వందన శివ పర్యావరణ తాత్వికత


వందన శివ పర్యావరణ తాత్వికత   

        భారతదేశంలో పర్యావరణం కోసం హిమాచల్ ప్రదేశ్ లోని గర్హ్వాల్ పర్వత శ్రేణిలో చెట్లను నరికివేయకుండా రక్షించడానికి యువతులు కౌగిలించుకున్న చిప్కో ఉద్యమం గురించి మరచిపోతున్న తరుణంలో వందన శివ వచ్చింది.

          వందనా శివ పర్యావరణ తత్వవేత్త , తత్వవేత్త, హరిత కార్యకర్త. గ్లోబల్ ఎకో-ఫెమినిస్ట్ ఉద్యమంలో కూడా వందనా శివ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచీకరణను బహుముఖంగా వ్యతిరేకిస్తున్న ఉద్యమకారణి.   
        వందన శివ భారతదేశంలోని డెహ్రాడూన్‌లో నవంబర్ 05, 1952న జన్మించారు.  ఆమె ప్రాథమిక విద్యను నైనిటాల్ లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్, డెహ్రాడూన్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ లలో అభ్యసించారు. చండీఘర్ లోని పంజాబ్ యూని వర్సిటిలో చదివి ఫిజిక్స్ లో 1972లో బిఎస్ సి.డిగ్రీ పూర్తి చేసింది. 
       కొద్దికాలం బాబా అటామిక్ సెంటర్ లో పనిచేసి కెనడా వెళ్లి గ్వెల్ఫ్ యూనివర్సిటి (ఒంటారియో)లో చదివి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ 1977లో అందుకొన్నారు.     ఆమెకు ఆసక్తి ఉన్న భౌతిక శాస్త్రం లో "కాంతి ఆవర్తనలో మార్పులు" (’’చేంజెస్ ఇన్ ది పీరియాడిసిటి ఆఫ్ లైట్ ‘’) అనే పేరుతో తన థీసిస్‌ను పూర్తి చేసి ఆమె 1979లో పశ్చిమ ఒంటారియో యూనివర్సిటి నుండి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పొందారు. ’హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థీరీ’’ అని ఆమె రాసిన పరిశోధన గ్రంథం మంచి పేరు తెచ్చింది. తర్వాత బెంగళూరు వచ్చి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ విధానాల అంతర సంబంధాలపై పరిశోధన చేసారు వందన.   

        యూని వర్సిటీలో చదువుతూనే ‘’ది వయోలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ‘’ పుస్తకం రాసింది. రసాయనిక ఎరువులు అతిగా ఉపయోగించడం వల్ల మంచి దిగుబడులు సాధించినా, జీవావరణ పర్యావరణాలు దెబ్బతిని మనుషుల ఆరోగ్యం పాడైపోతుందని చెప్పింది. సుమారు 1400 రకాల క్రిమిసంహారక పురుగు మందులు ప్రపంచం మొత్తం మీద మన ఆహారాలలో చేరి హాని కలిగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్ప్రే ద్వారా చల్లే మందులో ఒక శాతం మాత్రమే క్రిములను సంహరిస్తుందనీ మిగిలినదంతా ఆహార పదార్ధాలలో చేరుతుందనీ, వీటివల్ల కిడ్నీ సమస్య, కేన్సర్, గుండెపోటు సహజమైపోతాయని హెచ్చరించింది. తన అభిప్రాయాలు ప్రజలకు చేరువ అవటానికి అనేక పుస్తకాలు రాసింది. 
        1990లో ‘’వుమెన్ అండ్ అగ్రికల్చర్ ‘’అనే రిపోర్ట్ ను FAO కోసం రాసింది. అందులో ‘’ఇండియాలో ఎక్కువ మంది వ్యవసాయదారులు స్త్రీలే ‘’ అని చెప్పింది. వేదిక్ ఈకాలజి , అనదర్ స్టోరి ఆఫ్ ప్రోగ్రెస్, క్రియేటింగ్ ఫ్రీడం, పావర్టి ది ట్రు కాస్ట్, చిప్కో, ఈకో ఫెమినిజం, సీడ్స్ ఆఫ్ డెత్, మొదలైన 20కి పైగా పుస్తకాలను వెలువరించింది.
            డెహ్రాడూన్ లోయలో పుట్టి పెరిగిన వందన శివ తన చిన్ననాటి నుండి ప్రకృతికి దగ్గరగా ఉండేది. ఆమె తండ్రి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసేవారు. తల్లి ప్రకృతి ప్రేమికురాలు. 
 ఇది ఆమెకు ప్రకృతి పై ప్రేమను పెంచుకోవడానికి దోహదం చేసింది.

      వందన శివ, జయంత బందోపాధ్యాయ అనే ప్రముఖ శాస్త్రవేత్తను వివాహం చేసుకున్నారు. తల్లిని చూసుకునే విషయంలో వచ్చిన వివాదంలో వారు విడాకులు తీసుకున్నారు. ప్రతి 'స్త్రీ', తమ తల్లిని, పిల్లలతో పాటు సమాన సంరక్షకులుగా చేయాలన్న ఆమె పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఫలించింది.
       వందనా శివ జన్యుపరమైన పంటలకు వ్యతిరేకంగా జాతీయ అంతర్జాతీయ హరిత ఉద్యమాలకు సారధ్యం వహించింది. ఆమె జన్యుపరంగా మార్పు చెందిన పంటలను నిషేధించాలని పోరాడింది. ఆమె ఉద్యమ ప్రస్థానం 1982లో 'రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ' స్థాపనకు దారితీసింది. 1991లో, ఆమె జీవన వనరుల వైవిధ్యం మరియు సమగ్రతను (స్థానిక విత్తనం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం) పరిరక్షించేందుకు "నవదాన్య" అనే జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించింది. 
        1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీడిష్-జర్మన్ పరోపకారి జాకోబ్ వాన్ యుక్స్‌కుల్ చేత స్థాపించబడింది. దీనిని "ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి"గా పరిగణిస్తారు. ఆధునిక అభివృద్ధిలో 'మహిళలు మరియు జీవావరణ శాస్త్రాన్ని' ప్రధానాంశంగా ఉంచినందుకు ఆమెకీ అవార్డు లభించింది. 
       ఆమె 1993లో పర్యావరణ పరిరక్షణ జీవావరణ శాస్త్రానికి అత్యుత్తమ సేవలకుగానూ ' ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ ఆర్క్ (నెదర్లాండ్స్)'   , 1993లో ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) 'గ్లోబల్ 500 అవార్డు'  వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది.  1993లో ఐక్యరాజ్యసమితి (UN) యొక్క ' ఎర్త్ డే ఇంటర్నేషనల్ అవార్డు ', 1995లో డూన్ సిటిజన్ కౌన్సిల్, డెహ్రా డన్, ఇండియా నుండి 'ప్రైడ్ ఆఫ్ ది డూన్ అవార్డు ',1997లో ది గోల్డెన్ ప్లాంట్ అవార్డ్ (ఇంటర్నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎకాలజీ), డెన్మార్క్ అందుకుంది.
    “పాలక వర్గం మనిషి జీవితంలోని భౌతిక అవసరాలను నియంత్రించి, వాటిని ప్రజలకు ఇవ్వడం గానీ, నిలిపివేయడం ద్వారా గానీ చేసి తన అధికారాలను ప్రదర్శించి తనకున్న శక్తిని
సాధించుకుంటుంది." అని రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. ఈ విధంగా సహజ వనరుల దోపిడీకి రహదారి గా ఉన్న కార్పొరేట్ ప్రపంచీకరణ ను ఆమె తీవ్రంగా విమర్శించింది. ఆమె స్థిరమైన, సమానమైన అభివృద్ధి సమాజంలో ఉండాలని వాదించారు.
           భూమి ఒక పవిత్రమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ లో అన్ని జీవులు పరస్పరం ఆధారపడి జీవిస్తున్నాయి. అందువల్ల దాన్ని తప్పనిసరిగా రక్షించుకోవాలన్నది ఆమె తాత్వికత.   
       మహిళల దోపిడీకి, ప్రకృతి దోపిడీకి మధ్య లోతైన సంబంధం ఉందని శివ నమ్ముతారు. దీనికి కారణం ఆధిపత్యం, నియంత్రణకు విలువనిచ్చే పితృస్వామ్య ప్రపంచ దృష్టికోణమేనంటారు.జీవావరణ పర్యావరణ రక్షణకు స్త్రీలు బాగా ముందు ఉండాలని, ‘’ఈకో ఫెమినిజం ‘’ అందుకే నేడు అవసరమని నొక్కి చెప్పి దాన్ని వ్యాప్తిచేసింది.     
      
       వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTOలు) ప్రమాదాన్ని ఆమె ఊహించింది.ట్రేడ్-సంబంధిత మేధో సంపత్తి హక్కులు (TRIPS)  సంబంధించి సియాటిల్‌లో జరిగిన 1999 WTO నిరసనలలో ఆమె ఒప్పందానికి వ్యతిరేకంగా మాట్లాడారు.విత్తనాలవిషయం లో కార్పోరేట్ పేటెంట్ లను ఒప్పుకోరాదని, మేధోహక్కు, జీవ వైవిధ్యం, జీవనీతి, జెనెటిక్ ఇంజినీరింగ్ మొదలైన ముఖ్యవిషయాల పై వందనా శివ క్రియాశీలకంగా పోరాటం జరిపింది. ఆఫ్రికా ఆసియా, లాటిన్ అమెరికా, ఐస్లాండ్ స్విట్జెర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలలోని లోని ’గ్రీన్ మువ్ మెంట్ ‘ఉద్యమానికి క్రియాశీలక సహకారం అందించారు. జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా వ్యవసాభి వృద్ధి జరగరాదని ఈ సంస్థ పోరాడుతోంది.
        వేప, బాస్మతి బియ్యం, గోధుమలపై జరుగుతున్న ‘’బయో పైరసీ’’ ని చాలెంజ్ చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటిపై మనకున్న హక్కులను కాపాడింది.   
          అమెరికా లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తో 10సంవత్సరాలు ‘’వేప చెట్టు ‘’ పైరసీ పై పోరాటం చేసి ఆహక్కు భారత దేశానిదే అని మెడలు వంచి ఒప్పించింది. 
          విత్తన స్వేచ్చ, ఆహార సార్వభౌమాధికారాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించింది వందనా శివ. రైతులు తమ స్వంత విత్తనాలను ఉత్పత్తి , మార్పిడి , పెంపకం చేసే హక్కు కలిగి ఉండాలని ఆమె వాదించింది. ఆహార సార్వభౌమాధికారం, జీవవైవిధ్య పరిరక్షణకు విత్తన స్వేచ్ఛ అవసరమని ఆమె వాదించారు.
         ప్రతి ఒక్కరికి వారి జీవితాలను ప్రభావితమయ్యే పర్యావరణానికి సంబంధించి చేసే నిర్ణయాలలో పాల్గొనే హక్కు ఉందని శివ నమ్ముతారు.  దీనికోసం వికేంద్రీకృత భాగస్వామ్య పాలనా వ్యవస్థలు ఉండాలని ఆమె వాదించారు. 
         1940ల ప్రారంభంలో బెంగాల్ కరువుకు బ్రిటీష్ వారు బాధ్యులైతే మోన్‌శాంటో భారత దేశంలో ఆత్మహత్యల మారణహోమానికి బాధ్యులని ఆమె పేర్కొంది.
          సాధారణ బియ్యం కు బీటా కెరోటిన్‌ను జోడించడానికి శాస్త్రవేత్తలు జన్యు ఇంజనీరింగ్‌ను ఉపయోగించారు.రైస్‌లో బీటా కెరోటిన్, రెండు కొత్త ఎంజైమ్‌లను జోడించడం ద్వారా ఇది సాధ్యమైంది. దానివల్ల ఈ బియ్యం పసుపు-నారింజ లేదా బంగారు రంగు తో ఉంటుంది. అందుకే ఆ బియ్యాన్ని గోల్డెన్ రైస్ అంటారు. గోల్డెన్ రైస్ వేలాది బాలబాలికల కంటి జబ్బులను నివారించడానికి ఉపయోగపడు తుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈ బియ్యం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వందనా శివ, ఇతర గ్రీన్ పీస్ సంస్థలు చెపుతున్నారు.
         హరిత విప్లవం భారత దేశంలో కరువును తట్టకోగలిగింది. పంటల అధిక ఉత్పత్తికి దారితీసింది. కానీ దీన్ని డాక్టర్ శివ పట్టించుకోలేదని కొంతమంది విమర్శకులు పేర్కొన్నారు.

       శివ తాత్వికత ప్రపంచ పర్యావరణ ఉద్యమంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.  వేలాది రకాల విత్తనాలను సంరక్షించడానికి, రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడానికి 1991 లో
 నవదాన్య ఉద్యమం ఆమె ప్రారంభించింది.  నవధాన్య ‘’ అంటే కొత్త ధాన్యం అనికాదు ‘’తొమ్మిది రకాల విత్తనాలు’’ లేక నూతన బహుమతి అని అర్ధం చెప్పింది వందనా శివ.ఈ ఉద్యమం
రైతులు కార్పొరేట్ విత్తనాలు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడింది. జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడింది.
         వందనా శివ రచనల ఆధారంగా అనేక దేశాలు విత్తన స్వేచ్ఛ చట్టాలను ఆమోదించాయి. ఈ చట్టాలు రైతులు తమ స్వంత విత్తనాలను పొదుపు చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం, పెంపకం చేసుకునే హక్కును పరిరక్షించాయి. మొదటి సారిగా దేశం మొత్తం మీద 40విత్తన బ్యాంకులను నెలకొల్పి ప్రాంతీయ విభాగాలలో అందుబాటుకు తెచ్చి వైవిద్య వ్యవసాయానికి దారి చూపించింది. సిరియాలో అయినా మన దేశంలో అయినా తక్కువ నీళ్లతో పండించే పంటలను పక్కన పెట్టేశారు. కరువు పరిస్థితుల్ని తట్టుకొని పండే వరి, బార్లీ, గోధుమ, చిరుధాన్యాలు -- ఇవే రేపు పొద్దున మన ఆకలిని తీర్చే ఆహార పంటలు. చిరుధాన్యాలు పక్షులు తినేవి కదా అని మీరు ఎగతాళి చేయొచ్చు, కానీ వాటిలోనే మంచి పోషక విలువలు ఉండేది. నిజానికి, అవే మానవాళి అసలైన ఆహారం. మా లెక్కల్లో తేలిందేమంటే, ఇప్పుడున్న సాగునీటి వినియోగంతోనే మనం చిరుధాన్యాలనే పండిస్తే, 400 రెట్లు ఎక్కువ ఆహారం ధాన్యాలను పండించవచ్చు అని చెప్పింది వందన శివ.
        స్థానిక ఆహార ఉద్యమం అనేది స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఆహార వినియోగాన్ని ప్రోత్సహించే ప్రపంచ ఉద్యమం. వందనా శివ ఈ ఉద్యమానికి బలమైన మద్దతుదారు.   ఆహార సార్వభౌమాధి కారానికి, పర్యావరణ పరిరక్షణకు ఇది చాలా అవసరమని ఆమె వాదించింది
        1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీడిష్-జర్మన్ జాకోబ్ వాన్ యుక్స్‌కుల్ స్థాపించాడు. దీనిని " నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయం" గా పరిగణిస్తారు.
        డెహ్రాడూన్ వాలీ లో 2004లో ఇంగ్లాండ్ లోని షుమేకర్ కాలేజి తో కలిసి ‘’బీజ విద్యా పీఠ్’’ అనే అంతర్జాతీయ కాలేజీని ఏర్పాటు చేసింది. 
         అయినప్పటికీ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే ఇంటలిజెన్స్ బ్యూరో ఈ నవధాన్య వంటి స్వచ్ఛంద సంస్థల పై నిఘా పెట్టి, వీరు విదేశీ నిధులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని నివేదిక ఇచ్చినట్లుగా పత్రికలు వెల్లడించాయి.

____Pillaa kumaraswaamy 

Sources:
1.greencleanguide.com
2. పర్యావరణ దేవత 'వందన శివ'_గబ్బిట దుర్గాప్రసాద్( విహంగ పత్రిక)
3 britannica.com
4.వికిపీడియా



 

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం