యజుర్వేద, అధర్వ వేద కాలానికి మారిన సామాజిక స్థితిగతులు.
యజుర్వేద, అధర్వ వేద కాలానికి మారిన
సామాజిక స్థితిగతులు.
__రచయిత హైదరాబాద్లోని ఇసిఐఎల్లో రిటైర్డ్
సీనియర్ మేనేజర్.
ఋగ్వేదం లాగానే యజుర్వేదం, అధర్వవేదం కూడా ప్రధానంగా కర్మకాండకు సంబంధించిన మంత్రాల సంకలనాలే. కొత్తగా మంత్రాలు అవసరం అయ్యాయి అంటేనే సమాజం మారిందని అర్థం. సమాజంలో మార్పు లేకపోతే ఋగ్వేదమే సరిపోయేది. కాబట్టి ఋగ్వేదం లోని విషయాలను యజుర్వేదం తో పోలిస్తే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు కాలానికి, తరువాతి కాలానికి వచ్చిన మార్పు అర్ధం అవుతుంది.
క్రీస్తు పూర్వం 1000 నుండి ఆర్యులు సింధు నదీ పరీవాహక ప్రదేశం నుండి తూర్పుకు విస్తరించారు. ఈ విస్తరణ క్రమం సింధూ లోయలకు, గంగా యమునా లోయలకు మధ్యనున్న ప్రాంతాన్ని, గంగా యమునా లోయల పైభాగానికి విస్తరించ బడినది, అది ఇప్పటి హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, మద్ర రాజ్యమైన పంజాబ్ సరిహద్దుల్లోను, మత్స్య రాజ్యమైన రాజస్థాన్ భూభాగం అన్నమాట.
ఆర్యులు గణవ్యవస్థను ఛేదించుకొని మెల్లమెల్లగా రాచరికాలను ఏర్పరుచుకున్నారు. ఋగ్వేద కాలంలో రాజ్యాలు లేవు. భరత, పురు అన్న ప్రధాన తెగలకు చెందిన ప్రజలు కలిసి "కురు" అన్న తెగ గా మారారు. రుగ్వేదంలో పురూరవుడు పురు కుత్సుడు అన్న వారు మనకు కనిపిస్తారు. వారిలోని పురుకుత్సుని కొడుకు "త్రసదస్యుడు". ఈ త్రసదశ్యుని కొడుకు "కురుశ్రవణుడు". ఇతని పేరు మీదుగానే కురువంశం మొదలైంది. మొదట రాచరికం ఏర్పరుచుకున్న గణాలలో ఒకటి.
కురు మహారాజు తన తపస్సు ఫలితంగా కురు జంగలాన్ని కురుక్షేత్రం గా మార్చాడని మహాభారతంలోని ఆది పర్వంలో ఉంది. అడవులను (జంగలం) వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి అవసరమయ్యే భౌతిక శ్రమ యొక్క అద్భుత బ్రాహ్మణీ కృతరూపం,
ఈ తపస్సు అనుకుంటే అది గొప్ప చారిత్రక పరిణామ ఫలితమే. త్వరలోనే ఈ కురు తెగ వారు గంగా సింధు మైదానం లోని ఉత్తర భాగంలో ఉన్న ఢిల్లీ, కురుక్షేత్రం వరకు (కురు తెగ వారి నివాసం) విస్తరించారు. క్రమంగా వారు గంగా యమునా ప్రాంతాలలో నివసించే "పాంచాల" ప్రజలతో చేయి కలిపారు. అలా కురుపాంచాల తెగల ఆధిపత్యం ఢిల్లీకి, గంగా-యమునా మైదానం పశ్చిమ, మధ్య ప్రాంతాలకు వ్యాపించింది. వారు మీరట్ జిల్లాలో ఉన్న "హస్తినాపూర్ “ను రాజధానిగా చేసుకున్నారు. (శతపథ బ్రాహ్మణం 3-2-3-15) లోనూ అలాగే కడపటి వైదిక రచనలలోనూ ఉన్నది.
మహాభారతంలో ప్రధానమైన కురుక్షేత్ర సంగ్రామానికి కురు తెగ వారి చరిత్ర ముఖ్యమైనది. ఈ యుద్ధం కౌరవులకు , పాండవులకు మధ్య (వీరిద్దరూ కురు తెగకు చెందిన వారే). క్రీస్తుపూర్వం 950లో జరిగినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ
యుద్ధంలో కురు తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
రుగ్వేదంలో రాజులు రాచరికాలు రాజుకు రాజ్యాలు లేవని తెలుసుకున్నాం కదా. కానీ యజుర్వేద కాలానికి రాజులు, రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ రాజు పట్టాభిషిక్తుడు అవుతాడు. ఈ రాచరికం చుట్టూ బలమైన, సంక్లిష్టమైన, కర్మకాండ అల్లుకుని ఉన్నది. రాజుగారు సింహాసనాన్ని అధిష్టించే సమయంలో ప్రత్యేకమైన, పవిత్రమైన క్రతువులను పురోహిత వర్గం నిర్వహించేది. దీనిని రాజసూయ యాగం అని అధర్వవేదం (4-8-1) పేర్కొంటుంది. ఈ క్రతువుకు సంబంధించిన వివరాలను వెల్లడించే మంత్రాలు యజుర్వేద సంహిత లోను, బ్రాహ్మణా లలోనూ ఉన్నాయి. ఈ కర్మ కాండ బ్రాహ్మణం. నిర్వహించిన బ్రాహ్మణులకు పెద్ద మొత్తంలో దక్షిణలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్షత్రియుల, బ్రాహ్మణుల తమ ప్రాబల్యాన్ని పరస్పరం పెంపొందించుకున్నారు.
దీనితోపాటు అశ్వమేధ యాగానికి ఆనాటికే అంతకంతకూ ప్రాధాన్యత పెరిగిపోయింది. యజ్ఞాశ్వం తిరిగిన ప్రాంతమంతటా పాలకుడు లేదా రాజు తన ఆధిపత్యాన్ని ప్రకటించడానికి ఈ యాగాన్ని చిహ్నంగా మార్చారు. యజ్ఞాశ్వం తిరిగి వచ్చిన తర్వాత యజ్ఞాఅశ్వంకి, పట్టపురాణి సౌభాగ్యానికి సంబంధించిన క్రతుభాగం కొన సాగించబడు తుంది. (ఈ క్రతువులో భాగంగా రాజుగారి పట్టపురాణి గుర్రంతో రాత్రంతా గడపవలసి ఉంటుంది. ఇది కొంత అశ్లీల భాగం). కురువంశ మహారాజు పరీక్షిత్తు వారసుడైన జనమేజయుడు అశ్వమేధ యాగాన్ని జరిపినట్లు ఐతరేయ, శతపథ బ్రాహ్మణాలు రెండూ చెబుతున్నాయి.
రాజు యొక్క అధికార ప్రభావం పెరగటంతో రాజాస్తానికులు, ఉద్యోగులు సేవలందించడానికి ఒక సాంప్రదాయ కూటమి ఏర్పడింది. ఇలాంటి వారిని రాజస్థానములో ఉన్న రత్నాలు గా పేర్కొన్నారు. శతపథ బ్రాహ్మణం 5-3-1,1- 11 లో ఈ రత్నాలను పేర్కొన్నది. 1. సేనాని (సైన్యాధిపతి) 2. పురోహితుడు 3. రాణి 4.. సూత (సలహాదారు) 5. గ్రామణి (గ్రామ పెద్ద) 6. క్షత్రి (రాజ గృహ నిర్వాహకుడు)7. (సంగహీత్రీ) 8. భాగదుష (పంపిణీదారు లేదా చెల్లింపులు జరిపే వ్యక్తి) 9. అక్షా వాప(పాచికల సంరక్షకుడు) 10. గోవికర్తన (ఆవులను నరికే వాడు) 11. పాలాగల (వార్తా హరుడు). ఇలా. రాజాస్థానంలోని రత్నాలను వివరిస్తుంది ఆ
బలి పన్ను లేదా కప్పం గురించిన ప్రస్తావనలు పదే పదే ఈ గ్రంథంలో వస్తాయి. ఈ కురు పాంచాల రాజ్యమే కాక మరో పన్ను లేదా కప్పం కట్టాలి. ఈ వైశ్యులు బ్రాహ్మణులు నిర్వహించే యజ్ఞం లో భాగస్వాములు అవ్వటం గాని, యజ్ఞశాల లోకి ప్రవేశించే హక్కు గాని లేదు. శతపథ బ్రాహ్మణం (3-1-1-9- 10) వీరి స్థానం బ్రాహ్మణ, క్షత్రియుల తరగతి కన్నా దిగువ స్థానమే.
అందరికన్నా అట్టడుగు స్థానం సూద్రులది. ఋగ్వేదంలో ఆర్య, దస్యు, దాస అనేవి అనే పదాలు ఎక్కువగా కనపడతాయి. కానీ యజుర్వేద కాలం నాటికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి దస్యు, దాస స్థానంలో ఆర్య శూద్ర ప్రస్తావనలు ఆక్రమించాయి. (వాజసనేయ సంహిత14-30,20-17,16- 2). మొత్తం మీద బ్రాహ్మణులు, రాజన్యులు, వైశ్యులు సమాజంలోని ఆర్య విభాగంలో ఉండగా, శూద్రులు ఆర్యతర భాగంలో అట్టడుగు స్థానంలో ఉంచారు. ఆ మూడు వర్ణాలను ద్విజులు అన్నారు. అంటే రెండోసారి జన్మను పొందినవారు అని అర్థం. అది యజ్ఞోపవీతం అంటే ఉపనయనంచేసుకుంటే ఆ అర్హత వారికి లభిస్తుంది. ఆ అర్హత ఆ మూడు వర్ణాలకు మాత్రమే ఉన్నది. శూద్రులకు ఆ హక్కునిరాకరించబడినది. అందువలన పేర్కొంటుంది. శూద్రులు ఒకే జన్మను కలిగి ఉంటారు.
శూద్రులను ఆర్య సమాజం లో భాగంగా అంగీకరించినప్పటికీ వారికి ఎటువంటి హక్కులు లేవు. ఐతరేయ బ్రాహ్మణం 7-29- 4 ప్రకారం మిగిలిన వారికి అంటే పై మూడు వర్ణాలకు సేవ చేయటానికి మాత్రమే (అన్యన్య ప్రేష్య)జన్మించారు. వీరిని ఇష్టానుసారం చంపటానికి అర్హులు (యధా కామ వధ్య), వారికి ఆవుల సంపద ఉన్నప్పటికీ వారి స్థానం మార బోదు అని పంచవింశతి బ్రాహ్మణం 6-1-11 పేర్కొంటున్నది. అంటే ఈ సూద్రులు పై మూడు వర్ణాలకు ఉమ్మడి భృత్యులే. అంటే ఉమ్మడి సేవకులే. యజ్ఞం లో భాగంగా అగ్ని ప్రదక్షణ చేసేటప్పుడు పురోహితులు ఒక చివరన, రాజన్యులు మరొక చివరన ఉండి, సూద్ర, వైశ్య జనాన్ని లోబర్చుకోవడం కోసం మధ్యలో ఉండేలాగా చూడాలని ఐతరేయబ్రాహ్మణం పేర్కొంటుంది. పవిత్రుడైన గురువు"శూద్రులతో సంబంధాన్ని, ఉచ్చిష్టాన్ని ఇవ్వటం మానుకోవటమే కాక, స్త్రీని, శూద్రుడను తదితరులను కూడా చూడరాదని చెప్తుంది (14-1-31).
ఇక శూద్ర స్త్రీలు, దాసీలు, స్త్రీ బానిసలు, పురుష బానిసలు అనే పేరుతో అధర్వ వేదం లో కనిపిస్తారు. స్త్రీల స్థానం ఆనాడు మరింత అధోగతి పాలయింది. స్త్రీలకు "కాముకి", "స్వైరిణి" అన్న అవమానకరమైన పదాలు
వాడారు. (అధర్వ వేదం 5-22-6-7). ఆడవాళ్లను "శూద్రుడు, కుక్క, కృష్ణ పక్షి"తో సమానంగా ను, వీరు మూర్తిభవించిన "అసత్యం"గాను శతపథ బ్రాహ్మణం 15-1- 1-31 పేర్కొంటుంది. వారిని ఆశుచితో కూడిన వారిగా చెప్పబడింది. దాసీలు రోలు రోకలి తో పనిచేస్తూ (అధర్వ వేదం (12-3-13), ఆవు పేడను పొగేయ్యాలి. (12-4-9). వాజసనేయ సంహితలో పురుష సూక్తం లో వెదురు చీల్చడం, వాడి అయిన వస్తువులు తయారు చేయటం, అల్లికలు, బట్టలు ఉతకటం, రంగులు అద్దటం, లేపనాలు తయారు చేయటం లాంటి వృత్తులను ఆడవారే చేసేవారు. ఆడవారు చేసే పనిని తిరస్కార భావంతో చూసేవారు. ఇలాంటి పనులు చేసే ఆడువారిని దెయ్యాలకు భూతాలకు బలివ్వడానికి తగిన వారని, రంగులద్దే వారిని ఇంద్రియ సుఖాలకు బలి ఇవ్వాలని అన్నారు. సమాజంలో సంపన్నులైన వారిలో బహుభార్యత్వం ఉన్నది. రాజుకు ఉండే నలుగురు భార్యలను గురించి శతపథ బ్రాహ్మణం 13-2-6-7 ప్రస్తావిస్తూ పలువురు భార్యలు ఉండటం ఒక సామాజిక ఘనత అని
స్త్రీలను లైంగికంగా దోచుకునే ప్రధాన సాధనాలలో ఒకటి శుక్ల యజుర్వేదంలో (వాజసనేయ 30-5) దర్శనమిస్తుంది. విషయేచ్చను (కామము) సంతృప్తి పరిచేందుకై ఉద్దేశించిన వ్యభిచార వృత్తికి లాంఛనప్రా యమైన గుర్తింపు లభించింది. పలుచోట్ల పనిచేసిన దాస స్త్రీ లైంగిక వాంఛలకు ఎలా గురైందీ చాందోగ్యోపనిషత్ 4-4-1-4 లోని సత్యకామ జాబాలి కథ తెలియజేస్తుంది.
కృష్ణ యజుర్వేదం ప్రకారం ఆనాటి ప్రజలకు 28 నక్షత్రాల పేర్లు తెలుసు. అయితే సూర్య, చంద్ర చంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో వారికి అంతు పట్టినట్లు లేదు. రాక్షసుడైన రాహువు, కేతువు కారణం అని భావించారు. వైద్యానికి సంబంధించి మానవ శరీరంలో వివిధ అవయవాలను అధర్వవేదము 10-2,1-15 వివరిస్తుంది. శతపథ బ్రాహ్మణం 12-2,4-13-14 మనుష్యునికి వెన్నెముకలోని పూనల సంఖ్యను 26 అని కచ్చితంగా వివరించింది. రోగాలకు సంబంధించి, చికిత్సలు చేయటానికి మొక్కలు, వనమూలికలను వినియోగించారు. అదే సమయంలో మంత్రాలతో రోగాలు నయమవుతాయని ఎక్కువగా భావించేవారు.
యజుర్వేద కాలానికి యజ్ఞ కర్మకాండ చాలా ఎక్కువగా ఉండేది. యజ్ఞాలలో బలులు మొదలయ్యాయి. అనూహ్యంగా పెరిగిపోయాయి. బలి ఇవ్వని
జంతువు గాని, పక్షి గాని లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క యజ్ఞం కొన్ని రోజుల తరబడి సాగేది. అతిధిని ఆ కాలంలో "గోఘ్న"అంటే గోమాంసం ఆరగించేవాడు అని పిలిచేవారు. యజ్ఞం నిర్వహించిన పురోహితులకు ఇచ్చిన దక్షిణ లను బట్టి ఈ కర్మకాండ ఎంత పెద్ద ఎత్తున సాగిందో ఊహించవచ్చు. అంగ రాజు"ఉదమయ ఆత్రేయ"అనే బ్రాహ్మణుడికి పదివేల స్త్రీ బానిసలను, పదివేల ఏనుగులను ఇచ్చాడని ఐతరేయ బ్రాహ్మణం చెబుతుంది. అదే బ్రాహ్మణంలో రాజుకి పట్టాభిషేకం చేసిన బ్రాహ్మణుడికి బండారం, పశువులు వేల సంఖ్యలో ఇవ్వాలని ఉంది. ఉపనిషత్తుల్లో జనక మహారాజు యజ్ఞవల్క్యుడు కి 10,000 గోవులను బహుమానంగా ఇస్తాడు. అయితే ఈ సాహిత్యాన్ని అంతా తయారు చేసింది. బ్రాహ్మణులే కాబట్టి ఇందులో అతిశయోక్తి ఉన్నది అనుకున్నా, ఎక్కువ మొత్తాల్లో దక్షిణలు ఇచ్చినట్లుగా మాత్రం తెలుస్తున్నది. పురోహితులకు ఆవులు వాటితోపాటు బట్టలను, గుర్రాలను కూడా దక్షిణగా ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో రాజ్యంలో కొంత భాగాన్ని కూడా దక్షిణగా ఇవ్వమని అడిగేవారు. అశ్వమేధయాగం చేసినప్పుడు నాలుగు దిక్కుల లోనూ పురోహితులకు భూ దానం చేయాలని "శతపథ బ్రాహ్మణం" చెబుతోంది. ఇదే జరిగితే రాజుకు ఏం మిగులుతుంది? సాధ్యమైనంత భూమిని గుంజు కోవాలి అన్న పురోహితుల కోరికకు ఇది దర్పణం పడుతుంది.
రుగ్వేదంలోని అధిదేవత లైన ఇంద్రుడు, అగ్ని ఈ కాలంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోయారు. యజుర్వేదకాలంలో సృష్టికర్త అయిన "ప్రజాపతి"కి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఋగ్వేదంలో అప్రధాన దేవతలుగా భావించబడిన రుద్రుడు, విష్ణువుకు మలివేద యుగంలో ప్రాధాన్యత పెరిగింది. రుద్రుడు పశువుల దేవతగా ఆరాధించబడ్డాడు. రుగ్వేద కాలంలో సగం సంచార జీవనులుగా ఉన్నవారు ఇప్పుడు స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండటం చేత"విష్ణువు"వారికి రక్షకుడుగా పూజింప బడ్డాడు. దీనికితోడు దైవత్వానికి చిహ్నాలుగా కొన్ని వస్తువులను పూజించడం కూడా మలివేద యుగంలో ప్రారంభమయింది. ఋగ్వేద కాలంలో ప్రకృతి శక్తులకు మానవీయ రూపకల్పన చేసుకుని ఆరాధించే స్థానంలో ఇప్పుడు విగ్రహారాధన లక్షణాలు కూడా మొదలయ్యాయి.
_____________________________________
Comments
Post a Comment