పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన


పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన 

     పుచ్చలపల్లి సుందరయ్య (1913–1985) భారత కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేసిన గొప్ప తాత్విక నాయకులలో ఒకరు. ఆయన మార్క్సిజాన్ని ఒక ఆయుధంగా తీసుకుని, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన నాయకత్వం, తాత్విక దృక్పథం భారత కమ్యూనిస్టు చరిత్రలో ఆయనను విలక్షణంగా యోధునిగా నిలిపాయి.
       ‌ సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఇతనికి సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. పెద్దయ్యాక రెడ్డి అనే కులచిహ్నాన్నిను తొలగించుకున్నాడు.ఇది అతని సామాజిక సమానత్వం పై విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మనుషులంతా సమానమేనని తాను నమ్మిన సిద్ధాంతానికి అతను కట్టుబడినాడు. ఇప్పుడు అన్ని కులాల వారు తమ కుల గుర్తింపుకోసం తహ తహలాడుతూ తమ పేర్ల చివర కుల చిహ్నాలను అదేపనిగా పెట్టుకుంటున్నారు. సహచరులంతా అతన్ని ఆప్యాయంగా "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు.
           
       సుందరయ్య 1930లో తన 17వ యేట ఉన్నత పాఠశాల చదువుతున్న రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను, సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్, బోర్స్టల్ స్కూలు‌లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది.  

      సుందరయ్య మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక వర్గ పోరాటాన్ని చరిత్రలోని ప్రధాన చలన శక్తిగా గుర్తించారు. అది సామాజిక మార్పుకు చోదక శక్తిగాభావించారు. అప్పటి నుంచి పెత్తందారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు సుందరయ్య తన పోరాట ప్రస్థానం సాగించారు.రైతులు, కూలీలు, శ్రమ జీవులు తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆయన వారి వెన్నంటి నిలిచారు.పేదలకూ, శ్రామిక వర్గాలకూ సామాజిక న్యాయం లభించాలన్నదే ఆయన ప్రధాన ఆశయపథమైంది.

       హిందూధర్మంలోని వర్ణవ్యవస్థను ఆయన తీవ్రంగా విమర్శించారు. కులమత బేధాలు ప్రజలను విడదీసే వ్యవస్థగా భావించి వాటి నిర్మూలనకై కమ్యూనిస్టు ఉద్యమాన్ని అవిశ్రాంతంగా మలిచారు.
      
        సుందరయ్య మానవ విలువలను కేంద్రంగా పెట్టుకున్న నాయకుడు. వర్గపోరాటం తోపాటు వ్యక్తిగత గౌరవం, సమాజ ఐక్యతను కూడా సమానంగా ప్రాముఖ్యంగా పరిగణించారు.

       1946–1951 మధ్య నల్గొండ, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సుందరయ్య ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. ఆయన రైతుల భూముల కోసం, నిజాం రజాకార్ల దౌర్జన్యాలపై పోరాటానికి ముందుండి మార్గదర్శిగా నిలిచారు.


      1962 లో చైనా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది. ఈ సందర్భంలో చైనా పై భారత్ యుద్ధం‌ చేసింది. పార్టీ నాయకత్వంలో ఎస్.ఎ. డాంగే వర్గం భారత ప్రభుత్వాన్ని సమర్ధించింది. అంతే కాకుండా చైనా, రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పంథాను సమర్ధించింది. అయితే పి.సి.జోషి, రణదివే వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్టు మార్గంగా భావించింది. 1962 నవంబరులో, చైనా యుద్ధం సమయంలో చైనాను సమర్థిస్తున్నారన్న నెపంతో సుందరయ్యను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆయన పంథా చైనా కాదు,రష్యా కాదు. భారత దేశం పరిస్థితుల కనుగుణమైన పంథా. తరువాత పరిణామాలు పార్టీ లో చీలిక అనివార్యమైంది.1964 లో అది రెండుగా చీలిపోయింది.
        భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) స్థాపనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ లో వచ్చిన చీలిక తో CPI-M ఏర్పాటు కావడంతో ఆయన ఆ పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.ఈ సందర్భంలో
సిపిఎం విప్లవం మార్గాన్ని స్పష్టంగా దిశా నిర్దేశం చేయడం లో ఆయన విశేష కృషి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే అవకాశాలను ఉపయోగించి, శ్రమజీవులలో వేగంగా రాజకీయ చైతన్యం పెంచి, వర్గ పోరాటాలద్వారా విప్లవం సాధించాలనే దృక్కోణాన్ని సిపిఎం పార్టీ తీసుకుంది.
నెహ్రూ ప్రభుత్వం సుందరయ్యతో సహా చాలా మంది"సి.పి.ఐ-ఎమ్" నాయకులను అరెస్టు చేసింది. 1966 మే వరకు నిర్బంధంలో ఉన్నాడు.
         
      ‌సిద్దాంతాన్ని ఆచరణను కమ్యూనిస్టులకు రెండు కళ్లు గా ఆయన భావించారు.తదనుగుణంగా ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడమే కాకుండా సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా తీర్చిదించారు. నిఖార్సయిన కమ్యూనిస్టు ఎలా ఉండాలో ఆయన ఆచరణాత్మకంగా చూపించడం వలన ఆయనను కమ్యూనిస్టు గాంధీ అని కూడా అన్నారు.పార్టీ మహాసభ సందర్భంగా సభా ప్రాంగణంలో మలవిసర్జన చేస్తున్న వ్యక్తులను ఇది తగదని చెప్పినా వినకపోవడంతో తానే స్వయంగా చేతులతో మలవిసర్జన ఎత్తి దూరంగా పడవేసిన మహోన్నత వ్యక్తి సుందరయ్య.

     సుందరయ్య భార్య లీల కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు. వారిరువురి భావాలు కలిశాయి. పరస్పర అంగీకారంతో దంపతులయ్యారు. తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని బిడ్డలు పుట్టకుండా భార్య అంగీకారం తో తానే వాసెక్టమీ చేయించుకున్నారు.
     సుందరయ్య తన తండ్రినుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశాడు.1952 లో మద్రాసు నియోజిక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభ సభ్యునిగా,1962 లో, 1978 లో రాష్ట్ర శాసన సభా సభ్యునిగా ప్రజాసేవలో ఉన్నాడు.

      మార్క్సిజం, భారత సమాజ నిర్మాణం, వర్గ పోరాటం వంటి అంశాలపై లోతైన చర్చలు చేశారు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు రాశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు రచన చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగింది.

సుందరయ్యకు ఒక ఉద్యమ నేతగా మాత్రమే కాక, తాత్వికునిగా, రచయితగా కూడా గౌరవ స్థానం ఉంది. ఆయన భావజాలం నేటికీ కొనసాగుతున్న వర్గ పోరాటాలు, భూమి సంస్కరణలు, సామాజిక సమానత్వ ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉంది.

      నేటి సమాజంలో ఆయన ఆలోచనలైన పేదలకు భూపంపిణీ, సాగు హక్కు,
సామాజిక అసమానతల నిర్మూలన, శ్రమజీవుల హక్కుల పరిరక్షణ, మానవహక్కుల రక్షణ మొదలైన అంశాల ప్రాముఖ్యత అడుగడుగునా కనిపిస్తుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఏర్పడాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.

     1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశాడు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు.అక్కడ గ్రంథాలయం, ఆడిటోరియం, ఉన్నాయి . సుందరయ్య పార్కు కూడా ఏర్పాటయింది.

___ పిళ్లా కుమారస్వామి,9490122229














 



Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం