బౌద్ధానికి వన్నె తెచ్చిన నాగార్జున తాత్విక చింతన
బౌద్ధానికి వన్నె తెచ్చిన నాగార్జున తాత్విక చింతన
ఆచార్య నాగార్జున క్రీ.శ.2వ శతాబ్దం (150-250 CE) లో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో ఉన్న నాగార్జునకొండ ప్రాంతం లో జన్మించారని చరిత్ర కారులు భావిస్తారు.
ప్రాచీన చైనా, టిబెట్ మరియు సంస్కృత గ్రంథాలు గ్రంథాల ప్రకారం, నాగార్జున బాల్యంలోనే నాలందా మహావిహారం ( బీహార్‌లో ఉంది) వెళ్లి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇతను శాతవాహన వంశానికి చెందిన రాజుకు సలహాదారుగా పనిచేశారని, అనేక మంది పరిశోధకులు పేర్కొంటున్నారు.
నాగార్జున మహాయాన బౌద్ధ తాత్వికతకు చెందిన వారు. నాగార్జున తాత్వికత శూన్యతా సిద్ధాంతం, మధ్యమ మార్గం, రెండు సత్యాల సిద్ధాంతం, తర్కశాస్త్రంలో చతుస్కోటి వంటి అంశాలను ప్రతిపాదించింది. ఆయన తాత్విక చింతన మహాయాన బౌద్ధ ధర్మానికి గుండెకాయగా మారింది. అతని ఆలోచనలు మహాయాన బౌద్ధ తత్వాన్ని పరిపుష్టం చేసింది. ఆధునిక తాత్విక చర్చలకు కూడా ఎంతో ప్రేరణనిచ్చింది. ఈ తత్వం బౌద్ధం ముందు నుంచి చెపుతున్న అనిత్యత (impermanence), ప్రతీత్యసముత్పాదం (dependent origination), ద్వంద్వ విమర్శ (critique of dualism) వంటి అంశాలను మరింత లోతుగా పరిశీలించింది.చైనా చరిత్రకారుడు కుమారజీవ (Kumārajīva) నాగార్జునుని రచనలను చైనీస్ భాషలోకి అనువదించాడు. నేటి జెన్ బౌద్ధం, వజ్రయాన తాంత్రిక బౌద్ధం , చైనా, జపాన్, టిబెట్ బౌద్ధ సంప్రదాయాలపై ఆయన తాత్వికతా ప్రభావం ఉంది.
1. శూన్య సిద్ధాంతం (Doctrine of Emptiness)
నాగార్జున తన శూన్యవాదాన్ని అత్యంత ప్రాముఖ్యత గల గ్రంథం "మూలమాధ్యమకకారిక" లో గురించి వివరించాడు.నాగార్జున తాత్వికతలో "శూన్యత" అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శూన్యం అంటే "ఏమీ లేదు" అనే అర్థంలో కాక, స్వతంత్రమైన, స్వతంత్ర స్వరూపం (స్వభావం) లేనిదే అనే అర్థంలో ఉపయోగించాడు. ఆయన ప్రకారం ఏదీ స్వతంత్రంగా ఉనికి కలిగిఉండదు.ప్రతి దాని ఉనికి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచం పరస్పర ఆధారంతోనే (interdependence) ఉనికిలో ఉంటుంది.
ఇది ఆధునిక కాలంలో ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ఇదే. మార్క్సిజంలో ఇది ఒక ప్రధానమైన అంశం.
ఉదాహరణకు విత్తనం మట్టిలో పడితే మొక్కగా మారుతుంది. కానీ మొక్క స్వతంత్రంగా ఉనికిలో ఉండదు. అది మట్టి, నీరు, వెలుతురు పై ఆధారపడి ఉంటుంది.దీనినే ప్రత్యయసముత్పన్నం (Dependent Origination) అని అన్నాడు. ప్రస్తుత ప్రపంచంలో మనిషి మనుగడ చుట్టూ ఉన్న జీవావరణం పై ఆధారపడిఉంది. ఏ వ్యక్తి స్వతంత్రంగా జీవించలేడు ఇతరుల పై ఆధారపడి ఉన్నాడు. అదేవిధంగా జంతుజాలం కూడా చుట్టూ ఉన్న ఇతర జీవావరణం పైన ఆధారపడి ఉంది.
ఏదీ స్వతంత్రంగా ఉనికిలో ఉండదు.
ప్రతి వస్తువూ ఇతర కారణాల వల్ల ఉనికిలోకి వస్తుంది. కాబట్టి, ఇది శూన్యం (స్వతంత్ర స్వరూపంలేని).అని అన్నాడు. ఉదాహరణకు రథం అంటే అది చక్రాలు, కర్రలు, పట్టాలు కలిసిన సమూహమే కానీ, రథం అనే స్వతంత్ర వస్తువు లేదు.
అలాగే మనిషి కూడా. తల, మొండెము ఉంటేనే మనిషిగా చెపుతాం.
2. మాధ్యమిక మార్గం
నాగార్జున మాధ్యమిక మార్గాన్ని ప్రతిపాదించాడు. ఇది అస్తిత్వానికి - అనస్తిత్వానికి మధ్యన ఉన్న తత్వం.
ఇది ముఖ్యంగా ద్వంద్వాలు లేవని చెపుతుంది. అస్తిత్వం లేదు. అనస్తిత్వం లేదు. సత్యమంతా మధ్య లో ఉంది అని చెపుతుంది.ఏదైనా వస్తువు అది తానే తన కారణంగా ఉండదు. అదే విధంగా, అది పూర్తి కొత్తదిగా కూడా ఉద్భవించదు. ప్రపంచం నాశనమవ్వదు. కానీ ఏదీ శాశ్వతంగా ఉండదు. ప్రపంచంలోని మార్పులను అర్థం చేసుకోవాలంటే ఈ మాధ్యమిక వాదాన్ని అర్థం చేసుకోవాలి.
నాగార్జున రెండు రకాల సత్యాలను వివరించారు. ఒకటి సంవృతి సత్యం (Conventional Truth).
రెండోది పరమార్థ సత్యం (Ultimate Truth).ప్రపంచం యొక్క యథార్థ రూపాన్ని (ఉదా. దైనందిన అనుభవం, భాష, ఆచారాలు). దీనిని సంవృతి సత్యం అన్నాడు.ఉదా: "ఈ చెట్టు నిజంగా ఉంది" అని చెప్పడం. ఈ అనుభవాలకు మూలకారణమైన శూన్యత ను పరమార్థ సత్యం అన్నాడు.ఉదాహరణకు చెట్టు అనేది కేవలం పేరుకే ఉంది, దీని స్వతంత్రమైన ఉనికి లేదు. అని గుర్తించడం. అలాగే, బాణం గుచ్చుకున్న వ్యక్తికి "ఈ బాణం ఏ మెటీరియల్‌తో తయారైంది?" అనే ప్రశ్న అవసరం లేదు. సత్యాన్ని అనుభవించి ముందుకు వెళ్లడం ముఖ్యం.
3. లాజికల్ టెక్నిక్ – చతుస్కోటి" (Tetralemma) అనే తర్క విధానం
నాగార్జునుడు తాత్విక పరిశీలన కోసం "చతుస్కోటి" (Tetralemma) అనే తర్క విధానాన్ని ఉపయోగించాడు.
ఒక విషయం గురించి నాలుగు తర్కాలు:
1. అది ఉనికిలో ఉంది (Exists)
2. అది ఉనికిలో లేదు (Does not exist)
3. అది ఉనికిలో ఉందా లేదా అనే ప్రశ్నకు బదులివ్వలేం. (Both exists & does not exist)
4. ఇది ఉనికిలో ఉందా లేదా అనే ప్రశ్న వర్తించదు (Neither exists nor does not exist)
ఉదాహరణకు "ఆత్మ ఉనికిలో ఉందా?" → శూన్యత సిద్ధాంతం ప్రకారం, ఇది పై నాలుగు అవకాశాల కంటే మరొకటి.
బౌద్ధ తాత్త్విక చింతన లో విప్లవాత్మక మార్పు తెచ్చింది నాగార్జున తాత్వికత. ఆయన మహాయాన బౌద్ధాన్ని తాత్వికంగా బలపరిచారు. ఫ్రాన్స్‌లో జాక్ దరిదా (Jacques Derrida) యొక్క డీకన్స్ట్రక్షన్ సిద్ధాంతం నాగార్జున సిద్ధాంతాన్ని పోలి ఉంది. నాగార్జున తత్వాన్ని అర్థం చేసుకుంటే మార్క్సిస్ట్ తత్వం సులభంగా అర్ధం అవుతుంది.
నాగార్జున శూన్యత సిద్ధాంతం ప్రపంచంలోని అన్ని వస్తువుల స్వతంత్ర ఉనికిని తిరస్కరిస్తుంది. మార్క్సిజం భౌతిక వాదం (Materialism) ఆధారంగా సమాజాన్ని విశ్లేషిస్తుంది. రెండూ అనిత్యతను, మార్పును, పరస్పర సంబంధాలను ఒప్పుకున్నాయి.
నాగార్జున తత్వబోధ చేయడం ద్వారా సామాజిక విముక్తి సాధించవచ్చని నమ్మారు.మార్క్సిజం వర్గ పోరాటం (Class Struggle) ద్వారా సామాజిక మార్పు వస్తుందని చెపుతుంది.
నాగార్జున అస్తిత్వం, పరిణామం అన్నీ ఖచ్చితమైనవి కావని, మార్పు సహజమని చెప్పాడు. మార్క్సిజం సమాజంలోని విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ కొత్త సామాజిక పరిస్థితులను, పరిణామాలను తీసుకొస్తుందని చెపుతుంది.
నాగార్జున తాత్వికత ఒక విప్లవాత్మక ఆలోచనా విధానం. ఇది బౌద్ధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆధునిక మార్క్సిజానికి, ఆధునిక తత్వాలకు గొప్ప ప్రేరణ గా నిలిచింది.
నాగార్జునుని పేరు మీదుగా గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది. అతడు తన తాత్విక, బౌద్ధ ధర్మ ప్రచారం చేసిన ప్రదేశంగా భావించబడుతున్న కొండను నాగార్జున కొండ అని పిలుస్తారు. నాగార్జున కొండ ప్రాచీన బౌద్ధ స్థూపాలు, విహారాలు, బౌద్ధ శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.
అలాగే భారత ప్రభుత్వం కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని కూడా పేరు పెట్టారు.
___ పిళ్లా కుమారస్వామి, 9490122229
-
Comments
Post a Comment