత్మక కార్మిక విధానాలను ప్రవేశపెట్టాడు. పిడివాదుల విమర్శలకు ధృఢంగా నిలబడి తన ప్రజానుకూల విధానాలను కొనసాగించాడు. చాలా కాలం పాటు సాగిన ఈ ప్రక్షాళన పార్టీ ప్రజల పక్షాన నిలబడటానికి , ప్రభుత్వ నిబద్ధతను నిరూపించుకోవడానికి దోహదపడింది. ఈ సంకల్పంతోనే విద్యా సంస్కరణల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపికైన వారిని ప్రైవేటు పాఠశాలలు తీసుకోవాలని ఆ బిల్లు ఉద్దేశం.ఈ బిల్లును ప్రైవేటు పాఠశాలల యజమానులు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. నంబూద్రి వారితో చర్చలు జరపడానికి నిరాకరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నెహ్రూ ప్రభుత్వం నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఈ బిల్లును సాకుగా చూపి బర్తరఫ్ చేసింది. వారితో రాజీ పడే బదులు అమరవీరుడుగా బయటకు వెళ్లడానికి ఇష్టపడినాడు నంబూద్రిపాద్. ఈ సంఘటన పార్లమెంటరీ వ్యవహారాలలో కమ్యూనిస్టు పార్టీ రాటుదేలడానికి ఉపయోగపడింది. ఆ తరువాతి కాలంలో పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు జ్యోతిబసు రాజీనామా చేసి దిగి పోయారు. సీపీఐ(ఎం) బలంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కావాలన్న వ్యూహాన్ని ఆయన పట్టుబట్టి పార్టీ కార్యక్రమంలో చేర్చించాడు. మారుతున్న చారిత్రక , సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని నిరంతర పునర్విమర్శ చేయడం అవసరమని గుర్తించారు. పిడివాదాన్ని వదిలిపెట్టాడు. 

         ప్రజాస్వామ్య, వర్గరహిత సమాజానికి పరివర్తన చెందే దశలో పార్లమెంటరీ విధానాల అమలులో ఐక్య ఫ్రంట్ ఆవశ్యకత ను గుర్తించారు. కేరళలోని కమ్యూనిస్టు పార్టీల ఐక్య ఫ్రంట్‌తో ఆయన ప్రయోగాలు చేశాడు. ఈ అనుభవం ద్వారా భవిష్యత్తులో బహుళపార్టీ వ్యవస్థ రానున్నదని ఊహించాడు.తరువాత కాలంలో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్, ఎన్.డి.ఏ.,యుపిఏ, ఎన్ డి ఏ లు ఏర్పడుతూ ఉండటం మనందరికీ తెలిసిందే. అంతేగాక పార్టీలు విలక్షణమైన గుర్తింపుతో ఏర్పడతాయని గుర్తించారు.అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అస్తిత్వ వాద ఉద్యమాల ద్వారా ఏర్పడినాయి. భిన్న సంస్కృతుల కలయిక ద్వారా ప్రాంతీయ సంస్కృతులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన సూచించారు. కేరళలోని సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పక్కన పెట్టి,ఆయన వెనుకబడిన వారి సాంస్కృతిక భావజాలాన్ని అందుకోవడమే గాక దాన్ని ప్రచారం చేశారు.అతను జీవితాంతం తన శక్తినంతా దేశ స్వాతంత్ర్యం కోసం, సోషలిజం కోసం వినియోపెరిగింది!
        1965లో, ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో, యుద్ధం కన్నా శాంతియుత పరిష్కారమే మిన్న అనే పార్టీ నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాడు EMS.
      పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయవ్యవస్థ కూడా పాలకవర్గం చేతిలో ఒక అణచివేసే సాధనమన్నాడు నంబూద్రిపాద్‌. చాలా మంది న్యాయమూర్తులు ఒక వర్గానికి అనుకూలంగా ఉంటారన్నారు. నిండుకుండగా ఉన్న ధనిక వర్గం, కట్టుబట్ట, కనీస చదువులేని పేదవర్గం మధ్య న్యాయం ధనికవర్గాన్ని వరిస్తుందని అన్నాడు.

      నంబూద్రిపాద్ మహిళల హక్కులకు, లింగ సమానత్వాన్ని ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, మహిళల స్థితిని మెరుగుపరిచడానికి అనేక విధానాలను కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు. బాలికల పాఠశాలలను నెలకొల్పారు.

    నంబూద్రిపాద్ దళితులకు భూమి,ఇల్లు, ఉపాధి కల్పించే చర్యలు తీసుకున్నాడు.వారికి విద్యను అందించడానికి పాఠశాలలు, రాత్రి బడులు,అనియత విద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఒరవడి తోనే కేరళ సంపూర్ణ అక్షరాస్యత ను సాధించింది.
         నంబూద్రిపాద్ కేరళలో స్థిరమైన అభివృద్ధిని సాధించించడంలో పర్యావరణం కీలకమని గుర్తించారు. పునరుత్పాదక ఇంధనం, సహజ వనరుల పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించేందుకు ఆయన అనేక పథకాలను ప్రవేశపెట్టారు.
     విపిసింగ్ ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో మండల్ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. బిసి లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో రిజర్వేషన్ల ను అమలు చేయాలని మండల్ కమీషన్ చెప్పింది. రిజర్వేషన్ల అవసరాన్ని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా బుక్‌లెట్ రాసి ప్రచారం చేశారు. అదే సమయంలో వెనుకబడిన కులాల్లోని "క్రీమీలేయర్" కు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఆయన వ్యతిరేకించారు. తరువాత కాలంలో క్రీమిలేయర్ వారికి సుప్రీం కోర్టు రిజర్వేషన్ లను రద్దు చేసింది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ, భారతీయ తత్వశాస్త్రం, భారతీయ సాహిత్యం లేదా సంస్కృతి ఇలా ప్రతి అంశాన్ని అతను చర్చించారు. దేశంలో ప్రజాస్వామిక భావజాలం వ్యాప్తికి సంస్కృతి కున్న ప్రాధాన్యత ను ఆయన ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేసి వాటి ఆధారంగా విధానాలను నినాదాలను రూపొందించాలన్నాడు.
        తన మార్క్సిస్ట్ విశ్వాసాలతో పాటు, నంబూద్రిపాద్ సాంస్కృతిక , మేధో వికాస ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పాడు. సోషలిజం కోసం కేవలం రాజకీయార్థిక పోరాటాలే కాకుండా సాంస్కృతిక , సైద్ధాంతిక పోరాటం చేయాలని అతను నమ్మాడు. గ్రాంస్కీ చెప్పినట్లుగా ఆధిపత్య బూర్జువా సంస్కృతి ని, దాని భావజాలాన్ని ఎదుర్కోవడానికి కార్మికవర్గం తనదైన ప్రత్యేక సంస్కృతిని , మేధో సంప్రదాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
            సాహిత్యం కేవలం ప్రగతిశీల వస్తువుకు పరిమితం కారాదు. రూపం కూడా ముఖ్యం. సాహిత్య సంఘం స్థాపించిన వారు రాజకీయ కార్యకర్తలు.వారు సాహిత్యాన్ని కూడా రాజకీయ దృష్టితో చూశారు.కాబట్టి తగిన శ్రద్ధ చూపలేదు. అది తప్పే.
సాహిత్యం ఒక కళాత్మక నిర్మాణం. నిజానికి రూపం , సారం(వస్తువు) రెండూ భిన్నంగా లేవు. ప్రగతిశీల కంటెంట్ కోసం ప్రగతిశీల రూపం ఉండాలి. ప్రగతిశీల రూపం పరిపూర్ణ రూపంతో సమానం అని నంబూద్రి పాద్ తన సాహిత్య చర్చ -- సాహిత్య సంవాదం, (1996)లో పేర్కొన్నారు.ప్రజాసాహిత్యాన్ని ప్రజల భాషలో ప్రజలకర్థమయ్యే విధంగా కళాత్మకంగా రచయితలు తీర్చిదిద్దాలని ఆయన కోరారు.ఆయన సూచనమేరకు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఫర్ ఆర్ట్ అండ్ లెటర్స్(paal) మహాకవి వైలోప్పిల్లి శ్రీధర మీనన్ జయంతి సందర్భంగా ఏర్పడి చాలా మంది ప్రగతిశీల రచయితలను వెలుగులోకి తెచ్చింది.PAAL సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, మ్యూజిక్, ఫిల్మ్, ఆర్కిటెక్చర్ మరియు అన్ని ఇతర రకాల కళలు PAAL పరిధిలోకి ఇముడ్చుకుంది. అదిప్పుడు కేరళలో మతతత్వం మరియు ఫాసిజంతో పోరాడుతున్న అత్యంత శక్తివంతమైన సంస్థ. ఇది EMS వదిలిపెట్టిన వారసత్వాలలో ఒకటి.
       
      ఆయనది సరళమైన జీవనశైలి. ఆయన జీవితమంతా పార్టీకోసం , శ్రామిక వర్గం కోసం త్యాగం చేశారు. తన పూర్వీకుల ఆస్తి ద్వారా వచ్చిన మొత్తం డబ్బును పార్టీకి ఇచ్చాడు. 
1963లో అరెస్టయ్యాక అతని భార్య ఇంటికి వెళ్ళడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి ఉండింది. ఆ రోజుల్లో వారి నివాసం పార్టీ ప్రధాన కార్యాలయం లో ఉండేది. సామాజిక న్యాయం, సమానత్వం , సుస్థిరత, విప్లవం పట్ల అతని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవకారులకు ఆదర్శంగా నిలిచింది. 




  









Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం