ఆత్మ భావాన్ని ప్రవేశ పెట్టి ప్రచారం చేసిన ఉపనిషత్తులు*
*ఆత్మ భావాన్ని ప్రవేశ పెట్టి ప్రచారం చేసిన ఉపనిషత్తులు*
వేదాలు తరువాత వీటిపై వ్యాఖ్యానాలు గా ఉపనిషత్తులు వచ్చాయి. ఆహారం సేకరణ దశలో వచ్చినవి వేదాలు. సేకరణ దశ దాటి స్థిర వ్యవసాయం ముఖ్యంగా ఇనుప నాగలితో దున్నే సమయంలో ఉపనిషత్తులు వచ్చాయి.
ఇవి మొత్తం 108. ప్రసిద్ధి చెందిన 108 ఉపనిషత్తులలో ఐదారు మాత్రమే ప్రారంభం లో ఉన్నాయి. ప్రతి తరం వీటిని కంఠస్థం చేసి తరువాత వారికి అందించారు . కానీ వీటి తేదీలపై పండితులలో ఏకాభిప్రాయం లేదు. ఇవి బౌద్ధానికి పూర్వం ఉంటాయి. దాదాపు 95 ఉపనిషత్తులు 1వ-సహస్రాబ్ది BCE చివరి శతాబ్దాల నుండి సుమారు 15వ శతాబ్దం CE వరకు రూపొందించబడినాయని భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మసూత్ర లను ప్రస్థానత్రయి అని పిలుస్తారు.
19వ శతాబ్దం ప్రారంభంలో ఉపనిషత్తులను ఇంగ్లీషు లోకి అనువదించారు. అవి జర్మన్ తత్వవేత్తఆర్థర్ స్కోపెన్‌హౌర్ ను బాగా ఆకట్టుకున్నాయి.
వేదాల్లో ఆత్మభావన ఉంది. అయితే అది ఉపనిషత్తులు చెప్పిన ఆత్మభావన కాదు. మన శరీరానికి సంబంధం లేకుండా మనలో ఒక ఆత్మ ఉందని వేద రుషులు నమ్మారు. ఈ ఆత్మ వృక్షాల నుండి, వనస్పతి నుండి, అంతరిక్షం నుండి మనకు లభిస్తుందని చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రాణాన్నే ‘ఆత్మ’గా భావించారు. ఈ ఆత్మ తిరిగి పుడుతుందని మాత్రం వేద రుషులు నమ్మలేదు.
అంటే పునర్జన్మ భావన వేదంలో ఎక్కడా లేదు. మరణం తర్వాత తిరిగి పుడతాం అని వేదం నమ్మలేదు. కానీ, మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి పోతామని వేద రుషులు భావించారు. స్వర్గం ఆకాశంలో, నరకం పాతాళంలో ఉంటుందని చెప్పారు. మనం చేసిన పనులను బట్టి స్వర్గానికో, నరకానికో పోతాం. అక్కడే ఉంటాం. అంతే. తిరిగి మరలా, మరలా పుట్టం- ఇదీ వేద కాలపు నమ్మకం.
స్వర్గం దక్కాలంటే మంచి పనులు చేయాలి. వారికి తెలిసిన మంచి పనులు యజ్ఞాలు చేయడం, దేవతలకు జంతువుల్ని బలివ్వడం, ఇవే వారు అనుకున్న మంచిపనులు.
అయితే…..ఉపనిషత్తులు వేదం చెప్పిన మంచి పనుల్ని చెడ్డపనులుగా భావించాయి.వేదం చెప్పని పునర్జన్మ భావాన్ని ప్రతిష్టించాయి. పునర్జన్మకు విపరీతమైన ప్రచారం ఇచ్చాయి కూడా.
ఇలాంటి తాత్త్విక భూమిక ఈ భారత భూభాగంపై ఉన్నప్పుడు బుద్ధుడు పుట్టాడు. బుద్ధుని కాలానికి అటు వేదం చెప్పిన యజ్ఞయాగాది కర్మకాండలూ, ఇటు ఉపనిషత్తులు ఊదరగొడుతున్న పునర్జన్మవాదాలూ- పోటీపడుతున్నాయి.
బుద్ధుని కాలానికి ఉన్న ఉపనిషత్తులూ దాదాపుగా మూడే. ఈశోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులు. అలాగే బుద్ధుని సమకాలికాలని చెప్పే మరో రెండు ఉపనిషత్తులు న్నాయి. ఐతరేయ, తైత్తరీయోప నిషత్తులు.
ఛాందోగ్యం
పునర్జన్మ భావాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన ఉపనిషత్తు ఛాందోగ్యం.
”కర్మల్ని బట్టి మళ్ళీమళ్ళీ పుడతారు” అని చెప్పింది ఈ ఉపనిషత్.
ఛాందోగ్యంలో (5-10-7)లో ఇలా ఉంది:
”మంచి ఆచరణ కలవారు రమణీయమైన యోనిలో – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – యోనుల్లో పుడతారు.
చెడ్డ ఆచరణ కలవారు నీచ యోనిలో – కుక్క, పంది, ఛండాల యోనుల్లో పుడతారు”
ఈ ఉపనిషత్తులో చనిపోయాక ”ఆత్మ” ఎలా తన యాత్ర కొనసాగిస్తుందో చెప్పే వివరణ ఉంది.
ఈ యాత్ర 2 యానాలుగా ఉంది.
1. పితృయానం, 2. దేవయానం.
పితృయానంలో జీవుడు చనిపోయాక ఆత్మ తొలుత పొగలోకి వెళ్తుంది. అక్కడ నుండి రాత్రికి, రాత్రి నుండి కృష్ణపక్షానికి, అక్కడి నుండి దక్షిణాయనానికి , అటునుండి 6 మాసాలకు, ఆ తర్వాత పితృలోకం, అక్కడినుండి ఆకాశం, ఆకాశం నుండి చంద్రమండలం చేరుతుంది.
ఆ ఆత్మ గడువు తీరేదాకా అక్కడే ఉంటుంది. గడువు తీరాక తిరిగి భూలోక ప్రయాణం చేస్తుంది. తిరుగు ప్రయాణంలో …
తిరిగి ఆకాశం, అక్కడి నుండి వాయువును, వాయువు నుండి పొగకూ, పొగనుండి మేఘాలకు చేరి, వర్షంతో కలిసి భూమికి చేరుతుంది. అక్కడ వరిధాన్యంగానో, ఔషధిగానో, వనస్పతిగానో, అపరాలుగానో మారుతుంది. ఇలా వివిధ ఆహార పదార్థాల నుండి ఆత్మ తిరిగి జీవుడిగా జన్మిస్తుంది”
ఇదీ .. ఛాందోగ్యోపనిషత్‌లో ఆత్మ షటిల్ సర్వీస్.
ఆత్మ వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి వస్తుందని చెప్పిన వేద ఋషుల భావాలకు ఒక నిర్దిష్టరూపం ఈ ఉపనిషత్తు కల్పించింది. ఈ భావనే భగవద్గీతలో ”అన్నాద్భవంతి భూతానీ…” అనే శ్లోకంలో కన్పిస్తుంది.
ఇక, రెండోయాత్ర దేవయానం. ఈ యాత్ర ముక్తిపొందిన వారిది. జీవన్ముక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. వీరిది నిష్కామకర్మ. వీరు తిరిగి మరలా పుట్టరు. వీరి ఆత్మకు మానవ జీవనం నుండి విముక్తి కల్గుతుంది.
ఛాందోగ్యం వీరి యాత్ర ఇలా కొనసాగుతుందని చెప్పింది…
”మరణించిన వారి ఆత్మ మొదటిగా కిరణాల్ని చేరుతుంది. అక్కడి నుండి పగలు, అక్కడి నుండి శుక్లపక్షం, అక్కడి నుండి ఉత్తరాయనం 6 నెలలు, అక్కడి నుండి సంవత్సరం, అక్కడి నుండి సూర్యలోకం అక్కడి నుండి చంద్రలోకం, అక్కడి నుండి విద్యుత్తుకు చేరి అక్కడ నుండి బ్రహ్మలోకం పోతుంది. అక్కడ ‘అ-మానవులు’ ఉంటారు. వారు ఈ జీవుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకుపోతారు. ఆత్మ అక్కడే ఉండిపోతుంది.
ఈ భావనే ఆ తర్వాత కైవల్యంగా మారింది. శైవులు శివైక్యం పొందటం, విష్ణు భక్తులు నారాయణ పథం చేరడం (వైకుంఠానికి పోవడం) ఇలా విభిన్న పద్ధతులుగా వ్యక్తం అయ్యింది.
అయితే, ఛాందోగ్యంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. ముక్తి పొందిన ఆత్మ- వేదాల్లో సూపర్ పవర్‌గా ఉన్న ఇంద్రలోకం పోలేదు. కొత్తగా రూపొందిన బ్రహ్మలోకం వెళ్ళింది. ఇది వేదాన్ని బలంగా తిరస్కరించడమే.
బృహదారణ్యకం
”జీవుడు చనిపోయాక అతని శరీరంలోని ఇంద్రియాలు తిరిగి భూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ మాత్రం ఆకాశంలో కలిసిపోతుంది” – అని బృహదారణ్యకోపనిషత్‌లో వుంది.
ఈ ఉపనిషత్ ‘ఆత్మ’ అనేది ‘ఆకాశం’ అనే ఇంద్రియానికి సంబంధించిందిగా చెప్పింది.
అయితే, మనం ఇక్కడే ఒక విషయాన్ని గుర్తించుకుంటే బావుంటుంది.
బుద్ధుడు ఉపనిషత్తులు చెప్పిన పంచభూతాల్లో ”ఆకాశం” అనే భూతాన్ని ఒప్పుకోలేదు. అలాగే ఆకాశభూత నిర్మితిగా చెప్పిన ”ఆత్మ”నూ అంగీకరించలేదు.
ఐతరేయం
ఈ ఉపనిషత్ లో ”పునర్జన్మ” భావాలు ఒక కల్పనగానే కన్పిస్తాయి. దీనికి ముందున్న ఉపనిషత్తులు పునర్జన్మ గురించి ఎంతగా చెప్పినా అది ఈ ఉపనిషత్ కాలానికి ఈ దేశప్రజల్లో బలంగా నాటుకుపోలేదు. ఈ ఉపనిషత్ జన్మల్ని 3 రకాలుగా వర్గీకరించింది.-
మొదటి జన్మ: పాలలో వెన్నలా, చెరకురసంలో బెల్లంలా పురుషుని దేహంలో ”రేతస్సు”(వీర్యం) ఉంటుంది. ఇది స్త్రీ గర్భంలో పడడమే మొదటి జన్మ. గర్భధారణ ప్రక్రియ మూలం పురుషుడేే. స్త్రీ కాదు. అని చెప్తుంది ఈ ఉపనిషత్.
రెండవ జన్మ: స్త్రీ గర్భాశయంలో పెరిగి పెద్దయి- పుట్టడం జీవుని రెండో జన్మ.
మూడవ జన్మ: ఈ జీవుడు పెరిగి పెద్దవాడై, తండ్రిగా మారి, తిరిగి పుత్రునిగా పుట్టడం మూడో జన్మ-
ఇలా ప్రతి జీవికి తను తల్లి కడుపున పుట్టడం, భూమ్మీద పడడం, తిరిగి తను భార్యవలన బిడ్డగా పుట్టడం ఈ మూడు జన్మలూ ఒక పరంపరగా ఉంటాయి. ఇలా ఈ లోకం ‘సంతానం’ రూపంలో తెంపు లేకుండా ఉంటుంది. – అంటుంది ఈ ఉపనిషత్.
Comments
Post a Comment